చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 35
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
(తమ అనుచరుడు సగ్స్ పోలీసులకు పట్టుబడ్డాడని, అతని ద్వారా వీలర్ విషయం తెలుసుకొని పోలీసులు విడిపించారని, తాము పోయిందనుకున్న చంద్రమణి నాన్సీ దగ్గర ఉందని ఒమన్ తో రాస్పిన్ చెప్పటం చాటుగా ఉన్న నాన్సీ విన్నది. ప్రస్తుతం తాము వలవేసిన ముసలిదాని చేత చెక్కులపై సంతకం చేయించి, త్వరగా అక్కడ నుండి బయట పడాలని వారనుకోవటం కూడా విన్నది. ఆమె వెంటనే పోలీసులకు విషయం చెప్పాలని ఊళ్ళోకొస్తుంది. హోటల్ దగ్గర తనకిచ్చిన ఉత్తరాన్ని చదివిన ఆమె, తాను పంపిన చంద్రమణిని తిరిగి తీసుకోవటానికి హోటల్ దగ్గరకు వస్తున్నానని ఎవరో వ్రాసిన ఆ ఉత్తరంలో ఉంటుంది. తనకు వచ్చిన చంద్రమణిని తిరిగి దాని యజమానికి ఇచ్చివేస్తానని నాన్సీ చెబుతుంది. తరువాత......)
@@@@@@@@@@@
చంద్రమణి యొక్క అసలైన యజమానికే అది తిరిగి చేరాలని నాన్సీ అంగీకరించింది. కానీ రాస్పిన్ దానికోసం తనంత తానుగా దావా వేయాలని ఆమె భావించింది.
"అతను అలా చేయటానికి ధైర్యం చేయడు!" బెస్ అంది.
"సరిగ్గా అదే!" నాన్సీ బదులిచ్చింది. "కాబట్టి మనం తెలుసుకోవలసినదేమిటంటే, ఈ రాత్రి ఎవరు వచ్చినా, అతనికి రాస్పిన్ తో ఏదో విధమైన సంబంధం ఉండి ఉంటుంది."
దీనిలో వివరించలేని ఒక వాస్తవం ఉందని జార్జ్ వ్యాఖ్యానించింది. "ఈ అజ్ఞాత వ్యక్తి తనను తాను "శ్రేయోభిలాషి" అని ఎందుకు చెప్పుకొంటున్నాడు? ఆ పదం వల్ల అతను ముఠాలో ఒకడని ధ్వనించటం లేదు.. . .బదులుగా నీ పక్షాన ఉండే వ్యక్తి అనిపిస్తోంది."
"ఇదంతా చాలా విరుద్ధంగా ఉందని నేను అంగీకరిస్తున్నాను" అని అంది నాన్సీ. "ఈ రాత్రి మనకు అన్ని సమాధానాలు దొరుకుతాయని ఆశిద్దాం."
అమ్మాయిలు కారులోకి ఎక్కి పోలీసు ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు. అదృష్టవశాత్తూ చీఫ్ బుర్కె అక్కడే ఉన్నాడు. వెంటనే వాళ్ళు అతని ఆఫీసు గదిలోకి పంపబడ్డారు. నాన్సీ తన కథను పూర్తిచేయగానే, ఆశ్చర్యంతో అధికారి కనుబొమలను పైకి లేపాడు.
"మీకు తెలియకుండానే, ఖచ్చితంగా మీరొక పెద్ద మోసంలో యిరుక్కొన్నట్లు అనిపిస్తోంది." అన్నాడతను.
"ఇది మనం అనుకున్నదాని కన్నా పెద్దదే కావచ్చు" నాన్సీ చెప్పసాగింది, "అభాగ్యురాలైన మిసెస్ విల్సన్ కి జరుగుతున్న దానికి, పదిహేనేళ్ళ క్రితం మిసెస్ హోర్టన్ కి జరిగిన దానికి సారూప్యతలు ఉన్నాయి."
"అది నిజమే" చీఫ్ అన్నాడు. "ఈ సేవకులే ఒక కుంభకోణాన్ని కొంతకాలంగా లాక్కొస్తున్నారని మీరు భావిస్తున్నారా?"
"అలాగే కనిపిస్తోంది" నాన్సీ బదులిచ్చింది.
ఉద్దేశపూర్వకంగానే నాన్సీ జోనీ హోర్టన్ గురించి ఏమీ చెప్పకుండా నిగ్రహించుకొంది. అది యిప్పటికీ ఆమె తండ్రి కేసే!
తక్షణమే రెండు కార్ల పటాలాన్ని మిసెస్ విల్సన్ యింటికి పంపిస్తానని అధికారి చెప్పాడు. "ఆమెకు వైద్య సహాయం అవసరం ఉన్నందున ఒక డాక్టర్ని కూడా వాళ్ళలో చేరుస్తాను."
"వాళ్ళతో మేమూ వెళ్ళవచ్చునా?" నాన్సీ అడిగింది.
"ఈ కేసు మొత్తం కళ్ళతో చూస్తామంటే, నేను మిమ్మల్ని నిందించలేను. కానీ మీరు గాయపడాలని నేను కోరుకోను. మీరు పోలీసు కార్ల వెనకాల వెళ్ళినా, తెరచాటునే ఉండండి."
నాన్సీ తనకు చెప్పినట్లు జరుగకుండా తన మనుషులు ఒమన్ దంపతులకు అడ్డుపడతారని అతను చెప్పాడు. ఆ దంపతులు తమ నేరాలను అంగీకరించేలా చేయిస్తానని అతను ఆశాభావం వ్యక్తపరిచాడు. "వాస్తవానికి, వారిని మనం అరెస్టు చేయటానికి స్పష్టమైన సాక్ష్యం మన దగ్గర లేదు, కానీ కొంత ఆధారం మనం పొందవచ్చు."
సైరనులను గానీ, వారి రాకను తెలుపుతూ హెచ్చరించే మరే యితర సాధనాలను కానీ వాడకుండా, మిసెస్ విల్సన్ యింటికి రెండు స్క్వాడ్ కార్లను పంపుతున్నందుకు నాన్సీ సంతోషించింది. ఆమె తన కారులో వారిని అనుసరించింది. రెండు నల్లని సెడాన్లు ఆ యింట్లో వాళ్ళకు కనిపించకుండా రోడ్డు పక్కన ఆగగానే, నాన్సీ తన కారుని వాటి వెనుక ఆపింది.
కొద్దిసేపటికి పోలీసులు ఆ పాత యింటిని చుట్టుముట్టారు. ముగ్గురు అమ్మాయిలు రోడ్డు పక్కనే ఉన్న చెట్ల వెనుక నక్కి తీవ్రమైన ఒత్తిడితో చూస్తున్నారు. ఒక గూఢచారి ప్రవేశద్వారం దగ్గరకెళ్ళి గొళ్ళెంతో తలుపుని కొట్టాడు.
లోనుంచి బదులు లేదు. కానీ ఆత్రుతలో ఉన్న ఆ సమూహానికి లోనుంచి సాయం చేయమంటూ బలహీనమైన కేక వినిపించింది.
"అది శ్రీమతి విల్సన్ నుండి అయి ఉండాలి!" నాన్సీ భుజాన్ని గట్టిగా పట్టుకొని బెస్ అంది.
కొన్ని సెకన్ల తరువాత మేడమీద గదిలోంచి ఒక ఉత్తర్వు గట్టిగా వాళ్ళకు వినిపించింది, "నోరు మూసుకొని సంతకం పెట్టు!"
దాని వెనుకనే ఒక మహిళ అరుపు వినిపించింది. ఆపైన సాయం చేయమని ఒక స్త్రీ కేకపెట్టింది. గూఢచారి మరొకసారి తలుపును గట్టిగా బాదుతూ, "తలుపు తెరవండి! పోలీసు!" అంటూ స్వాధికారంతో అరిచాడు.
తదుపరి ఆదేశాలకు కూడా స్పందన లేకపోవటంతో మరో యిద్దరు పోలీసులు, డాక్టరు గూఢచారి దగ్గరకు వెళ్ళారు. వాళ్ళంతా కలిసి, తమ భుజాలతో తలుపును విరక్కొట్టారు. తరువాత వాళ్ళంతా గుంపుగా యింట్లోకి చొచ్చుకెళ్ళారు.
అమ్మాయిలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. "అక్కడ ఏమి జరుగుతోందని నువ్వు అనుకొంటున్నావు?" బెస్ అడిగింది.
నాన్సీ, జార్జ్ ఆమెకు బదులివ్వలేదు. వాళ్ళు యింట్లోంచి వచ్చే మరిన్ని శబ్దాలను ఆలకిస్తున్నారు. పూర్తిగా ఐదు నిమిషాలు గడిచాయి, ఇంకా వాళ్ళేమీ వినలేదు.
తరువాత గూఢచారి తిరిగి కనిపించాడు. "ఇప్పుడు మీరు లోపలకు రావచ్చు" అమ్మాయిలను పిలిచాడతను.
అతను హాల్లో ఉన్న మెట్ల వరకూ ముందు నడిచాడు. గూఢచారి తెరిచి ఉన్న ఒక పడకగది వైపు చూపించాడు. నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళు లోనికి ప్రవేశించారు.
"నువ్వా!" బేడీలు ఉన్న ఒక మనిషి అరిచాడు. అతను సీమన్ గా నటించిన వ్యక్తి. అతడు నాన్సీ వైపు కళ్ళు మిటకరించి చూసాడు. యువ గూఢచారి అతన్ని పట్టించుకోకుండా ఆ గదిలోని యిద్దరు ఆడవాళ్ళను తేరిపార చూసింది. వారిలో ఒకామె, చేతికి సంకెళ్ళు ఉన్న మిసెస్ ఒమన్ అన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరొక ఆమె, ఒక పెద్ద పాతకాలపు మంచం మీద పడుకొని ఉన్న ఒక వృద్ధ మహిళ. ఆమె బాగా బక్కచిక్కినట్లు కనిపిస్తోంది. డాక్టరు ఆమె పక్కన కూర్చున్నాడు.
"ఈమె మిసెస్ విల్సన్" చెప్పాడతను. తరువాత ఆమె వైపు తిరిగి, "మీ ప్రాణాలను కాపాడిన అమ్మాయిలు వీళ్ళే" అన్నాడు.
ఆ స్త్రీ నీరసంగా నవ్వి బలహీనమైన స్వరంతో యిలా అంది, "మీకు నా కృతజ్ఞతలు. ఈ దుష్ట సేవకులు పట్టుబడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది."
మిసెస్ విల్సన్ని వెంటనే ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళి, సరైన ఆహారం, మంచి సంరక్షణ కల్పించినట్లయితే ఆమె కోలుకొంటారని వైద్యుడు చెప్పాడు. ఈలోపున పోలీసులు ఆ గదిలో ఉన్న వస్తువులన్నింటినీ పరీక్షించారు. వాళ్ళు తెరిచి ఉన్న న్యూయార్కు సిటీ బాంకు చెక్కు పుస్తకాన్ని కనుగొన్నారు.
"వీటిలో ఆరు చెక్కులు పెద్ద మొత్తాలతో నింపబడ్డాయి" బాధ్యతలు నిర్వర్తించే అధికారి చెప్పాడు.
"అవి వివిధ వ్యక్తులకు చెల్లించటం కోసం వ్రాయబడ్డాయి. కౌంటరుఫోయిళ్ళ మీద వ్రాతలను బట్టి పురాతన కళాఖండాలను, ఒక గార్డెన్ ట్రాక్టరు కొనుగోళ్ళ చెల్లింపులకు వ్రాసినట్లు ఉంది. కానీ మిసెస్ విల్సన్ అలాంటివేమీ తాను కొనలేదని చెబుతున్నారు."
"ఈ రాక్షసులు వాటి మీద నా చేత సంతకాలు చేయించాలని ప్రయత్నిస్తున్నారు" దాదాపుగా సణుగుతున్న స్వరంతో ఆ రోగి చెప్పింది. "వారు చెక్కుల వెనుక దొంగ సంతకాలు పెట్టి నా డబ్బును కాజేయాలని చూస్తున్నారు."
అంత గణనీయమైన మొత్తంతో ఒక ఖాతాను ఒకే బాంకుకు బదిలిచేయటం ఆమెకు ఎలా సాధ్యపడిందని మిసెస్ విల్సన్ని గూఢచారి అడిగాడు.
"వేరు వేరు బాంకుల్లో ఉన్న నా పొదుపు ఖాతాలను ఒకే చోటికి తరలించమని ఈ ఓమన్లు నన్ను బలవంతపెట్టారు" ఆమె బదులిచ్చింది.
"ఆ మొత్తాలన్నింటినీ వాళ్ళు చెక్కు సౌకర్యం ఉన్న ఒకే ఖాతాలో జమచేసారు. అన్ని చెక్కులు ఆ ఖాతా మీదనే జారీ అవుతున్నాయి."
డాక్టరు మెల్లిగా ఆ మహిళ చేతులపై తట్టాడు. "ప్రస్తుతం ఏమీ చెప్పటానికి ప్రయత్నించవద్దు" అన్నాడతను.
"ఒమన్ దంపతులను జైలుకి తీసుకెళ్ళటానికి పోలీసుల వద్ద తగినన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మీకు ఒంట్లో బాగుందని అనిపించినప్పుడు, మీరు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవచ్చు."
నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళు మిసెస్ విల్సన్ కి తాము వెళ్ళి వస్తామని చెప్పారు. త్వరలోనే ఆమె ఈ క్లిష్ట పరిస్థితులనుంచి బయట పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఆమె వారిని చూసి కృతజ్ఞతగా నవ్వింది. "నాకు తగ్గిందని అనిపించినప్పుడు, దయచేసి నన్ను చూడటానికి రండి. మీరు నాకు చేసిన సాయాలన్నింటికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకొంటున్నాను."
అమ్మాయిలు అలాగే చేస్తామని వాగ్దానం చేసి, ఆ గదిని విడిచిపెట్టారు.
(సశేషం)
No comments:
Post a Comment