జీవం పోసుకున్న వృత్తికళ
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
కారు వెంకటాపురం కాలనీలోకి ఎంటరయింది. ఆ కాలనీ పరిసరాలను చూస్తుంటే నా మనసులో ఆనందం, ఉద్వేగం సమపాళ్ళలో మేళవించాయి. అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేం లేదు కాని, ఖాళీ స్థలాల్లో ఇళ్ళు మొలిచాయి. అప్పట్లోని కొన్ని గుడిసెలు, రేకుల ఇళ్ళు బంగ్లాలయ్యాయి. బహుశా వాళ్ళ పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగస్థులవడం వల్లనో, ఇతరులకు అమ్మేయడం వల్లనో.
అప్పటి మా ఇంటి దగ్గరకు వచ్చి కారాపాను. అది మా నాన్న స్వశక్తితో, సంపాదనతో 80 గజాల స్థలంలో కట్టుకున్న రెండు గదుల రేకుల ఇల్లు. ఆయనకి అదంటే చాలా ఇష్టం. ఆ కాలనీ నిజానికి వృత్తి పనులు చేసుకుని పొట్ట నింపుకునే బీదవాళ్ళ కోసం ఏర్పడినది. కొంతమంది అమ్ముకున్నారు. నాన్న ఓ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నా, మాదీ అలాంటి పరిస్థితే కాబట్టి నాన్న అక్కడ స్థలం కొని ఇల్లు కట్టారు.
మా ఇంటికి ఆనుకుని కుడివైపున శ్రీశైలం అనే కోమటాయన, ఎడం వైపున చెక్కపని చేసే రామచంద్రయ్య, ఎదురుగా దర్జీవాళ్ళూ ఉండేవారు.
మా నాన్న చేస్తున్న సంస్థలోనే చిన్న చిన్న కాంట్రాక్టు పనులు పట్టుకుని చేసేవాడు రామచంద్రయ్య.
రామచంద్రయ్య అంటే మా నాన్నకు ఎంతో గౌరవం. దాన్ని అతడు చేసే పని వల్ల సంపాదించాడు.
మా ఇంట్లో ఏవన్నా కార్పెంటరీ పనులుంటే రామచంద్రయ్యనే పిలిచేవాళ్ళం.
ఆయన పనిచేసే విధానం భలే చూడ ముచ్చటగా ఉండేది. సంచిలోంచి పనిముట్లను తీస్తే, అప్పుడే కొన్నంత కొత్తగా ఉండేవి. వాటిపట్ల, చేసే పనిపట్ల ఎంతో భక్తి భావం కనబరిచేవాడు. చిన్నదైనా, పెద్దదైనా పనిలోకి దిగే ముందు దేవుడికి దణ్నం పెట్టుకుని మొదలెట్టేవాడు. పనిలోకి దిగాడా, ఇక ఈ లోకంలో ఉండడు. తదేక దీక్షతో పనిచేసి, పూర్తయ్యాక తనకు సంతృప్తి కలిగితేనే వస్తువును మాకు చూపించేవాడు.
మా ఇంట్లోని పీటలు, సత్యనారాయణ స్వామి పూజా మందిరం, నిత్య పూజ షెల్ఫ్ అన్నీ ఆయన పనితనానికి నమూనాలే. అప్పుడప్పుడు తలుపు రెక్కలు ఊడిపోయినా, పీటల మేకులు పైకొచ్చినా మరమత్తు చేసేవాడు. పనికి తగ్గ డబ్బు మాత్రమే తీసుకునే వాడు. చిన్న చిన్న మరమత్తులకు ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు.
ఒకసారి మా ఇంట్లో ఆయన పనిచేస్తున్నాడు. అటుగా వెళుతున్నప్పుడు పొరబాట్న నా కాలు ఒక పనిముట్టుకు తగిలింది. అంతే, ఆయన ముఖం ఎర్రగా మారింది. "బాబూ, ఈ వృత్తి మాకు అన్నం పెడుతోంది. ఉపకరణాలు సహకరిస్తున్నాయి. మాకు దేవుడితో సమానం. తప్పుకు లెంపలేసుకుని కళ్ళకద్దుకో" అన్నాడు. వస్తువుకు దణ్నం పెట్టడమేంటి? పిచ్చి కాకపోతే. కుర్రతనం, పొగరుగా అలాగే నుంచున్నాను. కాని ఆయన చెప్పింది నేను చేసే దాకా పని మొదలెట్టనని భీష్మించుకుని కూర్చున్నాడు. నాకేం చేయాలో పాలుపోలేదు. సరైన సమయంలో పని పూర్తి కాకపోవడానికి నేనే కారణమని కొంపదీసి మా నాన్నతో చెబుతాడేమో అనిపించి భయమేసింది. ఆయన చెప్పినట్టు ఆ పనిముట్టుకు ఒంగి కళ్ళకద్దుకుని దణ్నం పెట్టాను. ఆ వెంటనే ఆయన ముఖం ప్రసన్నంగా మారి "బాబూ, చదువుకునే వయసులో కాగితం కలాన్ని, ఉద్యోగం చేసేటప్పుడు వనరులను, యంత్రాలను, పనిముట్లను గౌరవించాలి. అభిమానించాలి. ప్రేమించాలి. అవి మనకు సహకరించకపోతే మన కడుపు నిండదు. అభివృద్ధి కుంటు పడుతుంది." అన్నాడు.
ఆనాడది పూర్తిగా అర్థం కాలేదు కాని, తర్వాత్తర్వాత ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించాక ఆయన చెప్పింది సుభాషితం అన్న విషయం అర్థమైంది.
రామచంద్రయ్యగారికి కొడుకు సాంబ, కూతురు పద్మ ఉన్నారు. పిల్లను ఏడో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత పెళ్ళి చేశారు. ఆ పిల్ల వైవాహిక జీవితం ఎప్పుడూ ఒడిదుడుకులతో నడుస్తుండేది. మొగుడు ఆ పిల్లని తిట్టి, కొట్టేవాడు. మా ఇంటికొచ్చి చేతులకు, కాళ్ళకు ఉన్న గాయాలను చూసి కంట తడి పెట్టుకునేది. అవి చూసి మా కళ్ళు కూడా చెమర్చేవి. వాళ్ళ సంసారం విషయమై రామచంద్రయ్య ఊరి వాళ్ళతో పంచాయతీ పెట్టించినప్పుడు ఆ కుర్రాడు 'తప్పు తెలుసుకున్నాను, పెళ్ళాన్ని చక్కగా చూసుకుంటా' అని మాటిచ్చి పద్మను కాపురానికి తీసుకువెళ్ళేవాడు కాని, తర్వాత కొంత కాలానికి షరామామూలే. ఆ పిల్ల ఏడుస్తూ ఇంటికొచ్చేది. కూతురి జీవితం ఆయన మనసును ఎంత కల్లోల పరుస్తున్నా పనిలో దిగితే పనే ఆయన లోకం.
కొడుకు సాంబను పదో తరగతి వరకు చదివించి, తనతో అట్టి పెట్టుకుని పని నేర్పించాడు. సాంబ ఆయన వారసుడిగా, తండ్రిలాగానే పనిలోని మెళకువలను ఆపోశన పట్టి చేసే పనిలో తనదైన ప్రత్యేక పనితనం చూపేవాడు. వాళ్ళూరిలోని పిల్లను చేసుకున్నాడు. దూరపు చుట్టం, వరసకు మరదలవుతుంది. వాళ్ళిద్దరూ చక్కగా కలిసుండేవారు.
కొంత కాలానికి మా నాన్న అక్కడి ఇల్లు అమ్మేసి మంచి కాలనీలో విశాలమైన ఇల్లు కొన్నాడు. మేము అక్కడికి మారి పోయాం.
చాలాకాలం తర్వాత ఎప్పుడో ఒకసారి గతస్మృతులను నెమరేసుకోడానికి అక్కడికి వెళ్ళాను. రామచంద్రయ్య పెద్దవాడయిపోయాడు. పద్మ శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోయిందట. ఆమెకి ఒక కొడుకు. సాంబ పని మీద బైటకెళ్ళాడట. అతడికి పెళ్ళయింది. ఒక కూతురు కొడుకు. పిల్లలు రత్నాల్లా ఉన్నారు.
నాకు మంచినీళ్ళు, చాయ్ ఇచ్చి గౌరవంగా చూశారు.
మళ్ళీ ఇన్నాళ్ళకు కాలనీకి వచ్చాను.
కారు దిగి రామచంద్రయ్య ఇంటికి వెళ్ళాను. ఆయన మంచం పట్టాడు. ఆయన భార్య నాలుగేళ్ళ క్రితం చనిపోయిందట. బహుశా ఆయనకు చెవుడనుకుంటా, పద్మ వాళ్ళ నాన్నకు నన్ను చూపిస్తూ, చెవి దగ్గర పెద్దగా అరుస్తూ నా గురించి చెప్పింది. ఆయనకు అర్థమయిందో లేదోగాని, చేతులెత్తి నమస్కరించాడు. అప్పుడే సాంబ వచ్చాడు. షర్ట్ మీదున్న చిరుగులు వాళ్ళ పరిస్థితికి అద్దం పడుతోంది. నాదీ తనదీ ఇంచుమించు ఒకే వయసు. ఎందుకో నా ముందు నుంచోడానికి సిగ్గుపడ్డాడు.
"సాంబా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు?" అడిగాను.
"ఒక కంపెనీలో మెకానిక్ గా, అదీ క్యాజువల్ గా" బాధగా అన్నాడు.
"మీ వృత్తి కార్పెంటరీ కదా? పైగా నాన్న నిన్ను తనంతటివాడిగా కూడా తీర్చిదిద్దాడు. మరి ఇదేంటి…" ప్రశ్నించాను.
"ఇప్పుడు జనాలకు కావలసినవన్నీ షాపుల్లో తక్కువ ధరకు దొరకుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు చెక్క, కర్ర వస్తువుల స్థానాన్ని దాదాపు ఆక్రమించేశాయి. పాడైతే వాటిని రిపెయిర్ చేయించుకోవడం మాని కొత్తవి కొనుక్కునే సంస్కృతి పెరగింది. ఈ వృత్తిలో ఉద్యోగాలూ తక్కువే. ఇంటి పరిస్థితులకు నేను ఆసరా కాకపోతే అందరం రోడ్డున పడతాం. అందుకని మెకానికల్ షాపులో కొంతకాలం పని నేర్చుకుని కంపెనీలో పనికి కుదిరాను. ఎప్పటికైనా పర్మనెంట్ చేసుకుంటారని ఆశ." అన్నాడు.
వాళ్ళ పరిస్థితికి జాలేసింది. మనసు కరిగింది.
పద్మ ఒక ప్లేటులో చాయ్, బిస్కెట్లు తెచ్చింది. నేను గరం గరం చాయ్ తాగుతూ-
"ఇప్పుడు కార్పెంటరి పని మంచి జీతంతో వస్తే చేస్తావా?" అడిగాను.
అతడి ముఖంలో విస్మయానందాలు.
"ఎందుకు చేయను సార్. అది మా కులవృత్తి, కులదైవం. వదల్లేక, వదల్లేక బతుకుతెరువు కోసం ఆ పనిని వదిలాను. ఎక్కడన్నా ఉందా?" ఆశగా అడిగాడు.
"ఉంది మా కంపెనీలోనే. మాకు కార్పెంటర్ అవసరముంది. నువ్వు గుర్తొచ్చి ఇన్నాళ్ళకు ఈ కాలనీకి, నువ్వు చేస్తావో చేయవో అన్న అనుమానంతో మీ ఇంటికీ వచ్చాను. హమ్మయ్యా, నువ్వన్న మాటతో ధైర్యం వచ్చింది. ఇదిగో నీకు ఉద్యోగం ఇస్తున్నట్టుగా కాగితం. రేపు ఇందులో ఉన్న అడ్రస్ కి వచ్చి జాయినైపో."అన్నాను.
సాంబ కళ్ళలో నీళ్ళు. నేనన్న మాట వాళ్ళింటి పరిస్థితిని మారుస్తుందనో ఏమో పద్మ గబగబా వచ్చి నా కాళ్ళకు దణ్నం పెట్టింది.
నేను వారించే లోగానే సాంబ వాళ్ళావిణ్ని పిలచి ఆమెతో కలిసి నా కాళ్ళకు నమస్కరించాడు.
"ఏమిటి సాంబా ఇది? అన్నయ్యలాంటి వాణ్ని నేనేం మీమీద అభిమానంతో ఏ సహాయమూ చేయడం లేదు. మా అవసరం నన్ను ఇక్కడికి రప్పించింది. అడిగించింది. చక్కగా పనిచేసుకో. ఎలాంటి పరిస్థితులెదురైనా, వృత్తి విద్యను వదులుకోకు. ఈ విషయంలో నాకన్నా నువ్వు అదృష్టవంతుడివి. మా రామచంద్రయ్య పేరు నిలబెట్టాలి. మీరందరూ బాగుండాలి." అని లేచాను బయల్దేరడానికి సిద్ధపడుతూ.
తేలికపడ్డ మనసులతో, వెలిగే ముఖాలతో కారు దాకా వచ్చి సాగనంపారు.
***
కొన్నిరోజుల క్రితం ఆఫీసు పనిమీద ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఒక కంపెనీకి పనిమీద వెళ్ళాను. అక్కడ దూరంగా లేత్ మిషన్ దగ్గర పనిచేస్తున్న సాంబ కనిపించాడు. సాంబ కార్పెంటర్ కదా, అతడు కాదేమో అనుకున్నాను. కాని, శ్రద్ధగా పరికించి చూస్తే అర్థమయింది అతడు సాంబ అని. ఎందుకైనా మంచిదని ఆ ఆఫీసులో పనిచేసే ఒకతన్ని పేరడిగి సాంబేనని కన్ఫర్మ్ చేసుకున్నాను.
మా సంస్థలో అగరవత్తులు, సెంట్లు తయారు చేస్తారు. మార్కెట్లో మా ప్రొడక్ట్స్ కు మంచి పేరుంది. నేను మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ హెడ్ ను. ఒకరోజు ఎండీతో మీటింగ్ పెట్టి 'మన ప్రొడక్ట్స్ ను చేత్తో చేసిన అందమైన చెక్క బాక్స్ లలో పెడితే మంచి అట్రాక్టివ్ లుక్ వస్తుంది. ఒకరికొకరు కాంప్లిమెంటరి, గిఫ్ట్ బాక్సులుగా ఇవ్వడానికీ బాగుంటుంది. సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని' చెప్పి ఒప్పించాను.
"నీ ఇన్నోవేటివ్ థింకింగ్ బాగుంది కాని, మరి అంతటి స్కిల్డ్ పర్సన్ మనకు ఎక్కడ దొరుకుతాడు?" అని అడిగాడు.
"అదంతా నేను చూసుకుంటాను. నా కొదిలేయండి" అన్నాను.
వంశ పారంపర్యంగా తరతరాలకు చేరే కళలు చేతి వృత్తులు. తమకు మాత్రమే సొంతమైన నైపుణ్యంతో ఓపిగ్గా, శ్రద్ధగా తీర్చిదిద్దే ప్రతి వస్తువులోనూ జీవం ఉట్టిపడుతూంటుంది. మూలికా వైద్యం, జోతిషం, చిట్కాలు వంటివన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇంగ్లీష్ చదువుల వల్ల ఇవన్నీ అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటిని ప్రోత్సహించాలి. హస్తకళల్లోని కళ యంత్రాలతో చేసే వాటిలో ఎక్కడుంటుంది. ఒక్కసారి కోల్పోతే, మళ్ళీ అంతటి ప్రావీణ్యం సంపాదించడానికి కొన్ని ఏళ్ళు పట్టొచ్చు, లేదా అసలు సాధ్యం కాకపోనూవచ్చు. ఈరోజు నావంతు ప్రయత్నం నేను చేశా. ఒక వృత్తి కళాకారుడికి వెలుగుబాట చూపాను. ఇప్పటిదాకా ఎంతో మందికి ఉద్యోగం ఇచ్చాను. ఇవాళ పొందిన తృప్తి నాకు ఏనాడూ కలగలేదు. నేను తనకోసం ఒక అవకాశం కల్పించానని తెలిస్తే, ఇంటి పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా, నామోషీగా భావించవచ్చు. అందుకే విషయం సాంబకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను.
(తమ కళతో జగతికి వన్నెతెచ్చే వృత్తి కళాకారులందరికీ ఈ కథ అంకితం)
***
No comments:
Post a Comment