కలుముల జవరాల శతకము - కోసంగి సిద్ధేశ్వరప్రసాద్
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం: కలుముల జవరాల శతకకర్త కోసంగి సిద్ధేశ్వరప్రసాద్ రైల్వే కోడూరు, కడపజిల్లా నివాసి. తల్లి కృష్ణవేణమ్మ తండ్రి లింగయ్య. ఈకవి శతకాంతంలో తనగురించి ఇలా చెప్పి కొనినాడు.
వఱలు తలకోన సిద్దేశు వర జనితుఁడఁ
గృష్ణవేణమ్మ లింగయ్య ప్రియసుతుండ
రక్తి కొసంగి సిద్ధేశ్వర ప్రసాదుఁ
గలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!
వీరు ఈ శతకమే కాక 1, ఈశ్వరస్తవము, 2. గుడాలకోన మహత్మ్యం, 3, బాలమిత్ర శతకము, 4. విఘ్నరాజ శతకము లను రచించినారు.
వీరి గురించి ఇతర వివరాలు దొరకలేదు.
శతక పరిచయం:
"కలుములజవరాల! కరుణఁ గావుమమ్మ" అనే మకుటంతో ఆటవెలదులలో రచింపబడిన ఈ శతకం భక్తిరస ప్రధానమైనది. ఈ శతకములో శ్రీమన్నారాయణుని పత్ని అయిన శ్రీమహాలక్ష్మి గురించిన వైదిక పౌరాణిక అంశాలు, పూజావిధానము వివరింపబడినవి. ఏ యే దేశములలో యేవిధముగా ఏరూపమున లక్ష్మి ఆరాధింపబడినది తెలియచేయబడినది. అష్టలక్ష్ముల గురించి తెలుపబడినది. సరళమైన భాషలో శ్రీదేవీ సంబోధనాత్మకమైన దేవో స్తోత్ర నామావళి అక్కడక్కడ మనకు కనిపిస్తాయి.
ఇప్పుడు కొన్ని పద్యాలను చూద్దాము.
శ్రీరమా! శుభదాయని! సిద్ధలక్ష్మి!
యష్టభాగ్యప్రదాయని యాదిలక్ష్మి!
విశ్వనిర్మాణ కారిణి విజయలక్ష్మీ
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
ఓ మహామాయ! శ్రీపీఠ! కామజనని
నిత్య యౌవ్వన సౌందర్య! నిత్యపుష్ట!
శంఖ చక్ర గదాహస్త! సర్వశస్త!
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
పద్మ! పద్మజ! పద్మాక్షి! పద్మహస్త!
పద్మముఖి! పద్మసుందరి! పద్మగంధి!
పద్మభవుమాత! పద్మిని! పద్మనిలయ!
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
సర్వకర్మ ప్రవర్తిని! సర్వశక్తి!
సర్వమంగళ సంపన్న! సర్వవర్ణ!
విష్ణుపత్ని! హిరణ్మయి! విశ్వమాత!
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
ఇందుసోదరి! జగములనేలు తల్లి
అల సర్స్వతీ శివలతో నాడు లక్ష్మి!
కమల హరిరాణి పుణ్యాల కలిమిపంట
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
పురాణ కథలతో కూర్చిన ఈ పద్యాలను చూడండి.
"స్త్రీ" కలిగెఁ గృష్ణు నందుండి సృష్ఠిమొదట
రమణి రెండయ్యె లక్ష్మి యు రాధ యనఁగ
లక్ష్మిఁ బెండ్లాడె విష్ణుఁడా లక్ష్మివీవె
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
శక్రు సంపద దుర్వాసు శాప వశత
నుదదిఁబడె; దేవదానవు లుదధిఁ జిలుక
నందు జన్మించితివి తల్లి యబ్జ నిలయ
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
వెళ్ళదలఁచిన యింటికి వెడలనీక
యడ్డపడుచుండు గూబను నాదరించి
వాహనంబుగాఁ గొంటివో వార్థితనయ
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
హరినినుఁ బరిహసింప నీవాగ్రహించి
శిరమునూడిపోఁ బల్కితి; హరియునంత
హయశిరమున హయగ్రీవుఁడయ్యెనంట
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
విష్ణు శాపాన నశ్వమై వెలసినావు
నతని ద్యానింప నాతఁడు నశ్వమయ్యె
అట్టిమీకుఁ బుట్టినవాఁడె హైహయుండు
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
అష్టలక్ష్ముల వర్ణన పద్యాలు కొన్ని చూద్దాము
సుజనవందిత శుభకరి సుగుణ్వల్లి
మౌనిసేవిత మాధవి మంజుభాషి
అంబుజావాస జయజయ ఆదిలక్ష్మి
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
క్షీరసాగర భవ సురసేవ్య లక్ష్మి
బ్రహ్మ విష్ణు శివాత్మికా ప్రణవలక్ష్మి
తత్వమర్థస్వరూపిణీ ధాన్యలక్ష్మి
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
మంత్రమయి పరవర్షిణి మంత్రహృద్య
భార్గవీ భయనాశినీ భవ్యచరిత
ద్రష్థ శ్రీయంత్ర వాసిని ధైర్యలక్ష్మీ
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
ప్రథిత చతురంగ మండిత పరిజననుత
శాంతమయి పాపనాశిని సౌమ్యమూర్తి
సర్వసంపన్న గజలక్ష్మీ జయము జయము
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
కమల యమల సప్తస్వర గానలోల
దేవదానవ మునిజన సేవితపద
జ్ఞానదాయిని జయము సంతానలక్ష్మి
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
వరలక్ష్మీ వ్రతవిధానము మరియు వ్రతకథలను కూడా ఈశతకములో మనం చూడవచ్చును. అంతే కాక అనాదిగా వివిధ నాగరికతలలో లక్ష్మీ ఆరాధన ఏవిధంగా ఏరూపులలో జరుపుకునే వారో పద్యరూపంలో మనకు వివరంగా తెలియచేసినారు.
అల బృహత్కథా శ్లోకాల నరసి చూడఁ
గలిమి నాశించి యక్షిణిన్ గొలచినట్లు
తెల్లమగు నేను దలఁతు నిన్నుల్లమందు
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
సింధు నాగరికతఁగన నాటి సింధులోయ
దరిని పంజాబు గుజరాతు త్రవ్వకాలఁ
గానవచ్చె నీరూప విగ్రహము లెలమి
కలుముల జవరాల! కరుణఁ గావుమమ్మ!!
అంతే కాక కాంబోడియ, చైన , వంటి దేశాలలో దొరికిన నాణెములపై లక్ష్మీ బొమ్మల గూర్చి కూడా మనం ఈశతకము వలన తెలిసికొనవచ్చును.
ఎంతో చక్కగా సరళమైన భాషలో వేదాంత పౌరాణిక అంశాలనే కాక చారిత్రిక అంశాలను కూడా ఈశతకంలో జోడించి మనకు అందించారు.
విజ్ఞానదాయకము, భక్తిరస పూరితము అయిన ఈశతకము అందరు తప్పక చదవ వలసినది.
మీరుకూడా చదవండి. మీ మిత్రులచే చదివించండి.
No comments:
Post a Comment