మానస వీణ - 50 - అచ్చంగా తెలుగు

                                                                      మానస వీణ - 50 

                                                                                                 కిషోర్ మల్లిపూడి



జరుగుతున్న సంఘటనలన్నీ ఆలోచిస్తూ తర్వాత కర్తవ్యం ఏమిటా అని అనుకుంటున్న సమయంలో దినేష్ కి , హోమ్ మంత్రి కృషీలరావు గారి నుంచి ఫోన్ వచ్చింది, ఇంటికి వచ్చి ఒకసారి కలవమని.
         కృషీలరావు సాధారణంగా ఆఫీసర్స్ ఎవ్వరినీ ఇంటికి వచ్చి కలవమని చెప్పరు, అలాంటిది ఇంటికి వచ్చి కలవమన్నారంటే విషయం ఏమై ఉంటుందో దినేష్ ఊహించాడు. “బయలుదేరుతున్నా సర్!” అని చెప్పి, దినేష్ కృషీలరావు గారి ఇంటికి బయలుదేరాడు.

దినేష్ వెళ్ళగానే బయట సెక్యూరిటీ, “రండి సర్. మీరు వస్తే సార్ కూర్చోపెట్టమన్నారు” అని చెప్పి, అక్కడ పని వాళ్లకి సార్ కి కాఫీ తెమ్మని చెప్పి వెళ్లిపోయాడు.

        ఒక అయిదు నిముషాలు గడిచాక...
        కృషీలరావు గారు రాగానే... దినేష్ లేచి “గుడ్ మార్నింగ్ సార్” అంటూ, సెల్యూట్ చేసాడు.
        “నో ఫార్మాలిటీస్... కూర్చోండి దినేష్” అని చెప్పి, కృషీలరావు కూడా కూర్చున్నారు.
        కాఫీ తాగుతూ, “అన్నట్టు అప్పలనాయుడు అరెస్ట్ తర్వాత ఏమైంది? ఏదైనా విషయం రాబట్టారా? మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది?” ఈ విషయం మాట్లాడదామనే పిలిచాను అన్నారు.
        దినేష్, “ఎస్ సర్... ఆల్మోస్ట్ చాలావరకు కేసు సాల్వ్ అయ్యినట్టే సార్... అప్పలనాయుడు భార్య సుశీలమ్మ గారితో మాట్లాడాను. ఆవిడ నుంచి చాలా విషయాలు సేకరించి, ఆ డీటెయిల్స్ అన్నీ ఫైల్ చేశాను సార్. ఆవిడ అప్పల నాయుడు చేసిన అన్ని చీకటి పనులకి సాక్ష్యం, ఇదే విషయం తర్వాత కోర్టులో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు కూడా. కాకపోతే...”
        “ఆ కాకపోతే, ఏమైనా ప్రాబ్లమా దినేష్...?
        “ప్రాబ్లెమ్ ఏమి కాదు సార్, ఎంతైనా అప్పలనాయుడు తనకు భర్తే కదా..! కొంచెం శిక్ష తక్కువ పడేలా, అతనిలో మార్పు వచ్చి, ఒక మంచి వ్యక్తిగా మారటానికి సాయం చెయ్యమని అభ్యర్ధించింది.”

“తర్వాత... అతని అనుచరుల మాట ఏంటి? అప్పలనాయుడుని అంత తక్కువ అంచనా వేయటానికి లేదు, లాకప్ లో ఉండి కూడా, తన అనుచరులతో కధ నడిపించగల సమర్ధుడు. నమ్మకమైన ఆఫీసర్ ని మీరు తోడుగా పెట్టుకోండి దినేష్.”

“సరే సర్ , మనకు నమ్మకమైన S .I నే పెట్టాను.”

“తర్వాత అప్పలనాయుడు అన్యాయంగా గూడెం వాళ్ళ దగ్గర లాక్కున్న భూములు, తిరిగి ఇచ్చే విషయం ఏమైంది?
          “ఆ విషయమై ఎంక్వైరి చేశాను సర్, చాలా వరకు అన్ని దౌర్జన్యంగా లాక్కున్న భూములే, సుశీలమ్మ దగ్గర వాటికి సంబంధించిన దస్తావేజులన్ని ఉన్నాయి అని చెప్పారు. అలాగే లోకల్ తాశీల్దారు తో కూడా మాట్లాడాను, ఈ విషయమై అతను కూడా మనకు సహకరించటానికి ఒప్పుకున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం సర్...”
          “చెప్పండి దినేష్...”
           ఎలా చెప్పాలో అని దినేష్ సంశయిస్తుంటే...
           “చెప్పండి దినేష్ ఏమి పర్వాలేదు” అన్నారు కృషీలరావు గారు.
           “మీ నాన్నగారైన ఓబులేశుని హత్య చేసింది అప్పలనాయుడు మనుషులే అని నా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది సర్...”
           ఒక్కసారిగా కృషీలరావు ఆశ్చర్యంతో ఏమి చెప్పాలో అర్ధంకాక అలానే ఉండిపోయాడు.
           “అవునా...! నేను ఇంకా భూషణం చేయించాడు అనుకుంటున్నా” అన్నాడు.
            “అవును సర్, చేసింది అప్పలనాయుడు మనుషులే అయినా, చేయించింది మాత్రం భూషణం గారే.
అలాగే మీరనుకున్నట్టు, ఆయన మనవరాలు మానస బ్రతికున్న విషయం మీ నాన్నగారికి తెలుసన్న ఒక్క నిజం మాత్రమే మీ నాన్నగారి హత్యకు కారణం కాదు సర్...”

“మరి ఇంకేంటి దినేష్?” తండ్రి మరణం గూర్చిన విషయం కావడంతో ఎంతో బాధతో... అంతే అతృతతో అడిగాడు కృషీలరావు.

“చెప్తాను సర్, భూషణం గారు చేసే అకృత్యాలలో అడవి సంపదను కొల్లగొట్టడం, అడవిలో మత్తు పదార్ధాలు అయిన గంజాయి సాగు చెయ్యటం ఒకటి. దానికి అప్పలనాయుడ్ని, అతని అనుచరులను వాడుకునేవారు. అతని రాజకీయ చక్రం తిప్పినంత కాలం, ఆ పలుకుబడి ఉపయోగించుకుని, ఆ కార్యకలాపాలు గుట్టు చప్పుడు కాకుండా సాగించారు. కానీ మీ నాన్నగారు MLA అయ్యాక, భూషణం గారికి ఎన్నోసార్లు చెప్పి చూసారట, ఈ పనులన్నీ మానుకోమని, అలాగే మానస బ్రతికున్న విషయం చెప్పి, ఆ తల్లిని బిడ్డని కలిపే ప్రయత్నం చేద్దామని చెప్పారట. ఇవన్నీ జీర్ణించుకోలేని భూషణం గారు, మీ నాన్నగారిని MLA చేస్తే, తన చీకటి సామ్రాజ్యానికి రాజకీయ సహకారం ఉంటుంది అనుకున్నారు. కానీ మీ నాన్నగారు అలా చెయ్యక పోయేసరికి, అదే సమయంలో MLA నుంచి, మంత్రిగా కూడా అవకాశం రావటంతో, ఎక్కడ తన విషయాలన్ని తెలిసిన మీ నాన్నగారు అతన్ని చట్టానికి పట్టిస్తారో అన్న అనుమానంతో అప్పలనాయుడితో కలిసి, ప్రమాణస్వీకారం చేసి వస్తున్న మీ నాన్నగారిని ఎవరో ప్రత్యర్ధులు హత్య చేసినట్టు సృష్టించి, అడ్డు తొలగించారు. అందుకే మీ నాన్నగారు తను రాసుకున్న ఉత్తరంలో తనకు ప్రాణహాని ఉన్నట్టు వ్రాసారు సర్.”
చెప్పటం ముగించాడు దినేష్.

దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిన కృషీలరావు, ఇవన్నీ ఊహించలేదు.
          “అందుకే దినేష్ మీలాంటి సమర్ధుడైన ఆఫీసర్ మాత్రమే ఈ కేసు సాల్వ్ చెయ్యగలడని మీకు అప్పగించాను” అన్నాడు.
           “అన్నట్టు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా సేకరించారు దినేష్?
           “ఎస్ సర్, అనుమానం వచ్చి ఒకసారి అప్పలనాయుడు, భూషణం గారి కాల్ డేటా రప్పించాను. అప్పుడే నాకు భూషణం గారికి, అప్పలనాయుడికి ఏదో సంభంధం ఉన్నట్టు అర్ధం అయ్యింది. అప్పలనాయుడి ఎంక్వయిరీ సమయంలో నాకు తెలిసింది ఏమిటి అంటే, నేను ఈ కేసు టేకప్ చేసిన విషయం తెలిసిన అప్పలనాయుడు భూషణం గారికి ఫోన్ చేసి, ఎలాగైనా తన పలుకుబడి ఉపయోగించి, ఈ ఇన్వెస్టిగేషన్ ఆపించమని, లేదంటే తను పట్టుబడితే భూషణం పేరు కూడా బయటపెడతానని ఫోన్ చేసి బెదిరించాడట. ఆ ఫోన్ కాల్ తర్వాతే భూషణం గారికి బెంగతో ఆరోగ్యం పాడయి, తర్వాత బీపీ ఎక్కువై, పక్షవాతం రావటం జరిగిందని” చెప్పసాగాడు దినేష్.

“మరి తర్వాత ప్లాన్ ఏంటి దినేష్...?”
          “చూడాలి సర్, నేనయితే అన్ని విషయాలు సేకరించి, సరైన ఆధారాలతో ఫైల్ తయారు చేసి త్వరలో మీ ముందు ఉంచుతాను. తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది.”
          “ఇక నేను వెళ్తాను సర్, అప్పలనాయుడి భార్య సుశీలమ్మ గారిని కలవాలి” అంటూ దినేష్ అక్కడనుంచి కదిలాడు.

“ఓకే దినేష్ తర్వాత కలుద్దాం...” అని కృషీలరావు తన తర్వాత కర్తవ్యం ఏంటా అని ఆలోచిస్తూ పేపర్ చదవటంలో నిమగ్నమయ్యాడు.

***

కాఫీ తాగటం పూర్తవ్వగానే, మానస “పద అనిరుధ్  బయటకి వెళ్ళాలి, పని ఉంది” అంది.

              “ఏంటా పని? ఎప్పుడూ ఉండేవే కానీ, కొంచెం అవన్ని పక్కనపెట్టి, సరదాగా అలా బయట నడుద్దాం పద. నీతో ప్రశాంతంగా మాట్లాడి ఎన్ని రోజులయ్యిందో.”

కొంచెం సేపు అలోచించి... “సరే పద” అన్నది మానస. అడగగానే ఒప్పుకున్నందుకు ఎగిరి గంతేసినంత ఆనందం వచ్చింది అనిరుధ్  కి.
          ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మానస మోహంలో. ఇంతకాలం ఏ బంధాల కోసం తను తాపత్రయ పడిందో, అంతకంటే రెట్టింపు బంధాలని, మనుషులని ఇచ్చాడు దేవుడు.

          నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు తగులుతున్న మానస చేతి స్పర్శని ఆస్వాదిస్తూ, ఒక తెలియని అనుభూతిని పొందుతున్నాడు అనిరుధ్. అటు మానస పరిస్థితి కూడా అలానే ఉంది. అనిరుధ్ బాల్య మిత్రుడే అయినా, ఎన్నోసార్లు బైక్ మీద తిరిగారు, ఎన్నోసార్లు కలిసి తిరిగారు కానీ అప్పుడెప్పుడు కలగని అనుభూతి, ఈ రోజు ఈ స్పర్శలో కలుగుతుంది. బహుశా ప్రేమలో ఉన్నామన్న ఊహకున్న గొప్పశక్తి ఇదే అనుకుంటా”, అని అనుకుంటూ ఇద్దరూ చిన్నగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నారు.

          ఇద్దరి మధ్య మౌనం ఎన్నో మాటలు మార్చుకుంటున్న వేళ... చల్లని గాలికి సముద్ర తీరంలో అలలులా ఎగురుతున్న ఆమె ముంగురులు ఒక చేతితో సవరించుకుంటున్న మానస ఇంకా అందంగా కనిపించింది అనిరుధ్  కి .

          ఇటు తను ఎప్పుడూ చూసే చిన్నచిన్న విషయాలు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి మానసకి. ఇంతలో పాలపొదుగు కోసం, ఒక ఆవుదూడ తన తల్లి దగ్గరకి పరిగెత్తడం చూసిన మానస, ఆ దృశ్యానికి పరవశించి పోయి, అక్కడే అలానే కొంత సేపు నిలబడి పోయింది.

          ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న అనిరుధ్, ఆనందంతో మానస అనుభవిస్తున్న అనుభూతిని అర్ధం చేసుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు.

          ఇంతలో తేరుకున్న మానస, “ఏంటి అనిరుధ్  అలా చూస్తున్నావ్?” అని అడిగింది.
         “ఏమి లేదు మానస, ఇన్నాళ్లు నువ్వు నీ తల్లి ప్రేమ కోసం ఎంత ఆరాటపడి ఉంటావో కదా” అని ఆలోచిస్తున్న.

          “అవును అనిరుధ్, నాకు మాటలు వచ్చాక - "అమ్మా" అని పిలిస్తే ఎవరు పలికారో, ఎవరు నా ముద్దు ముద్దు మాటలకు పరవశించి పోయారో తెలియదు. కానీ ఇన్నాళ్లకు "నా బంగారు తల్లీ..." అంటూ అప్పటి నా పిలుపుకు సమాధానంగా మా అమ్మ శ్రావణి గారిని పంపించాడు ఆ దేవుడు.”

          “అవును మానస, అన్నీ తెలిసిన దేవుడు అందరిని ఒకేలా పుట్టించకుండా ఇలా ఎందుకు చేస్తాడో అర్ధంకాదు.”
           అందుకు మానస చిన్నగా నవ్వి... “నువ్వు పొరబడుతున్నావు అనిరుధ్. నువ్వు ఎప్పుడైనా మురికి నీరు వర్షంగా కురవటం చూసావా?
          “లేదు...!”
          “హిమాలయ పర్వతం నుంచి కరిగే నీరు మురికిగా కరగటం చూసావా...?
          “లేదు మానస...”
          “వర్షం నుంచి వచ్చే నీరు, ఆ హిమాలయాల నుంచి వచ్చే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అంతే స్వచ్ఛంగా ప్రతీ ప్రాణిని ఈ ప్రకృతిలో సృష్టించాడు దేవుడు. కాకపోతే ఆ నీరు ప్రవహించే చోట్లని బట్టి, ఆ నదిలో కలిసే ఇతర మురికి వల్ల ఆ నీరు ఎలా కలుషితం అవ్వుతుందో, మనిషి కూడా తను పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న మనుషుల వల్ల కలుషితం అవుతాడు. అందుకే పసిపిల్లలు దేవునితో సమానం అనేది. మనమే మన స్వార్ధపు ఆలోచనలతో వారి పసి హృదయాల్ని కాలంతో పాటు కలుషితం చేస్తాం. అయినా ఎన్నో సృష్టించిన మనిషి ఒక్కటి మాత్రం తనకు తాను సృష్టించుకోవటంలో విఫలం అవుతాడు, అదేంటో తెలుసా..?

          “ఏంటి మానస...?

          “ఆనందం... అవును ఆనందం.”

          “తన చుట్టూ ఉన్న మంచి మనుషుల మధ్య ఆనందం ఉందని గ్రహించక, ఎక్కడికో పరుగులు తీస్తాడు. మురికి కాలవలో పేరుకు పోయిన చెత్తని ఎవ్వరు శుభ్రం చెయ్యలేరు అనిరుధ్, ఒక్క కొత్త నీరు తప్ప. అలాంటి కొత్త సమాజం కోసమే నా ఈ ప్రయత్నమంతా...”

          “నిజం మానస...”

          “హ్మ్మ్... అన్నట్టు నీ ఆస్ట్రోనాట్ అవ్వాలనే ఆశయం ఎంతవరకు వచ్చింది?”

           “దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మానస. బహుశా వచ్చే నెలలో ఇక్కడ పరిస్థితులన్ని చక్కబడితే , కొంతకాలం నేను ఒక ట్రైనింగ్ మీద ఢిల్లీ వెళ్ళవలసి వస్తుంది.”

           “మంచి విషయం చెప్పావు అనిరుధ్. నేను కూడా ఇక్కడ చెయ్యాల్సిన పనులు చాలానే ఉన్నాయ్.
ముఖ్యంగా జగ్గయ్య తాతతో గూడెం వాళ్ళకి ఒక ఆయుర్వేద హాస్పిటల్ పెట్టించాలి, గూడెం పిల్లలకి మంచి చదువు చెప్పించాలి. అన్ని బాగున్నాయి కానీ, ఇప్పుడే నీ చేరువలో ఉన్న మాధుర్యం చవిచూస్తుంటే, మళ్ళీ దూరం అవుతావా?” అంటూ బుంగ మూతి పెట్టింది మానస.

          “ఎంత మానస... ఒక్క ఆరు నెలలు అంతేగా, ఇట్టే గడిచిపోవూ?

“అయినా నీ చేరువలో ఏర్పడిన ఈ బంధం విలువ తెలియాలి అంటే ఆ మాత్రం దూరం తప్పదు" అన్నాడు కొంటెగా...

         అవును. చేరువ ఇద్దరి మధ్య బంధం పెంచితే, దూరం ఆ బంధం యొక్క విలువని తెలుపుతుంది.

ఇద్దరూ వారి వారి ఆశయాల కోసం కలిసి అడుగులు వేస్తూ ముందుకు నడవసాగారు...

 

No comments:

Post a Comment

Pages