నహుషుడు - అచ్చంగా తెలుగు

నహుషుడు

అంబడిపూడి శ్యామ సుందరరావు 




స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించటం వలన ఆయనకు బ్రహ్మహత్యా దోషము పట్టుకుంది అందువల్ల తాను స్వర్గాది పత్యానికి అనర్హుడిని అని భావించి ఆచూకీ తెలియని సరస్సులో నారాయణ మంత్రం జపిస్తూ ఒక తామర తూడు లో దాక్కున్నాడు ఆ సమయంలో అష్టదిక్పాలకులు దేవతలు మునులతో సంప్రదించగా వారు చంద్ర వంశములో ప్రభ - ఆయువు లకు జన్మించిన నహుషుడు అర్హుడని నిర్ణయించారు. 

ఋగ్వేదంలో నహుషుని  గురించి తరచుగా ప్రస్తావించబడింది . నహుషుడు ప్రతిష్ఠానం నుండి పాలించాడు. రాజ్యపాలన చేస్తూ నూరు యాగాలు చేశాడు అతను పురూరవుని పౌత్రుడు ఈతని భార్య ప్రియంవద. ప్రియంవద ద్వారా యతి (ముని అయ్యారు) యయాతి(రాజు అయ్యాడు) సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నాడు. శ్రీమద్భాగవతము నందును, విష్ణు పురాణము నందు నహుషుని కొడుకులు యతి, యయాతి , సంయాతి, ఆయాతి, నియతి, కృతి అని ఆరుగురు చెప్పబడి ఉన్నారు దానధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో నహుషుడు ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడిన వాడు. అలా దశదిశలు వ్యాపించిన అతని కీర్తి, ఇంద్రలోకానికి కూడా చేరుకుంది అందువల్ల నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా దేవతలు నహుషుని స్వర్గాధిపతిగా  చేశారు ఆ విధంగా ఒక సాధారణ రాజైన నహుషునికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు.

ఇంద్రపదవి చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రానురానూ అతనికి అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్నుమిన్ను కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహుషునికి ఓమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే ‘ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు. నహుషుని మాటలకు శచీదేవి విస్తుపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు.శచీదేవి విష్ణుమూర్తిని ఈ ఆపద నుంచి తప్పించమని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు నహుషుని తన వద్దకు సప్తర్షులు పల్లకి మోయగా రమ్మని సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు శచీదేవి నహుషుడిని తన వద్దకు సప్తర్షులు పల్లకి మోయగా అందులో రమ్మని చెపుతుంది. తప్పని సరి పరిస్తుతులలో సప్తర్షులు నహుషుని పల్లకి మోయటానికి అంగీకరిస్తారు నహుషుడు ఆ పల్లకిలో బయలుదేరుతాడు.

శచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుడిని ఒక్క తాపు తన్నాడు. ‘సర్ప! సర్ప!’ (త్వరగా, త్వరగా) అంటూ ఆయనను తొందర పెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేక పోయాడు. ‘సర్ప! సర్ప! అంటున్నావు కదా! నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు,’ అంటూ నహుషుని శపించాడు.చేసిన తప్పును తెలుసుకొని నహుషుడు క్షమించమని వేడుకొని శాపవిమోచన అడుగుతాడు అప్పుడు అగస్త్యుడు ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆ నాడే  నీకు శాప విమోచన కలుగుతుంది అని చెపుతాడు. ఆనాటి నుండి నహుషుడు పెద్ద సర్పము రూపంలో దైత్య వనములో తిరుగుతున్నాడు.

పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతము దాటి దైత్యవనములో ప్రవేశిస్తారు.భీముడు ఆ ప్రాంతంలో సంచరిస్తున్న సమయములో సర్పరూపంలో నున్న నహుషుడు భీముడిని తన తోకతో బంధిస్తాడు వాయు దేవుడి అంశంతో జన్మించిన భీముుడు అమిత బలశాలి భుజ బలం లో, గదా యుద్ధం లో భీముడికి ఎవరూ సాటిలేరంటే అతిశయోక్తి కాదు. జరాసంధుడిని మల్ల యుద్ధం లో ఓడించిన యోధుడు భీముడు. బకాసురుడు, హిడింబాసురుడు మొదలైన రాక్షసులను వధించిన వాడు. దానంలో కర్ణుడికి, బలము భీముడికి ఎవరూ సాటిలేరని చెబుతారు. అటువంటి భీముడు విచిత్రముగా ఓ కొండ చిలువ కు బందీ కావాల్సి వచ్చింది భీమునికి ఆ సాధారణ బలం ఉన్నప్పటికీ, నహుషుడు  చాలా శక్తివంతంగా ఉన్నాడు, అతను పడిపోయినప్పుడు అగస్త్యుడి నుండి ఒక వరం పొందాడు, అతనిని తీసుకున్న, అతనికంటే గొప్ప బలవంతులు వెంటనే తమ బలాన్ని కోల్పోతారు.

భీముడిని వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు బందీ అయిన భీముని చూసి ఆశ్చర్యపోతారు. నహుషుని చెరలో విలవిల్లాడుతున్న భీముని చూడగానే ధర్మరాజు కి  ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది. దాంతో మెల్లగా దాన్ని మాటల్లోకి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. ‘నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుడిని విడిచిపెడతావా’ అని ప్రతిపాదించాడు ధర్మరాజు.

తన ప్రశ్నలకు సరి అయిన జవాబు లిస్తే భీముడిని వదిలిపెడతామని సర్ప రూపంలో ఉన్న నహుషుడు చెపుతాడు నహుషుడు, ధర్మరాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశారు. అవి ‘బ్రాహ్మణుడు అంటే ఎవరు? అతను ఏం తెలుసుకోవాలి?’ అని. దానికి ధర్మరాజు ‘సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహము వంటి లక్షణాలు ఉన్న వాడే బ్రాహ్మణుడు, అతను దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలనీ’ బదులిచ్చాడు. అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారెవరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకొచ్చాడు. భారతములో యక్ష ప్రశ్నల గురించి మనము విన్నాము ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబులిచ్చి తన సోదరులను విడిపించుకున్న విషయం మనకు తెలుసు కానీ భారతములో  యక్షుడిని మించిన చిత్రమైన పాత్ర సర్పరూప ములోని నహుషుడు ఆ విధంగా నహుషుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి భీముడిని విడిపించుకొని నహుషునికి ధర్మరాజు శాప విమోచనం కలుగజేస్తాడు నహుషుడు ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసే శాప విముక్తుడవుతాడు నహుషుని వృత్తాంతం అరణ్యపర్వం లో ఉంది.పౌరులను పాటించాల్సిన రాజుకి ఆ పాలనాధికారం తలకెక్కి కోరరాని కోరిక కోరిన,నహుషునిలా దిగజారిపోక తప్పదని ఈ కథ చెబుతుంది.

***

No comments:

Post a Comment

Pages