న్యాయం- ధర్మం - అచ్చంగా తెలుగు

న్యాయం- ధర్మం

డాక్టర్. బీ. యన్. వీ. పార్ధసారధి





జడ్జి జయదేవ్ తన పాత మారుతి కారుని అమ్మాలనుకున్నాడు. ఆ కారు అతను హై కోర్ట్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆరేళ్ళకి కొన్నాడు. ఆ కారు అతనికి బాగా అచ్చివచ్చింది అని చెప్పొచ్చు. అందుకే, ఆ కారు కొన్న మరో పదేళ్లకు ఇన్నోవా కొన్నప్పటికీ , పాత మారుతి ని మాత్రం పదిలంగా చూసుకునేవాడు. జడ్జి గా పదోన్నతి పొందాక ప్రభుత్వం వారు కారు ఇవ్వటం తో , మారుతి, ఇన్నోవా రెండు కార్లని జడ్జి జయదేవ్ పూర్తిగా తన కుటుంబం వాడకానికి విడిచి పెట్టేసాడు. ఇంట్లోవాళ్ళు మారుతి కన్నా , ఇన్నోవా మీద మక్కువ చూపడం తో , కొన్నాళ్ళకి మారుతి కారు గారేజ్ కే పరిమితమయ్యింది. దానితో , మారుతి ని అమ్మెయ్యమని ఇంట్లో వాళ్ళు తరచూ జయదేవ్ ని సతాయించడం మొదలెట్టారు. మారుతి కారు మీద మమకారం ఉండటం వల్ల జయదేవ్ ఎటూ తేల్చకుండా విషయాన్ని నానుస్తూ వచ్చాడు. కోర్టుకి శలవు రోజుల్లో బయటికి వెళ్లాలంటే తరచూ మారుతి కారునే వాడసాగాడు జయదేవ్.

"మారుతి కారు కొని దాదాపు ఇరవై మూడేళ్లయ్యింది. ఇంకొన్ని రోజులు పొతే, దాన్ని పాత ఇనప సామాన్లు కొనేవాడు కూడా తీసుకోడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎంతో కొంతకి దాన్ని అమ్మేయండి. " అని జయదేవ్ భార్య జానకి తరచూ సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా సణగటం మొదలెట్టింది. చివరికి ఒక సుముహుర్తాన ఒకరోజు ఏ కళ న వున్నాడో కానీ జయదేవ్ ' అలేగే. కారు అమ్మేద్దాం ' అన్నాడు భార్య జానకి తో. భర్త ' అమ్మేద్దాం ' అన్నదే తడవుగా జానకి తమ డ్రైవర్ కి ' ఎవరైనా కొనే వాడుంటే మారుతి కారుని అమ్మేస్తాం' అని చెప్పింది. ఆ డ్రైవర్ వెంటనే నాలుగు రోజుల్లో ఒకడిని పట్టుకుని వచ్చాడు. వాడు కారుని పరిశీలించి యాభై వేలకి కొంటానని మాటిచ్చాడు.

ఆదివారం నాడైతే తాను ఇంట్లో వుంటాను కాబట్టి ఆరోజు వచ్చి డబ్బులిచ్చి కారు పట్టుకెళ్ళమని చెప్పమన్నాడు జయదేవ్ భార్య జానకితో. ఇంతలో అనుకోకుండా రెండు రోజులముందు అనగా శుక్రవారం నాడు కోర్టు వారి బండి ని సర్వీసింగ్ కి ఇయ్యాల్సి రావటం తో డ్రైవర్ ని ఇన్నోవా బండి ని తియ్యమన్నాడు జడ్జి జయదేవ్. దురదృష్ట వశాత్తు ఇన్నోవా బండి స్టార్ట్ కాలేదు. ఎంత ప్రయత్నించినా కదలనని మొరాయించింది. అప్పుడు డ్రైవర్ తో మారుతి బండిని తియ్యమన్నాడు జడ్జి జయదేవ్. మారుతి బండి అప్పటికి దాదాపు మూడు నెలలుగా అస్సలు వాడలేదు. కానీ వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయ్యింది.

ఆరోజు సాయంత్రం కోర్టు నుంచి వస్తూనే జయదేవ్ భార్య జానకి తో, " నేను మారుతి అమ్మదలచుకోలేదు. ఇవాళ ఉదయం నా అవసరానికి ఆ అబండే నాకు ఉపయోగ పడింది. ఇన్నోవా వుండీ ఇవాళ నాకు ప్రయోజనం లేకుండా పోయింది. మూడు నెలలుగా వాడకపోయినా మారుతి ఏ ఇబ్బంది పెట్టకుండా సాఫీగా స్టార్ట్ అయ్యింది. " అన్నాడు.

భర్త కొన్ని స్థిరసమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అతను కోర్టు లో ఇచ్చే తీర్పుల లాగానే ఏమాత్రం తొణకకుండా, బెణకకుండా మాట్లాడే తీరు ముప్పై ఏళ్ల దాంపత్య జీవితంలో బాగా అనుభవం ఉండటం వల్ల మారు మాట్లాడకుండా జానకి తమ డ్రైవర్ తో, " అయ్యగారు తన నిర్ణయం మార్చుకున్నారు. మారుతి బండి అమ్మట్లేదు. ఆ కుర్రాడికి ఈ సంగతి చెప్పి, ఆదివారం రావద్దని చెప్పు " అంది.

మర్నాడు అనగా శనివారం ఉదయం డ్రైవర్ వస్తూనే జానకి తో, " అమ్మగారు. పాపం అతను మన పాత బండి ని కొనటానికి ఒక మార్వాడి దగ్గర భార్య నగలు తాకట్టు పెట్టి యాభై వేలు కాష్ తీసుకున్నాడు. ఇప్పుడు సారు బండి అమ్మట్లేదు అంటే అతనితో వాళ్ళ ఆవిడె గొడవ పడుతుంది. అతను వర్రీ అవుతున్నాడు " అన్నాడు.

డ్రైవర్ అన్న విషయాన్ని జానకి తన భర్త జయదేవ్ చెవిన వేసింది. ' అతని ఇంట్లో సమస్యలకి నేను ఎలా బాధ్యుడిని అవుతాను? అతన్ని అప్పు చేసి నా కారు కొనమని నేను చెప్పనా? " అన్నాడు లా పాయింట్ తీస్తూ జడ్జి జయదేవ్. భర్త తో వాదించి లాభం లేదని తెలిసిన జానకి మౌనం వహించింది.

సోమవారం నాడు డ్రైవర్ డ్యూటీ లోకి వస్తూనే జానకి తో, " అమ్మగారు. అతని ఇంట్లో బాగా గొడవయ్యింది. అతని భార్య ఎలాగైనా సరే తన నగలు విడిపించుకుని రమ్మంది. పాపం అతను మార్వాడీకి మూడువేలు చెల్లించి నగలు విడిపించుకుని తన భార్య కి ఆ నగలు తిరిగి ఇచ్చాడు. " అన్నాడు.

భర్త ఉదయం కోర్టు కి వెళ్లేముందు అనవసరంగా అతనికి చికాకు కలిగించటం ఎందుకని, సాయంత్రం కోర్టు నుంచి వచ్చాక ఆ సంగతి మెల్లగా అతని చెవిన వేసింది జానకి. 

" అతనికి మూడు వేలు నష్టం వస్తే మనం ఎలా బాధ్యులం? " అని మళ్ళీ లా పాయింట్ తీసాడు జడ్జి జయదేవ్.

మర్నాడు ఉదయం డ్రైవర్ డ్యూటీ లోకి వస్తూనే ఆఫీస్ బండి తియ్యబోతూ, మారుతి కారు ముందు అద్దాలు పగిలి ఉండటం గమనించాడు. బండి పక్కనే ఒక రాయి కూడా పడి వుంది. జడ్జి జయదేవ్ కి మారుతి మీద ఎంత మక్కువో డ్రైవర్ కి కూడా బాగా తెలుసు. వెంటనే జానకి కి ఆ దుర్వార్తని చెప్పాడు డ్రైవర్.

జానకి భర్త జయదేవ్ కి ఆ దుర్వార్తని చెవిన వేసింది. " నన్ను కోర్టు లో దింపి మారుతి కారు అద్దాలు బాగు చేయించి బండి ఇంట్లో పెట్టి, ఆ తర్వాత నువ్వు కోర్టు కి రా " అని డ్రైవర్ కి పురమాయించాడు జడ్జి జయదేవ్.

సాయంత్రం కోర్టు నుంచి జయదేవ్ ఇంటికి వచ్చాక జానకి భర్త తో, " ఏవండీ! మారుతి కారు అద్దాలు మార్చడానికి మూడు వేలు ఖర్చు అయ్యింది" అంది. మూడు వేలు అన్న మాట వినగానే ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు జయదేవ్. అది చూసి నవ్వింది జానకి.

"ఎందుకు నవ్వుతున్నావు?" ప్రశ్నించాడు జయదేవ్.

"మన మారుతి కారుని మనం అమ్ముతాం అని చెప్పాము కాబట్టి ఆ కుర్రాడు యాభై వేల రూపాయలకి కొనటానికి ఒప్పుకుని పాపం డబ్బులు కోసం తన భార్య నగలు తాకట్టు పెట్టాడు. మళ్ళీ మనం మనసు మార్చుకుని బండి అమ్మటం లేదు అని మాట మార్చాము. అతను మూడు వేలు చెల్లించి ఆ నగలు విడిపించుకుని తన భార్య కి ఆ నగలు తిరిగి ఇచ్చాడు. అతనికి మూడు వేలు నష్టం అయితే దానికి మనం ఎలా బాధ్యులం అవుతాం అని మీరు లా పాయింట్ తీశారు.

న్యాయం వేరు, ధర్మం వేరు. న్యాయపరంగా మీరు అన్నది ఒప్పో, తప్పో నాకు తెలియదు. కానీ మన చర్య వల్ల అతనికి మూడు వేలు నష్టం కలిగిందన్న మాట మాత్రం వాస్తవం. ఆ నష్టాన్ని భర్తే చేయటం మన ధర్మం. మనం చేసే చర్యలకి మనమే బాధ్యులం అవుతాం. దాని పర్యవసరం కూడా మనమే అనుభవించాలి. అదే కర్మ సిద్ధాంతం.  మనం ధర్మం పాటించనప్పటికీ, కర్మ సిద్దాంతం ప్రకారం మనము చేసే ప్రతీ మంచి, చెడు యొక్క ఫలితం మనం అనుభవవించాల్సిందే. ఇప్పుడు మనకి అదే జరిగింది. " అంది జానకి. మౌనంగా తల దించుకున్నాడు జడ్జి జయదేవ్.

***

No comments:

Post a Comment

Pages