ఒకటైపోదామా ఊహల వాహినిలో - 7 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా ఊహల వాహినిలో - 7

Share This

ఒకటైపోదామా ఊహల వాహినిలో - 7

కొత్తపల్లి ఉదయబాబు 


(పెళ్ళికి ముందే తనకు బిడ్డను కనిచ్చే అమ్మాయినే చేసుకుంటాను అంటూ తండ్రికి చెబుతాడు విరాజ్.)

పదిమందిలోను పరువుపోదూ? అప్పుడు విషయం అప్పుడు చూసుకోవచ్చులే. ఏది ఏమైనా ఈ రోజుల్లో పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించడం చాలా తప్పైపోతోంది. ప్రస్తుతానికి ఒప్పుకున్నట్లుగా ఒప్పుకొని  సమయం వచ్చినప్పుడు తన నిర్ణయం  ప్రకారం చేయడమే"  అనుకున్న అతని తండ్రి తన భయాన్ని కొడుకుకి కనిపించనివ్వకుండా పకపకా నవ్వేశాడు.

  " గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని మా చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాల్లో చదివాను రా.

 చాలా ఎదిగిపోయావు రా నువ్వు. ఈరోజుల్లో చదువులు అన్నీ ఇలాగా అమ్మకి నాన్నకి ఎదురు తిరగమని  చెప్తున్నాఏంట్రా? సరే నువ్వు చెప్పినట్టే రాయిద్దాం. ఓ కాగితం ముక్కేగా" అన్న విరాజ్ తండ్రి  తన స్నేహితులు, విరాజ్ స్నేహితుల సమక్షంలో అగ్రిమెంట్ కాగితం రాసి  కొడుకుకు ఒక కాపీ ఇచ్చి రెండో కాపీ తన దగ్గర భద్రపరచుకున్నాడు.

  ఆ కాయితాలు తీసుకునేటప్పుడు  కలుసుకున్న వారి చూపుల్లో గెలుపు మాదే అన్న ధీమా ఎవరికి వారిలో కనిపించింది.

  సరిగ్గా ఆ సమయంలోనే విరాజ్ కళ్ళల్లో హరిత పడింది.

  ***

  ''ఇంటికి రమ్మన్నారుగా... అందుకే ఇంతవరకు మీరు చూడకుండా దూరంగా ఫాలో అయ్యాను.'' అన్న మాటలు విని -

  తలవంచుకుని ఇంటి సందులోకి మలుపు తిరుగుతున్న హరిత టక్కున ఆగి వెనక్కి తిరిగింది.

  వెనుక బైక్ మీద విరాజ్.

  హరిత భయపడలేదు.

  'సరే. నేను ఇంట్లోకి వెళ్లిన పది నిముషాల తర్వాత రండి. అంతవరకూ ఇక్కడనుంచి కదలద్దు. మీరు ఈ సందు మొగలో ఈ చెట్టుకిందే నిలబడండి. ఈలోగా మీరు వస్తానన్నారని అమ్మకి చెప్పి ఉంచుతాను. మీరేం చెప్పాలో అమ్మముందే నాతో మాట్లాదురుగాని.'' అనేసి అతని సమాధానం కోసం చూడకుండా గబగబా వెళ్ళిపోయింది హరిత.

  అంతవరకూ క్షణమొక యుగంలా గడిపిన విరాజ్ పదకొండో నిముషంలో హరిత వెళ్లిన ఇంటి గుమ్మం ముందు బైక్ ఆపి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు.

  ఒక నడివయసు ఆవిడ తలుపు తీసింది.

 '' మీరూ...''

  '' నా పేరు విరాజ్ అండి .ఈ మధ్య మీ అమ్మాయి  చదివిన కళాశాలలో వార్షికోత్సవంనాడు  మీ అమ్మాయిగారికి బహుమతి ఇచ్చింది నేనే.''

  ''అలాగా..అమ్మాయి చెప్పింది బాబు. లోపలకి రండి.'' అంటూ  ఆహ్వానించింది ఆమె.

  ''హరితా ...నీకోసం విరాజ్ గారు వస్తారని చెప్పావుగా.. వచ్చారు.నేను కాఫీ తెస్తాను బాబు.'' అని ఆమె లోపలకు నడవబోయింది.

  ''నేను కాఫీ టీలు తాగను మేడం. అయినా అవేమీ అవసరం లేదు. ముందు మీరు కూర్చోండి.''అన్నాడామెను.

  ఆమె కూర్చుంది.

  ''నిజానికి నేను సూటిగా మీతో మాట్లాడటానికి వచ్చాను. నేను మొట్టమొదటి సారి హరితను చూసినప్పుడు నా గుండె ఏదోతెలియని వేగంతో కొట్టుకుంది. కార్యక్రమం పూర్తి అయి ఇంటికి వెళ్లినా అది తగ్గలేదు.

  నాకు అపుడే అర్ధమైంది తనని చూసి నా రక్తం ఉరకలు వేస్తోంది అంటే ... ఆమె  నా జీవిత భాగస్వామి అయితే బాగుంటుంది అని.

  నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో కొందరితో సోషల్ గా మూవ్ అయినప్పుడు కూడా నాకు ఏ  భావమూ కలగలేదు ఎవరిమీదా. కానీ హరితను తలుచుకున్న కొద్దీ నాలో ఏదో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఒక విధంగా ఇది ప్రేమ తాలూకు మొదటి భావమేమో నేను చెప్పలేను.

  ముక్కు మొహం తెలియని  ఒక కుర్రవాడు ఇంత  ధైర్యంగా తన పెద్దలెవరినీ తీసుకురాకుండా ఇలా చెప్పేస్తున్నాడేమిటి   అని మీరు అనుకోవచ్చు. ఒక్క క్షణం ఆలస్యమైనా నా  జీవితానికి జవాబును కోల్పోతానేమో అనే భయంతో నాలుగు రోజుల క్రితం తానూ కాలేజీకి వెళ్తుంటే దారికి అడ్డుతగిలాను.

  మీరు ఏం చెప్పదలచుకున్నా మా అమ్మ ఎదురుగా చెప్పండి ..ఇలా రోడ్డుమీద వద్దు అంది హరిత. ఈ నాలుగు రోజులూ ఆలోచించిన మీదట నాకు అర్ధమైంది ...నేను ప్రశ్న అయితే తానూ జవాబు...అని. అలా నిర్ణయించుకున్నాకనే  ఈరోజు ధైర్యంగా  మీముందు నిలబడ్డాను.

  ఇక నా కుటుంబం గురించి.'' అంటూ తన తండ్రి గురించి, తన వ్యాపారం గురించి అన్ని వివరాలు చెప్పాడు.

  ఇంతలో వేడిగా పొగలు కక్కుతున్న బోర్నవిటా తీసుకుని వచ్చి అతనికి ముందు టీపాయిమీద పెట్టింది హరిత.

  ''ఆయన చెప్పినదంతా విన్నావు కదమ్మా. మరి మన గురించి కూడా నువ్వు చెప్పమ్మా.'' అంది తల్లి వెనుకగా నిలబడి ఆమె భుజం మీద చేయి వేసి నిలబడి.

  ''ముందు అది తీసుకో బాబు. చల్లారి పోతుంది.మీరు అది తాగాకా నేను చెబుతాను.'' అందామె.

  మారు మాట్లాడకుండా దానిని తీసుకుని మూడు గుటకల్లో పూర్తిచేసి కప్ టీపాయ్ మీద ఉంచాడు విరాజ్.

  ''అంత వేడి పదార్ధం...మూడు గుటకల్లో తాగేసారా?'' ఆశ్చర్యపోయింది హరిత.

  ''బాబు. నాపేరు శకుంతల. మావారు ఎయిర్ ఫోర్స్ లో   పనిచేసేవారు. కొంతమంది ఉత్సాహవంతులైన ఉద్యోగుల్ని ఎంపిక చేసి వారికి పైలట్ శిక్షణ ఇప్పిస్తే అత్యవసర సమయాలలో పనికొస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంపిక చేసిన ఉద్యోగులలో మావారు ఒకరు. వారి పేరు ధర్మతేజ.

  అయితే  ఇక రెండు మూడు రోజుల్లో శిక్షణ పూర్తయిపోతుంది అనుకుంటున్న సందర్భంలో వారు నడుపుతున్న విమానం నేలమీదకు లాండింగ్ అవుతున్న సమయంలో ఆయన మరణించారు. అప్పటికి హరితకు 13వ సంవత్సరం. ఆ తరువాత మేము నా పుట్టింటికి వచ్చేసాం. కేవలం ఆయన  ద్వారా సంక్రమించిన  ఫ్యామిలీ పెన్షన్ తో బ్రతుకుతున్నాం.

  హరిత తనకాళ్లమీద తానూ నిలబడాలి...అన్నది వారి కోరిక. ఆ ప్రయత్నంలోనే డిగ్రీ చేస్తోంది. నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే  ఎయిర్ ఫోర్స్ కాంటీన్ లో హెల్పర్  గా  పనిచేస్తున్నాను..

తను కూడా  చదువు పూర్తి అయ్యాక ఏదో ఒక  జాబ్ చేస్తుంది.

  వాళ్ళనాన్నగారు క్రమశిక్షణకు మారుపేరు. ఏది కావాలన్నా ముక్కు సూటిదనమే తప్ప డొంక తిరుగుడుదనం మా కుటుంబంలో లేదు...ఉండదు.

  మేము తల్లీ కూతుళ్లలా ఉండం.స్నేహితుల్లా ఉంటాము. మీరు మొన్న తనని అడ్డగించిన సంగతి నాకు చెప్పింది.  అలాంటి పనులు మంచిది కాదు...ఇంటికే తీసుకురా విషయం ఏమిటో తెలుసుకుందాం ..అన్నాను నేను.

 మీరు కూడా ధైర్యంగా మీ మనసులో మాట చెప్పారు. చాలా సంతోషంగా ఉంది నాకు. నేను అమ్మాయితో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ యిచ్చి వెళ్ళండి.'' అంది శకుంతల

  ''షూర్ మేడం. '' అంటూ అప్పటికే హరిత అందించిన పాడ్, పెన్ను తీసుకుని దానికి ఉన్న కాగితం పై విరాజ్ తన నెంబరూ, తన తండ్రి నెంబర్ నోట్ చేసాడు.

  ''ఇందులో నా నెంబర్ తో పాటు మా నాన్నగారి నెంబర్ కూడా ఇచ్చాను మేడం. '' అన్నాడు పాడ్ టీపాయ్ మీద పెడుతూ.

  ''మరో విషయం మేడం.''

  ''చెప్పు బాబు''

  ''హరితగారికి నేను నచ్చితే సరే. నచ్చకపోతే మాత్రం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను.  హరిత గారు ఎవరిని చేసుకున్నా ఆ వివాహం పూర్తి అయేంతవరకు నేను మీ కుటుంబానికి సహాయంగా ఉంటాను.''

  ''సరే.'' అందామె నవ్వుతూ.

  ''ఇంకొకమాట  మేడం. ఒక వేళ హరితగారికి నేను నచ్చితే ...వెంటనే పెళ్లి చేసుకోము మేడం. మూడేళ్లపాటు మీ అనుమతితో స్నేహంగా ఉంటూ   ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాకా పెళ్లిచేసుకుంటాం.''

  ''ఇదంతా జరిగేవిధానమేనా బాబు? మీరు మీ పద్దతిలో నిర్ణయించేసుకుంటే సరిపోతుందా? ముందు మీ ఇంట్లో మీ పెద్దలు ఒప్పుకుంటారా అని?''

  ''ఇలా జరుగుతుందనీ, జరగాలనీ కాదు మేడం. ఒకవేళ హరితగారు ఒప్పుకొని, మీరు అనుమతిస్తేనే...కాదు అంటే ... ఇంకోలా ఆలోచిస్తాను.. మరి వెళ్ళొస్తాను మేడం. బాగా ఆలోచించుకుని ఒక వారం రోజుల్లో నాకు ఏ విషయాన్ని మీరే ఫోన్ చేయండి మేడం.ఈలోగా మీ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టను.మరి వెళ్లి వస్తాను...''అంటూ విరాజ్ లేచాడు.

  ''ఒకవేళ మీరు  అన్నట్టు జరగకపోతే...?''తల్లి భుజం మీదనుంచి మెల్లగా అంది హరిత.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages