పరిపాలనా దక్షత - అచ్చంగా తెలుగు

పరిపాలనా దక్షత  

సి.హెచ్. ప్రతాప్




మగధ దేశం మహారాజు విజయవర్మ అరవై సంవత్సరాలు దిగ్విజయంగా రాజ్య పాలన సాగించి ఆ రాజ్యాన్ని భరతఖంఢంలోనే అగ్రగామిగా నిలబెట్టాడు. ఆ రాజ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు, అనారోగ్యాలు, అశాంతులు లేక సిరి సంపదలతో సుఖంగా జీవిస్తున్నారు. రాజ్యంలో అంతరంగిత భద్రత అద్భుతంగా వుండడంతో దొంగల బెడద లేదు. సైన్యాధ్యక్షుడు, సైన్య పరివారం మొత్తం ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా వుంటుండడంతో పొరుగు రాజ్యాల నుండి దండ్రయాత్ర ముప్పు కూడా లేదు. అహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం విజయవర్మ కృషి చేస్తుండడంతో అతడిని ఆ రాజ్య ప్రజలు దేవుడిలా కొలుచుకునేవారు.అటువంటి పరిస్థితుల్లో విజయవర్మ అనారోగ్యంతో అకస్మాతుగా కన్ను మూసాడు. దేశానికి రాజు లేకుండా ఒకక్షణం కూడా ఉండకూడదన్నది రాజ్యం యొక్క రాజ్యాంగం చెబుతోంది.. మహారాజు దశ దిశ కర్మ కాండలు పూర్తయిన వెంటనే అతడి ఏకైక పుత్రుడు ఆదిత్యవర్మ రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఆదిత్యవర్మకు పరిపాలనానుభవం శూన్యం. అందుకే మహామంత్రి, సైనాధ్యక్షుడు,రాజగురువులను రాజ్యపరిపాలన అంశాలపై నిరంతరం సంప్రదిస్తుండేవాడు. దేశంలో పరిపాలన మరింత సమర్ధవంతంగా వుండేందుకు రాజ్యాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి స్థానిక పరిపాలనాధికారులను నియమించమని మంత్రిమండలి ఇచ్చిన సలహా నచ్చి  ఆదిత్యవర్మ  ఆ విధంగా సమర్ధులైన ఎనిమిదిమంది పరిపాలనాధికారులను నియమించాడు. ప్రతీ నెల వారితో అంతరంగిక సమావేశాలను నిర్వహిస్తూ రాజ్యం లో పరిస్థితిని ఎప్పటి కప్పుడు తెలుసుకుంటుండేవాడు.  ఇదిలా వుండగా రాజ్యానికి ఆగ్నేయ భాగానికి పరిపాలనాధికారుడిగా వున్న జయసింహుడికి క్రమంగా అహంకారం తలకెక్కింది. తన వలనే తన భాగం ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్న ఆలోచన తలకెక్కేసరికి విజృంభించడం మొదలెట్టాడు. ఇది కనిపెట్టిన కొందరు సహాయ పరిపాలనాధికారులు అతడి చుట్టూ చేరి అతడిని పొగడ్తలతో మెప్పించడం మొదలుపెట్టారు. ఈ ప్రపంచంలోపొగడ్తలకు లొంగని వారెవరుంటారు ? కొన్నాళ్ళకు జయసింహుడు తన సహాయ పరిపాలనాధికారుల చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాడు.పాలనా వ్యవహారాలు వారి మీదకే పూర్తిగా నెట్టేసి తాను మాత్రం సర్వ సౌఖ్యాలు అనుభవించడం మొదలుపెట్టాడు. తనని పొగడతతో మెప్పించినవారు ఎన్ని తప్పులు చేసినాకూడా జయసింహుడు పట్టించుకునేవాడు కాదు. దానితో ఆ సహాయ పరిపాలనాధికారులు ఒక పక్క జయసింహుడికి సేవలు చేస్తూ మరొకపక్క సామాన్యులపై విరుచుకుపడేవారు. తమకు ఎదురుచెప్పినవారిని  శిక్షించేవారు. దానితో ప్రజలు నిరంతరం బాధలు పడుతూ ఎలాగైనా ఈ విషయం మహారాజుకు చేరవేయాలని అనుకుంటుండేవారు.     అయితే జయసింహుడు స్వతాహాగా చాలా తెలివైన వాడు కావదమే కాదు ఇతరుల వద్ద తన గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడే విద్య తెలుదు. అతడు ఆదిత్యవర్మ వద్ద కపట వినయాలు నటిస్తూ తన రాజ్యభాగం గురించి చిలవలు వలువలు కల్పిస్తూ లేనివి వున్నట్టుగానూ, వున్నవి లేనట్టుగానూ చెబుతుండేవాడు. దానితో ఆదిత్యవర్మకు జయసింహుడంటే ఎనలేని గురి కుదిరింది.

దీనిని ఆసరాగా చేసుకొని జయసింహుడు తాను ఎప్పటికైనా ఒక రాజ్యానికి రాజు కావాలనే తన కోరికకు కార్యరూపం కల్పించ ఆరంభించాడు.  మగధ రాజ్యాన్ని ఆగ్నేయ భాగంలో వున్న పొరుగురాజుతో చాటు మాటు మంతనాలు సాగిస్తూ తన రాజ్యభాగం గుండా పొరుగురాజ్య సైన్యం మగధ రాజ్యాంపై దండెత్తే విధంగా కూడా ప్రణాళికలు రచించసాగాడు. పొరుగు రాజు నుండి జయసింహుడికి పెద్ద సంఖ్యలో ధనం, వజ్య వైఢూర్యాలు, విలువైన కానుకలు చాటుగా అందసాగాయి. అందులో కొంత భాగం సైన్యాధ్యక్షుడికి అందజేస్తూ అతడిని కూడా కాలక్రమంలో జయసింహుడు లోబరచుకున్నాడు. ఆదిత్యవర్మను పదవీచ్యుతుడిని చేస్తే పొరుగురాజుకు సామంతరాజుగా వుంటునే మగధ దేశానికి రాజయ్యేట్లుగా పొరుగురాజుతో రహస్య ఒప్పందం చేసుకున్నాడు  సైన్యాధ్యక్షుడు కేతువర్మ. ఈ పధకాన్ని సమర్ధవంతంగా అమలు చెస్తే మగధ రాజ్యంలో కొంత భాగానికి జయసింహుడిని రాజుగా చేసే ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. తానేం తక్కువ అన్నట్లు మహామంత్రి సుమంతుడు సైతం కేతువర్మ, జయసింహుడిలతో చేతులు కలిపాడు. అందరూ ఆదిత్యవర్మపై తిరుగుబాటు చేసేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.  అయితే పరిపాలనానుభవం లేని కారణంగా ఆదిత్యవర్మ తన రాజ్యంలో ఏం జరుగుతుందో అనే విషయంలో స్థానిక పరిపాలనాధికారులు ఇచ్చే నివేదికల పైనే ఆధారపడేవాడు కాని తనంతట తానుగా వేగులు, గూఢచర్యం ద్వారా స్వతంతంగా తెలుసుకునేవాడు కాదు. అందరూ నెలసరి సమీక్షలలో అంతా బాగుంది అంటే తానూ ఆనందంగా తలూపి వారికి విలువైన కానుకలు ఇచ్చి పంపేవాడు.

అయితే ఆగ్నేయ ప్రాంతపు ప్రజలలో ఒక విద్యాధికుడుచొరవ తీసుకొని ఒక తెల్లవారు ఝామున రాజప్రసాదానికి వచ్చి మహారాజుకు సమాచారమందించాడు. జయసింహుడు ప్రజలను చిత్రహింసలు పెట్టడం, అతని సహాయ అధికారులు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతుండడం తో పాటు పొరుగు దేశపు దూతలు కొందరు యాత్రికుల వేషంలో తరచుగా వస్తుండడం అక్కడి ప్రజలకు అనుమానం కలిగిస్తోందని, ఇలా అక్కడ జరుగుతున్న విషయాలన్నింటిని పూసగుచ్చినట్లు ఆదిత్యవర్మకు వివరించాడు. ఆ సమాచారం విన్న ఆదిత్య వర్మ ద్రిగ్బ్రాంతికి లోనయ్యాడు. తన వెనుక ఏదో కుట్ర జరుగుతున్నట్లు అనుమానం కలిగింది.  ఈ విషయమై తక్షణం వివరాలను సేకరించాలని నిర్ణయించుకున్నాడు. తక్షణమే తనకు నమ్మిన బంటుల్లా వుండే ఇద్దరు వేగులను పిలిచి అసలు విషయం రెండు రోజులలో చడీ చప్పుడు లేకుండా సేకరించుకురమ్మని పంపించాడు.

 " ప్రభూ, ప్రజల పట్ల మీరాజకుటుంబానికి వున్న ప్రేమానురాగాలు, ఆప్యాయతలు,బాధ్యత అన్నీ ఈ దేశప్రజలకు తెలుసు. అసలు ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఒక దేవుడిలా కొలుచుకుంటున్నారనేది అతిశయోక్తి కాదు. అయితే గుడ్డిగా ఒకరిని ముఖ్యంగా అత్యున్నత పదవులలో వున్నవారిని నమ్మడం మంచిది కాదు. వారిని నమ్మినట్లే నటించి వారిపై కూడా నిఘా వుంచడం సరైన పద్ధతి. రాజులు లేని ప్రజలుండవచ్చు కాని, ప్రజలు లేని రాజులుండరు.పరిపాలన అంతా ప్రజల సమస్యలతో కూడుకొని ఉంటుంది.రాజ్య విస్తరణ కాంక్ష, యుద్ధా లు,కొంత తమ శక్తిసామర్థ్యాల పరీక్షలే అయినా,రాజ్యములతో పెద్దదైతే రక్షణ భారమంత పెరుగుతుంది.మహారాజుల ప్రథమ కర్తవ్యం పాడిపంటల అభివృద్ధికై చెరువులు తవ్వించటం, మానసికానం దానికి దేవాలయాది నిర్మాణాలు, నృత్త గీత,కవిత్వ రచనాది కళలను పోషించటం వగైరా. పరిపాలన అనుకూలత కోసం ప్రాంతాలవారీగా,పాలనాధికారుల నునియమించటం,చిన్న చిన్న కోటలు నిర్మించటం మంచిదే. అయితే పాలనాధికారులు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఎంతొ అవసరం. కనుక ఈ విషయంలో మీరు జాగరూకతతో వుండడం మంచిది"అని విన్నవించుకొని ఆ విద్యాధికుడు చడీ చప్పుడు లేకుండా నిష్క్రమించాడు.

ఆదిత్యవర్మ పంపిన మెరికల్లాంటి ఆ దూతలు రెండురోజుల్లో ఆగ్నేయ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల గురించి పూస గుచ్చినట్లు వివరించారు. దానితో పాటు తనను పొరుగురాజుతో చేతులు కలిపి పదవీభ్రష్టుడిని చేసేందుకు సైనాధ్యక్షుడు, మహామంత్రి, జయసింహుడు పన్నిన పన్నాగం గురించి కూడా సమాచారం అందించారు. అంతే ఆదిత్యవర్మ అప్రమత్తుడయ్యాడు. వెంటనే సైనికులను పంపించి ముగ్గురినీ చెరశాలలో వేయించాడు. ఆగ్నేయ ప్రాంతంలో సంచరిస్తున్నఅయిదుగురు పొరుగు దేశపు వేగులను పట్టుకొని నిర్ధాక్షిణ్యంగా ఉరి తీయించాడు. సైన్యాధ్యక్షుడికి విధేయులుగా వున్న కొంతమంది సైనికులను శాశ్వత కారాగార శిక్ష విధించాడు. తన వేగులు ఇచ్చిన సాక్ష్యాధారాల బట్టి పూర్తిస్థాయి విచారణ జరిపించి రాజద్రోహం నేరం కింద జయసింహుడు, సైన్యాధ్యక్షుడు, మహామంత్రులకు మరణదండన విధించి తక్షణమే అమలుచేయించాడు. రాజ్యపాలనలో తన పొరపాటును తెలుసుకున్నఆదిత్యవర్మ తిరిగి తన పాలనలో అటువంటి పొరపాట్లు చెయ్యలేదు. 

***

No comments:

Post a Comment

Pages