పెదయౌబళపుగొండ బెరిగీనిదే
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0353-01 సం: 04-309
పల్లవి:
పెదయౌబళపుగొండ బెరిగీనిదే
వదలకకొలిచితే వరములిచ్చీని
చ.1: పదివేలశిరసుల బలునరసింహము
గుదిగొన్నచేతుల గురుతైనది
ఎదుటబాదాలుగన్నులెన్నైన గలిగినది
యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది
చ.2: ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది
మొనసి రాకాసిమెకముల గొట్టేది
కనకపుదైత్యుని కడుపుచించినది
తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది
చ.3: శ్రీవనితదొడమీద జేకొని నిలిపినది
దేవతలు గొలువ గద్దెపై నున్నది
శ్రీవేంకటాద్రియందు జెలగి భోగించేది
భావించి చూచితేను పరబ్రహ్మమైనది
భావం
పల్లవి:
పెదయౌబళపుగొండ(అహోబలంకొండ. కర్నూలు జిల్లాలో ఉన్న నృసింహస్వామి క్షేత్రం. )
ఇదుగో పెరుగుతోంది.వదలక ఆ కొండను ( ఆకొండలో ఉన్న నరసింహస్వామిని) కొలిచితే వరములు ఇచ్చాడు.
చ.1:
పదివేలశిరస్సులు కలిగిన బలము కలనరసింహము ఇది.
అతిశయించు చేతులు లక్ష్యంగా కలిగినది ఈ సింహము.
ఈ సింహము మన కళ్ళ ఎదుట అనేక పాదాలు, ఎన్నో కన్నులు కలిగి దర్శనమిస్తున్నది.( సమస్త సృష్టి స్వరూపము నరసింహుడు కనుక అనేక పాదాలు, ఎన్నో కన్నులు స్వామికి ఉన్నాయని భావం)
ఇది బ్రహ్మాండమనెడి గుహ స్థానముగా కలిగినది.( సమస్త బ్రహ్మాండములోను నరసింహస్వామి వ్యాపించి ఉన్నాడని భావం)
చ.2:
గొప్పదైన శంఖము , చక్రము , ఆయుధములతో ఈసింహము ఉన్నది.
పూని రాక్షస మొగములను ఈ సింహము కొడుతుంది.
హిరణ్య కశిపుని కడుపును ఈ సింహం చించింది.
తననునమ్మిన ప్రహ్లాదుని దగ్గర ఉన్నది.
చ.3:
లక్ష్మీదేవిని తొడమీద ఈ సింహం ఉంచుకొన్నది.
దేవతలు కొలుస్తుండగా ఈ సింహం గద్దెపై ఉన్నది.
ఈ సింహం శ్రీవేంకటాద్రిలో శ్రీ వేంకటేశునిగా ప్రకాశిస్తూ భోగిస్తున్నది.
No comments:
Post a Comment