పీ.ఎస్.ఎఫ్. స్ట్రోక్
కుమారి సంహితా నాయుడు
''డాడీ... డాడీ... ఈరోజు మా స్కూల్‌లో ఓ కొత్త కాంపిటీషన్ పెట్టారు తెలుసా!''
ఆరోజే ఆఫీసులో ఇంక్రిమెంట్ అందుకున్న ఆనందంలో సాయంత్రం ఇంట్లోకి అడుగుపెట్టిన వెంకట్రావుతో అన్నారు- అతని పుత్ర, పుత్రికారత్నాలు.
ఈలోగా కాఫీకప్పుతో హాల్లోకొచ్చింది కామేశ్వరి.
పిల్లల వంక, భార్యవైపూ కళ్ళువిప్పార్చి చూసి, కనుబొమలెగరేసి, కాఫీకప్పు అందుకుని కుర్చీలో కూర్చుంటూ- ''ఏంటోయ్- పిల్లలేంటో కాంపిటీషన్, గట్రా అంటున్నారు? ఏంటీ విషయం?'' అనడిగాడు.
''ఏంలేదండీ- స్కూల్లో 'చిల్డ్రన్ ఫండ్' అనీ కొత్త ఫండొకటి మొదలెట్టారట. స్టూడెంట్స్‌కి తలావొక కార్డుముక్క చేతికిచ్చి పంపారు. ఈ ఫండ్‌కి విరాళాలిచ్చేవారి పేర్లు, వాళ్ళ విరాళాలు ఆ కార్డులో రాసి, డబ్బు కలెక్ట్ చేస్కుని రమ్మ న్నార్ట. ఎవరెక్కువ కలెక్ట్ చేస్కొస్తే వాళ్ళకి స్కూల్‌లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్‌ప్రైజుల్తోపాటు కన్సొలేషన్ ప్రైజులూ, క్లాసులో గ్రేడింగ్సూ, ర్యాంకులూ ఇస్తార్ట!'' అర్థంకాని అమాయకుడికి అరటిపండొలిచి నోట్లో పెట్టినట్లు విడమర్చి చెప్పింది కామేశ్వరి.
అది విని ఉలిక్కిపడ్డాడు వెంకట్రావు. అతడి మనసేదో కీడు శంకించింది. ఉత్సాహమంతా ఆవిరైపోయి, వెచ్చటికాఫీ గొంతులోంచి దిగుతున్నా మనిషి మాత్రం చల్లబడిపోయి నీరుగారి పోవడానికి రెడీగా ఉన్నట్లు- ''అంటే- వినాయకచవితి రోజుల్లో గల్లీలీడర్లు, ఛోటా మోటా రౌడీలు మనలాంటోళ్ళ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తారే... అలా స్కూలువాళ్ళు కూడా పిల్లల పేరెంట్స్ నుంచి ఇలా బలవంతపు చందాలు వసూలు చేస్తున్నారా?''
అమాయకంగా అడుగుతున్న అతడి వంక జాలిగా చూస్తూ ''అంతేగా మరీ!'' అంది కామేశ్వరి.
''అదేంటి కామూ... మొన్ననే అదేదో జిల్లాలో వరదలొచ్చాయంటూ 'ఫ్లడ్ రిలీఫ్ ఫండ్' అన్చెప్పి ఒక్కో స్టూడెంట్ నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేశారుగా స్కూలువాళ్ళు? మళ్లీ ఈ 'చిల్డ్రన్ ఫండ్' ఏమిటీ?'' అసహనంగా గొంతు పెగల్చుకొని అడిగాడు వెంకట్రావ్.
''సాయంత్రం పిల్లల్ని తీసుకెళ్లేందుకు నాలాగా స్కూలుకొచ్చిన తల్లులందర్నీ హెడ్‌మిస్ట్రెస్ తన రూమ్‌కి పిల్చి ఈ విషయం చెప్పినప్పుడు మేమందరం మీలాగే అడిగాం!'' అంది కామేశ్వరి.
'ఏం చెప్పిందావిడ?' అన్నట్లు ఆత్రంగా చూస్తున్న అతడితో ''ఇకపై స్కూలు తరపున ప్రకటించబోయే విరాళాలకు ముందుగానే నిధి సమకూర్చుకోవడానికట- ఈ 'చిల్డ్రన్ ఫండ్!'' అంది.
ఇంకేం అనాలో తెలీలేదు వెంకట్రావ్‌కి. కాసేపు తనలోతానే సణుక్కొంటూ గొణుక్కుని-
''సర్లె- ఆ కార్డులిలా తగలెయ్యండి- చెరోవందా రాసిస్తా!'' అన్నాడు చిరాగ్గా.
అంతే- 'గయ్య్'మన్నారు పిల్లలిద్దరూ ''వాట్ డాడీ, ఓన్లీ హండ్రెడా? మా క్లాస్‌మేట్స్ ముందు మాకెంత ఇన్సల్టో తెల్సా? క్లాసులో మా ప్రిస్టేజ్ నిలబడాలంటే ఎవ్రీ స్టూడెంట్ పేరెంట్స్ నుంచి మినిమమ్ థౌజండ్ రూపీస్ కంటే తక్కువ కాకుండా కలెక్ట్ చేసుకురమ్మంది మా క్లాస్‌టీచర్!''
''బాబోయ్‌ఁ... ఇద్దరికీ కలిపి రెండువేలా?'' గుండె ఆగినంత పనైంది వెంకట్రావ్‌కి.
* * *
''ఏంటి రామారావ్... దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?''
''ఏమిటా..? మా ఇంటికీ, నా సమాధికీ పైకప్పులు దేనితో వేద్దామా... అని!''
''మరీ అంత వెటకారమెందుకోయ్?'' ఉడుక్కున్నాడు వెంకట్రావు.
''లేకపోతే ఏమిటి వెంకట్రావ్- నేను బాధల్లో ఉంటే ఇలా దెప్పిపొడవటం భావ్యంగా ఉందా?'' దీనంగా అన్నాడు రామారావు. అంతలో... అక్కడికొచ్చాడు సుబ్బారావు --
''అబ్బేఁ... మన వెంకట్రావ్ ఉద్దేశ్యం అదికాదోయ్ రామారావూ! ఉదయం ఆఫీసుకొచ్చినప్పట్నుంచీ నువ్వెందుకో దిగులుగా ఉంటేనూ- కారణమేమిటా... అని అడిగాడంతే!'' అని వివరించాడు.
''ఏంటోలే... అంతా నా ప్రారబ్దం !'' నిర్లిప్తంగా పెదవి విరిచేశాడు రామారావు.
''అదేంటి రామారావుగారూ- ఈడు దాటినా పెళ్ళికాని కుర్రాడిలా ఏమిటా వైరాగ్యం? ఏమా కథ? మాకూ చెప్పొచ్చుగా!'' ఆసక్తిగా అంది- లంచ్ ముగించి తన సీట్‌లోకి వచ్చిన స్వరాజ్యలక్ష్మి.
''అదిగో... మళ్లీ వెటకారం!'' ఉక్రోషపడ్డాడు రామారావు. ఆ నలుగురూ ఒకే సెక్షన్‌లో పనిచేసే ఉద్యోగులు. లంచ్ అవర్‌లో ప్రతిరోజులాగే ఆరోజు కూడా మాట్లాడుకుంటున్నారు.
''సర్సరే... అందరి తరపునా నేను క్షమాపణలు చెప్తున్నాను... సరేనా? ఇంతకీ విషయమేంటో చెబుదూ?!'' నొచ్చుకోవద్దంటూ నచ్చజెప్పాడు వెంకట్రావ్.
''ఏం చెప్పను? అసలు పెళ్ళెందుకు చేస్కున్నానా, పిల్లల్నెందుకు కన్నానా... అనుకుంటున్నాను!''
''అరెరెఁ... నీకింత తొందర్గా అంత పెద్ద జీవితసత్యం అర్థమైపోయిందా? ఆశ్చర్యంగా ఉందే?!''
''ఔన్లెండి- నా 'లోన్ అప్లికేషన్' రిజెక్ట్ అయ్యిందని నేనేడుస్తుంటే... మీ అందరికీ వేళాకోళంగా ఉంది కదూ?!'' మరింత కుమిలిపోయాడు రామారావు.
''ఏమిటీ... నీకు లోన్ సాంక్షన్ కాలేదా?'' పెట్రోలు రేటు ఒక్కసారిగా రెండ్రూపాయలు తగ్గిందన్న వార్త విన్నవాడిలా ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్రావు.
''అసలు మన ఆఫీసులో ఎవ్వరూ తీసుకోనన్ని లోన్లు తీసుకుని 'లోను వీరుడు'గా పేరొందిన నీకే లోన్ సాంక్షన్ కాలేదంటే... ఆశ్చర్యంగా ఉందే?!'' సుబ్బారావు కూడా విస్తుబోతూ అన్నాడు.
''ఇంతకీ... మీ లోన్ అప్లికేషన్ ఎందుకు రిజెక్టయ్యింది రామారావుగారూ?'' అనునయంగానే అయినా... కాసింత కుతూహలంతోనే అడిగింది స్వరాజ్యలక్ష్మి.
''ఇప్పటికే అన్నిరకాల లోన్లూ తీసేసుకున్నాను కాబట్టి!'' దిగాలుగా చెప్పాడు రామారావు.
''ఔనోయ్- నాకు తెలీకడుగుతానూ... నీకా- ఏ బాదరబందీ లేదు. 'డబ్బు ఖర్చయ్యే' వ్యసనాలే నీకు లేవు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి 'ఓపెన్ హార్ట్ సర్జరీ' లేదా 'క్లోజ్డ్ కిడ్నీ సర్జరీ' లాంటి కాస్ట్‌లీ ఆపరేషన్లేవీ చేయించలేదు. ఇల్లు కట్టడం, ఫ్లాట్ కొనడం వంటి ప్రాజెక్ట్‌లేమైనా తలపెట్టావా... అంటే అదీ లేదు! ఇక 'పిల్లల పెళ్ళిళ్ళు' చేసి చితికిపోయావా... అనుకుంటే- అసలు పెళ్ళీడుకొచ్చిన పిల్లలే నీకు లేరు. ఉన్న ఇద్దరూ నాలుగూ, ఆరోక్లాసు చదివే కుర్రకుంకలేనాయె! ఐనా- ఓ ఉద్యోగి ఎన్ని రకాల లోన్లు తీస్కోవచ్చో అన్నిరకాల లోన్లూ ఇప్పటికే తీసేస్కున్నావ్. అసలు నువ్విన్ని లోన్లు తీస్కోవాల్సిన అవసరమేంటోయ్?'' ఆ చిదంబర రహస్యం తెలుసుకోవాలని అడిగాడు సుబ్బారావు.
''అడిగితే నువ్వేమైనా ఫీలవుతావని ఊరుకున్నాం గానీ... ఇన్నాళ్లుగా మా డౌటు కూడా అదే! నువ్విన్ని లోన్లు తీసుకోవాల్సిన అవసరాలూ, ఆర్థిక సమస్యలూ నీకేమున్నాయి రామారావూ?'' అతడి బాధని పంచుకోవాలన్న పెద్దమనసుతో అడిగాడు వెంకట్రావు.
అంతే!
అంతవరకూ లోలోపలే ఉగ్గబట్టిన దుఃఖం ఒక్కసారిగా బయటకి తోసుకురావడంతో బావురుమన్నాడు రామారావు. మిగతా ముగ్గురూ అతడికి ధైర్యంచెప్పి ఊరడించి అనునయించడంతో- కాస్త తేరుకుని, 'కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుం' దన్నట్లు అసలుసంగతి చెప్పసాగాడు --
''ఓ బాధ్యతగల తండ్రిగా నా పిల్లలు చదువుకుని బాగుపడ్తారన్న ఆలోచనతో, వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలన్న ఆశతో రెండేళ్ల క్రితం ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్పించా! చదువు సంగతేమో కానీ, అప్పట్నుంచే మొదలయ్యాయ్... నా ఆర్థిక ఇబ్బందులు!'' అనే ఉపోద్ఘాతంతో చెప్పుకొచ్చాడు రామారావు --
''అడ్మిషనప్పుడు కట్టే డొనేషనూ, అడ్మిషన్ ఫీజుల్తోనే నేను సగం ఆరిపోయా! ఏకమొత్తంలో కట్టాల్సిన ఆ ఫీజుల కోసం ఏనాడూ ఒక్కలోనూ తీస్కోని నేను- ఆఫీసులో రెండు లోన్లు తీస్కున్నాను. తర్వాత జనరల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, మంత్లీ ఫీజు, టర్మ్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజుల్తో పాటు టెక్ట్స్ బుక్స్, నోటుబుక్స్, స్కూల్‌డ్రస్సులు, బెల్టులు, బూట్లు, సాక్స్‌లు గట్రాలన్నీ స్కూలోళ్ళ దగ్గరే, వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లకే కొనాలి కాబట్టి- ఆ ఖర్చులు తట్టుకోడానికే కొత్తలోన్లు తీస్కున్నా!''
''నిజమే! మామూలు ప్రైవేట్‌స్కూల్‌లో పిల్లల్ని చదివిస్తున్న నాకే ఈ ఫీజులమోత తట్టుకోలేనంతగా వుంది. కాస్త పేరున్న స్కూల్‌లో పిల్లల్ని చదివిస్తున్న నీ పరిస్థితి ఎలావుంటుందో నేనర్థం చేసుకోగలను'' తన అవస్థను గుర్తుతెచ్చు కుంటూ అన్నాడు వెంకట్రావు.
''మాదీ అదే పరిస్థితండీ! పిల్లల ఫీజుల బాధే భరించలేకుండా వుంటే మధ్యమధ్య 'రిపబ్లిక్‌డే, ఇండిపెండెన్స్ డే, స్కూలు యానివర్సరీడే' అంటూ జరిపే సెలబ్రేషన్స్ కోసం మళ్లీ కొత్తగా ఒక్కొక్కర్నుంచి వందలూ, వేలూ వసూలు చేస్తున్నారు. పిల్లల్ని ప్రైవేట్‌స్కూళ్ళలో చదివిస్తున్న పాపానికి ఈ వడ్డింపులు తట్టుకోలేక నానాయాతన పడ్తున్నామంటే నమ్మండి!'' గోడు వెళ్లబోసుకుంది స్వరాజ్యలక్ష్మి.
''అంతేకాదండోయ్ స్వరాజ్యలక్ష్మిగారూ! దేశంలో వరదలూ, కరవులూ, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా సరే... వాటి 'రిలీఫ్ ఫండ్' అంటూ స్కూలు తరపున విరాళాలిచ్చేందుకు మన పిల్లల్నుంచే వేలకువేలు వసూల్జేస్తున్నారు. 'అత్తసొమ్ము- అల్లుడి దానం' లాగ డబ్బు మనది- పేరు మాత్రం స్కూలు ఓనర్లది!'' తన అనుభవం చెప్పుకొచ్చాడు సుబ్బారావు.
''ఇవేకాదు సుబ్బారావ్- ఈమధ్య 'చిల్డ్రన్ ఫండ్' పేరుతో కొత్తగా పిల్లల్తో డబ్బు వసూలు చేయిస్తున్నారీ ప్రైవేట్‌స్కూలోళ్ళు. పైగా, పిల్లలకి అవేవో కార్డులిచ్చి పంపి బలవంతపు చందాలూ, విరాళాలూ సేకరించడమే కాక- ఎక్కువ డబ్బు వసూల్జేసుకొచ్చిన స్టూడెంట్స్‌కి 'ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్'లో ప్రైజులూ-గ్రేడులూ-ర్యాంకులూ ఆశ చూపుతున్నారు. దాంతో చదువు సంగతి ప్రక్కనపెట్టి పిల్లలంతా పోటీలు పడ్తూ తల్లిదండ్రుల్తో సహా, ఇంటికొచ్చిన గెస్టుల్ని కూడా వదలకుండా స్కూలు ఓనర్ల కోసం బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ స్కూళ్ళ ఓనర్ల దోపిడీలకు బలైపోతూ చితికిపోయిన తండ్రుల్లో నేనూ ఒకణ్ణి!'' తనలోని ఆవేదన వెళ్లబోసుకున్నాడు రామారావు.
'రోలొచ్చి మద్దెలతో మొరబెట్టుకుందట!' అనే సామెతలోని పరమార్థం అతడి స్థితిని చూస్తూంటే చాలా ప్రాక్టికల్‌గా అర్థమవసాగింది మిగతావాళ్ళకి.
''ఔనౌను... నా పరిస్థితీ అదే! ఇంక్రిమెంట్ వస్తే మా ఆవిడకి పట్టుచీర కొనివ్వాలనుకున్న నా కోరిక ఈసారి కూడా తీరలేదు. నా ఇంక్రిమెంట్ డబ్బుల్ని కాస్తా నిన్న మా పిల్లలు వాళ్ళ స్కూల్లో అదేదో ఫండ్ పేరు చెప్పి గద్దల్లా తన్నుకు పోయారు!'' తన గోడు చెప్పుకున్నాడు వెంకట్రావు.
''మనమే కాదు... ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లల్ని చదివించే మనలాంటి పేరెంట్స్ బాధలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయ్! ఏం చేస్తాం... ఈ ఫీజుల బాదుడికి తట్టుకోలేనప్పుడల్లా ఇలా పరస్పరం బాధల గాథలు చెప్పుకొని ఒకర్నొకరం ఓదార్చుకోవడం తప్ప?!'' నిస్సహాయంగా అంది స్వరాజ్యలక్ష్మి.
''అదీ నిజమే ! కాబట్టి నువ్విలా డీలా పడిపోకుండా కాస్త ధైర్యంగా ఉండు రామారావూ!'' అంటూ మిగతా ముగ్గురూ రామారావుని ఊరడించి ధైర్యం చెప్పి, ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్లిపోయారు.
* * *
నాల్రోజుల తర్వాత- ఓరోజు... రామారావుకి సీరియస్సై హాస్పిటల్‌లో చేర్పించారనీ, అతడి పరిస్థితి 'అటూఇటూ'గా ఉందన్న వార్త ఆఫీసులో గుప్పుమంది.
అతడికి క్లోజ్‌గా ఉండే కొలీగ్స్ ఆఫీసులో ఓ రెండు గంటలు పర్మిషన్ తీసుకుని హాస్పిటల్‌కి చేరుకున్నారు.
రామారావు దగ్గరి, దూరపు బంధువులకు అప్పటికే సమాచారం ప్రసారం కావడంతో 'చివరిచూపు' కోసం వచ్చినట్లుగా వాళ్ళందరూ అప్పటికే అక్కడికి చేరుకొని వున్నారు.
రామారావు పరిస్థితి ఏ 'రేంజ్'లో సీరియస్‌గా ఉందో అక్కడున్న అంతమందినీ, వాళ్ళందరి ముఖాల్లో అగుపిస్తున్న ఆందోళననీ చూస్తే అర్థమైంది- వెంకట్రావ్, సుబ్రావ్, స్వరాజ్యలక్ష్మిలకు.
గతరాత్రి రామారావు భోజనం చేశాక- ఉన్నట్లుండి భళ్ళున వాంతి చేసుకుని, మాటాపలుకూ లేకుండా కళ్ళు తేలేసి కుప్పకూలేసరికి- ఇంట్లోవాళ్ళు రాత్రికిరాత్రి పెద్దాసుపత్రికి తరలించారట.
చలనంలేని రామారావుని టెస్ట్ చేసి- ''మైగాడ్!'' అంటూ డ్యూటీడాక్టర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్సూ, వెంటనే రామారావు బాడీ(?)ని ఐ.సీ.యూ.కి తరలించే హడావుడీ చూసి రామారావు భార్యాపిల్లలకి గుండెలు జారిపోయాయిట. ఏం జరిగిందో తెలీక బేజారెత్తిపోయార్ట! పైగా, అతడికి వరుసగా సెలైన్ ఎక్కిస్తూ తలకీ, ఛాతీకీ ఏవేవో మిషన్లు బిగించి ఎల్.సీ.డీ.స్క్రీన్‌పై కన్పించే రీడింగ్ నోట్ చేస్కుంటున్న నర్సుల్నీ, వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్సిస్తూ డాక్టర్ చేసే హంగామానీ చూసి బిక్కచచ్చిపోయార్ట.
అసలు భర్తకేమైందో తెల్సుకోవాలని ట్రై చేసిన అతడిభార్యకి డాక్టర్ విషయం చెప్పకుండా ''సారీ! 12 గంటలు గడిస్తే గానీ ఏ సంగతీ చెప్పలేం. మీ బంధువుల్కీ, దగ్గరోళ్ళకీ కబురు పంపుకోండి!'' అని చెప్పేసరికి- ఆమె లబోదిబోమంటూ అందర్కీ ఫోన్లుచేసి విషయం పాస్ చేసిందట- అదీ సంగతి!
డాక్టర్ పెట్టిన 12 గంటల 'డెడ్‌లైన్' పూర్తయింది కాబోలు- ఐ.సీ.యూ. బయట ఆత్రంగా, ఆందోళనగా, బెరుకుగా, బేలగా, దీనంగా, భయంగా నిల్చుని డాక్టర్ చెప్పబోయే ఆ 'శుభ లేదా అశుభ' వార్త కోసం రామారావు భార్యాపిల్లలూ, బంధువుల్తో పాటు వెంకట్రావ్, సుబ్బారావ్, స్వరాజ్యలక్ష్మి ఎట్సెట్రాలు కూడా ఎదురుచూడసాగారు.
ఇంతలో- సీరియస్‌నెస్ నిండిన ముఖంతో లోపల్నుంచి డాక్టర్ రానేవచ్చాడు. వచ్చీరాగానే- ''మీలో మిసెస్ రామారావు ఎవరండీ?'' అనడిగాడు. అంతమందిలోంచి గుండె చిక్కబట్టుకొని బిక్కుబిక్కుమంటూ ముందుకొచ్చిన ఆవిడ భయంభయంగా డాక్టర్‌ని సమీపించి, ఇంకాపుకోలేక ఫెళ్ళున బావురుమంది.
''ప్లీజ్‌ఁ... కాస్త కంట్రోల్ చేసుకోండమ్మా !'' అంటూ ఆమె తేరుకోడానికి ఓ రెండు క్షణాలాగి, ''మీకెంతమంది పిల్లలు? ఏ స్కూలు వాళ్ళది? ఏం చదువుతున్నారు?'' అనడిగాడు.
అంతే! ఆవిడకేం స్ఫురించిందో, ఏంటో- ''అదేంటి డాక్టర్! అప్పుడే ఆయనకి... ఓరిదేవుడా!'' అంటూ మళ్లీ ఘొల్లుమనేంతలో- ''ఊర్కోండమ్మా- ఏదేదో ఊహించుకోకండి! మీ అదృష్టంకొద్దీ పెద్దప్రమాదం తప్పింది. ఇంకోసారి స్ట్రోక్ వస్తే మాత్రం ఆయన్ని కాపాడ్డం ఇంపాజిబుల్!'' అన్నాడు.
అది విని అందరూ రిలీఫ్‌గా ఊపిరి పీల్చుకుంటూండగా ''ఏనాడూ ఒక్కసారైనా ముక్కు చీదడం గానీ, ఓ దగ్గు దగ్గడం గానీ ఎరుగని మా రామారావుకి ఇంత సడెన్‌గా గుండెపోటెలా వచ్చింది డాక్టర్?'' బంధువుల్లోంచి ఎవరో అడిగినదానికి- తల తిప్పి చూస్తూ చెప్పాడు డాక్టర్ --
''ఇది గుండెపోటని ఎవరన్నారు? రామారావుగారికి వచ్చింది 'పి.ఎస్.ఎఫ్.స్ట్రోక్!''
''పి.ఎస్.ఎఫ్. స్ట్రోకా?'' అలాంటి జబ్బు బయటగానీ, సినిమాల్లోగానీ, కనీసం తెలుగు టీవీ సీరియల్స్‌లో గానీ ఎప్పుడూ, ఎక్కడా విన్నట్లుగా లేకపోవడంతో చాలామంది ఒకేసారి అడిగేశారు.
“ఔను- ఈ 'పి.ఎస్.ఎఫ్.స్ట్రోక్' ఈమధ్యే కొత్తగా మొదలైంది. స్కూళ్ళకి వెళ్లే పిల్లలున్న తండ్రులకే ఈ స్ట్రోక్ తరచుగా వస్తోంది. ఇది 'గుండెపోటు' కంటే డేంజర్! దీని ఎఫెక్ట్ డైరెక్ట్‌గా మెదడుపై ఉంటుంది. అందువల్ల దేహంలో అన్ని భాగాలపై ఒకేసారి ప్రభావం కనిపిస్తుంది. ఈ స్ట్రోక్‌కి గురైన వాళ్ళకి సాధారణంగా మతిభ్రమించడం, పక్షవాతం రావడం, మాట పడిపోవడం, 'కోమా'లోకి వెళ్లిపోవడం... ఇలా ఏదైనా జరగొచ్చు. ఈ స్ట్రోక్ బారినపడి కూడా తట్టుకుని క్షేమంగా బయటపడే ఛాన్స్ నూటికి ఒక్కరికే ఉంది. ఆ ఒక్కరూ రామారావే కావడం మీ అదృష్టం!'' అన్నాడు డాక్టర్.
''మైగాడ్... 'పి.ఎస్.ఎఫ్.స్ట్రోక్' ఇంత డేంజరా? అసలు ఈ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవా లంటారు డాక్టర్?'' రామారావు బంధువుల్లోంచి మరెవరో అడిగారు.
''సింపుల్! స్కూళ్ళకెళ్లే పిల్లలున్న తండ్రులు ఒకేవొక్క జాగ్రత్త తీస్కుంటే చాలు- ఈ స్ట్రోక్ వాళ్ళ దరిదాపుల్లోకి కూడా రాదు. కానీ, చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఈ స్ట్రోక్‌కి గురౌతున్నారు!''
''ఇంతకీ... ఏమిటా జాగ్రత్త డాక్టర్?'' ఇంకెవరో అడిగిన ప్రశ్నకి బదులుగా చెప్పాడాయన-
''తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోంచి తీసేసి, గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడమే!''
''అసలు 'పి.ఎస్.ఎఫ్.స్ట్రోక్' అంటే ఏమిటి డాక్టర్?''
''ప్రైవేట్ స్కూల్ ఫీ స్ట్రోక్!!''
అది వినగానే- మిగతావాళ్ళ సంగతేమో కానీ... వెంకట్రావ్, సుబ్బారావ్, స్వరాజ్యలక్ష్మిలకి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది... వెంటనే తామెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో!!
***
No comments:
Post a Comment