అనసూయ ఆరాటం -29
చెన్నూరి సుదర్శన్
అనసూయకు మన్సుల మన్సు లేదు.
ఆకలైతాందనే ధ్యాస లేదు. పచ్చి మంచినీల్లు సుత ముట్టకుంట మూలకు మంచమేసుకొని పండి లోపల.. లోపల ఏడ్వబట్టింది.
సరిత రెండు మూడు సార్లు బువ్వకు లేపింది. సుశాంత్ వచ్చి అనసూయను నవ్వియ్యబోయిండు. అనసూయ ఉలుకు లేదు.. పలుకు లేదు.
నాత్రి పదకొండు కావత్తాంది. ఆదిరెడ్డి వచ్చిండు. నిలబడే హోషుల లేదు. కాళ్ళు తడబడ్తానై. కాల్లూ.. చేతులు కడుక్కోకుండనే జరంత తిన్నట్టు చేసి మంచంల వాలి పోయిండు.
సురేందర్ వచ్చి ఏదో పుల్లబెట్టి పోయిండని ఆదిరెడ్డికి చెప్పింది సరిత. కాని ఆదిరెడ్డి ఇన్పిచ్చుకునే పరితితిల లేడు.. గుర్రు కొట్టబట్టిండు.
***
తెల్లారి పొద్దుగాల్నే ఆదిరెడ్డి ఆఫీసుకు పోదామని తయారై టిఫిన్ కోసరం డైనింగ్‌బల్ల దగ్గరకచ్చి కుర్సిల కూకున్నడు.
సరిత తపుకుల టిఫిన్ తీస్కచ్చి పెట్టింది. అది సూడంగనే నెత్తి గోక్కుంట..“ఏంది సరితా.. పూరీలో.. ఇడ్లీలో చెయ్యక పోయినవ్.. పోపు పెట్టిన బువ్వ తీస్కచ్చి ముందల పెడ్తివీ..” అడిగిండు ఆదిరెడ్డి.
“మరి మిగిలిన సలిబువ్వ పారేసుకుంటమా..” తల్కాయె అదోరకంగ తిప్పుకుంట జవాబిచ్చింది సరిత.
“బువ్వెందుకు మిగిలింది”
“మన ముగ్గురికని పెడితే.. నువ్వు తినకపోతివి. మీ అమ్మా.. తినకపాయె.. ఇగ మిగులకపోతే ఏమైతది”
“అమ్మ ఎందుకు తిన్లేదు”
“మీ సురేందర్ మామయ్య వచ్చి ఏదో పుల్ల బెట్టి పోయిండని నాత్రి సెప్తాంటె నువ్వు ఇనే హాలత్‌ల ఉన్నవా..” అన్కుంట మూతి మూడు వంకర్లు తిప్పింది సరిత. “ అత్త అలిగి మూలకు మంచమేసింది”
“అగ్గో.. అమ్మ ఇంకా లేవ లేదా.. అమ్మా.. అమ్మా” అని గట్టిగ కేకేసిండు.
అనసూయ సప్పుడు సెయ్యలేదు.
కడ్పుల కాలుతే అదే లేత్తదిలే.. అని మన్సుల గులుక్కుంట పోపన్నం తినకుండనే ఆవలపడ్డడు ఆదిరెడ్డి.
ఆవల రెండు పార్టీలు ఆఫీసుల తనకోసరం ఎదురి సూసుకుంట ఉంటయని యాదికచ్చింది. నిన్ననే వాల్లకు టైమిచ్చిండు.
మంచి బ్యారం తగిలింది. రెండు పార్టీలకు రెండు ప్లాటు అంటగట్టేటాల్లకు తల పానం తోకకచ్చింది.
పొద్దుమూకి అయిదయ్యింది. ఇంతల సెల్ ఫోన్ మోగింది. ఫోన్ తీసి సూసిండు ఆదిరెడ్డి. చెల్లెలు జయమ్మ ఫోన్ అది.
ఫోన్ ఆన్ సేసి “జయా.. చెప్పురా.. “ అన్నడు.
“అన్నా.. ఒక పాలి ఇంటికిరా.. నీతోని మాట్లాడాలె” అన్నది జయమ్మ.
“ఏందో అది చెప్పరాదు.. నాకు టైం లేదు”
“అన్నా.. ఇది ఫోన్ల సెప్పేది కాదు” అని ఏడ్తానట్టనిపిచ్చింది.
“సరే.. వత్తానలే.. ఏడ్వకు. ఒక గంటల ఆడుంట..” అని ఫోన్ కట్ సేసిండు. ఇక తప్పదని కార్ల ఉప్పల్‌కు బైలెల్లిండు ఆదిరెడ్డి.
జయమ్మ ఇంట్లకు కాలు బెట్టి అప్సోసయ్యిండు. ఇంట్ల సామాను అట్టదరిద్రంగ ఉన్నది. ఆయిమన్న కురాకు సుత తింటానట్టు లేరు. జయమ్మ పురంగ బక్కబడ్డది.
“ఏమైందే జయా.. పానం బాగుంట లేదా.. ఎట్లనో ఉన్నౌ..” నారాజుగ అడిగిండు ఆదిరెడ్డి కుర్సీల కూకుంట.
“ఏమైంది నాకు బాగనే ఉన్న. నువ్వు బాగనే సూసుకుంటానవ్ కదా..” అన్నది జయమ్మ మొకమంత ఎట్లనో పెట్టుకొని.
“నేను సూసుకునేదేమున్నదే.. బావ బాగ సూసుకుంటలేడా.. నౌకరి సుత ఇత్తాన కదా..”
“నౌకరిత్తానవని ఆఫీసుల చప్రాసి పనులు సెప్తానవా..”
“చప్రాసి పనులేం సెప్పిన..” అని గద్దిచ్చుకుంట.. ఉరిమి సూసిండు”
“గదే.. వద్దంటాన. గట్ల సూసుడు.. మాట్లాడుడు.. నువ్విప్పుడు ఆఫీసరువైతివి. ఎన్కట నువ్వు గిట్లనే .. ఉన్నవా.. నాలుగు పైసలు సేతిల ఆడుతాంటే.. ఎవలతోని ఎసోంటి పనులు సేయించుకోవాల్నో తెల్తలేదు.. మంచి మర్యాదలు మంట్లె కల్సిపోయినై”
“గీ డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు. అడిగేదేందో.. సూటిగ అడుగు.. నాకు మర్యాదలు తెల్వయా..”
“తెల్తే.. మా ఆయన తోని చాయెలు తెప్పిచ్చుకుంటవా.. మీ దోస్తులముందల. నాతోని చెప్పుకుంట బాధపడ్డడు. ఇది నీకు మర్యాదగనే అన్పిచ్చిందా..”
“చాయెలు తెమ్మంటే తప్పా..”
“బావతోని చాయెలు తెప్పిచ్చుకుండు తప్పుకాదా..! నీకిప్పుడు తప్పులేవో.. ఒప్పులేవో.. తెల్తలేదు. బ్రోకర్ పనులు చేత్తానవ్ కదా..”
“జయా.. “ అని కోపంగ మీదికి లేసిండు.
“ఇప్పుడు నేను తప్పేమన్నా.. నేను అనేది కాదు.. వాడల నన్ను బ్రోకర్ చెల్లె అని పిలుత్తాండ్లు” అని ఏడ్వబట్టింది.
“సరే.. సరే.. దమాక్ లేనోట్లు గట్లనే అంటరు. నువ్వు పట్టించుకోకు.
బావ తోని ఇంకోసారి చాయె తెప్పిచ్చుకోను. సరేనా.. బావకు సారీ చెప్తలే.. ఇగ ఊకో.. నాకు పనున్నది. పోవాలే” అని సట్న లేసి బైట పడ్డడు ఆదిరెడ్డి.
కారు నడుపుతాండే గాని మన్సు మన్సుల లేదు.
‘ఇయ్యాల లేసి ఎవ్వల మొకం సూసిన్నో..! అటు అమ్మ.. ఇటు చెల్లెలు భేజా తిన్నరు. రేపటిదాకా ఇంటి మొకం సూడద్ద’ ని శంషాబాదుల తన ఆఫీసు దగ్గర దోస్త్ ఫాం హౌజుకు తొవ్వ తీసిండు.
ఆనాత్రి దోస్త్ తను మస్తుగ ఎంజాయ్ చేసిండ్లు.. తాగుడు.. తినుడు. సరిత ఫోన్ చేత్తే.. ఆమె చెప్పేది ఏమీ ఇనకుంట..
“రేపత్త” అని ఒక్క మాట తోని ఫోన్ కట్ సేసి సిచ్చాఫ్ సేసిండు.
రేపటికల్ల తల్లి సుత సల్లబడ్తదని ఆదిరెడ్డి ఐడియా..
తెల్లారి సక్కంగ శంషాబాదు అఫీసుకు పోయేటాల్లకు నిన్నటి కస్టమర్లు మల్ల వచ్చిండ్లు. వాల్లతోనే పొద్దంత గడ్సిపోయింది. ఆ నాత్రి మల్ల ఫుల్లుగ మందుకొట్టే ఇంటిక వచ్చిండు ఆదిరెడ్డి.
సరితకు మొదటి సారిగా ఆదిరెడ్డి మీద బగ్గ కోపం వచ్చింది.
రేపు తాడో.. పేడో.. తేల్సుకోవాలనుకున్నది.
***
తెల్లారి శాన పొద్దుపోయినంక లేసిండు ఆదిరెడ్డి.
పనులన్ని సేసుకొని తయారవుకుంట.. అమ్మ కనబడ్త
లేదేందని అనుమానమచ్చి..
“అమ్మా..” అని పిల్సిండు.
వంటింట్లకెల్లి సరిత వచ్చింది.
“అమ్మను పిల్తాంటే.. నువ్వత్తాన వేంది” అని గరంగ అన్నడు. “అమ్మ లేదా..”
“ఉన్నదో.. లేదో.. ఆమె కమ్రలకు పోయి సూడరాదు” అంతే గరంగ జవాబిచ్చింది సరిత. “నువ్వు ఇంట్లోల్ల సంగతేమైనా పట్టిచ్చు కుంటానవా.. ఏదో అంటరు సూడు.. కడుపే కైలాసం.. తాగుడే భాగోతం”
“సరే ఇంక నోరుముయ్యి..”అన్కుంట అనసూయ కమ్ర దిక్కు పోతాంటే..
“అత్త మొన్నటి సంది అట్లనే పన్నది. లేత్త లేదు. పచ్చి మంచినీల్లు సుత తాగుత లేదు.. నీకు చెప్తాంటే.. ఫోన్ కట్ చేత్తివి. సిచ్చాఫ్ చేత్తివి..” అన్నది సరిత.
ఆదిరెడ్డి పానం ధస్సుమన్నది. ‘అమ్మ నిజంగా మొండిదే.. నాయ్న సచ్చిపోయినప్పుడు సుత ఐదారు రోజులగదాక బువ్వ తినకుంట ఉన్నది’ అని మన్సులకు రాంగనే గుండెల భయం సొచ్చింది.
”అమ్మా.. అమ్మా..” అని పిల్సుకుంట అనసూయ కమ్రల కుర్కిండు.
అనసూయ మచంల గోడ దిక్కు మొకం సేసి పండుకున్నది.
దగ్గరకు పోయి తల్లి భుజంమ్మీద చెయ్యేసి మెల్లంగ ఊపిండు.
“ఏమైందమ్మా.. సురేందర్ మామ వచ్చిండా..! ఏమన్నడు” అన్కుంట మంచం పట్టే మీద కూకున్నడు. “నిన్న నాకు అర్జెంటు పనులుండి పోయిన..”
అనసూయ పక్కగోలు తిరిగి సన్నంగ ఏడ్వబట్టింది.
“ఏ సంగతి చెప్పక పోతే.. నాకెట్ల తెల్తది. నువ్వు ముందుగాల ఏడ్పాపి ఏమైందో చెప్పు” అని బతిలాడిండు ఆదిరెడ్డి.
అనసూయ మెల్లంగ మంచంల లేచి ఆదిరెడ్డికెదురుంగ కూకోబోయి సొలిగింది. ఆదిరెడ్డి పట్టుకున్నడు.
“సూత్తానవా.. రెండు రోజుల సంది కడ్పుల ఏ ఆసర లేంది పానం సొలుగదా.. ఎందుకమ్మా.. గింత మొడేసం”
“నువ్వు సురేందర్ మామయ్యకు పైసలు బాకి ఉన్నవా” జర నిమ్మలంగ అడిగింది అనసూయ.
“అమ్మా.. నీకు గీలెక్కలన్నీ ఎందుకు. యాల్లకింత బుక్కెడు తిని ఆరాంగ టీవీ సూసుకుంట కూకో.. సూడబుద్ధిగాకుంటే కిష్నా.. రామా అనుకుంట ఓ మూలకు పండుకో. గాని గీ ఇచ్చకాయలు.. కచ్చకాయలు నీఎందుకు చెప్పు” అని కొంచెం గరంగ అన్నడు ఆదిరెడ్డి.
అనసూయ గయ్యిన లేసి నిలబడ్డది. కండ్లు చింతపిక్కలైనై.. నిప్పులు కురువబట్టినై. పానంల ఓసర లేక ఊగట్టింది.
“కొడుకా.. గింత గమండు పెరిగిందా నీకు. ఏందీ.. నేను ఓ మూలకు కూకోవాల్నా.. గట్ల కూకుంటే నువ్వు గింతటోనివి అయ్యేటోనివా..
మన సేతుల్ల గీతలు కాదురా. మన భవిసత్ సెప్పేది.. మన సేసే పనులే మనకు భవిసత్.
మొగడు సచ్చిన ముండను ఎందరు చీదరిచ్చుకున్నా.. చీత్కరిచ్చు కున్నా.. ఊల్లెకెల్లి ఎల్లగొట్టాలని సూసినా.. నా తమ్ముడు సురేందర్ మనల్ని దగ్గరికి తీసిండు. ఓ నీడ సూయించిండు. నిన్ను పట్నం తీస్కచ్చి పనిప్పిచ్చిండు. నీకు ధరావత్తు కట్టి కంపిని పెట్టిత్తే ఇప్పుడు నీకండ్లు నెత్తికెక్కినాయిరా కొడుకా.. ధరావతు పైసలు సుత నీ తాన ఎల్తలేవా.. ప్రమీల మీది నగలమ్మి నీకు ధరావత్ పెట్టిండు.. తెలుసా.. నీకు. నీ పెండ్లాం గట్ల నగలిత్తదా.. !
ఆపైసలియ్యకుంట ఇంకో దానికి ముడిపెడ్తవా.. నీ అత్కెతెలివి పాడుగాను.
నువ్వు సైకిల్ షాపుల.. పుత్తకాల షాపుల నౌకరున్నది మర్సిపోయినవా.. అప్పుడే మనం నీతిగ బతికినం. నీతి తప్పినోని మీద నేను తిరుగబడ్డ సంగతి మర్సిపోయినవా.. అనసూయ అంటే.. నిప్పు అని అంతా మెచ్చుకున్నరు. గిట్ల నువ్వు నీతి తప్పి బతుకుతవని తెలిత్తే ఆనాడే మిమ్మల్నందరిని బాయిలేసి.. నేనూ పడి సచ్చేదాన్ని” అంటాంటే అనసూయ బొండిగె బొంగురు పోయింది. మాట రాక చీరె కొంగు మొకం మ్మీద కప్పుకొని కొద్ది సేపు ఏడ్పురాగం తీసింది.
ఆదిరెడ్డి కట్టెసర్సుక పోయిండు. అనసూయ కోపాన్ని మొదటి సారిగా సూసిండు. సరిత గల్మల్ల నిలబడి బీర్పోయి సూత్తాంది. సుశాంత్‌రెడ్డి వాల్ల నాయ్నను.. నాయ్నమ్మను బిక్కు, బిక్కుమనుకుంట ఏడ్పు మొకం పెట్టిండు.
“సురేందర్ మామయ్య ఫోను చేత్తే ఎత్తవా.. నువ్వు గిట్ల ఎందరి కొంపలు ముంచుతానవవురా.. వాల్ల ఉసురు నీ పిలగానికి తాకుతది. అయ్య చేసే పాపపు పన్లకు కొడుకులకే బలైతరు. మీ నాయ్న నీతి మంతుడు గనుకనే మీకీ అదృట్టం పట్టింది. ఆయననే గనుకు నీతి తప్పితే మీరంతా ఏనాడో గంగల కొట్టుకపోదురు. మీనాయ్న సచ్చినంక వాల్ల దుకాన్లు ఏమైనై. ఇచ్చుక పోలే..”
“అమ్మా.. గన్ని పైసలు నా దగ్గర ఒక్క పాలి ఎల్లై. మామయ్యకు పైసలు అప్పుడిన్ని అప్పుడిన్ని ఇత్త గాని లే.. లేచి మొకంగిట్ల కడుక్కో.. “అని బుద్గరియ్యబట్టిండు ఆదిరెడ్డి.
“మామయ్య నీకు ఒక్క పాలి ఇయ్యలేదా.. నువ్వు అప్పుడిన్ని అప్పుడిన్ని ఎందుకిత్తవ్.. నీ దగ్గర లేకుంటే ఏదైనా అమ్మి మామయ్యకు పైసలు సుక్త కట్టు.
No comments:
Post a Comment