దివ్యౌషధం
G.S.S. కళ్యాణి.
గత పది రోజులుగా నలభయ్యేళ్ళ
గోవిందం విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నాడు. దగ్గు మందులూ,చిట్టి చిట్కాలూ ఎన్ని వాడినా
ఫలితం కనపడకపోవడంతో తన భార్య సులోచన సలహా మేరకు డాక్టరును సంప్రదించాడు గోవిందం. గోవిందానికి
కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టరు, గోవిందం ఊపిరితిత్తులలో వాయు కాలుష్యంవల్ల
సమస్య ఏర్పడినట్లు గుర్తించారు.
వెంటనే డాక్టరు కొన్ని మందులు
రాసి గోవిందానికిచ్చి, “ఇవి వాడండి. మీకు వీలైతే కాలుష్యానికి దూరంగా ఎక్కడైనా కాస్త
స్వచ్ఛమైన గాలి పీల్చగలిగే చోటికి వెళ్లి కొన్నాళ్ళు గడిపి రండి!", అన్నారు.
ఆస్పత్రినుండీ ఇంటికి వెడుతూ,
"మనం ఈ సిటీని వదిలి ఎక్కడికో సుదూర తీరానికి వెడితే తప్ప డాక్టరుగారు చెప్పిన
ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చలేం!", అంటూ నిట్టూర్చింది సులోచన.
"మా స్నేహితుడు సీతారాంకి
వాళ్ళ ఊళ్ళో పొలాలున్నాయి. అక్కడ ఫార్మ్ హౌస్ కూడా ఉందట! మనల్ని అక్కడికెళ్లి కొద్దిరోజులు
ఉండమని వాడు నన్ను ఎప్పటినుంచో అడుగుతున్నాడు. మన బుజ్జిగాడికి ఎలాగో వేసవి సెలవలు
కదా! సీతారాం వాళ్ళ ఊరు వెడదాం!", అన్నాడు గోవిందం కొద్దిగా ఆయాసపడుతూ.
ఆ మాట విన్న ఎనిమిదేళ్ల బుజ్జిగాడు
ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఆ వారాంతం బయలుదేరి సీతారాం వాళ్ళ ఊరు చేరుకుంది గోవిందం కుటుంబం.
సిటీలో వినపడే రణగొణ ధ్వనులుగానీ, కాలుష్యంగానీ అక్కడ లేవు. పచ్చటి ప్రకృతి మనసుకు
ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఫార్మ్ హౌస్ లో ఏ ఇబ్బంది లేకుండా గడిపేందుకు గోవిందం కుటుంబానికి
కావలసిన అన్ని ఏర్పాట్లూ చేసి సిద్ధంగా ఉంచాడు అక్కడి నౌకరు నారయ్య.
"మన ఊళ్ళోలాగా ఇక్కడ
ఏ.సీ. లేదు. అయినా చాలా చల్లగా ఉంది. ఎందుకమ్మా?", సులోచనను ఆశ్చర్యంగా అడిగాడు
బుజ్జిగాడు.
"ఇక్కడ చెట్లు ఎక్కువగా
ఉన్నాయి కదా! అందుకని!", బదులిచ్చింది సులోచన.
“మన ఊళ్ళో కూడా అక్కడక్కడా
చెట్లు ఉన్నాయి. కానీ అక్కడ ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఎందుకనీ?", సులోచనను మళ్ళీ
అడిగాడు బుజ్జిగాడు.
"మనం వాడే ఏ.సీ.లవంటి
ఎలెక్ట్రానిక్ గృహోపకరణాలూ, యంత్రాలూ, వాహనాలూ… అవన్నీ వేడిని పుట్టించి దాన్ని రెట్టింపు
చేసేవే! ఆ వేడిని తగ్గించేందుకు అక్కడ ఉన్న చెట్లు సరిపోవు. అక్కడి వాతావరణం చల్లబడాలంటే
ఇంకా బోలెడు చెట్లు కావాలి!", చెప్పింది సులోచన.
అంతలో నారయ్య అరటి ఆకుల్లో
వేడి వేడి ఉప్మానూ, మట్టి ముంతల్లో మజ్జిగనూ తీసుకుని వచ్చాడు.
"అరె! ఆకులో టిఫినా?
మట్టిగ్లాసులో మజ్జిగా??", అంటూ ఆశ్చర్యపోయాడు బుజ్జిగాడు.
"అదేంటి బాబూ? వీటిని
ఎప్పుడూ చూడలేదా?”, నవ్వుతూ అడిగాడు నారయ్య.
"లేదు తాతా! అమ్మ రోజూ
టిఫిన్ కోసం 'యూజ్ అండ్ త్రో' ప్లేట్లనూ, ప్లాస్టిక్ గ్లాసులనూ వాడుతుంది. అలా చేస్తే
అమ్మకు అంట్లు తోముకునే పని ఉండదట!", చెప్పాడు బుజ్జిగాడు.
"నాకూ అంట్ల పని పెద్దగా
ఉండదు బాబూ! ఎందుకంటే ఈ ఆకులను పశువులు తినేస్తాయి. కొద్దిపాటి నీళ్లతో ఈ ముంతలను శుభ్రంగా
కడిగేయచ్చు!", చెప్పాడు నారయ్య.
"నారయ్యా! నాకు మా ఊరు
తీసుకెళ్లడానికి కొన్ని మట్టి ముంతలు కావాలి! తెచ్చి పెడతావా?", అడిగింది సులోచన.
"ఓ! తప్పకుండానమ్మా!",
చెప్పాడు నారయ్య.
గోవిందం నారయ్యకు మట్టి ముంతలకోసం
డబ్బులిచ్చాడు. నారయ్య సైకిలు మీద బయటకువెళ్లి అరగంట తర్వాత మట్టిముంతలతో తిరిగి వచ్చాడు.
"నారయ్య తాతా! మీ ఊళ్ళో
ఆటోలుండవా? ఎక్కడికెళ్ళాలన్నా కష్టపడి సైకిలు తొక్కాల్సిందేనా?", అడిగాడు బుజ్జిగాడు.
"ఇందులో కష్టమేముంది
బాబూ? సైకిలు తొక్కడం గుండెకు చాలా మంచిది. వాయుకాలుష్యం కూడా ఉండదు! ప్రకృతి మనకు
అమ్మ. ఆ తల్లి నేను బతకడానికి కావలసినవన్నీ ఇస్తోంది! ఆవిడ బాగుకోసం నేను ఆమాత్రం కష్టపడలేనా?",
అడిగాడు నారయ్య.
"చదువుకోకపోయినా బుజ్జిగాడి
ప్రశ్నకు మంచి సమాధానం ఇచ్చావు నారయ్యా!", అంటూ నారయ్యను మెచ్చుకున్నాడు గోవిందం.
నాలుగు రోజులు గడిచేసరికి
గోవిందం ఆరోగ్యం కుదుటపడింది. తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యి, ఆ మర్నాటి ఉదయానికి
ఇల్లు చేరుకున్నారు గోవిందం, సులోచన, బుజ్జిగాళ్ళు.
ఇంటికి రాగానే బుజ్జిగాడు
తమ ఇంటి ఆవరణలో ఉన్న మట్టిలో నారయ్యను అడిగి తెచ్చిన విత్తనాలను నాటి, వాటికి నీళ్లు
పోస్తూ, "మనం బోలెడు మొక్కలు పెంచుదాం. అప్పుడు మనకు కూడా చల్లటి, స్వచ్ఛమైన గాలి
వస్తుంది!", అన్నాడు.
బుజ్జిగాడు చేసిన పనికి ఆశ్చర్యపోయారు
గోవిందం దంపతులు.
కాసేపటి తర్వాత ఆఫీసుకు తయారవుతున్న
గోవిందానికి ఒక స్టీలు నీళ్ల సీసాను అందిస్తూ, "ఇకపై ఇదే మీ నీళ్ల సీసా! నేను
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడేందుకు నా వంతు కృషిని మొదలుపెట్టాను!",
అంది సులోచన నవ్వుతూ.
"ఆహా! అద్భుతం! నువ్వూ, బుజ్జిగాడూ ప్రకృతికి మేలు చేసే పనులు మొదలు పెట్టేశారన్నమాట! నిజమే! భూమాత క్షేమంగా ఉంటే మనమూ క్షేమంగా ఉంటాం. ఈ రోజుల్లో మనకు వస్తున్న అనేక ఆరోగ్య రుగ్మతలకు పర్యావరణ కాలుష్యం కారణమవుతోంది. అటువంటి అనారోగ్యాలకు దివ్యౌషధం మన చేతుల్లోనే ఉంది. అదే కాలుష్య నివారణ! ప్రకృతిని కాపాడేందుకు మీలాగే నా వంతు కృషిని నేను కూడా చెయ్యాలని అనుకుంటున్నాను. ఇవాల్టినుండీ నేనూ, సీతారాం ఒకే వాహనం పై ఆఫీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఒకరోజు నేను వాడిని తీసుకునివెడితే మరుసటి రోజు వాడు నన్ను తీసుకునివెడతాడన్నమాట! అలా మేము ఇంధనంవల్ల కలుగుతున్న వాయుకాలుష్యాన్ని కొంచెమైనా తగ్గించగలుగుతాం! ఇక నేను వెళ్ళొస్తా!", అంటూ బైకు మీద అక్కడికొచ్చిన సీతారాంతో కలిసి ఆఫీసుకు బయలుదేరాడు గోవిందం.
*****
No comments:
Post a Comment