కాలభైరవాష్టమి: (మార్గశిర బహుళ అష్టమి) (04-01-2023) - అచ్చంగా తెలుగు

కాలభైరవాష్టమి: (మార్గశిర బహుళ అష్టమి) (04-01-2023)

Share This
కాలభైరవాష్టమి: (మార్గశిర బహుళ అష్టమి) (04-01-2023)

శ్రీరామభట్ల ఆదిత్య 



శ్లో॥ కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥

శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి... కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాథ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది.

మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు. శివుని  ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన వున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది.

బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మ కపాలం కాశీలో మాయమైంది... అదే బ్రహ్మ కపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది...

శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ  కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు.

కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ అందునా శివక్రోధము చేత జన్మించాడు... ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. నాలుగు చేతుల్లో శూలం,కపాలం,గద మరియు ఢమరుకం ఉంటాయి. రౌద్రనేత్రాలు , పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం.

శ్రీ శివమహా పురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు ఎనిమిది. అవి
1) కాల భైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ

ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం.... ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ 'కాలభైరవాష్టకం' కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

శ్రీ కాల భైరవాష్టకం:

దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్ర మిందుశేఖరం కృపాకరం
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

శూలటంకపాశదండపాణిమాది కారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం
భీమవిక్రమంప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం 
భక్తవత్సలంస్థితం సమస్తలోకనిగ్రహం
నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపతజాలముగ్రశాసనం
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోక పుణ్యపాపశోధకం విభుం
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం
శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం

జై కాలభైరవా...

No comments:

Post a Comment

Pages