మానస వీణ - 51 - అచ్చంగా తెలుగు

 మానస వీణ - 51 

  డాక్టర్. అరుణ, హైదారాబాద్  

 



             సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల భువనగిరి...

      ‘సృష్టికర్తను సృష్టించింది ఓ అమ్మ. ఆ అమ్మ కూడ ఆడదేగా... అంత గొప్ప ఆడపిల్లను మా తాత ఎందుకు వద్దనుకున్నారో! అవును... గొప్పతనాన్ని గుర్తించటానికి కూడా గొప్ప మనసు ఉండాలిగా...! వాళ్ళ అమ్మే జన్మనివ్వకుంటే తాత భూమి మీదకు వాచ్చేవారు కాదు కదా...! అది ఎపుడు స్ఫురణకి రాలేదేమో...! మొత్తానికి మా జాతినే వద్దనుకున్నారా...! మా తాతకు అంత ద్వేషం ఎందుకో...!’ ఆలోచనలతో మానస మనసు బరువెక్కింది. చవితి చంద్రుని లాంటి తెల్లనైన ముఖంలో ఏదో అలజడి మొదలైంది...

           మానసకు తాతయ్య భూషణం కళ్ళ ముందు మెదులుతున్నాడు. ‘ఈ భూమి మీద ఆడపిల్లలనే లేకుండా చేద్దాం అనుకున్నాడా..? మానవ జాతి మనుగడకు ప్రతిరూపమైన అమ్మ అనే పదాన్ని దూరం చేద్దామన్నుకున్నాడా....! రేపటి తరానికి ఆడపిల్లల బోసినవ్వులు వద్దనుకున్నాడా...? ఆడపిల్ల అని తెలియగానే పురిటిలోనే చంపేస్తున్నారు. నన్ను మాత్రం బాహ్య ప్రపంచానికి వచ్చాక చంపమన్నారు మా తాతయ్య భూషణం. అమ్మో! గొప్పోరు మా తాత...

        నిజంగా ఆ ఓబులేశు తాత మంచివాడు కాబట్టి జిటిఆర్ అంకుల్ స్థాపించిన ఆ అనాథాశ్రమంలో నన్ను వదిలేశాడు లేకుంటే...? ఎలా ఉండేదాన్నో, ఎలా పెరిగేదాన్నో... తలుచుకుంటేనే వళ్ళు జలదరించింది. 

        ఒక పక్క అమ్మాయిలు అంతరిక్షంలోకి దూసుకుపోతుంటే మాతాత లాంటి వారు అమ్మాయిల మనుగడే వద్దునుకుంటున్నారు.....! ఏ కాలంలో బతుకుతున్నామో! ఎంత ఆలోచించినా అర్థం కాలేదు మానసకు. తన శక్తినెవరో లాగేసినట్లు నిలబడలేక కుర్చీలో కూలబడింది.

        అంతలోనే ఒక ఊహ మనసుని తాకి సంధ్యగాలికి శరీరం ఉత్తేజం అయినట్లు ఉత్సాహాన్ని నింపింది. తాతయ్య లాంటి వారు కొందరే... తాతయ్య నన్ను వద్దున్నుకున్నారు సరే.... నాతోనే ఆడజాతి అంతరించిపోదు కదా!. 

        జిటిఆర్ అంకుల్, దినేష్, అనిరుధ్  లాంటి మంచి మనషులు ఈ సమాజంలో వున్నారు కాబట్టే నాలాంటి వారికి రక్షణ దొరుకుతోంది. లేకుంటే భద్రత ఎడారిలో నీటి చందం అయ్యేది. మొక్కగా ఉన్నప్పుడు ఒకరి తోడు అవసరం అయినా... స్ర్తీజాతి స్వశక్తితో మహా వృక్షమై ఎదిగి, పది మందికి నీడ నివ్వాలి'.

ఆడపిల్లల గురించి ఆలోచిస్తున్న మానసకి ఓ పాట గుర్తొచ్చింది. 

       "చందురుని మించు అందమొలకించు ముద్దుపాపాయివే నిన్ను కన్న వారింట కష్టములనీడ తొలగిపోయేనులే...” 

       'అమ్మాయి పుట్టుకతో వారి ఇంట్లో కష్టాలు తొలగిపోయేటప్పుడు "శ్రీలక్ష్మీ. ధనలక్ష్మి" అంటూ రకరకాల పేర్లు పెట్టుకొని ముద్దుగా చూసుకుంటారుగా... మరి తాతయ్య నన్ను ఎందుకు చంపాలనుకున్నారో అన్న ప్రశ్న మానస మనస్సును ఎపుడూ కలవరపెడుతూనే ఉంటుంది.  

        'పురిటి నొప్పుల బాధ తెలియని మా తాతయ్య లాంటి వారికి ఏం తెలుస్తూంది మావిలువ”. ప్రేమ, ఆదరణ కరువైన వాళ్ళకే ప్రేమానురాగల విలువ తెలుస్తుంది. తనను అనాథ చేసిన తాతకు ఆడవారి విలువ తెలియజేయాలి’ అనుకుంది.

         'ప్రేమను ప్రేమతోనే, పగను పగతోనే, ముల్లును ముళ్లుతోనే జయించాలనే’ సామెత వుంది కానీ మాసన మనస్సు వెన్న లాటింది. ఆమె ఎంచుకున్న మార్గం సమాజంలో మార్పు. శత్రువులలో కూడా ప్రేమను వెతుకుంది మానస. వారు అలా తయారు కావటానికి కారణం ఏంటి, ఎందుకు, ఎలా అని ఆలోచిస్తూ వారిలో మంచితనం కోసం వెతుకుతుంది.

         తాతయ్య పట్ల కోపం రాలేదు మానసకు. అసలు తాతయ్యకు ఆడపిల్లలు అంటే అంత భయం ఎందుకో...! కారణం ఏమై వుంటుందో...! అంటూ మానస మనస్సులో ఎన్నెన్నో ఆలోచనలు.

         మా తాత... అప్పలనాయుడు లాంటి ఎందరో క్రూర మృగాల్ని చూసి వుండవచ్చునేమో బహుశా...

తన ఇంటి ఆడపిల్లకు అలాంటి గతి పట్ట కూడదని అలా చేసాడా...! ఈ ఆలోచన మనసుకు శాంతినిస్తున్నా, ఇది ఏమాత్రం నిజం కాదని మనసు గట్టిగా చెపుతోంది. ఆలోచనలు చుట్టుముట్టి ఊపిరినాడనివటం లేదు.

        'పోనిలే... ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. నేను అనాథగా పెరిగినందుకే తెలిసింది ప్రేమ విలువ, ఆ ఒంటరితనంలో నేను యెన్నో నేర్చుకున్నాను. ఈ సమాజానికి ఆడ జాతివిలువ తెలియజేస్తాను’ అనుకున్నాకా మానస మనసు కాస్త తేలిక పడింది.

                                                              ***

          “ఇష్టం ఉన్నచోట కష్టం ఉంటుంది. కష్టం ఉన్నచోట బాధ ఉంటుంది. కష్టం, బాధ రెండిటినీ అర్థం చేసుకున్నచోట ప్రేమ ఉంటుంది”. మానస మనస్సు ప్రేమతో కొరకు ఆరాటపడుతోంది. తనను ప్రాణంలా చూసుకునే అనిరుధ్  ని ఆరునెలలు వదలి వుండేది ఎలా...? అంతలోనే... ఇలాంటి బేలతనపు ఆలోచనలు నచ్చలేదు, తన మనసుకు. అనిరుధ్ ఎప్పుడూ తనవాడే... ఇప్పుడు అది కాదు నేను ఆలోచించవలసింది.

          ఒక ఆలోచన అపుడే మొగ్గ తొడిగింది.

          మానసకు తన గతం గుర్తువొచ్చింది. తను ఇన్నాళ్ళు ఏ ప్రేమ కోసం తపించిందో, ఆ ప్రేమ దొరికిన వెంటనే తన గతాన్ని మరిచినట్టు అనిపించి... తాను చేయాల్సిన కర్తవ్యo గుర్తోచ్చింది. “ఒకరి ప్రేమకోసం... ఆలోచిస్తూ అందర్నీ దూరం పెట్టే కన్నా, ఆ ప్రేమ అందరిపై చూపటం ఉత్తమం” అనుకొని, తనలా ప్రేమకోసం పరితపించే అనాథలు చాలా మంది ఉన్నారు హేమలత ఆశ్రమంలో... వారి కోసం ఏదైనా చెయ్యాలి. నాలా అందరూ ధైర్యంగా ఉండకపోవచ్చు కదా!

          ‘నేనెంటి...? నా ఆశ్రమాన్ని, నా తోటివారిని మరిచిపోయాను…?’ 

          అనుకున్నదే తడువుగా క్షణాల్లో అక్కడికి చేరుకుంది. గేటులోకి కాలు పెట్టడమే తడువు... ఒక్కసారిగా ‘అక్కా అక్కా’ అంటూ ఆప్యాయతతో కూడిన పిలుపులు మనసుని చుట్టేసాయి. ఆ అనురాగలబాంధవ్యాలకు మనస్సు మూగబోయింది ఓక్షణం. ‘ఇన్నాళ్ళు ఈ ప్రేమకెందుకు దూరమైయ్యానో’ అనుకుంది మనస్సులో మానస. 

          ఆశ్రమానికి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చి నట్లు ఉన్నారు. 

         “ఆబుజ్జి పాపాయిలు అక్కా... మీరేనా మానస అంటే” అని పరిచయం చేసుకున్నారు.

          ఓ నలుగురు అమ్మాయిలు మానసను అదే పనిగా చూస్తున్నారు. ఆ అమ్మాయిలు యెంత అందగా వున్నారో...

         వాళ్ళ దగ్గరికివెళ్ళి ‘మీ పేర్లు ఏంటి ?’ అని అడిగింది. ఆమె మాట ఇంక పూర్తి కాకుండనే ‘నినూష, చైత్ర, దివ్య, రమ్య’ అని చెప్పింది నినూష. 

        నినూష చెలాకీగా, అందంగా, చూపరులను ఆకట్టుకునేలా వుంది. ఆ అమ్మాయిని చూడగానే ఎందుకో తనని తను చూసుకున్నట్లు ఉంది.

       "నినూ... నువ్వు ఇక్కడికి ఎoదుకు వచ్చావు..! రావటానికి ఏంటి కారణం?” అంది మానస.

       “అక్క! మా అమ్మకి మేము ఐదుగురం అమ్మాయిలం. మా నాన్నకోరిక కొడుకుపుట్టాలని. కానీ నాన్న కోరిక ఫలించలేదు. నాన్న తాగేవాడు. తాగి వచ్చి రోజూ గొడవలు... అవి భరించలేక. ఇద్దరూ విడిపోయ్యారు. నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు. అమ్మకు మమ్మల్ని పోషించటం కష్టంమైపోయి, పిల్లలు లేనివారికి నలుగురు అక్కలను దత్తతనిచ్చిoది. నన్ను ఎవ్వరూ తీసుకోలేదు. అమ్మకు జబ్బు చేసి చనిపోయింది. అమ్మ ఒక ఇంట్లో పని చేసేది. ఆ ఇంటి సర్... బాలచందర్ సర్ అనీ, ఆయనే నన్ను ఈ ఆశ్రమంలో చేర్పించారు. అపుడప్పుడు ఆ సర్ వచ్చి నాకు కావాల్సినవి ఇస్తుంటారు. ఇక్కడ అందరూ మీ గురించి చేప్తుంటే మిమ్ముల్ని చూడాలనే ఆరాటంతో ఎదురు చూస్తున్నా. మీరు రాగానే అలానే చూస్తుండి పోయా. ఏమి అనుకొకు అక్కా... ఇక్కడ అందరూ నీ పేరే జపిస్తుంటారు అక్కా” అంది నినూ.

        “అవునా ? ఎందుకు?” అని అడిగింది మానస. 

         “అక్క, మీరు అందరితో కలిసిపోయేవాళ్ళనీ, గలగల నవ్వుతూ చలాకీగా వుండేవాళ్ళనీ... రోజుకో పదిసార్లు వినివుంటా. ఆరోజు నుండే మొదలైంది, మానసక్కను చూడాలనే ఆరాటం.”

        నినూ మాటలు విన్న మానసకు మాటలు రాలేదు కాసేపు....

        “అక్కా ,అక్కా” అని నినూ పిలవటంతో మానస ఊలిక్కిపడిoది.

        "అక్కా... ఏం ఆలోచిసున్నావు?" అంది నినూ.

        "ఏమి లేదమ్మా” అంది నవ్వుతూ మానస.

         మనసులో ఆలోచనలు సుడితిరుగుతున్నాయి.

        'కొన్నాళ్ళు నేను దూరంగా ఉంటే, ఇక్కడి పిల్లలు పరితపిస్తున్నారు. నా అవసరం ఇక్కడి వారికి చాలాఉంది. వారి అవసరం నాకూ ఉంది. నా అశయ రహదారిలో... నినూష, చైత్ర, దివ్య, రమ్య... ఇలా అందరినీ నడిపించాలి.' ఒక స్థిర నిర్ణయం తీసుకుంది, మానస.

        ఒక వైపు పాఠశాలలోని పిల్లలూ, మరోవైపు..ఆశ్రమంలోని పిల్లలూ...

  సమాజానికి సహాయపడే వ్యక్తులుగా... వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే బాధ్యతని తన భుజస్కంధాలపై వేసుకొంది మానస.

        ఆమె ఆశయసిద్ధికి ఎవరెవరు తోడ్పాటునందిస్తారో... ఆమె తన కలను ఎలా నెరవేర్చుకుందో... కాలమే నిర్ణయించాలి.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages