ఒకటైపోదామా ఊహల వాహినిలో - 8 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా ఊహల వాహినిలో - 8

Share This

ఒకటైపోదామా ఊహల వాహినిలో - 8 

కొత్తపల్లి ఉదయబాబు  


 

''ఒకమాట..హరితగారు. ఆడది ప్రేమించి విఫలమై పరిస్థితులకు తల ఒగ్గి మరొకరితో పెళ్ళికి సిద్దపడి పెళ్లి చేసుకుని  జీవితాంతం సర్దుబాటు చేసుకుంటూ బతికేస్తుంది. కానీ మగవాడు మొదటిసారి నిర్మలమైన మనసుతో ప్రేమలో పడినపుడు ఆ ప్రేమ సఫలమైతే అతనంత గొప్ప ప్రేమికుడు ఉండడు .విఫలమైతే అతనంటే నిక్కచ్చిమనిషి మరొకడు ఉండడు . ధన్యవాదాలు. ''

  ''అవెందుకు బాబు?''

  ''నా మనసులో మాటలు అన్నీ మీ సమయం వెచ్చించి  విన్నందుకు. వెళ్ళొస్తానండి . మీ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఈరోజు శుక్రవారం. మళ్ళీ ఇదేరోజు సాయంత్రం అయిదు గంటల లోపు మీనుంచి నాకు ఫోన్ రావాలి.''

  ''అలాగే.''

  ''బై హరితగారు '' విరాజ్ వెళ్ళిపోయాడు.

  ***

  అతను అలా వెళ్ళిపోగానే ఒక్కసారిగా విరగబడి నవ్వుకున్నారు శకుంతల, హరిత.

 ''ఈ ప్రేమ పిచ్చోడు నీకు ఎక్కడ తగిలాడమ్మా!'' అడిగింది శకుంతల.

  "నీకు చెప్పాను కదా మమ్మీ. నేను బహుమతి తీసుకోవడానికి నా సీట్లోంచి లేచి వేదిక మీదకి వెళుతున్నంతసేపు  అసలు ఆటను కన్ను ఆర్పలేదు   మమ్మీ. సర్లే గాని అతనికి సమాధానం చెబుతావ్?" అడిగింది హరిత తల్లిని.

  " వారం రోజుల సమయంలో  మీ ఇద్దరి ప్రవర్తన అంతా గమనించి నీ అభిప్రాయం తెలుసుకుని మరి చెప్తాను సరేనా? ఈలోగా నేను ఒకసారి క్యాంటీన్ నుంచి  వచ్చేటప్పుడు ఓసారి వాళ్ళ షాప్ కి వెళ్లి  నేను అని చెప్పకుండా వాళ్ళ నాన్నగారిని చూసి మాట్లాడి వస్తాను. ఒక పరీక్షకి నిలబడాలంటే ముందు బాగా చదవాలిగా! సరే నువ్వు వెళ్లి చదువుకో " అని చెప్పి శకుంతల లోపలికి వెళ్ళిపోయింది.

  హరిత చదువులో పడింది.

 ******

 ఈ ప్రకృతిలో ప్రేమ కున్న పైత్యం అదే!

 ప్రకృతి పరంగా ప్రేమికులైన స్త్రీ పురుషుల చూపులు తొలిసారి కలుసుకుని ఒకరి దృష్టి ఒకరి  నుంచి మరొకరికి ప్రవహించినప్పుడు, అందులోనూ ఒకరు ముందడుగు వేసి తన మనసులో మాట స్పష్టంగా నిర్మల హృదయంతో రెండవ వారికి చేరవేసినప్పుడు... రెండో వారిలో ఆ  బీజం నాటుకుని మొలకెత్తడం  ప్రారంభమవుతుంది.  ఇప్పుడు హరిత ఆ స్థితిలోనే ఉంది.

దాదాపు గంట నుంచి పుస్తకం ముందు వేసుకుని కూర్చున్న హరితకి  ఒక అక్షరం ముక్క కూడా బుర్రలోకి వెళ్ళలేదు.

పేజీలు అటు ఇటు  తిరిగేస్తోంది  గానీ... విరాజ్ రూపమూ, చలాకీగా తల్లితో చెప్పేసిన   మాటలే చెవుల్లో మురళీనాదంలా వినిపిస్తున్నాయి.

కాలం ఎంత మారిపోయింది? పూర్వకాలం ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఉంటే చుట్టుపక్కల కుటుంబాలవాళ్లు తమ ఎరుకలో ఉన్న  ఏమైనా సంబంధాలు  చెప్పేవారట. ఆడపిల్ల వారి  తరపు పెద్దలు వచ్చి మగపెళ్ళి వారితో  తమ విషయాలు చెప్పి, వారు చెప్పిన విషయాలు తెలుసుకుని, పెళ్లిచూపులకు రమ్మని మగపెళ్ళి వారిని ఆహ్వానించేవారట.

 మంచి ముహూర్తం చూసుకొని మగ పెళ్లివారు తమ బలగంతో ఆడపిల్ల వారింటికి పెళ్లి చూపులకు వెళ్లేవారట. ఆడపిల్ల చేత పాటలు పాడించి, అటు ఇటు నడిపించి, రకరకాల శల్యపరీక్షలు చేసి నచ్చితే కట్నకానుకలు, ఆడపడుచు లాంఛనాలు మిగతావన్నీ  మాట్లాడుకునేవారట. 

ఓ శుభముహూర్తంలో పెళ్ళి అయ్యేదట.

మరి ఈ కలికాలంలో  పెళ్ళికొడుకే తాను ప్రేమించిన అమ్మాయి ఇంటికి ధైర్యంగా వచ్చి, తన, తన కుటుంబ విశేషాలు అన్ని చెప్పి, మీ అమ్మాయికి తాను నచ్చితేనే  ఫోన్ చేయండి అనే స్థాయికి  వచ్చారంటే యువకులు తమ జీవి భాగస్వామిని ఎన్నుకోవడంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

 (ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages