పుత్రోత్సాహం - అచ్చంగా తెలుగు

పుత్రోత్సాహం

రాధకృష్ణ కర్రి




"కోమల్, కోమల్ ఎక్కడున్నావ్??" అంటూ వీధి వీధంతా వినబడేలా 3వ అంతస్తు నుండి అరుస్తున్నాను. ఎక్కడా వాడి ఆచూకీ మాత్రం తెలియలేదు. సుమారు ఒక గంట తరువాత ఒంటినిండా బురదతో, రేగిన జుట్టుతో.
గబగబా వచ్చి, ఫ్రిజ్లో ఉన్న పాలగిన్ని తీసుకుని ఒక గిన్నెలో పోసుకున్నాడు. డబ్బాలో ఉన్న ఓ రెండు పుంజీలు బిస్కట్ లు తీసుకుని పరుగున మళ్ళీ వెళ్ళిపోయాడు. నేను ఎంత పిలిచినా వెనక్కి తిరిగిచూడలేదు. వాడి సంగతి తెలిసి, నేను ఇహ అరవకుండా టీ విలో Are You Ok Baby సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూస్తున్న.
ఆ సినిమా గురించి నా ప్రియనేస్తం సుధా మురళి ఒక రివ్యూ రాసింది. ఆ రివ్యూ నచ్చి ఆ సినిమా చూడడం మొదలుపెట్టాను. 

ఆ సినిమా కథ, కథనం గూర్చి సినిమా మొత్తం చూశాక చెబుతాను లెండి. 

ఇహ అసలు కథలోకి వచ్చేస్తున్న.

మళ్ళీ ఓ అర్ధగంట తరువాత  వచ్చిన వాడి అవతారం చూసి నా బాధ చూడాలి...!!
ఎందుకంటే, వాడి బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసినా ఆ మురికి వదలదు. చచ్చినట్లు చేతితో ఉతకవలసిందే! పొలంలో నాగలితో దున్నినా మహా అయితే, మోకాలివరకు బురద అంటుకుంటుంది. కానీ, వీడు మాత్రం అంతకు మించి బురదలో పొర్లి వచ్చినట్లున్నాడు.

కోపంతో ఓ నాలుగు చీవాట్లు ఒడ్డిద్దామకునే లోపు ఒకటో అంతస్తులో ఉంటున్న సుచిత్ర వచ్చి...

"అన్నయ్యా...అన్నయ్యా! నువ్ చెప్పినట్లే చేశాను. అమ్మను అడిగి పాతగుడ్డ తీసుకువస్తానన్నావు. తెచ్చావా? ఆంటీ ఇచ్చిందా?" మా వాడిని కుదిపేస్తు అడుగుతోంది.

వాడేమో నన్ను, ఆ పిల్లను మార్చి మార్చి చూస్తున్నాడు. గుటకలు మింగుతున్నాడు.

ఆ పిల్ల మాత్రం వీడిని వదలకుండా ఇంకా అన్నం పెడదమా!...పాలు పోద్దామా! అంటూ అడుగుతూ పోతోంది.

మా అబ్బాయ్ అవతారాన్ని, ఆ పిల్ల మాటల్ని విన్నాక నా సందేహం రెట్టింపయింది. 

ఏం నిర్వాకం చేశావు రా మళ్ళీ అని అడిగితే...

"అబ్బే! అదేం లేదమ్మా. ఆ పిల్ల ఏదో మాట్లాడుతోంది. తనకేం తెలియదు. 

సుచిత్ర నువ్ వెళ్ళు. నేను తరవాత వస్తాను" అని పంపేశాడు.

గబగబా బాత్రూంలోకి దూరి షవర్ ఆన్ చేశాడు.

ఇంతలో క్రింద ఫ్లోర్ లో ఉన్న రోషిణి గారు వచ్చారు. అసలే వాడి అవతరాన్ని చూసి ఒళ్ళు మంది ఉన్న నాకు, ఆవిడ రాక కాస్త ఇబ్బంది కలిగించింది. నా కోపాన్ని ఆవిడ మీద చూపించితే బాగోదని తమాయించుకొని, ఆవిడను ఆహ్వానించి కూర్చోమని సోఫా చూపించాను. ఆవిడ వస్తూనే....

"మీరు నిజంగా కోమల్ వాళ్ళ అమ్మ అవడం మీ అదృష్టం అండి. ఎంత మంచిపిల్లవాడండి మీ అబ్బాయ్! ప్రతీదీ మనకెందుకులే అని వదిలేసే ఈ రోజుల్లో మీ అబ్బాయ్ లాంటి పిల్లలు ఉండడం చాలా అరుదు. మీరు చాలా అదృష్టవంతులండి" అని ఎక్కడా విరామ చిహ్నాలు లేకుండా మాట్లాడేస్తోంది.

నాకేమీ అర్థంకాక ఆవిడ వైపు చూస్తూ కూర్చున్నాను. మళ్ళీ ఆవిడే చెప్పడం మొదలు పెట్టింది.

"మీ అబ్బాయ్ కి మంచి మనసుంది. ఏ పనైనా ముందు తను ఆచరించి, అప్పుడు మాత్రమే తోటిపిల్లలకు చెబుతాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అసలు వీధిలో పిల్లలందరికీ లీడర్ మీ అబ్బాయి. ఇహ, పెద్దవాళ్లకు తలలో నాలుక. మీ అబ్బాయ్ భవిష్యత్తులో ఒక మాంచి లీడర్ అవుతాడు. కోమల్ ని కన్న మీరు మహా అదృష్టవంతులంటూ" కాస్త విరామం ఇచ్చింది.

వేరే గత్యంతరంలేక ఓ కాఫీ కప్పు ఆవిడకు అందించాను. అంతలో మా కోమల్ స్నానం ముగించి వచ్చి, ఎదురుగా ఉన్న రోషిణి గారిని చూసి "హాయ్! అత్తా అంటూ పలకరించాడు." అంతే,

ఆవిడ మళ్ళీ మొదలెట్టింది..."చూశారా చూశారా! అందరి పిల్లలూ 'ఆంటీ' అని పిలుస్తుంటే, మీ వాడు మాత్రం 'అత్తా' అంటూ ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నాడో- అబ్బ! ఎంత ముద్దొస్తున్నావు నాన్న" అంటూ మా వాడికి మెటికలు విరిచింది.

"మీ వాడు ఇవాళ ఎంత మానవత్వాన్ని చూపించాడో తెలుసా!" అంది. 

తెలీదనన్నాను.

"ఇందాకటి వరకు మీ వాడు నాలుగురోజుల క్రితం పుట్టిన కుక్కపిల్లల్ని కాపాడి, వాటికి మన అపార్ట్మెంట్ సెల్లార్లో జాగ్రత్రగా నివాసం ఏర్పాటు చేశాడు. అసలేం జరిగిందంటే .... ఆ కుక్కపిల్లలు మన అపార్ట్మెంట్ వెనుక గ్రానైట్ బండ క్రింద ఉన్నాయి. తల్లి కుక్క ఒంటినిండా గాయాలతో మూలుగుతోంది. ఇంతలో ఓ నాలుగు పెద్ద కుక్కల గుంపు వచ్చి ఆ తల్లి కుక్కమీద దాడి చేసి కరిచేస్తున్నాయి, కుక్కపిల్లల్ని కూడా కరిచి లాగి పారేస్తున్నాయి. పిల్లల్ని కాపాడుకోలేక పోరాడుతూనే ఉంది తల్లి.

అక్కడే మన అపార్టుమెంట్ వెనుకనున్న గ్రౌండ్ లో ఆడుతున్న మీ వాడు ఆ అరుపులు విని వాటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటివరకూ దీనిని ఒక ఆటగా చూస్తున్న అవతలి వీధిలోని పిల్లలు, పెద్దలంతా, మీ పిల్లాడు వాటిని తరిమికొట్టే ప్రయత్నాన్ని చూసి, ఏమనుకున్నారో ఏమో, వాళ్ళు కూడా కలిసి మొత్తం మీద ఆ కుక్కల్ని తరిమికొట్టారు. 

ఆ కుక్కపిల్లల్ని జాగ్రత్తగా బండ క్రింద నుండి తీసి కోమల్ వాటిని మన సెల్లార్లోకి మారుస్తానన్నప్పుడు, అందరూ కలిసి మీ కోమల్ కి సాయం చేశారు. ఆ పెద్ద కుక్కకు ఆయింట్ మెంట్ పెట్టి, ఒక గోనిపట్టా తెచ్చి, దాని మీదకు అది వచ్చేలా చేసి, గిన్నెలో పాలుపోసి పట్టించాడు. దానికి లూసి అని పేరుపెట్టి, దానిని నిమురుతూ ఎంత ధైర్యం చెప్పాడో! కుక్కపిల్లల్ని తల్లి దగ్గరగా పెట్టి...పాలు తాగించి వచ్చాడు. జీవకారుణ్య సంస్థకు నా ఫోన్ నుండే ఫోన్ చేసి వాటి వివరాలు అందించాడు. వాళ్ళు వచ్చేవరకూ వాటి సంరక్షణ మీ అబ్బాయే చూస్తానన్నాడు. కోమల్ చేసినపనికి ఆ వీధిలోని పెద్దలందరూ చాలా మెచ్చుకున్నారు. వీళ్ళు చేసిన పనిని కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు. ఎంతమంది చూశారో దానిని! ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్ వచ్చాయో దానికి! అంతేకాదు...

ఇందాక సుచిత్ర వచ్చింది కూడా ఆ కుక్కపిల్లలకి వెచ్చగా ఉండేందుకు కప్పడానికి ఇస్తానన్న పాత దుప్పటి కోసమే" అంటూ అప్పటివరకూ మా వాడు చేసిన పని గురించి చాలా ఆనందగా చెప్పింది. 

మళ్ళీ తనే ...

"పక్కనున్న మనుషులే ప్రమాదంలో ఉంటే నాకెందుకు అని అందరూ తప్పుకుపోతుంటే... మీ వాడు మాత్రం మానవత్వాన్ని అన్ని వైపుల నుండి చూపిస్తూనే ఉన్నాడు. మొన్నటికిమొన్న ఎదురింట్లోని చిన్న బాబు కాలికి దెబ్బతగిలితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసాడు. వాడి వెనుక పిల్లలందరూ వాడికి సాయం చేశారు. ఇలా ప్రతి పనిలోనూ వాడే ఉంటాడు. అసలు...ఎవరికి కావలండీ ఈ రోజుల్లో ఇలాంటి విషయాలన్నీ? చెప్పండి! 

నేను చెబుతున్నాను చూడండీ! మీ వాడు భవిష్యత్తులో ఓ లీడర్ అవుతాడు కచ్చితంగా. ఇవన్నీ చూస్తుంటే నాకు మీ వాడిలాంటి బిడ్డ ఉంటే బాగుణ్ణు అని అనిపిస్తోంది. అమ్మో! బిడ్డకి నా దిష్టే తగిలేలా ఉంది. కొంచెం మిరపకాయలు దిష్టి తీసేయండి. ఏదేమైనా మీరు మీ పేరుతో కాదు... కోమల్ వాళ్ళ అమ్మగానే బాగా పేరు తెచ్చుకుంటారు... చూస్తుండండి.

నాన్నా కోమల్! ఉంటాను రా మరి...బాయ్" అని వెళ్ళిపోయారు రోషిణి గారు.

ఆవిడ అలా వెళ్ళగానే, మరో ఫోన్... మీ అబ్బాయి చాలా గ్రేట్ అంటూ. 

వాడి గురించి వీధిలో చాలా సార్లు మీ అబ్బాయి చాలా మంచివాడు , అందరితోనూ సరదాగా ఉంటాడు. తను లేకపోతే వీధిలో సందడే ఉండదు అంటుంటే... ఏదో ముఖస్తుతికి అంటున్నారు అనుకునేదాన్ని. 

కాని ఇవాళ వాడు చేసిన పనిని ఆవిడ అమితానందంతో చెప్పడం, మిగిలిన ఫోన్ కాల్స్ రావడం చూసి మనసు ఆనందంతో పొంగిపోయింది.

వెంటనే నాకు సుమతీ శతకంలోని...

"పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!" 

అనే పద్యం గుర్తుకువచ్చింది.

వాడి వయసు చూస్తే 11 ఏళ్ళు. మానవత్వం చూస్తే 20ఏళ్ళు. అన్నింటిలో ఉన్నానని దూరతాడు. ఎక్కడ గొడవలు ఇంటిమీదకు తెస్తాడో అని నాకు ఒకపక్క భయం...

ఇరుగుపొరుగు వాళ్ళు మాత్రం వాడి గురించి చెప్పేవి వింటుంటే మరోప్రక్క ఆనందం.

అయినా సరే, మనసు తూకం మాత్రం కాస్త భయంవైపే మొగ్గు చూపుతోంది. తల్లి సహజ భయమేమో మరి!

నిజానికి పిల్లల మనసులు నిష్కల్మషమైనవే, ఎటువంటి రాతలు లేని తెల్లకాగితాలే. వాటిమీద కేవలం పెద్దలు, వారు పెట్టే హద్దులు, భయాలు... స్వార్ధం...ఇలా ఒకటేమిటి ఎన్నో వాళ్ళ స్వచ్ఛమైన హృదయాలలో బీజాలుగా చేరి, వయసుతోపాటు పెరిగి మానులై వేళ్ళూనుకుంటాయి. ఆ అవలక్షణాలను కొంత మేర పిల్లలకు దూరంగా ఉంచగలిగితే, ఎందరో మహానుభావులు  సిద్ధమవుతారు. అంతెందుకు పరోపకారం ఇదం శరీరం అనే సూక్తిని తూ. చ. తప్పక పాటించిన మన తాతముత్తాతలే మళ్ళీ అవతరిస్తారు. కాదనలేని సత్యం ఇది. 

ఒక్కసారి ఆలోచిస్తే... పిల్లలు ఇలాంటి మంచి పనులు చేస్తుంటే, వారి తల్లిదండ్రులను అందరూ పొగుడుతుంటే...
ఇంతకు మించిన సంతోషం ఆ తల్లిదండ్రులకు  ఏం ఉంటుంది అంది నాలోని ఓ సిసలైన మనసు.

నిజమే కదా! అని తోచింది నాలోని తల్లి మనసుకు.

***

No comments:

Post a Comment

Pages