నా ఆధ్యాత్మిక ప్రయాణం_శ్రీ వేంకట వినోద్ పరిమి - అచ్చంగా తెలుగు

నా ఆధ్యాత్మిక ప్రయాణం_శ్రీ వేంకట వినోద్ పరిమి

Share This

నా ఆధ్యాత్మిక ప్రయాణం_శ్రీ వేంకట వినోద్ పరిమి

ప్రతాప వేంకట సుబ్బారాయుడు, అంతర్యామి వ్యాసకర్త 


ఆధ్యాత్మిక యాత్రలు అందరూ చేయలేరు. చేసినా దూరాభారాలతో, సమయాభావంతో దేవుళ్లనీ, అక్కడి పరిసర ప్రాంత దైవాలని ఏకాగ్రతతో దర్శించలేం. అలా చూసి ఇలా వచ్చేవాళ్ళమే ఎక్కువగా ఉంటాం. ఆధ్యాత్మిక యాత్రలో భగవద్దర్శనాలంటే పర్యాటక ప్రదేశాన్ని పర్యాటకుడు దర్శించి వర్ణించినట్టుగా కాదు. అక్కడి దైవంతో, మనుషులతో, పరిసరాలతో మమేకం అవ్వాలి. తన్మయత్వం పొందాలి. అలాంటి అనుభూతిని పంచడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలౌకిక, అనుభవైకవేద్య  అనుభూతిని చదువరులుగా మానవజన్మతో మనం పొందడం కూడా సుకృతమే! దైవంతో నా అనుభవాలు మొదటి రెండు పుస్తకాలు మనలను అవ్యక్త ఆధ్యాత్మికానుభూతికి లోనయ్యేలా చేశాయి. ఇప్పుడు వెలువడిన నా ఆధ్యాత్మిక ప్రయాణం ముఖచిత్రం మొదలు ఆసాంతం మనసులో ముద్రించుకుని కలకాలం కొలువుంటుంది. శ్రీ వేంకట వినోద్ పరిమిగారి అనుభవాలను మనం పరిపూర్ణంగా జీర్ణం చేసుకుంటాం. 22 అనుభవాల అనుభూతులు, ముగింపు మాటతో గ్రహించాక ఒళ్ళు గగుర్పొడుస్తుంది, కళ్ళు ఆనందబాష్ప నిలయాలవుతాయి, హృదయం నవనీతమవుతుంది. ధన్యోస్మి. శ్రీ పరిమిగారిని పూర్తిగా ఆవాహన చేసుకున్నారు కాబట్టే శ్రీ యం. రమేష కుమార్ గారు రచయిత మధురానుభవాలను, ఆలయాల మహిమలను, స్థలపురాణాలను యథాతథంగా నూరు శాతం అక్షరీకరించారు. పుస్తకంలోని అక్షరాలను కళ్ళు ఏరుకుంటుంటే, యాత్రల్లో శ్రీ పరిమిగారి చేయిపట్టి నడుస్తున్నట్టే ఉంటుంది.

కొండలు కోనలు దాటి, సముద్రాలు లంఘించి రచయిత సందర్శించిన కొన్ని ప్రదేశాలు మనకు తెలియను కూడా తెలియదు. వారు ప్రత్యక్షంగా పొందిన వింత, విచిత్ర అనుభవాలను మనకూ పంచి పెట్టారు. రకంగా మనమూ ధన్యులమే.

భగవంతుడితో అనుభవాలు భక్తి పరిక్వతను సూచిస్తాయి. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు వారి వారి ప్రాప్తాన్ని బట్టి లీలలు గోచరమవుతాయి, అయితే వాటిని గుర్తించడం, అన్వయించుకోవడం ఎంతో హృదయ పరిణతి ఉంటే తప్ప జరగదు.

శ్రీ వేంకట వినోద్ పరిమిగారి మూడు పుస్తకాలు కూడా యాదృచ్ఛికంగా నన్ను చేరాయి. పుస్తకం అందుకున్న ప్రతిసారీ అవ్యక్తానుభూతిలో తన్మయత్వాన్నొందాను.

కొన్ని పుస్తకాలు ఇంట్లో ఉంటే స్వామి కరుణ మనతో ఉన్నట్టే, మనలను కాపాడుతున్నట్టే! శ్రీ పరిమిగారి పుస్తకాలు కోవకు చెందినవే. పుస్తకాలు అమ్మగా వచ్చే డబ్బు తిరుమలలోని గో సేవకు వెచ్చిస్తారు కాబట్టీ ఆవగింజంత పుణ్యాన్నీ మూటగట్టుకోవచ్చన్నది ఫలశ్రుతి.

లోకాస్సమస్తా సుఖినోభవంతు.

ఓం శాంతి, శాంతి. శాంతిః

పుస్తకాన్ని దిగువ లంకెలలో కొనుగోలు చెయ్యవచ్చు. 

https://www.amazon.in/gp/product/B0CQCY69BP/ref=cx_skuctr_share?smid=A1UOIFTN31DI0B

https://books.acchamgatelugu.com/product/daivam-tho-na-anubhavalu-3/

ఈ పుస్తకాన్ని గురించిన ఇతర పత్రికా సమీక్షలు :

 




 ***

No comments:

Post a Comment

Pages