హోమ్ టూర్!
"హాయ్ ఫ్రెండ్స్"
గోపికా గొంతు వినగానే మాధవ్ గట్టిగా అరవబోయి గోపిక గొంతు తన పక్కనుంచే వినపడటం వల్ల
కేక బయటికి రాకుండా నోటికి చేయి అడ్డం పెట్టుకున్నాడు.
"ఇది మా బెడ్ రూము. ఈ
దుప్పట్లో ఉండేది మా వారు ఇంకా నిద్రలేవలేదు. ఉండండి నిద్రలో మా వారు పసిపాపలా ఎలా
ఉంటారో చూపిస్తాను!" అని దుప్పటి పట్టుకొని లాగటం మొదలు పెట్టింది.
"ఛీ! ఇప్పుడు నా దుప్పటి
లాగి నా పాచి మొహాన్ని,నా ఈ ఫ్యామిలీ ప్యాక్‌ను ప్రపంచానికి చూపిస్తుందా? ఒరే మాధవ్!ఎలాంటి
రోజు వచ్చిందిరా నీ జీవితం లో" అని దుప్పటి మొత్తం దగ్గరకు తీసుకొని లుంగచుట్టుకొని
పడుకున్నాడు.
"అబ్బా! లేవండీ!"
అంటూ గారాం పోతోంది .ఈ నటన ప్రపంచం ముందే నిజంగా సూర్యకాంతమే .
"మా వారు పిల్లడిలా మొండి
చేస్తున్నాడు ఇంకోసారి చూపిస్తా!" అంటూ వసపిట్టలా వాగుతూ రూమ్ లోనుంచి వెళ్ళి
పోయింది.
"నాన్నోయ్! ఈ రోజు అమ్మ
టిక్ టాక్ లో హోమ్ టూర్ చేస్తోంది"చింటూ గాడు విషయం చెప్పేసాడు.
"ఖర్మరా బాబూ!అర్జంట్
గా టాయిలెట్ వెళ్ళాలి, ఇది ఎక్కడుందో? ఎక్కడినుండి నన్ను షూట్ చేస్తుందో?"
"ఒరే! అమ్మ ఎక్కడుందిరా?"అని
మెల్లిగా అడిగాడు.తన గొంతు వినపడితే గోపిక మళ్ళీ "హాయ్ ఫ్రెండ్స్! మా వారు లేచారు
చూపిస్తాను రండి" అని ఎక్కడొస్తుందో అని భయం.
"ఇక్కడ లేదు నాన్నోయ్!
పోర్టికోలో పూలమొక్కలను వీడియో తీస్తోంది"
అన్నాడు.
"హమ్మయ్య!" వెనక
ఒక టాయిలెట్ ఉంది.ఎందుకన్నా మంచిదని అక్కడికి వెళ్ళాడు.పని కానించి బ్రష్ చేసుకొని.పెరడులో
చిన్న టవల్ కట్టుకొని వాకింగ్ చేస్తున్నాడు.
ఇంతలో "హాయ్ ఫ్రెండ్స్!
ఆయన మావారే" మిద్దెమీద నుండి తనను జూమ్‌లో షూట్ చేస్తోంది.
"రోజూ ఆయనకలా తిరక్కపోతే....!"
గోపిక మాట పూర్తిగా కాకుండానే, "గోపీకా.........!"
గట్టిగా గావుకేక పెట్టాడు.ఆ తరువాత ఏం చెప్తుందో తెలుసు కాబట్టి.
"మా వారే ప్రేమగా పిలుస్తున్నారు,
ఇప్పుడే కిందికెళ్ళి మీకు పరిచయం చేస్తాను!"అని కింది కొస్తోంది.ఇక ఆగితే ఏం జరుగుతుందో
ఊహించుకుని టాయిలెట్ లోకి దూరి లాక్ చేసుకున్నాడు.
"ఏమండీ!ఏమండీ!"గట్టిగా
అరుస్తూ పిలుస్తోంది.
మాధవ్ వాష్ రూమ్ లో బెల్లం
కొట్టిన రాయిలా వులుకూ,పలుకూ లేకుండా కూర్చున్నాడు.
"ఒరే! చింటూ! నాన్నెక్కడరా?"
అడిగింది గోపిక.
"అమ్మోయ్! నాన్న అందులోకి
వెళ్ళాడు" అని టాయిలెట్ చూపించాడు.
"ఏమండీ! త్వరగా రండీ!
మన ఫ్యామిలీ ని పరిచయం చేస్తున్నా, నా ఫాన్స్ కు" అంటోంది.
" ఇదేంటి ఈ రోజు ఇలా
బబుల్గంలా తగులుకుంది ! ఈ రోజు నీకు ఇలా తెల్లారిందిరా మాధవ్!"అనుకొంటూ ఫ్రస్టేషన్లో
అక్కడున్న మగ్గు తీసుకొని నెత్తి కొట్టుకున్నాడు. మగ్గు విరిగింది నెత్తి మీద బొప్పి
మిగిలింది.
చాలా సేపు వైట్ చేసి వెళ్ళి
పోయింది గోపిక.కొద్ది సేపు తరువాత చిన్నూ వచ్చి "నాన్నోయ్! హోమ్ టూర్ అయిపోయింది.నిన్ను
ఇంకోసారి పరిచయం చేస్తానంది అమ్మ.అందరికి సారీ చెప్పింది". బ్రతుకు జీవుడా అంటూ
బయటికొచ్చాడు మాధవ్.
అప్పటికి మధ్యాన్నం 12 అయ్యింది.ఇంత
వరకు కాఫీ చుక్క గొంతులోకి పోలేదు.నీరసంగా వెళ్ళి కూర్చీలో కూలబడ్డాడు.
"వచ్చారా! మన ఫ్యామిలీ
లో మీరొక్కరే మిస్ అయ్యారు.ఈ వీడియో ఎంత బాగా వచ్చిందో! వైరల్ అవుతుంది చూడండి"
అంది గోపిక.
"ఎన్ని షేర్స్ వెళ్తాయమ్మ"
చిన్ని అడుగుతోంది.
"బోలెడెల్టాయి ,లైకులు,కామెంట్స్
ఆదిరిపోవాలి అంతబాగా వచ్చింది వీడియో" చిన్నీ తో చెప్తోంది గోపిక.
వీళ్ళేమిటో వీళ్ళ భాషేమిటో
అర్థం కావటం లేదు మాధవ్ కు.ఉదయం లేచినప్పటి నుండి చింపిరి జుట్టుతో ,పాచిమొహం తో దిక్కుమాలిన
నైటీతో సెల్ ఫోన్ తీసుకోవటం.
"హాయ్ ఫ్రెండ్స్! ఇది
మాకుక్క ,ఇది పూలమొక్క,ఇది నేనేసిన ముగ్గు,ఇది బర్రె వేసిన పేడ,ఇది మా బుడ్డోడు తిన్న పండు తొక్క,ఇది మా పిల్లి నాకిన గిన్నె,ఇది మా డాగీ షిట్టు, ఇలా ఏది కనిపిస్తే దాన్ని వీడియో తీయటం.పోస్ట్
చేయడం.
పోస్ట్ చేసినప్పటి నుండి లైక్
లు షేర్స్,కామెంట్స్ చూసి పొద్దస్తమానం మాట్లాడుకోవటం.మాధవ్ కు అర్థం కాక "ఏమిటిది?"అని
పిల్లలనడిగితే "టిక్ టాక్ నాన్నోయ్!" అని చెప్పారు.
హాయిగా గడచి పోతున్న జీవితాల్లోకి
కరోనా వచ్చి లాక్ డౌన్ పడింది.తనకు ఆఫీస్ లేదు,పిల్లలకు స్కూల్ లేదు,గోపికకు పొద్దుపోవటం లేదు.
ఇదేదో నెల నుంచి ఈ టిక్‌టాక్
అనే మాట వీళ్ళ నోటిలో వినపడుతోంది. పొద్దుపోక
సెల్ల్ఫోన్ లో ఏదో చూసుకుంటున్నారు అనుకున్నాడు.కానీ అదేదో పిచ్చి పట్టినట్లు
ప్రవర్తిస్తున్నారు గోపిక ,
పిల్లలు.
తనకసలు ఈ టిక్ టాక్ అంటేనే
ఏమిటో తెలియని అర్బకుడు.ఈ రోజు ఎలాగైనా సరే ఈ టిక్ టాక్ అంటే ఏమిటో తెలుసుకోవాలని సెల్‌ఫోన్
తెచ్చుకుని " గూగుల్ తల్లీ! టిక్ టాక్
అంటే ఏమిటమ్మా!" అని అడిగాడు.
అడగడం ఆలస్యం గూగుల్ తల్లి "టిక్ టాక్ వీడియోస్ చూసి తరించు నాయనా!"
అని కుప్పల వీడియోస్ పంపించింది.
ఒకటి తరువాత ఒకటి చూస్తున్నాడు.అబ్బాయిలు
అమ్మాయిల వేషాలలో,విపరీతమైన మేకప్ వేసుకొని ,శృంగార హావభావాలతో ,సోలోలు, డ్యూయెట్
,ఏవో వల్గర్ డైలాగులు చెప్తూ వీడియోలు ఉన్నాయి.
చూస్తుంటే కంపరం పుడుతోంది.
వాటికింది అన్నీ బూతు కామెంట్స్
.చిన్న పిల్లలకు చెత్త డ్రెస్సెస్ వేసి వాళ్ళ ఏజ్ కు మించిన హావభావాలతో డాన్సస్.వాటికింద ఆ అమ్మాయిల బాడీ షేమింగ్
మీద కామెంట్స్,అంత చిన్న పిల్లల మీద అలాంటి కామెంట్స్. చాలా బాధ వేసింది.
ఈ పిల్లలు తల్లితండ్రులకు
తెలిసే చేస్తున్నారా?వాళ్ళ పిల్లల గురించి ఇలాంటి కామెంట్స్ చూసి ఆ తల్లితండ్రులు తట్టుకొని
ఎలా ఉన్నారు? చదువుతూ ఉంటే చాలా బాధేసింది.
ఇక మిడిల్ ఏజ్ లో ఉన్న ఆంటీలు
నైటీలలో, ఐటమ్ సాంగ్స్ కు డాన్సస్ వేస్తున్నారు.వీళ్ళ భర్తలు ఏమీ అనరా?వాళ్ళకు ఈ విషయాలు
తెలుసా?ఆ వీడియోస్ చూస్తుంటే అన్నీ డౌట్స్ వస్తున్నాయి మాధవ్ కి.
వాళ్ళ వీడియోస్ కింద చదవలేనటువంటి
భయంకరమైన కామెంట్స్.ఎప్పుడూ ఆఫీస్ పనిలో మునిగి తేలే అమాయకపు మాధవ్ ఇవన్నీ చూసి కరెంటు
షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయాడు.
ఏవో కొద్ది టిక్ టాక్ లు బాగున్నాయి.
దేవుడా వీళ్ళంతా ఎటువెళ్తున్నారు?అని అసహనంతో జుట్టు గట్టిగా పీక్కున్నాడు . గుప్పెడు
జుట్టు ఊడి చేతికొచ్చింది. ఇంకా పీక్కుంటే బట్టతల వస్తుందని మానుకున్నాడు.
హాల్లోకి వెళ్ళి నీరసంగా కుర్చీలో
కూర్చున్నాడు.
"వచ్చారా! ఈరోజు వీడియోలో
మన ఫ్యామిలీలో మీరు ఒక్కరే మిస్ అయ్యారు!"అంటూ వచ్చింది తన జాతిరత్నం గోపిక.
"ఇప్పుడు వాళ్ళకు నన్ను
చూపకపోతే కొంపలేం మునిగిపోదు!" అన్నాడు.
" రేపు తల్లి,పిల్ల ఛాలెంజ్
లో అమ్మ,నేను ఐటెం సాంగ్ కు డాన్స్ చేస్తున్నాం నాన్న!" చెప్పింది చిన్ని.
ఆ మాట వింటూనే తను ఇంతవరకు
చూసిన వీడియోల కింద చదివిన కామెంట్స్ గుర్తుకొచ్చి నిప్పు తొక్కిన కోతి లాగా ఎగిరాడు.
" రేపు మీ ఇద్దరూ ఆ దిక్కుమాలిన
పాటకు డాన్స్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే! మన పిల్లను, నిన్ను ఎవరో ముక్కు,మొహం తెలియని
వాళ్ళు భయంకరమైన పదజాలంతో దూషిస్తుంటే చదివి తట్టుకోగలవా? " అని అంటూ ఉండగానే
మాధవ్ ఫోన్ మోగింది.
ఫోన్ తీసి "హలో!"
అన్నాడు.
"ఏం మామ! ఆఫీసులో బుద్ధుడు,
ఇంట్లో మంచి రసికుడన్నమాట!" అవతల వాడు అన్నాడు.
అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో
కూడా మాధవ్ కు అర్థం కాలేదు!
"దేని గురించి మాట్లాడుతున్నావు!"
అని అడిగాడు చికాకుగా.
"ఆ..... ఆ.... దొంగ!
అన్నీ చేసి ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్నావు.ఒకసారి
మీ వార్డ్ రోబ్ లో మీ ఫోటో చూసుకో!" అని ఫోన్ పెట్టేసాడు.
ఏమి ఫోటోనో ఏమిటో అర్థం కాక
ఆలోచిస్తూ బుర్ర గోక్కున్నాడు. ఇంతలో "మీ బాత్ టబ్ ఎక్కడ కొన్నారు సార్? భలే ఉంది!"
కొలీగ్ ఫోన్. వరుసగా ఫోన్ మీద ఫోన్! ఇంట్లో అణువణువు గురించి అడుగుతున్నారు.
అవి ఎక్కడ కొన్నారు? ఇవి ఎక్కడ
కొన్నారు? ఈ పెయింటింగ్ సూపర్! మీ కుక్క బాగుంది దాని మూతి ముద్దుగుంది అంటూ ముఖ్యంగా
వాళ్ళ రొమాంటిక్ ఫోటో గురించి చాలామంది అడిగారు.
ఏమి అర్థం కాక బుర్ర గోక్కొని
గోక్కొని రక్తం చేతి కంటిది దాన్ని చూసి బెంబేలెత్తి, ఇంకా గోక్కుంటే రక్తదానం చేయొచ్చు
అనుకుని,
"గో.....పీ! మన ఇంటి
విషయాలన్నీ ఆఫీస్ వాళ్ళకు, ఫ్రెండ్స్ కు చుట్టుపక్కల వాళ్ళకు ఎలా తెలిసాయి చెప్మా!"అని
అమాయకంగా బిక్క మొహం వేసుకుని అడుగుతున్న మాధవ్ ను చూసి,
తను పొద్దున చేసిన నిర్వాకం
గుర్తుతెచ్చుకొని మురిసిపోయిన గోపిక మొహం చింకి చాటు అంత అయ్యింది.
ఒక్క గెంతులో రూమ్ లో నుంచి
బయటికి దూకి ఫోన్ తీసుకొని చూసి "ఏవండోయ్! నేను పొద్దున పెట్టిన హోమ్ టూర్‌కు వన్
మిలియన్ వ్యూస్ 50 కే లైక్స్ 300 కామెంట్స్ వచ్చాయి" అని చిన్న పిల్లల గెంతులు
వేస్తోంది.
మాధవ్ ఫోన్ లాక్కొని ముందు
కామెంట్స్ చదివాడు మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది.
"గో.....పీ!అని గావుకేక
పెట్టాడు. అందరూ మాధవ్ ముందు నిలువు గుడ్లు వేసుకొని నిలబడ్డారు.
ఫోన్ గోపిక చేతికిచ్చ"
కామెంట్స్ చదువు!" అన్నాడు.
కామెంట్స్ లో దాదాపు చాలామంది
గోపికని ఫిగర్ అని, కత్తిలా ఉంది,అంటూ ఇంకా చెత్తగా బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. అవి చూసి కాళ్ళ కింద
భూమి కదిలినట్లయింది.
తాను చేసింది హోమ్ టూర్ కదా!
ఇలా కామెంట్స్ ఎందుకు వచ్చాయి? అసలు వీడియోలో ఏమి ఉంది?అని వీడియో ప్లే చేసింది.
హోమ్ టూర్ వీడియోలో తన చీరలను
చూపిస్తూ ఉంటే అందులో తను,మాధవ్ హనీమూన్ లో తీయించుకున్న రొమాంటిక్ ఫోటో ఒకటి బట్టల
మధ్య కనీ కనిపించకుండా ఉంది.
తను చూసుకోకుండా పొరపాటున
అప్లోడ్ చేసింది. ఆ కనీ కనిపించని దాన్ని వీళ్ళు జూమ్ చేసి చూసి కామెంట్స్ పెట్టారన్నమాట.
ఒకసారి సోషల్ మీడియాలోకి ఎంటర్
అయిపోతే ప్రతి ఒక్కదాన్ని పోస్టుమార్టం చేసి చూస్తారనే విషయం గోపికకు అర్థమైంది. తన
బాడీ షేమింగ్ చేస్తూ పెట్టిన కామెంట్స్ చదువుతూవుంటే ఏడుపు తన్నుకొచ్చింది.
"ఇంటి పరువు బజారున పెట్టాను,
బయట తలెత్తుకుని ఎలా తిరగటం?" వెక్కివెక్కి ఏడుస్తోంది గోపిక.
మాధవ్ కు గోపికను చూస్తే చాలా
జాలేసింది. అందరూ ఏదో చేస్తున్నారు. నేను చేయాలనే తపన తప్ప! తర్వాత వచ్చే పరిణామాల
గురించి ఆలోచన లేకపోవడం వల్ల ఇప్పుడు బాధపడుతోంది.
ముందు ఫోన్ తీసుకుని ఆ వీడియో
డిలీట్ చేసి టిక్ టాక్ అకౌంట్ క్లోజ్ చేసేసాడు. గోపికను అనునయించాడు.
"ఏమండీ! బయట నన్ను ఎంత
బ్యాడ్ గా అనుకుంటారో కదా!" అని దీనంగా అడిగింది.
"అందరికీ ఇదే పనా! రెండు
రోజుల్లో మర్చిపోయి ఇంకో కొత్త దాని మీద ఫోకస్ చేస్తారు. సోషల్ మీడియాలో అడుగుపెట్టేటప్పుడు
చాలా జాగ్రత్త అవసరం. కొంచెం ఆలోచించి ఏ పోస్ట్ అయినా పెట్టాలి!" అన్నాడు.
"ఏవండీ! నేనా ఫోటో కావాలని
తీయలేదండి పొరపాటున రికార్డు అయింది. ఆ వీడియో వల్ల మీకు మీ ఆఫీసులో అవమానం అయ్యింది!"
" కొన్ని రోజులు ఫేస్
చెయ్యాలి తప్పదు!" అన్నాడు మాధవ్.
తాను చేసిన తప్పుకు పాపం మాధవ్
అందరికీ జవాబులు చెప్పలేక అల్లాడుతున్నాడు. ఇంత తెలివిగా ఆలోచించే నేను వీడియోస్ కింద
వచ్చే ఫేక్ పొగడ్తలకు బోల్తా పడ్డాను. నిజమే దీనివల్ల ప్రయోజనం ఏముంది పైగా తను, తన
కూతురు కలిసి ఐటెం సాంగ్‌కు డాన్స్ చేయాలనుకున్నారు. అలా జరిగింటే ఆ వీడియో కింద ఇంకెంత
భయంకరమైన కామెంట్స్ వచ్చేవో ఊహించుకోవడానికే భయపడిపోయింది చాలా బాధపడింది.
గోపిక వారం రోజులు అసలు ఫోన్
ముట్టుకోనేలేదు .ఇంట్లోంచి కాలు ఎవ్వరూ బయట పెట్టలేదు. ఒకరోజు టీవీ ఆన్ చేస్తే న్యూస్ ఛానల్లో
ఈ "టిక్ టాక్!" మీద దుమారం రేగుతోంది. డిబేట్ వాడి, వేడిగా సాగుతోంది. టిక్
టాక్!
బ్యాన్ గురించి ఆ డిబేట్ సాగుతోంది.
నెత్తి మీద నుంచి కొండంత బరువు
దించినంత ఆనందం వేసింది మాధవ్,గోపికకు.
గోపిక మొహంలో చిరునవ్వు విరబూసింది
ఇంట్లో నిద్రలేస్తూనే వినిపించే "హాయ్ ఫ్రెండ్స్!" అనే పదం ఇప్పుడు వినిపించట్లేదు.
"ఏవండీ లేవండి!"
అనే మధురమైన గోపిక గొంతు మాధవ్ చెవులకు ఇంపుగా వినిపిస్తోంది.
No comments:
Post a Comment