మంగతాయారు - మార్నింగ్ వాక్ - అచ్చంగా తెలుగు

మంగతాయారు - మార్నింగ్ వాక్

Share This

మంగతాయారు - మార్నింగ్ వాక్

పారుపల్లి అజయ్ కుమార్ 

అలమేలు మంగతాయారు ఆపసోపాలుపడుతూ తన భారీకాయాన్ని సోఫాలో చేరవేసింది.

ఈ మధ్య కాలంలో మంగతాయారుకు ఆయాసం ఎక్కువయింది.

నిల్చున్నా అయాసం, కూర్చున్నా ఆయాసం, తిన్నా ఆయాసం, తినకపోయినా  ఆయాసం, మాట్లాడినా ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.

ఇహ లాభంలేదని  మొగుడు సుబ్బారావును పోరుపెట్టి పెద్ద కార్పోరేట్ ఆసుపత్రిలో చూయించుకొంది మొన్న. పరీక్షల పేరుతో పదివేల రూపాయలు  కట్టించుకొని పరీక్షలు చేసి రిపోర్టులు చూసి ' ఏ రోగమూ లేదు.రోజూ ప్రొద్దున్నే మార్నింగ్ వాక్ చేయమన్నారు.' సదరు ఆసుపత్రి వైద్యులు.

సుబ్బారావు మూడు నెలల  నుండి చెపుతూనే వున్నాడు  'రోజూ ప్రొద్దున్నే లేచి కొంత దూరం నడవమని.'

మొగుడి మాటలు వినటం అన్నది మంగతాయారు జీవితంలో జరగని విషయం.

ఇక ఇప్పుడు పదివేలు తీసుకుని చెప్పిన డాక్టరు మాటలు మాత్రం వినాలని నిశ్చయించుకొంది.

పంచాంగం చూసి మార్నింగ్ వాక్ కు మరుసటి రోజు దివ్యమైన ముహూర్తం వుందని, దానికోసం సమాయత్తమవు తున్నది.

ప్లేటు నిండా జీడిపప్పు ,బాదం ,పిస్తా మెదలైనవి అన్నీ పెట్టుకుని రేపు నడవటానికి శక్తి కావాలని అవన్నీ తినడం మొదలుపెట్టింది ఆయాసపడుతూనే.

మంగతాయారు కాస్త కలిగిన కుటుంబంలోనే పుట్టింది.ఒక్కతే అమ్మాయని  తల్లీ, తండ్రీ గారాబాల మధ్య పెరిగి పెద్దదయింది.

ఇంటర్ దాకా చదువు ఎలాగో నెట్టుకొచ్చింది.  డిగ్రీ చదవనని మొండికేసింది.

 ఆడపిల్లకు ఈ చదువు చాలు, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని  తల్లితండ్రులు  కూడా పై చదువులకు బలవంత పెట్టలేదు. యిరవై దాటకుండానే మంచి సంబంధమని సుబ్బారావుకు ఇచ్చి పెళ్ళిచేసారు.

తల్లితండ్రులకు సుబ్బారావు ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులు బాగానే వున్నా, ఉద్యోగం పురుష లక్షణమని బాంక్ ఉద్యోగం చేస్తున్నాడు పెళ్ళి నాటికే.

 ఇద్దరు పిల్లలు పుట్టారు. పెరిగి పెద్దయ్యారు. వారికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కొడుకు,కోడలు అమెరికాలో సెటిల్ అయ్యారు.  కూతురూ, అల్లుడు బెంగుళూర్ లో ఉన్నారు.

 ఏనాడు మంగతాయారు ఏ పనీ చేసి ఎరుగదు.  చిన్నపుడు తల్లి ఏ పనీ చెప్పేది కాదు. పెళ్ళి అయ్యాక అత్తగారు  కూడా కోడలికి ఏ పని చెప్పలేదు.   అత్తగారు చెప్పలేదు కదాని తాయారు కూడా కల్పించుకుని చేసేది కాదు. పిల్లల పెంపకం  కూడా అమ్మో, అత్తో చూసేవారు. అలా, అలా పని చేయక చేయక, మొగుడు బాంక్ కు వెళ్ళిన సమయంలో ఏం చెయ్యాలో తోచక టీవీ సీరియళ్ళు చూస్తూ చిరుతిళ్ళు తినడం అలవాటుగా  మారింది.

అత్తగారు చనిపోయాక ఇంటిపనికి,  వంట పనికి మనుషులను పెట్టింది, అంతే గానీ తను మాత్రం ఏ మాత్రం వొళ్ళు  వంచలేదు.

కొడుకు అమెరికా నుండి లేటెస్ట్ వంట మిషన్ లు పంపిస్తూ తల్లికి ఏ మాత్రం శ్రమ లేకుండా చేస్తున్నాడు.

కాఫీ మిషన్, టీ మిషన్, అప్పడాల మిషన్, చపాతీల మిషన్ …ఇలా వటిల్లంతా మిషన్ల మయమై పోయింది. మిషన్ల ఆలనా పాలనా సుబ్బారావుదే.

తాయారు తనకు మిషన్ల పరిజ్ఞానం లేదని అన్నీ మొగుడుకు అప్పచెప్పి సోఫాలో కుదురుగా కూర్చునేది.

 బాంక్ మేనేజరుగా జాబ్ నుండి రిటైర్ అయిన తరువాత ఏం తోచని సుబ్బారావుకు ఈ పని బాగానే వుందనిపించి సంతోషంగా వంటింటి మిషన్లను హస్తగతం చేసుకున్నాడు.  దాని పర్యవసానమే రేపటి నుండి మంగతాయారుకు అతికష్టమైన మార్నింగ్ వాక్ ప్రహసనం.


తెల్లవారు ఝాము నాలుగు గంటలకు అలారం పెట్టింది తాయారు.

" నాలుగింటికి ఎందుకే? అయిదు దాటాక వెళితేనే కొద్దిగా వెలుగు వస్తుంది. నాలుగుకు  బాగా చీకటిగా వుంటుంది." అన్నాడు సుబ్బారావు.

 "నాలుగింటికి   వెళతానని ఎవరన్నారు? అయిదు తర్వాతే వెళ్ళేది." అంది తాయారు.

 "మరి,అలారం నాలుగుకు ఎందుకు?"

 "లేచి తయారవద్దా?"  దీర్ఘం తీసింది తాయారు.

 "గంట తయారవుతావా?  నువ్వు వెళ్ళేది మార్నింగ్ వాక్ కు. పేరంటానికి కాదు."

 "మార్నింగ్ వాక్ వెళితే మాత్రం  తయారవకుండా వెళతారా? మీకేం తెలియదు.నోర్ముసుకొని  పడుకోండి" అంటూ హుకుం జారీచేసి బీరువాలో ప్రొద్దున్నే కట్టుకోవాల్సిన చీర మ్యాచింగ్ బ్లౌజ్ వెతకడంలో పడిపోయింది తాయారు.

***

 తెల్లవార్లూ మంచంమీద తాయారు అటూ ఇటూ మెసలడంతో  నిద్రకు కరువై  అప్పుడే కళ్ళు మూతలు పడ్డ సుబ్బారావుకి అలారం మ్రోగడంతో కళ్ళు తెరచి చూసాడు.

ప్రక్కన మంగ లేదు.

అటూ ఇటూ చూసాడు.

స్నానం చేసొచ్చి  పట్టుచీర కట్టుకొంది అప్పటికే. నగలన్నీ దిగేసుకుంటుంటే గట్టిగా కేకలేశాడు సుబ్బారావు.  ఏ దొంగాడో చూస్తే తెంపుకుపోతాడని భయపెట్టాడు. 

 మొగుడి మాటలు వినాలని లేకపోయినా దొంగల భయంతో అయిష్టంగానే కొన్ని నగలు మాత్రమే పెట్టుకుని కొన్ని నగలను ప్రక్కన పెట్టింది. తల దువ్వుకొని పూలు ముడిచింది. ముఖానికి పౌడర్,పెదాలకు లిప్  స్టిక్  పూసుకుంది. మాచింగ్ స్టిక్కర్ బొట్టు బిళ్ళ పెట్టుకుని, బంగారు గాజుల మధ్య మాచింగ్ గాజులు తొడిగింది. అంతకు ముందురోజే క్రొత్తగా కొనుక్కున్న బూట్లు  వేసుకుంది.  హాండ్ బాగ్ తీసుకుని, సెల్ దానిలో వుంచి సుబ్బారావుకి బై బై  చెప్పి

మార్నింగ్ వాక్ కు బయలు దేరింది మంగతాయారు.

****

 అయిదు గంటలకు ముందే వాకింగుకు బయలుదేరిన మంగ ఉదయం ఏడు గంటలు దాటినా  రాకపోయేసరికి సుబ్బారావు కంగారు పడుతున్నాడు.

ఇంటికి అయిదు నిమిషాల దూరం లోనే

పార్కు  వున్నది. అందరూ అక్కడికే  వెళతారు నడకకు.  ఇంతసేపు వాకింగు చేస్తుందా? లేక ఎక్కడైనా పడిపోయిందా?  అని ఆత్రుత పడుతూ పాంటు వేసుకున్నాడు పార్కు దాకా వెళ్ళి చూసొద్దామని.

ఇంతలోనే గసపెడుతూ పరుగులాంటి నడకతో  వచ్చింది మంగతాయారు.

 సుబ్బారావును చూస్తూనే "అమ్మయ్యా !పాంటు వేసుకుని రెడీగానే వున్నారుగా. తొందరగా పెద్ద బజారులో క్రొత్తగా పెట్టిన 'గోవిందా గోవిందా' బట్టల షాపుకు వెళదాం పదండి"  అంటూ హడావుడి పెట్టింది.

 సుబ్బారావుకు ఏమీ అర్థం కాలేదు. "ఏడింటికే బట్టల షాపు తీసే తలకు మాసిన వాడెవడు?" అంటూ అడిగాడు.

 "అబ్బా!అవన్నీ దార్లో  చెపుతాగా. ముందు కారు తీయండి. పనిపిల్లను మనం వచ్చేదాకా ఉండమని చెపుతా" అంటూ బెడ్ రూం లోకి దూరింది.

 ఇక తప్పదనుకుంటు షెడ్ లో వున్న కారును బయటకు తీసాడు.

 అయిదు నిమిషాల్లోనే  ఇంకో చీర కట్టి మాచింగుల సరంజామా అంతా మార్చి క్రొత్తగా తయారై వచ్చిన తాయారును చూస్తూ విస్తుపోయాడు సుబ్బారావు.

 "ఏంటలా చూస్తారు?కారు స్టార్ట్ చేయండి" అంటూ భారీ కాయాన్ని  సీటులోకి చేరవేసింది తాయారు.

 దారిలో అసలు విషయం చెప్పింది.

'గోవిందా గోవిందా' అనే   క్రొత్త బట్టల షాపువాడు ఓపెనింగ్ ఆఫర్ అని పెట్టాడట.  ఉదయం మొదటగా వచ్చిన ఒక వంద మందికి ఉచిత  చీర అని ఆ ఆఫర్.

ఆ సంగతి విశ్వనాధంగారి భార్య వెంకట్రావమ్మ ఉదయం వాకింగులో కలసి చెప్పిందట.

ప్రొద్దున్నే విశ్వనాథం గారిని బట్టల షాపుకు తరిమి తను వాకింగ్ కు వచ్చిందట. అప్పటికే ఎంత మందికి చెప్పిందో, ఎంతమంది బట్టల షాప్ కు వెళ్ళా రో అని బెంగపడిపోయింది తాయారు.

 "ఇంతకూ ఎంత దూరం నడిచావు?" సుబ్బారావు అడిగాడు.

 "ఎంతదూరమోనా? పార్కుకు వెళ్ళగానే పక్కింటి పాపాయమ్మ కనిపించి నా చీరను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ  'ఎక్కడ కొన్నారు ఈ చీర? మొన్న మా పని మనిషి కూడా ఇలాంటి చీరే కట్టుకొచ్చింది.' అంటూ  దీర్ఘం తీసేసరికి నాకు వొళ్ళు మండి నాలుగు దులిపేసాను.

చుట్టూ వున్న నలుగురూ ఆడంగులు చేరి చీర మీద డిస్కషన్ మొదలు పెట్టారు. ఇవన్నీ జరుగుతూ వుండగానే వెంకట్రావమ్మ వచ్చింది అక్కడికి.ఈ విషయం చెప్పగానే వాకింగ్ రేపు అయినా చెయ్యొచ్చు లే, చీర రేపు ఉచితంగా ఇవ్వరు కదా అని ఇంటికి వచ్చా." అంది తాయారు ఘనకార్యం చేసిన లెవల్ లో.

సుబ్బారావుకు వొళ్ళు మండిపోయినా తాయారును పైకి ఏమీ అనలేక మనసులోనే తిట్టుకున్నాడు.

 బట్టల షాపు దగ్గరకు చేరేసరికి చేంతాడంత క్యూ వుంది. "నాకు ఓపిక లేదు. నువ్వు వెళితే వెళ్లు. లేదంటే ఇంటికి పోదాం." అన్నాడు సుబ్బారావు కారు ఆపుతూ.

 "ఇంత దూరం వచ్చి చీర తీసుకోకుండా  వెనక్కు వెళితే ఎంత అవమానం. మీరిక్కడే ఉండండి" అంటూ మంగతాయారు కారు దిగి,  కొంగు బిగించి యుద్ధానికి వెళ్ళే వీర నారీ మణిలా ముందుకు నడిచింది.

 కారు ప్రక్కకు తీసి పార్క్  చేసి, అటుప్రక్కనె ఉన్న ఉడిపి హోటల్ లో దూరి  ఉల్లిపాయ ఉప్మా పెసరట్టు  లాగించి, ఫిల్టర్ కాఫీ సేవించి తిరిగి కారు దగ్గరకు వచ్చాడు సుబ్బారావు.

 మరో అరగంటకు  మంగతాయారు వచ్చింది. ఇష్టపడి కట్టుకున్న చీరంతా నలిగిపోయి,కష్టపడి వేసుకున్న మేకప్ చెరిగిపోయి, ఆయాసపడుతూ, క్షతగాత్ర సైనికురాలిగా...   అయితేనేం విజయం మనదే అనే రీతిలో ముఖాన చిరునవ్వు, చేతిలో చీరతో దర్శనమిచ్చింది.

 తీరా  చీర విప్పిచూస్తే వొట్టి నాసిరకం. ఉచితం అంటే ఇంతే ననిపించేలా వుంది ఆ చీర సొగసు.  తాయారు  యింట్లో కూడా అలాంటి చీర కట్టదు అనిపించింది సుబ్బారావుకు.

 "మరేం ఫర్వాలేదు. మన పనమ్మాయి ఒక చీర ఇవ్వమని ఎప్పటినుండో అడుగుతుంది.ఈ క్రొత్త చీరను  దానికిద్దాం. సంతోషిస్తుంది." అంది తాయారు తెలివిగా.

పనిపిల్ల లక్ష్మి చచ్చినా కూడా ఈ చీర తీసుకోదు అనిపించింది   సుబ్బారావుకి. కానీ పైకి అనలేదు.

"ఏమండీ ఈ చీరలు తీసుకున్న వందమందికి  స్పెషల్ గా షాప్ యిప్పుడే చూపిస్తారంట. చూసొద్దామండీ." అంది తాయారు గోముగా. సరేననక తప్పలేదు మూగజీవి సుబ్బారావుకు.

ఇద్దరు షాపు లోపలికి వెళ్ళారు.కళ్ళు

జిగేల్ మనిపించే విద్యుద్దీప కాంతులలో మరింత జిగేల్ మనిపించె రంగు రంగుల పట్టు చీరలు.

ఒకదానిని మించి ఒకటికనపడుతున్నాయి.

కౌంటర్ లో ఉన్న సుందరీమణులు "మేడమ్ ,ఈ చీర చూడండి" అంటూ పిలుస్తున్నారు  కోకిల స్వరాలతో.

 "అబ్బే ! మేం కొనటానికి రాలేదండి. వొట్టిగా చూసిపోవడానికే వచ్చాము" అని తాయారు అంటుండగానే "మేం కూడా కొనమని అనటం లేదు మేడమ్. చూడమనే చెపుతున్నాం" అంటూ తీయతీయని  వశీకరణ  మాటలతో తాయారును కౌంటరు వైపు లాగేసారు కౌంటర్లో వున్న సేల్స్ గర్ల్స్.

చల్లటి ఆపిల్ జ్యుస్ తెప్పించారు తాగటానికి. మొదటిరోజు ప్రతీ చీరపై భారీ తగ్గింపు అని ఊదరబెట్టారు.

 తాయారు చేతిలో మూడు పట్టుచీరెలు,  సుబ్బారావు క్రెడిట్ కార్డులో ఎనభయ్ వేలు కోతతో  మూడు గంటలు పట్టింది షాపు నుండి బయటకు రావటానికి.

****

తెల్లవారి మళ్ళీ నాలుగు గంటలకే లేచి తాయారు తయారవుతుంటే "మంగా ,ఈ రోజన్నా శుభ్రంగా వాకింగు చేసి రా. ఎవరిదగ్గరా ఆగి ముచ్చట్లు చెప్పొద్దు.  నీ ఆరోగ్యం  ముఖ్యం. ముందు దాని సంగతి చూసుకో. కనీసం ఒక గంటన్నా కుదురుగా నడచి రా" అని చిలక్కి చెప్పినట్లు చెప్పి పంపించాడు సుబ్బారావు.  

సరేనని బుర్ర ఊపి బయలుదేరింది మంగతాయారు మార్నింగ్ వాక్ కు.

సుబ్బారావుకు అనుమానమే. అసలు తను చెప్పింది వింటుందా అని.

 ఎనిమిది అవుతుండగా వచ్చింది తాయారు దివ్యమైన తేజస్సు నింపుకుని. "ఏమండీ ఈ రోజు చిన్న బజార్లో  'పసిడి కళ ' బంగారు నగల దుకాణం ఓపెనింగ్ అట. శ్రావణ మాసం సందర్భంగా అనేక ఆఫర్స్ వున్నాయట" 

అని తాయారు తన్మయత్వంతో సగం కళ్ళు మూసుకుని  చెపుతుండగానే ధడేల్ మనే శబ్దం వినిపించి భయంగా పక్కకు దూకింది తాయారు. యెదురుగా సుబ్బారావు కనపడలేదు.  "ఏమండీ" అంటూ అటూ ఇటూ చూసింది. ఎక్కడా కనపడలేదు. క్రిందకు చూసింది. పాపం బడుగు జీవుడు సుబ్బారావు క్రిందపడిపోయి మూర్చపోయాడు అప్పటికే. 

 

No comments:

Post a Comment

Pages