నరులార నేడువో నారసింహజయంతి
డా.తాడేపల్లి పతంజలి
పల్లవి:
నరులార నేడువో నారసింహజయంతి
సురలకు నానందమై శుభములొసగెను
చ.1:
సందించి వైశాఖ శుద్ద చతుర్దశి శనివార -
మందు సంధ్యాకాలమున నౌభళేశుడు
పొందుగాగంభములోనబొడమి కడపమీద
కందువ గోళ్ళజించెగనక కశిపుని
చ.2:
నరమృగ నానాహస్తముల
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమబ్రహ్లాదునిగాచిరక్షించి నిలిచె
గురుతర బ్రహ్మాండ గుహలోనను
చ.3:
కాంచనపు గద్దె మీద గక్కనగొలువై యుండి
మించుగ నిందిర దొడమీద బెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచనసేయక మంచివరాలిచ్చీనదివో
భావం
పల్లవి:
నరులారా ! నేడు నరసింహజయంతి.( వైశాఖ శుక్ల చతుర్దశి)
దేవతలకు ఆనందాన్ని ఇస్తూ ఈ నరసింహజయంతి శుభములు ప్రసాదిస్తోంది.
చ.1:
వైశాఖ శుద్ద చతుర్దశి శనివారమునాడు సంధ్యాకాలమున అహోబలక్షేత్రంలో వెలసిననరసింహస్వామి స్తంభములోన పుట్టి గడపమీద సామర్థ్యముతో హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చాడు.
చ.2:
మానవుడు, సింహమురూపములతో కలిసి, అనేక హస్తములతో, అరుదైన శంఖము,చక్రము మొదలైన ఆయుధాలతో, గొప్పగా ప్రహ్లాదుని రక్షించి, నేడు అహోబలంలో గొప్పదైన బ్రహ్మాండమను గుహలోన నిలిచాడు.
చ.3:
ఇందిరను (లక్ష్మీదేవిని) తొడమీద పెట్టుకొని ప్రకాశిస్తూ. నరసింహస్వామి బంగారపు గద్దె మీద కొలువై ఉన్నాడు.
No comments:
Post a Comment