అత్తగారిల్లు
టి. వి. యెల్. గాయత్రి
ఉదయం పదిగంటలు.
గాఢనిద్రలో ఉంది భావన. సెల్ ఫోన్ మ్రోగింది. బద్ధకంగా చూసింది. అమ్మ.
"ఏమిటి?"అంది ఆవులిస్తూ.
"నిద్ర లేచావా?"అడిగింది రాగిణి.
"ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా!చెప్పు!"
"కాస్త ఫ్రెష్ అయ్యిరా!నీతో మాట్లాడాలి!"
"ఇప్పుడేనా అమ్మా!కాసేపు పడుకోనీ!"గునుస్తూ అంది భావన.
"నువ్వు లేచాక నాకు ఫోన్ చెయ్యి!మాట్లాడాలి నీతో!ఓకేనా!"అంటూ ఫోన్ పెట్టేసింది రాగిణి.
భావన ప్రక్కన చూసింది. విశాల్ నిద్రపోతున్నాడు. భావనకు విశాలుతో పెళ్లయింది. పెళ్లయ్యాక మూడు నిద్దర్ల తర్వాత ఇద్దరూ హనీమూనుకు కేరళ వచ్చారు.ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి.అక్కడ విశాల్ తల్లి తండ్రులు హిమబిందు,రఘురాములు ఉన్నారు. విశాల్ ఉద్యోగం బెంగుళూరులో. భావన తల్లి తండ్రులు రాగిణి, మోహనులు. భావన, విశాలుది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి రాజమండ్రిలో జరిగింది. ఈ పదిరోజుల హనీమూన్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు.
స్నానం చేసి వచ్చింది భావన. విశాల్ ని తట్టి లేపింది.
"అబ్బా!"అంటూ ఇటు తిరిగి ఉషోదయాన విరిసిన ముద్ద మందారంలా మెరిసి పోతున్న భార్యను గట్టిగా దగ్గరికి తీసికొని ముద్దు పెట్టుకున్నాడు. అతడి పట్టు వదిలించుకొని
"ముందు స్నానం చేసి రండి విశాల్!నాకు ఆకలేస్తుంది."అంది గారాబంగా.
"తప్పదా!"
"తప్పదు!కదలండి!"అంటూ అతడిని లేపింది.
విశాల్ బాత్ రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది. చుట్టూ చెట్లు. రమణీయమైన ప్రకృతి.
'అమ్మ ఫోన్ చెయ్యమంది కదా!'అనుకొని తల్లికి ఫోన్ చేసింది.
"నేను చెప్పింది శ్రద్ధగా విను!"
"వింటున్నాను చెప్పమ్మా!"
"మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళ్తున్నారు కదా!అక్కడ ఉన్న నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండు!పెళ్లి కుదరటం, హడావుడి, పెళ్లి పనులు, వెంటవెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో సావకాశంగా మాట్లాడటానికి కుదరలేదు.మీ అత్తగారు నాలాగా ఇంట్లో ఉండదు. ఉద్యోగం చేస్తోంది కదా! కొంచెం అధికారం చలాయించే మనస్తత్వంలాగా ఉంది.అక్కడున్నన్ని రోజులూ నైటీ వేసుకోకు!వాళ్ళ పద్ధతులు అవీ చూడు!జీన్స్, టీ షర్ట్స్ వేసుకోకు!పంజాబీ డ్రస్సులే వేసుకో!అలారం పెట్టుకొని ఏడింటికే నిద్రలే!బద్ధకంగా తిరగకు!మంగళ సూత్రాలు వేసుకో!దిండుక్రింద పెట్టి మర్చిపోకు!డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను!సోఫాలో కూర్చుని తినకు!... ఇంకా గుర్తు రావటం లేదు. వస్తే చెప్తాను!..."
"అలాగే అమ్మా!నువ్వు వర్రీ పడకు!నేను జాగ్రత్తగా ఉంటాను."
"విసుక్కోకు!వాళ్ళ దృష్టిలో మంచి పిల్లవనే భావన రావాలి కదా!నేను చెప్పినవేవీ కష్టమైనవి కాదు. కాస్త శ్రద్ధ పెట్టాలి!ఈ నెల్లో పెళ్లి చేసుకొని పై నెల్లో విడాకులు తీసికొంటున్నారు. నువ్వు ఆ జాబితాలో చేరకూడదని నా ఆరాటం. కొంచెం సర్దుకుపోతే చాలు!అతడు పెళ్లిలో నెమ్మదిగానే కనిపించాడు.ఈ పది రోజుల్లో నిన్నేమన్నా హర్ట్
చేసేటట్లు మాట్లాడుతున్నాడా?"
"అదేమీ లేదమ్మా!బాగానే ఉన్నాడు. ఇప్పుడే కదా పెళ్లయ్యింది. తర్వాత తర్వాత తెలుస్తుంది. ఇప్పటికి ఫర్వాలేదు. "
"నువ్వు భయపడకు!కానీ జాగ్రత్తగా ఉండు!"రాగిణి కంఠంలో దిగులు ధ్వనించింది.
"దిగులు పడకమ్మా!నేను బాగానే మేనేజ్ చేస్తాను."తల్లికి బదులిచ్చింది భావన.
"ఆ... మర్చిపోయాను. బొట్టు పెట్టుకో!పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో!నీ సూట్ కేస్ లో ఉంటాయి చూడు!"
నవ్వింది భావన.తల్లి ఆరాటం అర్థం అవుతోంది.
రూంలోకి వచ్చాడు విశాల్.
"అమ్మా!మళ్ళీ చేస్తాను!విశాల్ వచ్చాడు. నువ్వు దిగులు పడకు!అంటూ ఫోన్ పెట్టేసింది.
పెళ్లి చూపుల దగ్గర్నుంచి పెళ్లిదాకా హడావుడి. భావన, విశాల్ పెళ్లిలోపల అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ ఉన్నాకూడా భావనకు పెళ్లి అంటే కొంచెం భయంగా, దిగులుగా ఉంది. అమ్మా, నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు. భర్తతో కలిసి బ్రతకడం.. తనకు విలువ ఇస్తాడో? ఇవ్వడో? అతడి అలవాట్లు, వ్యక్తిత్వం ఎలా వుంటాయో అనే భయం పీడిస్తూనే ఉంది. ఇగో క్రాష్ వస్తే ఎలాగ? ఎన్నో అనుమానాలు... ఇంకెన్నో సందేహాలూ మనసుని పీడిస్తూ ఉన్నాయి.కొంత ధైర్యంతో, కొంత భయంతో పెళ్లి చేసుకొంది. పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికెనవేలు పట్టుకొని వివాహం అనే బంధంతో తన వాళ్ళను వదిలి అతడి జీవితభాగస్వామిగా అడుగు ముందుకు వెయ్యాలంటే సహజంగా కలిగే బెంగ భావన మనసులో మెదులుతూనే ఉన్నాకూడా ఈ హనీమూన్ ట్రిప్పులో విశాల్ ప్రవర్తన ఆమెకు కొద్దికొద్దిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది.
విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించటం, ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినటం, ఆమెతో శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెలిమి కోసం ఆరాటపడటం భావనలో అతడిపట్ల ఇష్టాన్ని కలుగచేస్తూఉంది.
సాయంత్రం ట్రివేండ్రంలో విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చారు విశాల్, భావనలు.
విమానాశ్రయం నుండి ఇల్లు చేరేసరికి రాత్రి ఎనిమిదయ్యింది.
ఇంటికి రాంగానే పిల్లలకు ఎఱ్ఱనీళ్లతో దిష్టి తీసింది హిమబిందు.
"మీరు వెళ్లి స్నానాలు చేసి రండి!భోంచేద్దాం!"అన్నాడు రఘురామ్.
భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది.
ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ నలుగురూ భోజనం చేశారు. అత్తగారికి, మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన. ఇద్దరూ మెచ్చుకొన్నారు.
"మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాము. అప్పుడు విశాల్, వినోద్ చాలా చిన్న పిల్లలు. అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది."అంది హిమబిందు.
హిమబిందు ఒక పేరున్న కళాశాలలో ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తోంది . ఇంకా రెండేళ్లు సర్వీసు ఉంది. రఘురామ్ ఇరిగేషన్ డిపార్ట్మెంటులో సీనియర్ ఆఫీసరుగా చేసి రిటైర్ అయ్యాడు.
రాత్రి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు. తెల్లవారి ఆరింటికి అలారం పెట్టుకొని పడుకుంది భావన.
తెల్లవారి ఆరింటికి లేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న బట్టలు చూసింది. హనీమూన్ లో తిరగటానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్ తో గడిపింది.పంజాబీ డ్రస్సులు, చీరలు కూడా ఉన్నాయి.
'చీర కట్టుకోనా!లేక పంజాబీ డ్రస్సా?'అని అనుకుంటూ ఒక షిఫాన్ చీర తీసింది. లేత పింక్ చీర మీద ఆకుపచ్చ లతలు, ఎరుపు పూలు ఉన్నాయి.
'ఇది బాగుంటుందిలే 'అనుకొని చీర కట్టుకొంది. పెళ్ళికి ముందే చీరలు కట్టుకోవటం నేర్చుకుంది. ఎక్కడ జారిపోతుందో అని భయం.అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది. జడ వేసుకొంది. సూట్ కేసులో పెట్టిన క్రొత్త మంగళ సూత్రాలు మెళ్ళో వేసుకొంది.పసుపు పచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి. బొట్టు పెట్టుకొని, పాపిట్లో సింధూరం కూడా పెట్టింది. రెండు చేతులకూ గాజులు కూడా వేసుకుంది.
అంతా అయ్యాక అద్దంలో చూసుకొంది భావన.
'ఎంత ముద్దొస్తున్నావ్ భావనా!'అనుకుంటూ ఓరగా విశాల్ వైపు చూసింది. నిద్ర పోతున్నాడు. అతడిని లేపుదామనుకొని 'వద్దులే 'అనుకొని టైము చూసింది. ఏడు గంటలు. తలుపు తీసికొని హాల్లోకి వచ్చింది.
సోఫాలో కూర్చుని పేపర్ చదువుతోంది హిమబిందు.
"అప్పుడే లేచేశావా!ఇంకొంచెం సేపు పడుకోలేక పోయావా!ఇంత త్వరగా లేచి ఏం చెయ్యాలి?"అంది కోడలిని మురిపెంగా చూస్తూ.
నవ్వింది భావన.
"చీర బాగుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు. నీకు చీరలు కట్టుకోవటం వచ్చా?"
"ఇప్పుడిప్పుడే కట్టుకోవటం నేర్చుకుంటున్నాను "అంది భావన.
"ఈ రోజు రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను. తర్వాత శని, ఆది వారాలు ఎలాగూ సెలవే కదా!కాసేపు మీతో గడిపినట్లు ఉంటుంది."
"మామయ్య గారేరి?"అడిగింది భావన.
"మేడమీద మొక్కల దగ్గర ఉంటారు. పొద్దున్నే లేచి మొక్కలను చూడందే ఆయనకు తోచదు. నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్ వంట ఎనిమిదింటికల్లా చేసి కాలేజీకి వెళ్లిపోతాను. కొరవ సవర ఉంటే రఘు చేస్తారు. ఈ పూట టమాటో బాత్ చేశాను. వంట కాసేపట్లో అయిపోతుంది."
ఇంతలో కుక్కర్ విజిల్ మోగింది.
"నువ్వు మేడమీదకు వెళ్లి రఘుకు ఈ పేపర్ ఇచ్చి వస్తావా!నేను కాస్తదేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను."అంది హిమబిందు.
"అలాగే!"అంటూ పేపర్ తీసికొని మేడమీదికి వచ్చింది భావన.
రఘురామ్ కూరగాయలు కోస్తున్నాడు.
మొక్కలు అంటే కొద్దిగా పూలమొక్కలు ఉంటాయేమో అనుకుంది భావన కానీ మేడ మొత్తం మొక్కలే. పెద్ద రూఫ్ గార్డెన్ ఉంది అక్కడ. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఔషధమొక్కలు ఇంకా లతలు ఎన్నో. మంచి పరిమళభరితమైన సమీరం మనసును మరిపించింది. అక్కడక్కడా చక్కర్లు కొడుతున్న సీతాకోక చిలుకలు, పసుపు రంగు పిట్టలు, పిచ్చుకలు... రమ్యంగా ఉంది తోట.
విశాల్ లో తండ్రి పోలికలు ఎక్కువ. కనుముక్కు తీరు అంతా తండ్రి ముక్కులోంచి ఊడిపడ్డట్టుగా ఉంటాడు. చిన్న కొడుకు వినోద్ తల్లి పోలిక.
కోడలిని చూడంగానే "రామ్మా!అప్పుడే లేచేశావా!"అన్నాడు ఆప్యాయంగా.
అవునన్నట్లు నవ్వింది భావన.
అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టాడేమో నేలంతా తడితడిగా ఉంది.
"జాగ్రత్త తల్లీ!జారిపడకుండా నడువు!"అన్నాడు రఘురామ్.
అక్కడ ఒక వైపు చెక్క ఉయ్యాల ఉంది. ఉయ్యాల గొలుసులకు దట్టంగా మాధవీలత అల్లించి ఉంది.
"అక్కడ కూర్చుందాం!"అంటూ ఉయ్యాలను చూపించాడు.
జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది. గుత్తులు గుత్తులుగా ఉయ్యాల గొలుసుల నిండా పూలు. నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు. చిన్న డిష్షులో లేత లేత వంకాయలు పట్టుకొని ఉయ్యాల మీద కూర్చున్నాడు రఘురామ్.
"ఇలా కూర్చోమ్మా!"
చీర పైకి పట్టుకొని కూర్చుంది భావన.
"రిటైర్ అయ్యిన దగ్గర్నుంచి ఈ తోట పెంచుతున్నాను. పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట తోటపనికి కేటాయిస్తే చాలు!"
"చాలా బాగుంది తోట.ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు."ప్రశంసించింది భావన.
"పెద్ద కష్టం కాదు. నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసికొన్నాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ ట్రైనింగుకు వెళ్తుంటాను. వాళ్ళు సూచనలు ఇస్తారు. మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. పక్కింటి వాళ్ళకూ, ఎదురింటి వాళ్ళకూ పంపిస్తాను. మీ అత్తయ్యకు కాలేజీ పనితోనే సరిపోతుంది. నేను ఈ రెండేళ్లలో వంట నేర్చుకున్నాను. ఈ రోజు నేను చేసిన కూర తిందువు గానీ!నీకు ఏ కూర అంటే ఇష్టం?"
"ఏమైనా తింటాను."మొహమాటంగా అంది భావన.
"అలా అంటే కుదరదు. మొహమాట పడకు!"
ఊ ''' మీకు బాగా వచ్చిన కూర ఏదైనా... నేను కూడా చేస్తాను. "
"నీకు వంట వచ్చా?"
"అంత రాదు..."నసిగింది భావన.
నవ్వాడు రఘురామ్.
"పెళ్లయిన కొత్తల్లో బిందూకు కూడా వంట అస్సలు రాదు. రకరకాల ప్రయోగాలు చేసేది. నీకు అన్ని కూరలు ఎలా చెయ్యాలో పుస్తకంలో వ్రాసి పెట్టాను. అది తీసికెళ్ళు!ఆ కొలతలతో ఇద్దరూ చేసుకోండి!ఇక్కడ మాత్రం నేను, బిందు చేసిపెడతాము. సాంబారు, మజ్జిగ పులుసు, పిండిమిరియం ఇవన్నీ నా స్పెషల్స్. ఈ రోజు బిందూని పప్పు, అన్నం మాత్రం వండమన్నాను. నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా!నీ కోసం ఏం చెయ్యను?"
రఘురామ్ అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భావనకు.
"ఒకే!నువ్వు మొహమాట పడుతున్నావు. పిండి మిరియం, చారు, గుత్తివంకాయకూర చేస్తాను. సరేనా!"
తలఊపింది బావన.
"ఇంకో విషయం విను!నువ్వు మరీ ఫ్యాన్సీ డ్రెస్సు కాంపిటీషనుకు వచ్చినట్లు చీర కట్టుకొని రాకపోయినా ఫర్వాలేదు. నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో!ఈ చీర అలవాటు లేక ఎక్కడన్నా జారి పడితే అది ఇంకా కష్టం కదా!"నవ్వాడు రఘురామ్.
పెద్దగా నవ్వింది భావన.
"నువ్వు నీలాగా ఉండు!పెళ్లవంగానే నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు!"
'సరే!'అన్నట్లు తల ఊపింది భావన.
రఘురామ్ తోటలో ఉన్న ఔషధమొక్కల గురించి, వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు.
ఇంతలో రఘురామ్ సెల్ ఫోన్ మోగింది.
"చూడు!గంట దాటి పోయింది. బిందూ పిలుస్తోంది. పద!కిందికి వెళ్దాము!"
ఇద్దరు కలిసి క్రిందికి వచ్చారు.
అప్పటికి విశాల్ లేచి స్నానం చేసి ఉన్నాడు. భావనను చూడంగానే అతడి కళ్ళు మెరిశాయి.
అందరూ కలిసి టిఫిన్ తిన్నారు.
హిమబిందు పెళ్ళి ఆల్బమ్స్ వచ్చాయని తీసికొని వచ్చింది. నలుగురూ కలిసి సరదాగా పెళ్ళి ఫోటోలు చూసారు. హిమబిందు లేచి టీ కలిపి తీసికొని వచ్చింది
భావన మొహమాట పడింది.
"నేను కలిపేదాన్ని కదా అత్తయ్యా!"అంది
"బెంగుళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి. ఇక్కడైనా కాస్త రెస్టుగా ఉండు!"నవ్వింది హిమబిందు.
రఘురామ్, విశాల్ వేసే ఛలోక్తులతో ఆ పూట గడిచింది.
భోజనాలకు కూర్చున్నారు నలుగురు.
నిజంగానే గుత్తివంకాయ కూర చాలా బాగుంది. పిండిమిరియం కొత్త రకం రుచితో చాలా బాగుంది. చారు అమోఘం.పాయసం, బజ్జీలు. కొత్త కోడలికి కొసరికొసరి వడ్డించింది హిమబిందు.
అత్తగారింట్లో కాస్త బెరుకు తగ్గింది భావనకు.
భోజనాలయ్యాక రఘురామ్,విశాల్ కారు సర్వీసింగుకు ఇచ్చి వస్తామని బయటికి వెళ్లారు.
అత్తాకోడళ్ళు కబుర్లలో పడ్డారు.
"ఎలా ఉంది కొత్త జీవితం?ఎలా ఉన్నాడు విశాల్? నీకు నచ్చాడా?"
హిమబిందు నవ్వుతూ అడిగే సరికి సిగ్గుపడింది భావన.
"మీరు ఒకరికొకరు కొత్త. అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. నేను ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలకు పాఠాలు చెప్పటమే నా పని. నేను పాఠం చెప్తున్నాననుకోకు!పెళ్లయిన కొత్తల్లో భార్యా భర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది. కొత్త మోజు అంటారు కదా!అదే! తర్వాత తర్వాత ఒకరిలో ఉండే లోపాలు ఇంకొకరికి తెలుస్తూ ఉంటాయి. ఇగో హర్ట్ అయ్యిందనో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో చిన్న చిన్న గొడవలతో మొదలై అవే పెద్ద అగాధాలుగా మారి విడాకుల దాకా వెళ్తున్నాయి. ఎక్కువగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్లల్లో విడాకుల శాతం ఎక్కువగా ఉంది. ఎందుకని?పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకటం, కనీసం అలవాట్లు, అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవటం, హడావుడి పెళ్లిళ్లు, ఒకరి మీద ఇంకొకరి ఆధిపత్యం కోసం నిరంతర ప్రయత్నం. వెరసి విడాకులకు పరిగెత్తటం.
భార్యాభర్తల మధ్య కావాల్సింది ప్రేమ, నమ్మకం, ఒకరి పట్ల ఒకరికి విలువ, గౌరవం. వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి. కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు.
నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా, మా ఆయనను, పిల్లల్ని చూసుకున్నాను. కొద్ది పాటి సర్దుబాటు మనకు ఎప్పుడూ ఉంటుంది. మనం ఆడవాళ్ళం. మగవాళ్ళకంటే మనలో ఓర్పు సహనం సహజంగా ఎక్కువే ఉంటాయి. అలా అని అన్నింటికీ భర్త ముందు దిగజారిపోనవసరం లేదు. ఒక్కోసారి గట్టిగా మన అభిప్రాయాలు చెప్పే స్వతంత్రం ఉండాలి. మరొకసారి కాస్త తగ్గి ఉన్నా ఫర్వాలేదు. అమ్మ, నాన్న విసుక్కుంటే వాళ్ళని వదిలివేయం కదా!అలాగే భర్త విషయంలో కూడా ఆలోచించాలి. మరీ మనల్ని వాడుకుంటూ ఉంటే మాత్రం సీరియస్ గా తీసికోవాలి.
విశాల్ కు కూడా ఇలాగే పాఠాలు చెప్తూ వస్తున్నాను. నీ విషయంలో వాడు అధికారం చెలాయిస్తాడని భయపడకు!ఒక వేళ ఏమన్నా క్రాష్ వస్తే సమస్యకు మూలమేమిటో ఆలోచించండి!ఇద్దరూ చర్చించుకోండి!నాకు తెలిసి వాడు నిన్ను బాధ్యతగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. నువ్వు కూడా నెమ్మదైన పిల్లవు.... "
ఆగింది హిమబిందు.
"నాకు కొంచెం భయంగా ఉంది అత్తయ్యా!ఉద్యోగం చేస్తూ, ఇల్లు చూసుకోవాలంటే ఎలాగా అనిపిస్తోంది. విశాల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది. నేను మాట్లాడాను. తను సపోర్ట్ ఇస్తానన్నాడు... కానీ..."
"ఇద్దరూ ఏమేమి పనులు చెయ్యాలో విభజించుకోండి!కాస్త అటూ ఇటూ అయినా కలిసి చేసుకోండి!డబ్బు విషయంలో కూడా. క్రమశిక్షణ చాలా అవసరం. ఇద్దరూ మాట్లాడుకొని అమలు చేయండి!సాధ్యమైనంతవరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి."
అత్తగారి మాటలు వింటుంటే ఒక విషయం అర్థం అయింది భావనకు. హిమబిందు చాలా గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళ. అలా ఉండటం తనకు చేత అవుతుందా!తనకు మొహమాటం ఎక్కువ. ఎవరితోనైనా గట్టిగా మాట్లాడటం అస్సలు చేతకాదు. తల్లి తండ్రుల చాటున ముద్దుగా పెరగటంతో పెద్దగా ఎవ్వరితోనూ ఘర్షణ అన్నది రాలేదు. ఇప్పుడు ఇది పెళ్ళి. అమ్మ, నాన్న చూసుకున్నట్లు ముద్దుగా గారాబంగా ఎవరు చూసుకుంటారు?
భావన ఆలోచిస్తూ ఉండటంతో మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టింది హిమబిందు.
"ముందు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకో!దానికి సంబంధించి నేను చెప్పటం కంటే రెండు మూడు పుస్తకాలు ఉన్నాయి. చాలా చిన్నవే.' నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి? ఇతరులను ఎలా గెల్చుకోవాలి?' అనే వ్యక్తిత్వవికాస పుస్తకాలు. మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, మన గౌరవానికి భంగం కలగకుండా జీవితభాగస్వామితో ఎలా మెలగాలో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది."
హిమబిందు లేచి తన బెడ్ రూంలో రాక్ లో ఉన్న పుస్తకాలు రెండు తెచ్చి భావనకు ఇచ్చింది.
ఇంతలో బెల్ మోగింది.
రఘురామ్, విశాల్ వచ్చారు.
సాయంత్రం విశాల్ తో బెంగుళూరులో పెట్టబోయే సంసారానికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవటానికి వెళ్ళింది భావన. వీళ్ళు వచ్చేసరికి రాత్రి ఎనిమిదయ్యింది. తిరిగి తిరిగి షాపింగ్ చెయ్యటం వలన పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారు విశాల్, భావనలు.
రెండో రోజు పంజాబీ డ్రెస్ వేసుకొంది భావన.ఫలహారాలు చేసి యాదగిరిగుట్టకు వెళ్దామన్నాడు రఘురామ్.
పొద్దున్నే పులిహోర, దధ్యోజనం వడలు చేశారు రఘురామ్, హిమబిందులు.
తినటానికి అన్నీ పెట్టుకొని బయల్దేరారు నలుగురు.
పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పెద్దవాళ్ళుకూడా పిల్లల్లాగా మారిపోయారు.
అప్పుడప్పుడు రఘురామ్ తమ పెళ్లయిన కొత్తల్లో ఎలా ఉండే వారో, ఇద్దరికీ మధ్య వచ్చే చికాకులు, కలహాలు ఎలా ఉండేవో, పిల్లలు పుట్టాక ఎలా చూసుకుంటూ ఇద్దరూ ఎలా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళో చెప్తూ ఉన్నాడు.
ఆ రోజంతా సరదాగా గడిచింది.
మూడో రోజు విశాల్ తమ్ముడు వినోద్ వచ్చాడు. అతడు అన్న పెళ్లయ్యాక ఢిల్లీ వెళ్ళాడు. అతడక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. విశాల్, వినోదుల సరదా కబుర్లతో గడిచింది.
మధ్యలో హిమబిందు భావనను తీసికొని బజారు వెళ్లి రాగిణికి మోహనుకు బట్టలు తీసికొంది. అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చరంగు గద్వాల్ చీర సెలెక్ట్ చేసింది భావన.
అలా బజారులో అత్తగారితో తిరిగుతూ మాట్లాడటం భావనకు చాలా అనందాన్ని కలిగించింది.
ఇంటికి వస్తూ ఉంటే ఐస్క్రీమ్ షాప్ దగ్గర ఆగారిద్దరు.
ఎప్పుడన్నా తల్లి తండ్రులతో బయటికి వెళ్తే ఐస్ క్రీమ్ తినిరావటం అలవాటు భావనకు.
'అత్తగారు పిల్లల సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తారు '. అనుకొంది భావన.
నాలుగోరోజు. ఆ రోజు సాయంత్రం గోదావరిలో రాజమండ్రికి భావన తిరిగి వెళ్ళాలి.
ఆరోజు రాత్రికే విమానంలో విశాల్ బెంగుళూరు వెళ్తున్నాడు. భావనను పదిరోజుల తర్వాత బెంగుళూరులో దిగబెట్టే ఏర్పాటు చేసుకున్నారు మోహన్, రాగిణులు.
పదిరోజుల సాన్నిహిత్యంతోనే భర్తని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంది భావనకు. పిల్లలకు ఏకాంతం కల్పిస్తూనే కోడలితో మాట్లాడుతూ ఉంది హిమబిందు.
"మరీ ఏమైనా ప్రాబ్లెమ్ వస్తే ఒక స్నేహితురాలు ఉంది అనుకొని నాతో చెప్పు!అత్తగారిని అనుకోకు!నాతో ఫ్రీ గా ఉండు!మొహమాట పడకు!"అంది హిమబిందు.
రఘురామ్ కోడలి దగ్గరికి వచ్చాడు.
"మాకు కూతుళ్లు లేరు. కోడళ్ళనే కూతుర్లుగా భావిస్తాము. నీకు తీరిక ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు!మన మధ్య ఎటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు. నేను కూడా నీ ఫ్రెండ్ ని అనుకో!సంకోచాలు అసలే వద్దు!వీడితో కూడా నువ్వు ఏమనుకుంటున్నావో చెబుతూ ఉండు!కమ్యూనికేషన్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోండి!"
అత్తమామల పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు పొందింది భావన.
సాయంత్రం భావనకు వీడ్కోలు చెప్పటానికి అందరూ స్టేషనుకు వచ్చారు.
ట్రైన్ కదిలే దాకా భావన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు విశాల్. బెంగుళూరులో ఒక్కడే భావన లేకుండా రాబోయే పది రోజులు ఎలా గడపాలి అనే బెంగ అతడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ట్రైన్ కదిలింది.
'వీళ్ళందరూ తన వాళ్ళు 'అనుకుంటూ దూరమవుతున్న భర్తను, అత్తమామల్ని, మరిదిని చూస్తూ సీట్లో జారగిలపడింది భావన.
అత్తగారిల్లు ఎలా ఉంటుందో అని భయపడిన భావనకు అత్త మామల ప్రవర్తన కొంత ధైర్యాన్ని ఇస్తోంది. తల్లి తండ్రులు, అత్తమామలు కలిసి చేసిన పెళ్ళి. ఆ పెళ్లిని చిన్నతనంతో, అవగాహనా రాహిత్యంతో తామిద్దరూ ఎక్కడ కూలగొట్టుకుంటామో అనే ఆరాటంతో ఇరువైపుల పెద్దలూ తమ వంతు బాధ్యతని తాము నిర్వర్తిస్తున్నారు. ఇక ముందుకు వెళ్తూ సజావుగా సంసార నౌకను నడిపించే బాధ్యత తమ ఇద్దరి పైనా ఉంది.
భావనకు ఇప్పుడు నమ్మకంగా ఉంది. విశాల్ తో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు ఆమె మెడలో పచ్చని మంగళ సూత్రం ఆమె హృదయానికి దగ్గరగా తళుకులీనుతూ ఆమెలో భద్రతాభావాన్ని పెంచుతోంది.
రైలు వేగం పుంజుకొంది.
***
No comments:
Post a Comment