"బంగారు" ద్వీపం (అనువాద నవల) -16
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(భోజనాల దగ్గర పిల్లలు ఫానీకి బంగారు ద్వీపంలో తమ అనుభవాల గురించి చెబుతారు. మరునాడు ఉదయం జూలియన్ ముందుగా లేచి, మిగిలినవాళ్ళను లేపుతాడు. తెల్లవారుఝామున వాళ్ళంతా శబ్దం కాకుండా యింటి బయటకొచ్చి సముద్ర తీరానికి చేరుకొంటారు. అన్నె చెప్పినట్లు ఆకాశం ఉతికి విస్త్రీ చేసిన తెల్లని బట్టలా మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంది. అంతకు ముందు రోజు తుఫాను వచ్చిన ఛాయలే లేవు. తరువాత . . .)
@@@@@@@@@@@@@@@@@@@@@@
జార్జి తన పడవను సమీపించింది. అప్పుడు ఆమె టిం ను తీసుకురావటానికి వెళ్ళగా, మిగిలిన పిల్లలు గట్టునున్న పడవను సముద్రంలోకి లాగారు. జాలరి కుర్రాడు ఆల్ఫ్, యింత పొద్దునే జార్జిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను తన తండ్రితో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నాడు. అతను జార్జిని చూసి యికిలించాడు.
"నువ్వు కూడా చేపలు పట్టటానికి వెళ్తున్నావా?" అతను ఆమెను అడిగాడు. "నేను. . . నిన్న తుఫాను వచ్చింది కదా! మీరు దానిలో చిక్కుకున్నారని భావిస్తున్నాను."
"చిక్కుకున్నాం" జార్జి చెప్పింది. "అరె! టిం! రా బాబా!"
ఇంత త్వరగా జార్జిని చూడటం టిం కి చాలా ఆనందం కలిగించింది. ఆమె సముద్రం దగ్గర ఉన్న పిల్లల వైపు పరుగు తీస్తూంటే, టిం దాదాపుగా ఆ అమ్మాయి ముందుకు తూలిపడేట్లుగా, ఆమె కాళ్ళకి అడ్డం పడుతూ గెంతుతున్నాడు. అతను పడవను చూడగానే ఉత్సాహంతో దానిలోకి దూకి, పడవ వెనుకభాగంలో, తన ఎర్రని నాలుకను బయటకు పెట్టి, తోకను విపరీతంగా ఊపుతూ నిలబడ్డాడు.
"ఇదెప్పుడు యిలాగే తోకను ఊపుతుంటుందని భావిస్తున్నాను"అన్నె దాని వైపే చూస్తూ అంది. "తిమోతీ! ఏదో ఒక రోజు అకస్మాత్తుగాఈ తోకను ఊపటం ఆపేస్తావు."
వాళ్ళు ద్వీపానికి బయలుదేరారు. సముద్రం చాలా ప్రశాంతంగా ఉన్నందున ఇప్పుడు పడవను నడపటం చాలా సులభం. వాళ్ళు ద్వీపానికి చేరుకోగానే, దానికి అవతల వైపుకి పడవను నడిపించారు.
అక్కడే ఓడ శకలాలు సూదిగా ఉన్న రాళ్ళపై గుట్టగా పోగుపెట్టబడ్డాయి. వాటి కిందకు అలలు వచ్చి వెడుతున్నా అవి ఏమాత్రం కదలకుండా ఆ రాళ్ళపై స్థిరపడ్డాయి. ఆ ఓడ కొద్దిగా ఒక వైపుకి ఒరిగి ఉంది. విరిగిపోయిన ఓడ స్థంభం మునుపటి కన్నా పొట్టిగా, ఒక కోణంలో నిలచి ఉంది.
"అదిగో అక్కడ ఉంది" జూలియన్ ఉత్సాహంగా అన్నాడు. "పాపం పాత శకలాలు! ప్రస్తుతం అది మరింత దెబ్బ తిన్నట్లు అనుకొంటున్నాను. నిన్న ఈ కొండరాళ్ళను ఢీకొట్టినప్పుడు ఎంత పెద్ద శబ్దం చేసింది!"
"మనం దాని దగ్గరకు ఎలా వెళ్తాం?" ఓడ శకలాల చుట్టూ చేరిన చెత్తను, సూదుల్లా ఉన్న రాళ్ళ సమూహాన్ని చూస్తూ అన్నె అడిగింది.
కానీ జార్జి ఏమాత్రం భయపడలేదు. తన చిన్న ద్వీపం చుట్టూ తీరాన ఉన్న ప్రతి అంగుళం తనకు సుపరిచితమే! ఆమె తన చేతుల్లోని తెడ్డులను స్థిరంగా కదిలిస్తూ, త్వరలోనే రాళ్ళపై విశ్రాంతి తీసుకొంటున్న శిధిలాలకు దగ్గరగా పడవను చేర్చింది.
పిల్లలు తమ పడవ నుండి శకలాల వైపు చూసారు. నీటి పైన ఉన్న దాని వైపు తొంగి చూస్తున్నప్పుడు, అది తాము ఊహించుకొన్న దాని కన్నా చాలా పెద్దదిగా కనిపిస్తోంది. అది ఒక రకమైన గుల్లపురుగులతో కప్పబడి ఉండగా, గోధుమ మరియు ఆకుపచ్చ సముద్రపు పాచి యొక్క పోగులు వేలాడుతున్నాయి. దాని నుంచి విచిత్రమైన వాసన వస్తోంది. ఎక్కడైతే రాళ్ళు ఢీకొట్టాయో, అటుపక్కన పెద్ద పెద్ద కన్నాలు కనిపించాయి. డెక్ భాగంలో కూడా కన్నాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, అది దీన స్థితిలో అనాధగా నిలిచిన పాత ఓడ - కానీ ఆ నలుగురు పిల్లలకు అది మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఉత్తేజాన్ని కలిగించే వస్తువు.
వాళ్ళు ‘శిధిలమైన ఓడ’ పడి ఉన్న రాళ్ళ దగ్గరకు పడవను పోనిచ్చారు. ఒక అల వాళ్ళ పడవను చిన్నగా కుదిపి వెళ్ళింది. జార్జి చుట్టూ ఒకసారి చూసింది.
"మన పడవను ఈ ఓడకే కట్టేద్దాం" చెప్పింది జార్జి. "అంతేగాక, మనం ఈ పక్కనుంచి డెక్ ను చాలా సులభంగా ఎక్కగలం. చూడు జూలియన్! ఈ తాడు ముడిని ఇటు పక్కన పైకి పొడుచుకు వచ్చిన ఆ చెక్కకు తగులుకొనేలా విసురు."
జూలియన్ తనకు చెప్పినట్లుగానే చేసాడు. తాడును బిగించి, పడవ కదలకుండా తమకు అనుకూలంగా ఉండేలా చేసాడు. అప్పుడు జార్జి ఒక కోతిలాగ తాము ఉన్న వైపు ఓడ శకలాలపైకి ఎగబ్రాకింది. అలా ఎగబ్రాకటంలో ఆమె నిష్ణాతురాలు. ఆమె వెనుకే జూలియన్, డిక్ అనుసరించారు. కానీ అన్నెకు సాయం చేయాల్సి వచ్చింది. త్వరలోనే నలుగురు ఏటవాలుగా ఉన్న డెక్ మీద నిలబడ్డారు. సముద్రపు పాచి ఉండటం వల్ల అడుగేస్తే కాలు జారుతోంది. అంతేగాకుండా భరించలేనంత వాసన వస్తోంది. అది అన్నెకు నచ్చలేదు.
"సరె! ఇది డెక్" చెప్పింది జార్జి. "అదే మనుషులు పైకి, కిందకు కదిలే మార్గం" అంటూ దూరంగా కనిపిస్తున్న పెద్ద కన్నం వైపు చూపించింది. వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళి తలొంచి చూసారు. ఇనుప వంతెన అవశేషాలు యింకా నిలిచి ఉన్నాయి. జార్జి దాని వైపు చూసింది.
"అది మన బరువును మోసేటంత దిట్టంగా ఉందనుకొంటాను" అందామె. "ముందు నేను వెళ్తాను. ఎవరి దగ్గరైనా టార్చి ఉందా? కింద బాగా చీకటిగా ఉన్నట్లుంది."
జూలియన్ తన దగ్గర ఉన్న టార్చిని ఆమెకు ఇచ్చాడు. మిగిలిన పిల్లలు మౌనంగా చూస్తున్నారు. ఆ పెద్ద ఓడలోపల కింద భాగంలో ఉన్న చీకట్లోకి చూస్తుంటే గగుర్పాటు కలుగుతోంది. జార్జి టార్చి వెలిగించి చేతితో నిచ్చెనను పట్టుకొని వేలాడుతూ కాళ్ళను కింద మోపింది. మిగిలిన వాళ్ళు ఆమెను అనుసరించారు.
టార్చి వెలుతురు వాళ్ళకు వింత దృశ్యాన్ని చూపించింది. ఓడలో ఎత్తు తక్కువ ఉన్నా, కింద ప్రాంతం లోకప్పు దట్టమైన ఓక్ కలపతో చేయబడింది. దాని కిందకు వెళ్ళినప్పుడు పిల్లలు తమ తలల్ని వంచవలసి వచ్చింది.
అక్కడ కొన్ని చోట్ల గదుల్లా కనిపించినా, అవి సముద్రంలో ములిగి సముద్రపు నాచు పట్టేసి బాగా దెబ్బ తిని ఉండటంతో, ఏది ఏమిటన్నది చెప్పడం చాలా కష్టం. వాటికి పట్టిన సముద్రపు నాచు చాలావరకు ఎండిపోయినా, వాసన మాత్రం భయంకరంగా ఉంది.
ఓడ లోపలి భాగంలో కలయజూస్తున్న పిల్లలు అక్కడక్కడ సముద్రపు నాచుపై జారి పడబోయారు. లోపల భాగం పరిధి మరీ ఎక్కువ లేదు. టార్చి లైటు వెలుతురులో పిల్లలకు గదుల కింద సామాను పెట్టుకొందుకు పెద్ద జాగా కనిపించింది.
"బంగారపు పెట్టెలను అక్కడే పెట్టేవారనుకొంటాను" అన్నాడు జూలియన్. కానీ అక్కడ నీళ్ళు, చేపలు తప్ప మరేమీ కనిపించలేదు! నీరు బాగా లోతుగా ఉన్నందున వాళ్ళు కిందకు దిగే సాహసం చేయలేదు. ఒకటి, రెండు చెక్క పీపాలు నీటిలో తేలుతున్నాయి. కానీ అవి పగిలిపోయి, ఖాళీగా ఉన్నాయి.
"అవి నీళ్ళ పీపాలనుకొంటాను, లేదంటే పందిమాంసమో, బిస్కట్లో నిల్వ చేసినవై ఉంటాయి" చెప్పింది జార్జి. "కేబిన్లు ఉన్న ఓడలోని మరొక వైపుకి మళ్ళీ వెళ్దాం రండి. అక్కడ నావికులు పడుకొనే పడక బల్లల్ని చూస్తుంటే వింతగా లేదూ? ఆ పాత కర్ర కుర్చీని చూడండి. ఇన్ని సంవత్సరాలుగా అది ఇక్కడే ఉండటం భ్రమలా అనిపించడం లేదు! ఆ కొక్కాలకు ఉన్న వస్తువులను చూడండి. అవి ప్రస్తుతం బాగా తుప్పు పట్టి సముద్రపు నాచుతో కప్పబడి ఉన్నాయి. కానీ ఒకప్పుడు అవే వంటవాడు ఉపయోగించిన మూకుళ్ళు, గిన్నెలు అయి ఉండాలి!"
ఆ పాత ఓడ శిధిలాన్ని చుట్టి రావటం ఒక వింత అనుభూతి. పిల్లలంతా బంగారు కడ్డీలు ఉన్న పెట్టెల కోసం గాలిస్తున్నారు. కానీ ఎలాంటిదైనా, ఒక చిన్న పెట్టె కూడా వారికి అక్కడ కనిపించలేదు.
మిగిలిన వాటి కన్నా కొంచెం పెద్దదయిన కేబిన్ దగ్గరకు వాళ్ళు వచ్చారు. దానిలో ఒక మూల పడకబల్ల కనిపించింది. దానిపై ఒక పెద్ద పీత విశ్రాంతి తీసుకుంటోంది. దానికి ఎదురుగా పూర్తిగా రంగు వెలిసిన పైభాగంతో, రెండు కాళ్ళు కలిగిన వ్రాత బల్లలాంటి పాత కాలపు ఫర్నిచర్ ఒకటి ఉంది. చెక్క అరలు, తోరణాలుగా వేలాడుతున్న కళ తప్పిన ఆకుపచ్చ సముద్రపు నాచుతో కేబిన్ యొక్క గోడలకు వంకరగా వేలాడుతున్నాయి.
"ఇది కెప్టెన్ సొంత కేబిన్ అయి ఉండాలి" అన్నాడు జూలియన్. "మిగిలిన వాటి కన్న పెద్దది. అటు చూడండి. ఆ మూల ఉన్నది ఏమిటి?"
"పాత కప్పు" అంటూ అన్నె దానిని చేతిలోకి తీసుకొంది. "ఇక్కడ సగం పగిలిన సాసర్ ఉంది. అంటే ఓడ ములిగిపోయే సమయంలో కెప్టెన్ యిక్కడ కూర్చుని టీ తాగుతున్నట్లున్నాడు."
ఇది పిల్లలకు వింతగా తోచింది. చీకటిగా ఉన్న ఆ చిన్న కేబిన్ కంపు కొడుతోంది. దాని నేలంతా తడిసి జారి పడేలా ఉంది. తన శిధిలమైన ఓడ గట్టుకి కొట్టుకు రాకుండా, నీటిలో ములిగి ఉంటేనే బాగుండేదని జార్జి తనలో భావించసాగింది!
"పదండి పోదాం" వణుకుతున్న కంఠంతో చెప్పిందామె. "నాకు ఇక్కడ నచ్చలేదు. ఇది ఉత్తేజితమేనని నాకు తెలుసు, కానీ కొంచెం భయం కూడా కలిగిస్తోంది."
వాళ్ళు వెళ్ళిపోవటానికి వెనుదిరిగారు. జూలియన్ టార్చి వేసి, చివరిసారి ఆ చిన్న కేబిన్ చుట్టూ చూసాడు. డెక్ పైకి వెళ్ళటానికి మిగిలిన వాళ్ళను అనుసరిస్తూ తన టార్చీని ఆర్పబోతుండగా, అతని దృష్టిని ఏదో ఆకర్షించి ఆగిపోయాడు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment