దైవమొక్కడే సంతత భజనీయుడు
డా. తాడేపల్లి పతంజలి
రేకు: 0353-03 సం: 04-311
పల్లవి:
దైవమొక్కడే సంతత భజనీయుడు
భావము సమబుద్ధి బాయగదగదు
చ.1:
హరియే నకలాంతరాత్మకుడటుగాన
తిరమై యొకరి నిందింపదగదు
అరయగ లోకములనిత్య మటుగాన
మరిగి కొందరిమీది మమతయు వలదు
చ.2:
బహుకల్పితములెల్ల బ్రకృతిమూలమే కాన
గహనపుదన వుద్యోగము వలదు
సహజవిహారుడు సర్వేశ్వరుడుగాన
వహిదానేవచ్చినవి వలదనదగదు
చ.3:
తపములు జపములు దాస్యమూలమె కాన
వుపమల సందేహమొగి వలదు
యెపుడును శ్రీవేంకటేశ్వరు సేవించి
చపలచిత్తమువారి సంగమిక వలదు
భావం
పల్లవి:
ఎప్పుడూ జీవులకు పూజనీయుడు భగవంతుడొక్కడే. స్వామి అంతటా ఉన్నాడు కనుక అందరూ సమానమే. సమదృష్టిని వీడరాదు.
చ.1:
అందరికి అంతరాత్మగా ఉన్నవాడు శ్రీహరియే.
కనుక ఒకరిని ఎప్పుడూ నిందించ కూడదు.
ఈలోకములన్ని అశాశ్వతములు.
ఎవ్వరును మనలను అంటిపెట్టుకొని ఎప్పుడూ ఉండరు. కనుక కొందరిపై మమకారము కూడా పద్ధతి కాదు.
చ.2:
ఈ ప్రకృతినుండి చిత్రవిచిత్రములైన అనేక కల్పనలు వచ్చుచున్నవి.
అంతేకాని జీవులు తమకు తాముగా ప్రయత్నించి సాధించేదేమియు లేదు.కనుక అటువంటి ప్రయత్నము చేయకూడదు.
ఆ పరమాత్మ సహజ లీలలందు ఆసక్తి కలిగినవాడు -కాబట్టి
ఆ స్వామి సంకల్పముతో తమకు తాముగా వచ్చినవాటిని కాదనకూడదు.
చ.3:
తపములు, జపములు మొదలయినవి దేవుని దాస్యమూలములు. ( కనుక దాస్య భావము వీడరాదని భావం)
ఆ తపస్సు మొదలైన సాధనలకు జెందిన ఉపాయముల పట్ల సందేహపడగూడదు.
ఎప్పుడూ శ్రీవేంకటేశ్వరునే సేవించుచున్నవారికి, దేవుని సేవించని చపల బుద్ధులతో ఎటువంటి సంబంధము పెట్టుకోకూడదు.
No comments:
Post a Comment