గుంపులో గోవిందం - అచ్చంగా తెలుగు

‘గుంపులో గోవిందం’

మీనాక్షీ శ్రీనివాస్



సత్యసాయి హోంస్ లో వినాయకచవితి సందడి హోరెత్తిపోతోంది.
ఈ మధ్యనే  మా అబ్బాయి అందులో ఓ విల్లా కొ న్నాడు.
అందుకు ముఖ్యకారణం మాత్రం మా గోవిందే.  వాడు అవడానికి మా మామగారికి వేలు విడచిన చెల్లెలి మరిది కొడుకే కానీ, మొదటి నుండీ మాకూ, వాళ్ళకీ మధ్య రాకపోకలు బాగా ఉండడంతో, ఇంచుమించుగా వాడూ మా పిల్లలతో బాటుగా పెరిగినవాడే.  ఈ మధ్యనే, అంటే ఓ ఏడాది క్రితం అనుకుంటా వాడు ఈ సత్య సాయీ హోంస్ లో విల్లా కొన్నాడు.  గృహప్రవేశానికి మేమూ వెళ్ళొచ్చాం.
చెప్పద్దూ చాలా ముచ్చటేసింది, వెంటనే మా వాడిని పోరి, మేమూ ఆ వెనకే కొన్నాం.
యిప్పుడు ఏ పండుగైనా మరీ ముఖ్యంగా వినాయక చతుర్థి,  భక్తి కంటే ఆర్భాటం, హంగామా ఎక్కువైపోయాయి.
మా కాలనీలో కూడా గణపతిని పెట్టారు, చాలా బాగా చేస్తారు రండంటూ నా కొడుకూ, కోడలు తెగపోరితే తెల్లారితే చవితి అనగా వెళ్ళాం.
తెల్లారి పూజా, హడావుడీ అంతా అయ్యాకా...భోజనాలు చేసి రెండు వీధుల అవతల ఉన్న మా గోవిందు యింటికి బయలుదేరాం.  మా కొడుకూ, కోడలూ ముఖ, ముఖాలు చూసుకుని ఒకటే నవ్వు.
ఆ నవ్వుల మధ్యే మా వాడు, "అబ్బా! ఏమిటమ్మా రాత్రంతా ప్రయాణం, పొద్దున్నుంచీ పూజా, పనీ, హడావుడి...ఇప్పుడంత తొందరేం వచ్చిందీ, బాబాయ్ ఏమీ అనుకోడు కానీ కాసేపు పడుకుని రెస్ట్ తీసుకోండి.   మళ్ళీ సాయంత్రం కాలనీలో వినాయకుడి పందిరిలో ఎటూ అందరం కలుస్తాం.
రాత్రి దాకా బోలెడన్ని కార్యక్రమాలున్నాయి..." అంటూ ఆపేసాడు.
“ఉంటారుగా!  మీ కళ్ళతో మీరే చూడచ్చు చిత్రాలు.  చూసిన వాళ్ళకి చూసినంత..." అంది కోడలు నవ్వుతూ.
‘సరే!  అదీ నిజమే కదా’ అనుకుని గదిలోకి వెళ్ళి నడుం వాల్చానో లేదో మళ్ళీ టింగ్ మంటూ మెసేజ్.
చూడకూడదు అనుకుంటూనే చూసాను, వాడే, ఆ వెధవే...ఏమయిందో యీ మధ్య మెసేజ్ లతో తెగ విసిగించేస్తున్నాడు.
తెల్లారుతూనే 'శుభోదయంతో మొదలు, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభ రాత్రి...యివి చాలనట్టు ఇంకా ఏవేవో మెసేజు లు, సంబంధం ఉన్నవీ లేనివీ' అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను.
                                                                ***
నిద్రలేచేసరికి సాయంత్రం ఐదయిపోయింది.
కోడలు పిల్ల యిచ్చిన కాఫీ తాగి, అంతా తయారై  రెండు వీధుల అవతల ఉన్న క్లబ్ హౌస్ దగ్గర పార్క్ లో పెద్ద పందిరీ, హడావుడీ...ఏకంగా యిరవై అడుగుల వినాయకుడు అది కూడా ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల సెల్ ఫోన్లు, కంపెనీ పేర్లతో సహా రాసి మరీ ఉన్నాయి.   అదీ మా గోవిందంగాడే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించాడట ఆ విగ్రహాన్నలా.
అసలే పెద్ద పెద్ద చెవులేమో, పైగా పెద్ద శబ్దంతో డీ జే లో పాటలూ.
గందరగోళంగా ఉందంతా.  ఒక్క నిముషం భరించడమే కష్టంగా ఉంది.  పాపం ఆ వినాయకుడు ఎలా భరిస్తున్నాడో ఆ హోరు.
మా వాడు వెళ్ళి కోప్పడి సౌండ్ తగ్గించేయించాడు.  బ్రతుకుజీవుడా అని కూర్చున్నాం.
మాకు ముందు వరసలోనే గోవిందం, భార్యా కూర్చున్నారు.
వాడు వంచిన తల ఎత్తకుండా ఏదో చేస్తున్నాడు.
ఏమిటా అని చూస్తినా చేతిలో సెల్.  నిట్టూర్చి వెళ్ళి వెనకాల కూర్చున్నాను.
కాసేపటికి సభ మొదలైంది.  ఒకాయన మైక్ లో గోవిందాన్ని పిలుస్తున్నాడు.
అక్కడే కూర్చుని వాడు పలికితేనా!  ఊహూ! నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు.
అంతలో ఇంకోకాయన వెళ్ళి ఆ పిలుస్తున్న పెద్దమనిషి చెవిలో ఏదో చెప్పాడు.
ఆయన తలకొట్టుకుంటూ జేబులోంచి సెల్ తీసాడు.
ఏం జరుగుతోందా అని నేను నోరు తెరిచి చూస్తున్నా...అంతలో నా వెనకాల నుంచి మాటలు...
"ఆ గోవిందంగాడి గురించి తెలిసీ, అలా గొంతెండిపోయేలా పిలవకపోతే, గ్రూప్ లో మెసేజ్ పడేయచ్చుగా!  యీయనకెప్పుడూ కొత్తే!" అంటున్నది మాకు రెండిళ్ళ అవతల ఉన్న ఏకాక్షం.
ఆయన పేరేమిటో కానీ, ఒకటే కన్నని అంతా అలాగే పిలుస్తారు.
"అదిగో!  ఆ మార్తాండం చెప్పేడుగా, యిప్పుడు చూడు ఆయన వాట్సప్ మెసేజ్ లో రమ్మని పిలుస్తాడీయన్ని...అప్పుడు వెడతాడు స్టేజ్ మీదకి ఈ మెంటల్ గాడు..." కిచకిచలాడాడు మరో ముకుందం.
ఆయన మాట పూర్తి కాకుండానే టింగ్ మని లేచిన గోవిందం అలా చేతిలో సెల్ చూసుకుంటూనే, వెళ్ళి స్టేజ్ మీద ఆయన పక్కన నిలబడ్డాడు.
ఆ పెద్ద మనిషి గోవిందం కాలనీ ప్రెసిడెంట్ అయ్యాకా చేసిన మార్పులూ, చేర్పులూ, మంచీ ముఖ్యంగా గణపతి నవరాత్రులు చేయించే తీరూ...మరీ ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఏ కాలనీలో లేని విధంగా జరిపే గణపతి నవరాత్రి ఉత్సవాలూ ఏకరువుపెట్టాడు.
ఆయన చెబుతున్నంతసేపు గోవిందం సెల్ లో అది రికార్డ్ చేస్తూనే ఉన్నాడు.
అంతా అయ్యాకా ఒకేసారి అక్కడున్న అందరి సెల్స్ కీ ఏక టింగ్, టింగ్, టింగ్లే'.
పనిలో పనిగా నా సెల్ కి కూడా ఏమిటా అని చూస్తున్నా, అప్పటిదాకా ఆ పెద్ద మనిషి చెప్పిన ఉపన్యాసం తాలూకా రికార్డ్...దానికి గోవింద్ ధన్యవాదాలు.
ఇదేదో చాలా తేడాగా అనిపించడమే కాదు.  నాలుగు రోజులు అక్కడుంటే మేమూ వాడిలా అయిపోతామేమోనన్న భయం నన్ను కుదిపేసింది.
 ఆ తరువాత ఏవో కొన్ని కార్యక్రమాలు. అలా వరసగా తొమిది రోజులూ బోలెడన్ని కార్యక్రమాలు. ప్రముఖ సంగీత కళాకారుడు శంభుప్రసాద్ గారి కచేరి, ప్రముఖ వైణికురాలి కచేరి, ఆనంద వల్లి గారి అమృత కవితాగానం ఇలా ఏవేవో జరిగాయి.  అయితే అవేవీ అంత చెప్పుకోదగినవి కావు.
కానీ ప్రతి రోజూ ఆ కార్యక్రమాలకు ముందో వెనుకో మా గోవిందంగాడి తవికో, అదే కవితో, గానమో, లేకపోతే స్వయంగా వ్రాసి, పాడిన పాటో ( అబ్బే పాట కాదుసుమీ పాటే) లేకపోతే ఉపన్యాసమో, యిలా రకరకాల హింస...అది కూడా రికార్డ్ చేసి ఇస్తాడు, ఆ సెల్ మైక్ ముందు పెట్టి స్పీకర్లో...వాడు చిద్విలాస మూర్తిగా ముందు వరసలో కూర్చుని ఉంటాడు.
ఆ రకంగా నేను అక్కడ ఉన్న అన్ని రోజుల్లో వాడు తలయెత్తుకుని ఉండడం చూడలేదు అంటే మరి మీరు నమ్మాల్సిందే!
మెడ అలా నలబై డిగ్రీల కోణంలో ఉండిపోయింది...బహుశా పడుకున్నప్పుడు కూడా అలాగే బిగుసుకుపోయి ఉంటుంది.
ఇక చేతి వేళ్ళంటారా!  రామరామ మా చిన్నప్పుడు వీధుల్లో తోపుడు బళ్ళ మీద అడుక్కుంటూ, అదేదో గిలక లాంటిది ఊపుకుంటూ వచ్చేవారు...యీపాటికి మీకు అర్థం అయ్యే ఉంటుంది వాళ్ళెవరో...అదే భంగిమ. 
పది రోజులూ ఇట్టే గడిచిపోయాయి.  ఒక్కరోజు కూడా వాడు మామూలుగా మాట్లాడడం చూడలేదు.
కర్ణుడి సహజ కవచకుండలాల్లాగా వాడి చేతుల్లో ఒకటి యాండ్రాయిడ్.  ఒకటి యాపిల్.
వాడి ఉనికీ, ఊపిరీ, సర్వస్వం వాటితోటే.
ఇంక మేం ఊరు బయలుదేరే రోజు దగ్గరపడింది.  గోవిందు దగ్గరకు వెళ్ళడం దండుగ అని తెలిసినా ఉండబట్టలేక వాడింటికెళ్ళాం నేనూ, మా వారూ.
పిల్లలు నవ్వుతున్నా పట్టించుకోకుండా. 'సర్లే' వాళ్ళ నవ్వులతో మాకు పనేమిటీ అని వెళ్ళామా!
ఎప్పుడూ కబుర్లతో, నవ్వులతో కేరింతలు కొట్టే మా గోవిందు యిల్లు కేంద్ర గ్రంథాలయంలా నిశ్శబ్దంగా ఉంది.
గోవిందు హాలులోనే కూర్చున్నాడు.  వాడి కొడుకూ, కోడలూ కోడలి పుట్టీంటీకి వెళ్ళారట.
గోవిందు పెళ్ళామేమో మిడిగుడ్లేసుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చుని టీ వీ చూస్తోంది.  అది మ్యూట్ లో ఉంది. చెప్పద్దూ చూడగానే నాకు నవ్వాగలేదు. హీరో, హీరోయిన్లు కవాతు మూకీలో, మరి నవ్వు రాక.
అయిందా!  "ఏరా గోవిందూ ! మరి మేం ఊరు వెడుతున్నాం." 
నా కేసి ఓ వెర్రి చూపు కళ్ళజోడులోంచి పైకి చూసి కూర్చోమన్నట్టు సంజ్ఞ చేసాడు.
వాడి పెళ్ళాం ఉలుకూ, పలుకూ లేకుండా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.
అంతలో నా ఫోన్ లో టింగ్ మంటూ ఏదో మెసేజ్ నోటిఫికేషన్.
సర్లే, ఎవరూ ఏం మాటాడడం లేదు కదా అని ఫోన్ తీసి చూసాను.
కళ్ళు గిర గిరా తిరిగాయి.  అయోమయంగా గోవిందు కేసి ఓ వెర్రి చూపు చూసాను.
చూసానంటే మరి చూడనూ...
ఆ మెసేజ్ వాడి నుంచే...ఇందాకా నే చెప్పిన మాటకి.
'ఓ బొటనవేలు, టాటా, ఓ వెర్రి నవ్వు, పూల గుత్తి ' ఉన్న ఏమోజీలు.
‘వెర్రి కుదిరింది, తలకి రోకలి చుట్టమన్నట్టుంది వీడి వాలకం’ అనుకుంటూ, నేను అయోమయంగా మా ఆయన కేసి చూసాను.
ఆయన మహా మేథావి.  సంగతి అర్థం అయినట్టుంది.  లేచి నిలబడ్డారు, వెడదాం అంటూ.
అంతలో గోవిందు పెళ్ళాం గరుడవర్థనం వంటింట్లోంచి సైగ చేసి పిలిచింది.
'ఓ నిముషం ఆగండి ' అని మా ఆయనకు చెప్పి లోపలికి వెళ్ళాను.
వాళ్ళ దేవుడిని చూపించి దండం పెట్టుకోమంది.  బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది.
'ఏమిటీ, మౌనవ్రతమా?' అడిగాను అవి అందుకుంటూ.
అవునూ, కాదూ మధ్య తల అడ్డంగా ఊపింది.
గోవిందు మాత్రం వంచిన తల ఎత్తకుండా ఆ ఫోనులో ఏవో టక టకా నొక్కేస్తున్నాడు.
'ఏమైంది వీడికీ? ఎప్పుడూ ప్రేమగా, ఆప్యాయంగా గలగలా మాటాడేవాడే!' అనుకుంటూ ఇంక అక్కడో క్షణం కూర్చోలేక వచ్చేసాం.
మా పిల్లలిద్దరూ మాకోసమే అన్నట్టు కూర్చున్నవాళ్ళు కూర్చున్న చోటే టీ వీ చూస్తూ కూర్చున్నారు.
మమ్మల్ని చూసి "అప్పుడే వచ్చేసారేమిటీ?   బాబాయ్ ఏమన్నాడు?" అన్నాడు మావాడు నవ్వుతూ.
"నా పిండాకూడన్నాడు.  వాడేమిటిరా అలా చేతబడి పాలబడ్డవాడిలా ఓ మాటా లేదు, మంతీ లేదు.   అన్నిటికంటే విడ్డూరం, నేను ఎదురుగా నిలబడి అడిగిన ప్రశ్నకి నా ఫోన్ కి మెసేజ్ పెట్టాడేమిటిరా, పింజారీ వెథవ...ఏ గాలైనా సోకిందా!" చిరాగ్గా అంటూ కూలబడ్డాను.
వాడు ఒకటే నవ్వు.  నవ్వి నవ్వి అలసిపోయి అప్పుడు చెప్పాడు.
గోవిందు రిటైర్ అయ్యాకా కాలనీ వాళ్ళు పెద్దరికం ఇచ్చి వాడిని కాలనీ ప్రెసిడెంట్ చేసారట.
ఓ వాటాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందరినీ సభ్యులుగా చేర్చారట.
అది మొదలు ఏ విషయమైనా, ఎవరితో అయినా వాట్సప్ లో తప్ప మాటాడడం మానేసాడట.
అలా రిటైర్ సిబ్బంది ఓ గ్రూప్, కాలేజ్ స్నేహితుల గ్రూప్, ఇంటర్, డిగ్రీ, స్కూలు స్నేహితుల గ్రూప్, పరిచయస్తుల గ్రూప్, ముదం-మోదం గ్రూప్, మురిపాల గ్రూప్, పాటల గ్రూప్, కథల గ్రూప్, ఆఖరికి పచారీ కొట్టు వాళ్ళ గ్రూప్, పాలవాడి నంబరూ, వాడి వాడకందార్లతో గ్రూప్...యిలా కాదేదీ గ్రూపుకనర్హం అంటూ సుమారు ఐదారొందల గ్రూపులు పెట్టి, సగానికి పైగా అతనే వాటికి అడ్మిన్ అట.
సుమారుగా అన్ని గ్రూపుల్లో కలిపి ఐదారు వేలమంది సభులు ఉంటారట.
అందరికీ పుట్టిన రోజు, పెళ్ళి రోజు, అవికాక ఇతరత్రా వ్యక్తిగత వేడుకలు...అన్నింటికీ క్రమంతప్పకుండా శుభాకాంక్షలు అందజేయడం.
అవికాకుండా ఫాదర్స్ డే, మదర్స్ డే, ఆ డే, ఈ డే అని తేడాలేకుండా దేశీయ, అంతర్జాతీయ దినాలన్నింటికీ అభినందనలూ, శుభాకాంక్షలూ...ఇవి కాక పుట్టుకలూ, చావులూ, అనారోగ్యాలు, రికవరీలు ఇలా ఒహటా, రెండా! ఎన్నని చెప్పడం.
అయిందా! ఇవి కాక ఈమధ్య తను ఎలాగైనా పేరు, ప్రతిష్టలు పొందాలన్న కీర్తి కండూతొకటి పట్టుకుందట తామరలా.  ఇంక చెప్పేదేముందీ కథలు, కవితలు, పాటలు, పద్యాలు అన్నింటా తలములకలుగా తలదూర్చేస్తున్నాడట.
ఏదో ఒకటి అవకతవకలు వ్రాసి తెల్లారి నాలిగింటినుంచే 'ఎత్తిపోతల పథకం ' అదేనండీ ఈ గ్రూప్ లో మెసేజ్ ఆ గ్రూప్ కీ, ఆ గ్రూప్ లో మెసేజ్ ఈ గ్రూప్ కీ ఇలా తర, తమ బేధం లేకుండా అన్ని గ్రూపులకీ బకెట్ల కొద్దీ తోడిపోస్తున్నాడట.  అలా అర్థరాత్రి దాటినా అదే పనట.  పాపం కంటి నిండా నిద్ర కూడా ఉండడం లేదట.
మా వాడు చెప్పడం నవ్వడం, నవ్వడం చెప్పడం.
అంతలో మా కోడలు పిల్ల...
"అలసిపోయారు కానీ కాఫీ తాగండి." అంటూ మాకు  తలో కప్పూ ఇచ్చి, తనూ తీసుకుని కూర్చుంది.
అలుపుసొలుపూ లేకుండా వాడు బాగానే చెబుతున్నాడు కానీ, వింటున్న నా తల గిర్రున తిరిగి, జైంట్ వీల్ ఎక్కిన అనుభూతి కలిగింది.  కాఫీ తాగి వాడు మళ్ళీ ఏదో మొదలుపెట్టబోయాడు.
మా కోడలు వాడిని ఒక్క కసురు కసిరి...
"బానే ఉంది ఆయనకి ఆ పిచ్చి పట్టుకుంటే, యీయనకి వచ్చినవాళ్ళందరికీ ఆయన గురించి చెప్పడం పిచ్చి పట్టుకుంది.  అలా రోజుల తరబడి చెప్పినా అది తెమలదు కానీ, అత్తయ్యా ! రాత్రి మళ్ళీ ప్రయాణం, వెళ్ళి కాసేపు పడుకోండీ’ అంది.
నేనూ, మా వారూ లేచి గదిలోకి వెళ్ళి ఇలా నడుం వాల్చామో లేదో అలా నిద్ర పట్టేసింది.                                                             
కానీ ఆ రాత్రి మా ప్రయాణం రద్దయింది.
కారణం మా గోవిందం గాడిని క్షణాల మీద ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందట.
నేను గమనించలేదు కానీ అప్పటికే వాడి మెడ మీదో గోపురం, చేతివేళ్ళు దొండకాయల్లా వాచిపోయి బిగిసిపోయాయట.
మేం వచ్చేసిన కాసేపటికే మనిషి బిగిసిపోయాడట.  ‘వెర్రి నాగన్న ఎలా ఉంటాడో' అనుకుంటూ ఆసుపత్రికి బయలుదేరాం.

 ***

No comments:

Post a Comment

Pages