మానస వీణ - 52
శుభ వారణాసి, టీచర్ హైదరాబాద్.
ఆశ్రమంలోని పిల్లలను
సమాజానికి సహాయపడే వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత తన భుజస్కంధాల పై వేసుకుంది
మానస. ఎలాచేయాలి? వీళ్లందరినీ ముందుకు ఎలానడిపించాలి అని మానస ఒక వారం రోజులుగా దీర్ఘాలోచనలో
పడింది.
ఒక సాయంత్రం వేళ
చల్లగాలి వీస్తుంటే, కొంచెంసేపు ఆ చల్లగాలిని ఆస్వాదించుదామని ఎంతో ఆనందంతో
“చల్లగాలి వీస్తుంటే కొంటెగా నా చీర చెంగు రెప రెపలాడేవేళ
ఎవరికోసమో
ఈ తహతహలు ఎవరి
కోసమో ఈ ఎదురుచూపులు...
నా
మనసు వీణను మీటిన ఓ ప్రియతమా”
అని తనలో తాను
పాడుకుంటూ మురిసిపోతూ, ఇంతలో ఏదో అలికిడి అవడంతో ఉలిక్కిపడింది మానస.
కూరలమ్మే వెంకాయమ్మ 'అమ్మ, కూరగాయలు తీసుకోండి' అని పిలుస్తోంది.
అక్కడ కాసేపు అలాగే నిల్చొని ఆమెను చూస్తూ ఉండిపోయింది. ఇంతలో
మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది. ముందుగా పిల్లలందరిని నాలుగు భాగాలుగా ( తన
మనసులో నాలుగు దిక్కులుగా ఉహించుకొంది) ఆ నాలుగు దిక్కులకి నాలుగు స్తంభాలుగా
నలుగురిని నాలుగు దిక్పాలకులుగా ఏర్పాటు చేసింది. ఇంతకీ ఆ
నాలుగు దిక్పాలకులు మన నినీష, చైత్ర, దివ్య, రమ్య .
తాను ఒకతే అన్నీ
చేయాలంటే కుదరదు కాబట్టి, ఈ నిర్ణయం తీసుకొన్నానని తనకి అండగా వున్న దినేష్ కు, జిటిఆర్ అంకుల్ కి
చెప్పింది. తన ఆలోచన చాలా బాగుందని వారు మెచ్చుకొని
'నీకు మేము ఎప్పుడు అండగా ఉంటామని' చెప్పారు.
మానసకు తాను పెరిగిన
ఆశ్రమాన్ని అందరూ గుర్తించాలి,
గుర్తించడమే కాదు ఆ ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా
చూడాలని తన తపన. ఆ తపనకి పిల్లలందరూ "మేము నీకు తోడు ఉంటాము మానసక్క"
అని తన వెనువెంట నడవడానికి సిద్ధమయ్యారు. రామదండు లాగా, ఒకేఒక సైన్యంలాగా
మారింది మానసదండు.
"నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది" అంటారు. అలాగే మంచి
చేయాలి అన్న ఆశ, ధృడ సంకల్పం ఉన్ననాడు
ఎవరూ మన విజయాన్ని ఆపలేరు. ఆశ్రమంలోని
పిల్లలకు చదువుతో పాటు ఆటలు, పాటలు, విద్యలు నేర్పించడమే కాక పరులకి సహాయపడే విధంగా పిల్లలని
మలచాలి. పిల్లలని అందమైన శిల్పాల్లా మార్చాలి అనుకొంటోంది మానస.
మొట్టమొదటి స్తంభము -
పిల్లలు తామే స్వయంగా కూరగాయలను పండించుకోవడం. దీనికి నాయకురాలు నినీష. ప్రతి రోజు ఈ భాగంలోని
పిల్లందరూ సాయంత్రం వేళలోఒక గంటసేపు
వ్యవసాయం చేస్తారు. ఉదయం బడికి వెళ్తారు, సాయంత్రం వ్యవసాయం
చేస్తారు. ఈవిధంగా పిల్లలు చేయడం వల్ల మంచి ఆరోగ్యవంతమయిన కూరగాయలు తామే
పండించుకొంటారు. మిగిలిన కూరగాయలు అంగడి వాళ్ళకి అమ్మడము ద్వారా వ్యాపారము కూడా
చేయడం నేర్పిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకి కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది.
దానితో పాటు చదువు కోవడం వల్ల సమర్ధవంతంగా వ్యాపారం చేయడం తెలుస్తుంది.
చైత్ర మన రెండో
స్థంభం నాయకురాలు. చైత్రకు ఆశ్రమానికి రాకముందే పలురకాల కుట్లు, అల్లికల్లు వచ్చు.
వీటితో పాటు టైలరింగ్ పని కూడా వచ్చు. చైత్రకి వచ్చింది కొంచమే కానీ తనకి తోడుగా
మానస వుంది, కొత్త కొత్త మెళుకువలు నేర్పించడానికి. ప్రతి
రోజు సాయంత్రం ఒక్క గంట కుట్టు పన్లు చేస్తారు పిల్లలు. ఆశ్రమంలోని పిల్లలందరి
బట్టలు కుట్టడం మొదలయిన పనులే చేస్తారు. నెమ్మదిగా బయటి వారి బట్టలు కుట్టే
స్ధాయికి ఇది దినదినాభివృద్ధి చెందాలని అందరి ఆశ.
ఈ సమాజంలో ఒంటరిగా
పోరాడాలంటే ముందుగా మనని మనం రక్షించుకోవాలి. మనము అందరికంటే పైస్థానంలో ఉండాలి. ఈ
ఆలోచనతో తపన పడిపోతోంది మానస. ఇదే మాట దినేష్,
జిటిఆర్ అంకుల్ లకు చెప్పింది. ఇప్పుడంటే మనము వున్నాము కాపాడటానికి, ఈ పిల్లలని రేపు
వీళ్ళు పెద్దయ్యాక వీళ్లకి తోడు
ఎవరు వుంటారు, అండగా ఎవరు వుంటారు? అని చాలా మధనపడ్డారు.
ఇంతలో ఫోన్ మ్రోగింది
దినేష్ ది. కాల్ చేసింది దినేష్ చిన్నప్పటి నేస్తం ప్రవీణ్. ప్రవీణ్ దగ్గర నుంచి
ఫోన్ రాగానే దినేష్ ఆనందానికి హద్దులు లేవు. అది చూసిన మానస కి, అంకుల్ కి దినేష్
ఎందుకు అంతలా ఆనందపడుతున్నాడో అర్ధం కాలేదు. ప్రవీణ్ ని ఆశ్రమానికి వెంటనే రమ్మని
చెప్పాడు. కొంచెం సేపటికి ప్రవీణ్ వచ్చాడు ఆశ్రమానికి. ఇంత అందమైన ఆశ్రమాన్ని తాను
ఎక్కడ చూడలేదని ఆశ్రమాన్ని చూస్తూ అలా వుండిపోయాడు.
ఆశ్రమాన్ని ఇలా
వర్ణించసాగాడు...
"ఆహా కన్నులకి ఇంపైన ఓ నందనవనమా,
నిన్ను
చూడని ఈ కళ్ళు ఎందుకు ?
నీ
వెచ్చని చిరుగాలి నా మేనిని తాకుతూ,
నేనున్న
సంగతే నన్ను మరచేలా చేస్తోంది."
ఇంతలో మానస టీ
పట్టుకొని వచ్చింది. టీ, టీ... అనగానే ఇంక ఊహా లోకము నుంచి బయటకు వచ్చాడు ప్రవీణ్ .
చక్కని టీ ని
ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకోసాగారు అందరూ. ప్రవీణ్ గురించి చెప్పసాగాడు
దినేష్... అతనొక కరాటే మాస్టర్ అని,
ఉద్యోగం తో పాటు కొంతమందికి
శిక్షణ కూడా ఇస్తాడని చెప్పాడు. అసలు ప్రవీణ్ కి ఆశ్రమానికి సంబంధమేమిటా అని అంతా
అనుకోసాగారు.
"ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే కొంతమంది చెడ్డవాళ్ళని
ఎదిరించాల్సి వస్తుంది. అందుకు ముందుగా వారు ఆత్మ రక్షణ చేసుకొనేలా తయారు చేయాలి.
తరువాత వాళ్ళే ఈ ఆశ్రమానికి ఆశ్రమ రక్షకులుగా తయారవుతారు." అన్నాడు దినేష్.
ఇప్పుడు మానసకి బాగా
అర్ధం అయింది. మూడో స్తంభంగా
కొంతమంది పిల్లలకి కరాటే నేర్పించడం
కరెక్ట్ అని అనుకొంది. నాయకురాలి గా దివ్య ని పెట్టింది.
ఇక నాలుగో స్తంభానికి
నాయకురాలు రమ్య - వీరికి సంగీతం, నృత్యం వంటి లలిత కళల్లో శిక్షణ ఇవ్వడమే కాక, టెక్నాలజీ ని
ఉపయోగించుకుని మిగతా స్ధంభాలలోని పిల్లలు పండించిన కూరలను, కుట్టిన బట్టలను అమ్మడం, ఛారిటి కోసం
ఆశ్రమంలోని పిల్లల చేత చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించడం వంటి పనులను
అప్పజెప్పారు. అయితే టెక్నాలజీ శిక్షణ కోసం ఒక నిపుణుడిని చూడాల్సి ఉంది.
వీటన్నిటి ద్వారా
వచ్చే డబ్బంతా ఆయా పిల్లల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడేలా చూసింది
మానస. ఈ విధంగా ఆశ్రమంలోని పిల్లలు తమ కాళ్లపై తాము నిలబడేలా వారి
భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. ఆడపిల్లలను చిన్నచూపు చూసే వాళ్ళందరిని
ఎదిరించడానికి ఒక సైన్యాన్ని తయారు చేస్తోంది మానస. అభిమన్యుడు తల్లి గర్భం లోనే
పద్మవ్యూహం నేర్చుకొన్నాడని అంటారు కదా. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా అలాంటి
అభిమన్యుడి లాంటివాళ్లే.
మానస ఆశయం కోసం ఇంత
మంది చేయి చేయి కలిపారు ఇంకా ఇంకా ముందుకు దూసుకొని వెళ్ళాలి ఆమె.
No comments:
Post a Comment