శ్రీథరమాధురి - 118
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
వైరాగ్యం లేదా నిర్లిప్తత అనేది ఒక సంపూర్ణ జీవితాన్ని జీవించిన తర్వాతే రావాలి. లౌకిక జీవితంలో విరక్తితోనో లేక నిరంతర హింస వల్లనో వైరాగ్యం కలిగితే అది కేవలం నటన మాత్రమే. అటువంటి వారి మనస్సులో అనేక దుష్ట ఆలోచనలు ఉంటాయి, వారు మోసకారులుగా ఉంటారు. లౌకిక జీవనంలో విఫలమవ్వడం వల్ల చాలామంది మతం వైపు మళ్లడాన్ని నేను చూశాను. అలా జరిగింది కనుక వారు మతాన్ని ఒక ఆయుధంగా వాడి ఇతరులను మోసపుచ్చుతారు. వైరాగ్యం అలా రాదు, మనం అటువంటి వారిని నమ్మలేము.
***
చింతించకండి. వైరాగ్యం మీకు కలిగినా కలగకపోయినా, మీరు అన్నింటినీ అధిగమించినా అధిగమించకపోయినా, మీరు ఎల్లప్పుడూ నన్ను నమ్మవచ్చు. నాకంటే ముందు మీరు నారాయణ భగవానుడి ధామాన్ని చేరుకుంటే తప్ప, నా ఆత్మ అక్కడికి చేరుకోదు. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను.
***
అన్నిటినీ అధిగమించి వైరాగ్యాన్ని పొందాలంటే, గృహస్థ బాధ్యతల నుంచి దూరంగా పారిపోవలసిన అవసరం లేదు. 'సంసార' జీవితాన్నే గడపవచ్చు. సంసారాన్ని వారు సాగరం అని ఎందుకు అన్నారంటే, అది సముద్రం వంటిది. పైనుంచి చూస్తే, విశాలంగా, అంతులేనట్లుగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి అందులో మునిగి లోపలికి వెళ్తే అనేక జాతులకు చెందిన జీవులు కనిపిస్తాయి. కాబట్టి సంసారంలో ఒకరు పూర్తిగా అనుభవాన్ని పొందిన తరువాత వైరాగ్యం సంభవిస్తుంది. అప్పుడు మీరు పూర్తి అనుభవాన్ని పొంది, అన్నింటిని అధిగమించడం అనే పడవను ఎక్కడానికి సిద్ధంగా ఉంటారు.
***
వంటింటిని జగన్మాత అన్నపూర్ణ కొలువుండే చోటుగా చెబుతారు.
నిజానికి ఒకరు చేసే వంట, దేవునికి ఆయన పర్యవేక్షణలో వండే ప్రసాదం వంటిది.
వంటింట్లో ఎవరైనా వండుతున్నప్పుడు, వారి మనసు ఆనందంతో, సంపూర్ణ ప్రేమతో నిండి ఉండాలి. వండే వారు వంటింట్లో ఉండే మాతా అన్నపూర్ణేశ్వరి పర్యవేక్షణలో వంట చేస్తారు.
నిరాశతో ఉన్నప్పుడు అసలు వంటింట్లోనే ప్రవేశించకూడదు. ఒకరికి మానసికంగా స్థిరత్వం లేనప్పుడు, అతడు లేక ఆమె అంతటి ప్రతికూలతతో ఆరోజు అసలు వంటింట్లోనే ప్రవేశించకూడదు.
భోజనాన్ని 'అన్నం' అంటారు. 'అన్నం న నిందయేత్, ప్రణోవా అన్నం.'
నిందయేత్ అంటే నిరాదరించడం. మంచి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తగిన మంచి వాసనతో, రుచితో, ఇతర పదార్థాలతో భోజనాన్ని తయారుచేయకపోవడం కూడా భోజనాన్ని నిరాదరించడమే.
వండేవారి, అన్ని ఆలోచనలు, ఉద్వేగాలు భోజనంలోకి వెళ్తాయి.
కాబట్టి భగవంతునికి అర్పించే భోజనం రుచితో సహా అన్ని అంశాలలో నిర్దిష్టంగా ఉండాలి. ఎంతో ప్రేమతో, దయతో భోజనాన్ని వండినప్పుడు భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు.
ఎవరైనా చికాకుగా, కోపంగా, ఇతరులపై మొహాలు మాడ్చుకుంటూ, అరుస్తూ వండితే దేవుడు ఆ ప్రసాదాన్ని దయ్యానికి అందిస్తాడు. ఆ ప్రసాదాన్ని తిన్న ఇంట్లోని వారందరూ దెయ్యం యొక్క ప్రసాదాన్ని తిన్నట్లే!
నెమ్మదిగా ఆ గృహం కొంపగా మారిపోతుంది. ప్రేమ, దయ, కరుణ, మంచి సంకల్పం వంటి వాటి బదులు ఇంట్లో కోపం, పగ, ప్రతీకారం, అసూయ, స్వార్ధం వంటివి చోటు చేసుకుంటాయి.
అందుకే అన్నం వండేందుకు వంటింట్లోకి ప్రవేశించగానే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.
కాబట్టి కోపంతో, పగతో వంటింట్లోకి ప్రవేశించకండి. ఇది యుద్ధక్షేత్రం కాదు తెలుసుకుని మెలగండి.
*****
No comments:
Post a Comment