అనసూయ ఆరాటం -30 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం -30 

(చివరి భాగం)

చెన్నూరి సుదర్శన్ 


నేను మాత్రం మీదగ్గర ఇంట్ల ఉండదల్సుకోలేదు. చిన్నోని దగ్గర ఉండి నిన్ను బదునాం సెయ్యదల్సుకోలేదు. ఇప్పటికే అందరు ఆదిరెడ్డి కంటే అనిమిరెడ్డే నాయవంతుడు అంటాండ్లు.


సక్కంగ నేను ములుగు పోత. మన గుడిసె ఉండనే ఉండె. నాకాల్లు రెక్కలు ఆడినంత కాలం కాయకట్టం సేసుకుంట.. రాజయ్య నాయ్న, బతుకమ్మ  నీడల బతుకుత.


 నాకు గిసోంటి రకుతపు కూడు తినబుద్ధి కాదు.


మానవ జలమ ఎత్తినప్పుడు నాయంగ బతుకాలె. నలుగురి నోల్లు కొట్టి బతుకుడు కాదు. నలుగురి బతుకులను బాగు సెయ్యాలే.. నలుగురు మెచ్చుకోవాలే.. మన అనుకునేటోల్లు నలుగురుంటేనే జీవితంరా.. నువ్వు ఏసీల కంపిని పెట్టి నలుగురికి దారి సూపిచ్చినవ్.. మెచ్చుకున్న. భూమ్మీదికి వచ్చినప్పుడు నలుగురు మెచ్చ బతుకాలె. కాని ఇదేం బతుకుడురా.. రోత బతుకు పాడుగాను..” అని కాండ్రిచ్చి ఊంచింది వాష్ బేసిన్ల.,


“ఫలాన అనసూయ కొడుకు ఎంత సంపాయించిండో అని  సూడరు. ఎంత నీతివంతుడో అని సూత్తరు. అయినా  నాకు తెల్వకడుగుతా..  సంపాయించిందంతతా సచ్చినప్పుడు ముల్లె కట్టుకొని పట్టుకపోతమా. సచ్చినోని పెయ్యి మీద ఈసమెత్తు సొమ్ములు సుత ఉంచరు. కట్టెల్ల కాలేత్తరే తప్ప.. నోట్ల కట్టల్ల కాలబెట్టరు.


నేను అరికీసు ఇక్కడ ఉండనంటే ఉండ. నువ్వు నాకొడుకువని చెప్పుకోవాలంటేనే రోత పుట్టుకత్తాంది” అని ముఖం చిట్లించుకుంట పోయి చిలక్కొయ్యకున్న  చెయ్యి సంచి తీసుకున్నది. తన చీరెలు, రైకలు సదురుకోబట్టింది.


ఆదిరెడ్డికి అన్ని యాదికి రాబట్టినై..


వాల్లను అన్నాలం సేసిన సమ్మయ్య సచ్చిపాయే.. వాల్ల కొడుకులకు పాపం తాకి ఊర్లు పట్టుకొని తిర్గబట్టిరి..


బుచ్చయ్య సచ్చిపాయే.. ఆయన పాపం కొడుకు రవీందర్‌కు తాకి సచ్చిపాయే..


రవీందర్ తను పనిసేసే కంపినికి మోసం సేసి కరెంటు మీటర్లు తయారయ్యే టెక్నిక్ అమ్ముకున్నడని అంతా అనుకునేటోల్లు. ఆ పాపం తాకిందనుకుంట.. ఆయన బిడ్డ సుస్మిత ఘోరంగ సచ్చిపాయే..      


సర్వేశం బాల నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్. ఆయన భాగోమంతా ఆదిరెడ్డికి తెలుసు. ఆ పాపమే తాకి నిరంజన్ గౌడు సచ్చిపాయే.. మల్ల మొన్నటికి మొన్న ఆయన రెండో కొడుకు సి. బి. ఐ.టి. ల ఇంజనీరింగు సదివే అంజన్ గౌడ్ సుత సైకిల్ మోటర్ డివైడర్‌కు గుద్దుకొని సచ్చిపాయే..


 నీయతి లేని బతుకులకు పాపం సుట్టుకుంటదని..  ఆదిరెడ్డిల భయం సొచ్చింది. 


ఆదిరెడ్డి ఉరికి అనసూయ చేతిలకెల్లి సంచి గుంజు కున్నడు       “అమ్మా.. నువ్వు ఎట్ల చెప్తే అట్ల ఇంట. కాని  మమ్ముల్ని ఇడ్సిపెట్టి పోకు” అని సుశాంత్‌ను తీస్కోని అనసూయ కాల్ల మీద పడేసిండు. సుశాంత్ ఒక్క సారే కీసు పిట్ట లెక్క ఏడ్వబట్టిండు. అనసూయ సుశాంత్‌ను ఎత్తుకొని సంకలేసుకున్నది. సుశాంత్ ఇంకా ఏడ్తనే ఉన్నడు.  సరిత వచ్చి తీసుకున్నది.


“అత్తామ్మా.. నిజంగనే  నువ్వన్నట్టు భూదందాలల్ల.. రాజకీయాలల్ల  నీయతిగ ఉంటే నడవది. నీయతి లేని సంపాదనతో కొన్నాల్లు సుఖపడ్డా.. ఆ తరువాత్తరువాత అడ్కతినే గతే పడ్తది.


ఆదిరెడ్డిని అందరు బ్రోకరుగాడు అంటాంటే నాకూ ఇనబుద్ధైత లేదు అత్తామ్మా. పైసల యావల పడి పజీత పాలైతానం. అయిందేదో అయింది. ఆదిరెడ్డిని  భూదందా చెయ్యనియ్య. మానేత్తడు. పురంగ ఏసీల షాపే సూసు కుంటడు” అని సుశాంత్ తలకాయె మీద ఆదిరెడ్డి చెయ్యి పెట్టిచ్చి పమానం సేయిచ్చింది.


అనసూయ జర శాంతానికచ్చింది. నిమ్మలంగ మల్ల మంచంమ్మీద కూకున్నది.


“అమ్మా.. నా చిన్నతనంల నువ్వు  ఎంత కట్టపడ్డవో.. నాకు తెల్వదా.. భవిషత్‌ల మల్ల అసోంటి కట్టాలు మనకు రావద్దనే పైసలెంబడి పడ్డ. మనమంతా సుఖంగా ఉండాలనే సెనం తీరిక లేకుండ సంపాయించుతాన. ఈ భూదందాల మాయల  పడి సురేందర్ మామయ్య మనసు కట్టబెట్టిన. నేను ఇయ్యాల్నే మామయ్య ఇంటికి పోయి పైసలిచ్చత్త. సెమాపన కోరుత. నువ్వు మన్సు కట్టపెట్టుకోకు” అన్కుంట అనసూయ ఒల్లె తల్కాయ పెట్టిండు. ఆదిరెడ్డి కండ్లు కన్నీటి కడువలైనై.


“ఆదిరెడ్డీ.. మీరంతా మచిగుండాలనీ.. బుద్ధిమంతులై మంచి పేరు తెచ్చుకోవాలనీ.. మీ నాయ్న పేరు నిలెబెట్టాలననేరా  నా ఆరాటం.


 ఇన్నాల్లు ఏదో తెలిసీ తెల్వక పనులు సేసి పాపం మూట కట్టుకున్నం. ఇకనన్న నలుగురికి సాయ పడ్దాంరా. ఏమంటవ్”  


“అమ్మా.. నువ్వు ఏం చెప్పినా  చేత్త. నీ మన్సుల ఏమున్నదో చెప్పు” అని తల్కాయె ఎత్తి అనసూయను సూసిండు ఆదిరెడ్డి.


అనసూయ జరంత సేపు ఆలోసన సేసింది.


ఆదిరెడ్డిని.. సరితను సూసుకుంట.. “ఆదిరెడ్డీ.. గింత కొంప మనకెందుకు.. కిరాయలకిచ్చే కంటే.. ఏదైనా పున్నెం పనులకు ఇచ్చింది మంచిది.


మనం ఐదో అంతస్తుల ఉందాం. ఇంకా పెంటిల్లు ఉండనే ఉండే.. మనకు సరిపోతది. మిగిలిన దాంట్ల చిన్న పిలగాండ్ల కోసరం అనాధాస్రమం పెడ్దాం. అది నేను సూసుకుంట..” ఏమంటవ్.. అన్నట్టు సూసింది ఆదిరెడ్డిని. “నువ్వు భూదందాలు మానెయ్యి. ఏసీల పనే సూసుకో.. అండ్ల పనిసేసేటోల్లకు మంచిగ జీతాలియ్యి. వాల్ల కట్ట సుకాలు తెల్సుకుంట.. కన్న బిడ్డల్ల లెక్క సూసుకో..”


అనసూయ మల్ల మామూలుగ మాట్లాడుతాంటే ఆదిరెడ్డి, సరితల పానం తోడెం నిమ్మలమైంది.  


“అమ్మా.. నీ ఆరాటం తెలిసచ్చింది. నీ మాటల్ల సత్తెం తెల్సుకున్న. భూదందాలన్నీ మానేత్త. ఏసీల పనే సూసుకుంట. సచ్చిపోయిన నాయ్న మీద ఒట్టు. ఇప్పటి సంది నువ్వు సెప్పినట్టే నడ్సుకుంట.


అన్నట్టు చెప్పుడు మర్సిపోయిన. అమ్మా.. ప్రమీల అత్తమ్మకు పంతులమ్మ నౌకరచ్చిందట. నిన్న మాదోస్త్ ఇంటికి పోతే తెల్సింది” అన్నడు ఆదిరెడ్డి.


“సూసినవా.. కొడుకా.. ఒక్కొక్కలు నౌకరున్న పోరినే పెండ్లు సేసుకుంటరు. కాని సురేందర్ తమ్ముడు.. పెడ్లి సేసుకొని పెండ్లాన్ని సదివిచ్చి నౌకరచ్చేటట్టు కట్ట పడ్డడు. ప్రమీల సుత శాన బుధ్ధిమంతురాలు. సక్కంగ సదువుకున్నది. అదంతా నా తమ్ముని మంచి తనమే.. ఔనా.. కాదా..” 


“రాజయ్య తాత నీయతిగల్లోడు గనుకనే.. సురేందర్ మామయ్య.. వాల్ల పిల్లలు సల్లంగున్నరు” అన్నడు ఆదిరెడ్డి. “నేనిప్పుడే సురేందర్ మామయ్య ఇంటికి పోయి పైసలు సుక్త ఇచ్చత్త..


నువ్వట్టు అనాధాస్రమం పెడ్దాం. నువ్వు ఇంక నిశ్చంతగుండు.. లే.. లేసి సల్లబడు”   


అనసూయ తుర్తిగ లేసేది సూసి దేవునికి మన్సుల దండం పెట్టుకున్నడు.


ఆదిరెడ్డి టిఫిన్ చేసి సురేందర్ ఇంటికి  బయల్దేరిండు.


***

ఆదిరెడ్డి మల్ల మునుపటి మనిషయ్యిండు.


తల్లి సెప్పినట్టు  భూదందా బ్రోకరు పనులు మానేసిండు ఆదిరెడ్డి.


ఒక మంచి రోజు సూసి పేపర్ల ప్రకటన ఇచ్చి.. ‘అనసూయమ్మ అనాధాశ్రమం, నాచారం’ అని తన సంతింట్ల ఏర్పాటు సేసిండు.


శంషాబాదు అఫీసును అమ్మంగ వచ్చిన పైసలు అనాధాస్రమం ఖాతాల జమచేసిండు.


ఆదిరెడ్డి శివ లింగ ఏసీ శాపుకు అంకితమై పోయిండు.


యాడాది గడిసింది.


అనాధాస్రమంల యాభై మంది దాకా చేరిండ్లు. అనసూయ సూసుకుంటాంది.


చిన్న పిల్లలు దేవుళ్ళ్తోని సమానమంటరు. అందుల అనాధలు.. వాల్లకు అనసూయ చేసే సేవ ఆదిరెడ్డికి ఫాయిదా అయ్యిందనుకుంట..


ఆ యాడాదికి గాను ‘ఓ-జెనెరల్’ కంపినీ వాల్లు ఆదిరెడ్డిని ‘ఊత్తమ డీలరు’ గా అవార్డు ప్రకటించి సన్మానిచ్చింది. మలేసియా.. సింగపూర్ సూసిరమ్మని గాలి మోటరు టిక్కట్లు.. కర్సులకు పైసలిచ్చింది.


 ఆదిరెడ్డికి ఆకాసమెత్తు ఎగిరిండు.


నిజమైన బతుకేందో సమఝయ్యింది.


ఇంటికి వచ్చుడు, వచ్చుడే.. “అమ్మా.. నీ కొడుకునై పుట్టినందుకు నాకు నిజంగా ఇప్పుడు గమండుగ ఉన్నది. నాయ్న లేకున్నా.. నన్ను కట్టపడి పెంచినవ్. నేను వంకర టింకర నడ్తాంటే బుద్ధి చెప్పి సరింగ నడ్పిచ్చినవ్.


ఇవ్వాల నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే.. నువ్వే కారణం. ప్రతీ తల్లి నీలెక్క ఆరాటపడి కొడుకుల బతుకు బాటలను సవరిచ్చుకుంటే మన దేశం శాన బాగుపడ్తది” అని తనకు వచ్చిన అవార్డును అనసూయ చేతిల పెట్టి  కాల్లకు మొక్కిండు ఆదిరెడ్డి. 

***   

No comments:

Post a Comment

Pages