"బంగారు" ద్వీపం (అనువాద నవల) -17
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(తుఫానులో గట్టుకి కొట్టుకొచ్చిన ఓడను శోధించటానికి మరునాడు ఉదయాన్నే బయల్దేరుతారు జార్జి, ఆమె బృందం. ద్వీపానికి చేరిన వాళ్ళంతా తాడు సాయంతో శిధిలమైన ఓడ పైకి ఎక్కారు. ఓడ అంతర్భాగంలో దిగువకు తొంగిచూసిన వాళ్ళకు అంతా చీకటిగా కనిపించింది. ఇన్నాళ్ళు నీటిలో మునిగి ఉండటాన, నాచు పట్టి అడుగు వేస్తే జారిపోయేలా ఉంది. కేబిన్ లోకి దిగిన వారు ఎంత శోధించినా బంగారపు ఆనవాళ్ళు కనిపించలేదు. డెక్ పైకి తిరిగి వెళ్ళటానికి వెనుతిరిగిన జూలియన్ అకస్మాత్తుగా ఆగిపోయాడు. తరువాత. . .)
@@@@@@@@@@@@@@@@@@@@
జూలియన్ టార్చి వేసి, చివరిసారి ఆ చిన్న కేబిన్ చుట్టూ చూసాడు. డెక్ పైకి వెళ్ళటానికి మిగిలిన వాళ్ళను అనుసరిస్తూ తన టార్చీని ఆర్పబోతుండగా, అతని దృష్టిని ఏదో ఆకర్షించి ఆగిపోయాడు. అతను చేతిలోని టార్చి వెలుతురుని దానిపై కేంద్రీకరించి, మిగిలిన వారిని పిలిచాడు.
"ఇదిగో! కొంచెం ఆగండి. ఇక్కడ గోడలో అలమర ఉంది. దానిలో ఏమైనా ఉందేమో చూద్దాం!"
మిగిలినవాళ్ళు వెనక్కి వచ్చారు. కేబిన్ గోడలో రహస్యంగా బిగించిన చిన్న అలమరలా కనిపించే దానిని అందరూ చూసారు. అక్కడ జూలియన్ కంటిని ఆకర్షించింది ఏమిటంటే తాళం చెవి పెట్టే కన్నం. అయితే, అక్కడ దాని తాళం తగిలించి లేదు.
"దాని లోపల ఏదో ఉండి ఉండవచ్చు" అన్నాడు జూలియన్. తన వేళ్ళతో అతను ఆ చెక్క తలుపుని బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అది కొంచెం కూడా కదలలేదు. "ఇది తాళం వేసి ఉంది" చెప్పాడతను. "అదే కావచ్చు."
"ప్రస్తుతం ఆ తాళం బిగిసిపోయి ఉందనుకొంటాను" జార్జి అంటూ తాను కూడా ప్రయత్నించింది. తరువాత ఆమె బలంగా ఉన్న ఒక పోకెట్ నైఫ్ ని బయటకు తీసి అలమర తలుపుకి, కేబిన్ గోడకి మధ్యలో దూర్చింది. ఆమె దానిని గట్టిగా వెనక్కి నెట్టగానే పెద్దగా శబ్దం చేస్తూ అలమర తాళం ఊడి వచ్చింది. ఆమె చెప్పినట్లే అది బాగా బిగిసిపోయి ఉంది. ఆ తలుపుని బలంగా తెరవగానే, పిల్లలకు ఆసక్తి గొలిపే వస్తువులతో ఉన్న ఒక అర కనిపించింది.
కొన్నేళ్లుగా సముద్రపు నీటిలో పడి ఉండటాన ఉబ్బిన చెక్క పెట్టె ఆ అరలో ఉంది. అంతేకాక రెండు, మూడు వస్తువులు, నీటిలో నానటం వల్ల ముద్ద కట్టిన పాత పుస్తకాలలా, కనిపించాయి. ఒక రకమైన త్రాగడానికి ఉపయోగించే గాజు పాత్ర లాంటి వస్తువు సగానికి పగిలి ఉంది. ఇవే కాక సముద్రపు నీటిలో పాడైపోయిన రెండు, మూడు చిత్రమైన వస్తువులు ఉన్నాయి. అవి ఏమిటన్నది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు.
"ఈ పెట్టె తప్ప ఆసక్తికరమైన వేవీ లేవు" అంటూ జూలియన్ దానిని చేతితో పైకెత్తి చూసాడు. "ఏమైనప్పటికీ, దీని లోపల ఉన్నదేదైనా పాడైపోయి ఉండాలి. కానీ మనం గట్టిగా ప్రయత్నించి దీన్ని తెరుద్దాం."
అతను, జార్జి ఆ పాత చెక్క పెట్టెను బలవంతంగా తెరవటానికి ప్రయత్నించారు. పెట్టె పైభాగంలో హెచ్.జె.కె. అన్న అక్షరాలు చెక్కి ఉన్నాయి. "
"అవి కెప్టెన్ ఇనీషియల్స్ అనుకుంటా!" అన్నాడు డిక్.
"కాదు. అవి మా ముత్తాత ముత్తాత ముత్తాత ఇనీషియల్స్" చెబుతున్న జార్జ్ కళ్ళు ఆనందంతో మెరిసాయి. "ఆయన గురించి నేను పూర్తిగా విన్నాను. ఆయన పేరు హెన్రీ జాన్ కిర్రిన్. ఇది ఆయన ఓడే తెలుసా? ఇది బహుశా తన కాగితాలను, డైరీలను పెట్టుకొని, రహస్యంగా దాచుకొనే ఆయన వ్యక్తిగతమైన పెట్టె అయి ఉండాలి. ఓ! మనం తప్పనిసరిగా తెరవాల్సినదే!"
అక్కడ ఉన్న పనిముట్లతో ఆ పెట్టెను బలవంతంగా తెరవాలని ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించి, జూలియన్ దానిని పట్టుకొని, తమ పడవ దగ్గరకు తీసుకెళ్ళాడు.
"దీనిని ఇంటి దగ్గర తెరుద్దాం" చెబుతున్న అతని గొంతులో హుషారు ధ్వనించింది. "సుత్తో, ఏదో తీసుకుని దీన్ని ఎలాగో తెరవవచ్చు. ఓ జార్జ్! ఇది నిజంగా విలువైనదే!"
అద్భుతమైన వస్తువేదో తమ హస్తగతం అయినట్లు పిల్లలు భావించారు. ఆ పెట్టెలో ఏదైనా వస్తువు ఉందా? ఉంటే, అది ఏమై ఉంటుంది? వెంటనే ఇంటికి చేరుకొని దాన్ని తెరవాలన్న ఆకాంక్ష వారిలో పెరిగిపోయింది.
వాళ్ళంతా వేలాడుతున్న పాత ఇనుప నిచ్చెన ఎక్కి డెక్ పైకి చేరుకొన్నారు. తాము పైకి చేరగానే, సముద్రపు అడుగు నుంచి గట్టుపైకి కొట్టుకొచ్చిన శిధిలమైన ఓడను, తమ చుట్టూ చేరి గమనిస్తున్న యితరులను వాళ్ళు గమనించారు.
"అయ్యో! గట్టున చేపలు పట్టే సగం పడవలు మనల్ని కనుగొన్నాయి!" జూలియన్ అరిచాడు. చుట్టూ చూసిన అతనికి చేపలు పట్టే పడవలు ధైర్యంగా ఆ శిధిలమైన ఓడ సమీపంలోకి రావటాన్ని అతను గమనించాడు. జాలర్లు వీళ్ళున్న ఓడను ఆశ్చర్యంతో చూస్తున్నారు. వాళ్ళకి ఓడ మీద పిల్లలు కనిపించగానే, గట్టిగా పిలవటం మొదలెట్టారు.
"ఎహోయి అక్కడ! ఆ ఓడ ఏమిటి?"
"ఇది శిధిలమైన ఓడ! " గట్టిగా అరిచి చెప్పాడు జూలియన్. "నిన్న వచ్చిన తుఫానులో యిది గట్టుకి విసిరి వేయబడింది!"
"ఇంకేం చెప్పకు" జార్జి కోపంతో మొహాన్ని చిట్లించింది. "ఇది నా పాడుపడ్డ ఓడ. దీనిని చూడటానికి ఎవర్నీ అనుమతించను."
తరువాత ఏమీ చెప్పలేదు. నలుగురు పిల్లలు తమ పడవెక్కి సాధ్యమైనంత వేగంగా యింటికి బయలుదేరారు. అప్పటికే వాళ్ళ టిఫిన్ సమయం దాటిపోయింది. వాళ్ళు బాగా చీవాట్లు తినవచ్చు. జార్జి కోపిష్టి తండ్రి వాళ్ళను బలవంతంగా మంచాలెక్కించొచ్చు. కానీ వాళ్ళు లెక్కచేస్తారా? వాళ్ళు శిధిలమైన ఓడను శోధించారు. అంతేకాక, బంగారు కడ్డీలు కాకపోయినా, ఒక చిన్న కడ్డీ అయినా ఉండే ఒక పెట్టెతో యింటికి వచ్చారు!
అనుకొన్నట్లే వాళ్ళు చీవాట్లు తిన్నారు. టిఫిన్ కూడా సగమే తిన్నారు. ఎందుకంటే క్వెంటిన్ బాబాయి ఆలస్యంగా వచ్చిన వాళ్ళు నిప్పులో కాల్చిన రొట్టె, పళ్ళతో చేసిన తీపి పదార్థాలకే తప్ప, వేడి మాంసం, గుడ్లకు అర్హులు కారని చెప్పాడు. ఇది చాలా విచారకరం.
తమకు దొరికిన పెట్టెను వాళ్ళు అబ్బాయిల గదిలో మంచం కింద దాచారు. కుక్క టిం ని జాలరి కుర్రాడికి అప్పజెప్పటంతో, తాను చేపల వేటకు వెళ్తున్నందున ఆల్ఫ్, దానిని యింటి వెనుక స్థలంలో కట్టేసాడు. చేపలు పట్టడానికి వెళ్తూ తన తండ్రి పడవలోంచి వింత గొలిపే ఆ శిధిలమైన ఓడను చూసాడు.
"పర్యాటకులను ఆ ఓడ మీదకు అనుమతించి మనం కొద్దిగా సొమ్ము చేసుకోవచ్చు" ఆల్ఫ్ చెప్పాడు. ఆ రోజు చీకటి పడే లోగా ఆసక్తి గల చాలామంది జనాలు మోటారుబోట్లు, చేపలు పట్టే దొన్నెల్లోంచి ఆ శిధిలమైన ఓడను చూసారు.
జార్జి దీనికి కోపగించుకొంది. కానీ ఆమె ఏమీ చేయలేదు. జూలియన్ చెప్పినట్లు, దానిని ఎవరైనా బయటనుంచి అలా చూడవచ్చు!
@@@@@@@
టిఫిన్ తినగానే ఆ పిల్లలు చేసిన మొదటి పని ఏమిటంటే, విలువైన ఆ పెట్టెను తీసుకొని తోటలో ఉన్న టూల్ షెడ్డుకి వెళ్ళారు. దానిని బలవంతంగా తెరవాలని ప్రయత్నించారు. ఏదో విలువైన సంపద దానిలో ఉందని ఎవరికి వారు తమలో రహస్యంగా భావించారు.
జూలియన్ పనిముట్టు కోసం చుట్టూ చూసాడు. అతనికి ఉలి లాంటిది కనిపించింది. ఆ పెట్టెను బలవంతంగా తెరవడానికి అది ఉపయోగిస్తుందని భావించాడు. దానితో ప్రయత్నించాడు కాని అది జారిపడి చేతివేళ్ళలో గుచ్చుకొంది. తరువాత అతను వేరే వస్తువులతో ప్రయత్నించాడు. కానీ ఆ పెట్టె తెరుచుకోవడానికి మొరాయించింది. పిల్లలు దాని వైపు చిరాకుగా చూసారు.
"దీనితో ఏమి చేయాలో నాకు తెలుసు" చివరికి అన్నె మాట్లాడింది. "దీనిని యింటి పైకప్పు మీదకు తీసుకెళ్ళి, బలంగా నేల పైకి విసిరి కొడదాం. అప్పుడది టక్కున తెరుచుకుంటుంది అనుకుంటున్నాను."
మిగిలిన వారు దాని గురించి ఆలోచించారు. "అలా ప్రయత్నించటం మంచిదే" అన్నాడు జూలియన్. "ప్రమాదం ఏమిటంటే, పెట్టెలో ఏదైనా వస్తువు ఉంటే, అది పగిలి పోవటమో, ధ్వంసం అవటమో జరుగుతుంది."
కానీ పెట్టె తెరుచుకోవడానికి మరో మార్గం కనిపించటం లేదు. అందుకే జూలియన్ ఇంటి పైకప్పు మీదకు దానిని మోసుకెళ్ళాడు. అతను అటక మీదకు వెళ్ళి, దాని కిటికీని తెరిచాడు. మిగిలిన వాళ్ళంతా కింద నుంచి ఎదురు చూస్తున్నారు. జూలియన్ ఆ కిటికీలోంచి క్రూరంగా దాన్ని బయటకు విసిరాడు. అది గాలిలో దూసుకొచ్చి కింద ఎగుడుదిగుడుగా ఉన్న నేలను పెద్ద శబ్దంతో తాకింది.
తక్షణమే పక్కనున్న ఫ్రెంచ్ కిటికీ తెరుచుకుని క్వెంటిన్ బాబాయి తుపాకీ గుండులా దూసుకొచ్చాడు.
"ఏం చేస్తున్నారిక్కడ?" అని అరిచాడు. “కిటికీ లోంచి మీరు ఒకరి మీద ఒకరు వస్తువులు విసురుకోవటం లేదు కదా? నేల మీద అదేమిటి? "
పిల్లలు పెట్టె వైపు చూసారు. అది తెరుచుకుని నేలపై పడి ఉంది. దానిలోకి నీరు చొరబడకుండా అంచు వద్ద తగరపు పూత పూసి ఉంది. పెట్టెలో ఉన్న వస్తువులేవీ చెడిపోలేదు! అవన్నీ పొడిగా ఉన్నాయి!
డిక్ దానిని తీయటానికి పరిగెత్తాడు.
"నేల మీద ఉన్నదేమిటని అడుగుతున్నానా?" అతని బాబాయి గట్టిగా కేకలేస్తూ అటు వైపు కదిలాడు.
"అది .... అది మాకు చెందినది" ఎర్రబడ్డ ముఖంతో చెప్పాడు డిక్.
"సరె! దీన్ని నేను పట్టుకెడుతున్నాను" అన్నాడు బాబాయి. "లేదంటే ఇలాగే నాకు చిరాకు తెప్పిస్తారు. అది నాకియ్యి. దీన్నెక్కడ నుండి తెచ్చావు?"
ఎవరూ బదులీయలేదు. కోపంతో చిట్లిస్తున్న అతని ముఖం నుండి కళ్ళజోడు జారిపడేంత పని అయింది. "దీన్నెక్కడ నుండి తెచ్చారు?" తనకు సమీపంలో గుడ్లు అప్పగించి చూస్తున్న అన్నెపై క్వెంటిన్ కస్సుమన్నాడు.
"పాడై..పో..యి..న ఓడ...నుంచి...." వణికిపోతున్న ఆ చిన్న పిల్ల మాట తడబడింది.
"పాడైపోయిన ఓడా?" ఆమె బాబాయి ఆశ్చర్యపోయాడు. "నిన్న గట్టుకి కొట్టుకొచ్చిన ఓడేనా? దాని గురించి నేను విన్నాను. నువ్వు చెప్పేది దానిలోకి మీరు వెళ్ళారా?"
"అవును" చెప్పాడు డిక్. అప్పుడే వారి వద్దకు వచ్చిన జూలియన్ కంగారుగా చూస్తున్నాడు. అప్పుడే తెరుచుకున్న ఆ పెట్టెను అతని మామయ్య పట్టుకుపోతే చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం అతను చేసిందదే!
"సరె! దీనిలో ముఖ్యమైనవేవో ఉండొచ్చు" అంటూ పెట్టెను డిక్ చేతుల్లోంచి తీసుకున్నాడతను. “ఆ పాడైపోయిన ఓడలో తొంగి చూచే హక్కు నీకు లేదు. దానిలోంచి ముఖ్యమైనదేదో నువ్వు తీసుకున్నావు."
"అది నా ఓడ" జార్జి కయ్యానికి దిగుతున్నట్లు అంది. "నాన్నా! దయచేసి ఆ పెట్టె మాకివ్వండి. మేమిప్పుడే దాన్ని తెరిచాము. దానిలో బంగారు కడ్డీ .... అలాంటి దేదో ఉందని మేము అనుకొంటున్నాము."
"బంగారు కడ్డీనా!" ఆమె తండ్రి బుసలు కొట్టాడు. "ఎలాంటి అమ్మాయివి నువ్వు! ఈ చిన్నపెట్టెలో అలాంటి వేవీ ఉండవు. ఆ కడ్డీలకు ఏమైందో తెలియజేసే వివరాలు దీనిలో ఉండే అవకాశం ఉంది. ఆ బంగారం ఎక్కడో అప్పజెప్పాల్సిన చోట అప్పగించి ఉంటారనే నేనెప్పుడూ అనుకొంటూ ఉంటాను. విలువైన సరుకులను పూర్తిగా దించేసిన పిదప గట్టు వదలి తిరిగి వస్తూ, ఈ ఓడ సముద్రంలో మునిగిపోయింది."
"ఓ నాన్నా! దయచేసి మా పెట్టెను తీసుకోనివ్వండి" బతిమాలే జార్జి కన్నీటి పర్యంతమైంది. బంగారానికి ఏమైందో తెలిపే పత్రాలేవో ఆ పెట్టెలో ఉండి ఉండవచ్చని అకస్మాత్తుగా ఆమెకు అనిపించింది. కానీ ఆమె తండ్రి బలవంతంగా తెరవబడి విరిగిపోయిన పెట్టెను తీసుకుని, మరో మాట చెప్పకుండా వెనక్కి తిరిగి యింట్లోకి వెళ్ళిపోయాడు. అతని చెయ్యి ఆనిన చోట పెట్టెకి ఉన్న తగరపు పూత మెరుస్తోంది.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment