మానసవీణ - 53 - అచ్చంగా తెలుగు

మానసవీణ - 53

Share This

 మానసవీణ - 53

డా.నీహారిక


తన ఛాంబర్ లో దీర్ఘంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు దినేష్. చేతిలో అప్పలనాయుడు కెస్ ఫైల్. ఎన్నో చిక్కుముడులు కనిపిస్తున్నాయి. భూవివాదం, గూడెంలో ఆడపిల్లలను నాశనం చెయ్యడం మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. కానీ దీని వెనక ఇంకేదో ఉంది అనిపిస్తోంది దినేష్ కు. లోతు తెలీని బావి లా ఉంది చూడటానికి. దిగాలి అంటే ఏదన్నా ఆధారం కావాలి. చేతిలో ఉన్న ఫైల్ ను మళ్ళీ మళ్ళీ చదువుతుండగా ఒకచోట ఆగిపోయింది దినేష్ చూపు. భృకుటి ముడి పడింది. వెంటనే ఫోన్ తీసి తనకు బాగా తెలిసిన నెంబర్ కు కాల్ చేశాడు.

***

చీకట్లు ముసిరి, వెన్నెల కురుస్తున్న రాత్రి. ఇంటిబయట అమ్మ పెంచిన పూలమొక్కల మధ్యలో కూర్చొని ఉంది మానస. కొండప్రాంతం కావడంతో చల్లటి గాలి వీస్తోంది. ఆహ్లాదమైన ప్రకృతి మధ్యలో, పైనుండి కురుస్తున్న వెన్నెల వానలో తడుస్తూ ముగ్ధలా కూర్చున్న మానసను చూసి మురిసిపోతున్నాడు అనిరుధ్. తనపక్కగా వచ్చి కూర్చున్నాడు. 

"ఏంటి మానసా? ఇక్కడ కూర్చున్నావ్? మంచు పడుతోంది. లోపలకు వెళదాం రా."

"అనిరుధ్, సరిత చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నా. తను ఇంకేదో ఉంది అని చెప్పబోయింది చూడు. అదేంటో తెలుసుకోవాలి. పైగా సుశీలమ్మ గారు కూడా ఒకసారి నాతో అన్నారు, తన భర్త రహస్యంగా ఏదో చేస్తున్నాడు అని, తను వారించినా పట్టించుకోలేదు అని."

"సరితతో మాట్లాడితే తెలుస్తుంది కదా. కానీ తను కళ్ళుతిరిగి పడిపోయింది. జగ్గయ్య తాత వచ్చి మందు వేసి వెళ్ళాడు. రాజా తన పక్కనే ఉన్నాడు ఇంకా. తను లేస్తే..." అనిరుధ్ మాట పూర్తికాక ముందే మానస ఫోన్ మోగింది. ఆశ్రమం నుండి  జనని వీడియో కాల్.

"ఏంటి జననీ, ఇంత రాత్రివేళ చేస్తున్నావ్!?? ఏమైనా అర్జెంట్ ఆ??"

"మానస గారు! చైత్ర ఎందుకనో రెండు రోజులనుంచి రాత్రి పూట భయంతో కేకలేస్తుంది,ఏడుస్తుంది. ఏమైంది అని అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పటంలేదు. మీరు మాట్లాడితే ఏమైనా చెప్తారేమో అని చేశాను" అని ఫోన్ ఆ నలుగురి వైపు తిప్పింది. 

అప్పుడే ఇంటి నుండి బయటకు వచ్చిన సరిత మానసతో పాటు ఫోన్ చూసి భయంతో గజగజ వణికిపోతోంది. 

"వీళ్లూ... వీళ్ళు మీకెలా తెలుసు!? దయచేసి వాళ్ళని జాగ్రత్తగా కాపాడండి. నేను గూడెంలో ఉన్నానని ఈపాటికి ఆ అప్పలనాయుడు మనుషులకు  తెలిసిపోయి ఉంటుంది, నేను దొరికితే పిల్లలు దొరికినట్లే!! 

"ఏంటి సరితా... ఏం చెప్తున్నావ్?!? ఈ పిల్లలు నీకెలా తెలుసు?" 

  "అక్కా... మమ్మల్ని ఆరోజు కాపాడింది నువ్వే కదూ. అక్కా మమ్మల్ని ఎత్తుకొచ్చినపుడు ఆ రోజు గుడిసెలో చూసిన ఒక బూచాడు నిన్న ఇక్కడికి వచ్చాడు అక్కా. భయమేస్తోంది అక్కా..." చైత్ర ఏడుస్తూ చెబుతోంది సరితను చూసి.

 ఏమి అర్థం కాలేదు మానసకు. పిల్లలకి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది. "ఇప్పుడు చెప్పు సరితా. ఆ రాత్రి ఏమైంది?? ఈ పిల్లలు నీకెలా తెలుసు?" అంటూ సరితను అడిగింది మానస. 

"ఆ రాత్రి అప్పలనాయుడు దగ్గరనుంచి తప్పించుకున్న నాకు నడుస్తుంటే అతని ఇంటి వెనక ఒక గుడిసె అందులోనుంచి ఏడుపులు వినిపించాయి. కాపలాగా ఎవరూ లేకపోవడంతో అందులో చూస్తే, అయిదుగురు ఆడపిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు అనాధలు, వాళ్ళని అమ్మేయడానికి వేరేవేరే ఆశ్రమాల నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడ నిర్బంధించారు. వారిని అవయవాల కోసము, వేరే దేశాలకి అమ్మకానికి పెట్టారని. నా బ్రతుకులాగే వారిది అవ్వకూడదని ఆ క్షణం నిశ్చయించుకున్నాను. అందుకే ఇందులోకి రాజాని దింపితే అతని ప్రాణానికి ప్రమాదమని తెలిసి అతనికి తెలియకుండా ఈ పిల్లలను తీసుకుని పారిపోయాను.

కానీ విధి ఎలా ఆడుతుందో మాతో!! ఆ పారిపోయే క్రమంలో అప్పలనాయుడు మనుషులు మమ్మల్ని వెంబడిస్తూ ఒకరిని చంపేశారు. నేనూ ఇంకా మిగతా నలుగురం ఎలాగోలా అడవిగుండా పట్నం చేరుకున్నాం. అక్కడ అనుకోకుండా నేను మీ అమ్మగారి దగ్గర పనిమనిషిగా చేరడం, ఆ పిల్లలను ఒక ఆశ్రమంలో చేర్చడం జరిగింది." అని బాధ పడింది సరిత.

ఇంతలో వెనక నుండి ఎవరో పరిగెడుతున్నట్టు  శబ్దం రావడంతో, మానసా, అనిరుధ్, రాజాలు  ఉలిక్కిపడ్డారు. "నేను చూసొస్తా" అంటూ రాజా నెమ్మదిగా వెళ్ళాడు ఆ శబ్దం వచ్చిన వైపు... అక్కడ ఒక వ్యక్తి చీకట్లో తచ్చాడుతున్నాడు. మెల్లిగా వెళ్లి ఒడుపుగా వాణ్ణి పట్టి ఒక్క నిముషంలో లాఘవంగా తన కండువాతో చేతులు కట్టేసి లాక్కొచ్చి అందరిముందు పడేసాడు రాజా.

అతన్ని చూడగానే ఖంగు తింది మానస...

"నువ్వు కరాటే మాస్టర్ ప్రవీణ్ వి కదూ... ఇక్కడేం చేస్తున్నావ్ చెప్పు..." అంటూ శివంగిలా విరుచుకుపడింది మానస.

"చెబుతాను. ముందు నా కట్లు విప్పండి. నేను మీ మిత్రుడినే కానీ శత్రువును కాను. నన్ను నమ్మండి" అని అన్నాడు.

ఆ మాటతో రాజా అతని కట్లువిప్పి నిలబెట్టాడు. 

"నేను మీరు అనుకుంటున్నట్టు కరాటే మాస్టర్ ని కాదు. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ ని. పేరు మార్చుకొని ఆశ్రమంలో చేరాను. అక్కడ నన్ను మఫ్టీ లో డ్యూటీ చెయ్యమని చెప్పింది ఇన్స్పెక్టర్ దినేష్ గారే."

"ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగారు అందరూ.

"దానికి సమాధానం నేను చెబుతాను" 

ఆ మాట వినిపించిన వైపు తిరిగి చూడగా, ఇన్స్పెక్టర్ దినేష్ గారు కనిపించారు అందరికి. 

అప్పుడే తెలవారుతోంది. నెమ్మదిగా చీకట్లు వదిలి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి భూమి మీదకు. 

"నేను అప్పలనాయుడు ఫైల్ చూస్తుండగా , అతన్ని అరెస్ట్ చేసిన రోజు రాత్రి ఫార్మాలిటీ కోసం తీసిన ఫోటోలో కొన్ని నిజాలు తెలిశాయి. అందులో నాకు కోల్ట్ స్టోరేజ్ బాక్స్ కనిపించింది. అసలు అది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం అని చేసిన ప్రయత్నంలో తెలిసింది ఏంటంటే అది మానవ అవయవాలు పాడవకుండా రవాణా కోసం వాడతారని. తరువాతి రోజు మానస నన్ను ఆశ్రమానికి పిలవడం, నేను వెళ్లడం, అక్కడ  ఇన్స్పెక్టర్ శశిధర్ ను కరాటే మాస్టర్ గా చూపించడం జరిగాయి. అన్నీ కేస్ ఛేదించడానికి నేను చేసినవే." అంటూ చెప్పుకొచ్చాడు ఇన్స్పెక్టర్ దినేష్.

"కానీ సర్, మా ఆశ్రమంలో ఎందుకు ఎంక్వైరీ చెయ్యాలి?" అనుమానంగా అడిగాడు అనిరుధ్.

 "ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది." అంటూ ఒక ఫైల్ లో జాగ్రత్తగా దాచిన ఫోటో చూపించాడు దినేష్ అందరికీ.

ఆ ఫోటోలో అప్పలనాయుడిని అరెస్ట్ చేసిన రాత్రి రక్షించిన బోటనీ స్టూడెంట్స్ తో పాటు ఒక మూలగా ఉన్న పోర్టబుల్ కోల్డ్ స్టోరేజ్ బాక్స్ ఉంది. దాని పైన బాగా క్షుణ్ణంగా చూస్తే కానీ కనిపించని అతిచిన్న అక్షరాలు, హాండ్ జూమ్‌ లెన్స్ సాయం తో చూపించాడు దినేష్ అందరికి.. 

అవే..."జిటిఆర్". గుమ్మనేని త్రివిక్రమరావు, అనిరుధ్ తండ్రి.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages