నేటి గృహిణి
(చిన్న కథ )
టి. వి. యెల్. గాయత్రి.
ఆ రోజు శనివారం సాయంత్రం కావస్తోంది.
"మమ్మీ!మమ్మీ!ఈ రోజు సాయంత్రం నా ఫ్రెండ్స్ మనింటికి వచ్చి ఆడుకుంటారు."అని గంతులు వేస్తూ చెప్పింది శ్రీజ.
హరిణి, మధు లిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వాళ్ళ పాప ఎనిమిదేళ్ల శ్రీజ.చుట్టుపక్కల పిల్లలతో ఆడుతూ ఉంటుంది. ఒక్కోసారి శ్రీజ తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి ఆడుకుంటే, మరొకసారి శ్రీజ ఫ్రెండ్స్ వచ్చి వీళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఇలా శని, ఆది వారాలు గడుస్తూ ఉంటాయి.
"ఒకే!అందరికీ పిజ్జాలు తెప్పించనా!"అంది మురిపెంగా హరిణి.
"పిజ్జాలతో పాటు కేకు కూడా ఉంటే బాగుంటుంది!"అంది శ్రీజ.
"సరే!ఆర్డరిస్తాను. వస్తుంది. పైనాపిలా? చాక్లెట్టా?"
"కాదు మమ్మీ!మొన్న త్రిషా వాళ్ళ మమ్మీ చేసింది బనానా కేక్. నువ్వు కూడా ఇంట్లో చెయ్యి!"అంటూ ముద్దుగా ఆర్డర్ వేసింది శ్రీజ.
ఖంగుతిన్నది హరిణి.
తనకు కేకులు, బేకులు చెయ్యటం చేతకాదు. అలా ఆంటే స్వీట్స్, హాట్లు కూడా వండటం రాదు. బయటనుండి ఆర్డరిచ్చి తెప్పించుకోవటమే!దోసెపిండి, ఇడ్లీ పిండి కూడా ఇంట్లో చేసి పెట్టే పని లేదు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ వంటలూ, పిండి వంటలూ చెయ్యటం ఎలాగా?
"మమ్మీకి కాస్త రెస్ట్ కావాలి కదా!కేకు నీకు షాపు నుండి ఆర్డర్ ఇస్తాను!"అన్నాడుమధు పాపను అనునయిస్తూ.
తల అడ్డంగా ఊపింది శ్రీజ.
"అందరి మమ్మీలు ఇంట్లోనే కేక్స్ చేస్తారు డాడీ!మన మమ్మీ కూడా ఇంట్లోనే కేక్ చెయ్యొచ్చు కదా !"గునుస్తూ అంది శ్రీజ.
"నీ ఫ్రెండ్స్ మమ్మీలు హౌస్ వైఫ్ లు కదా!వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మన మమ్మీ జాబ్ చేస్తుంది.కంపెనీలో పని ఎక్కువ ఉంటుంది. సాటర్ డే , సండే టూ డేస్ కాస్త మమ్మీకి రెస్ట్ కావాలి కదా!ఐస్ క్రీం కూడా ఆర్డర్ చేస్తాను!"ఇంకా శ్రీజకు వివరిస్తూ బతిమిలాడాడు మధు.
"ఊహు!ఈ ఒక్క సారి మమ్మీ కేక్ చేస్తుంది!... అంటూ బుంగమూతి పెట్టింది శ్రీజ.
ఇంకా గట్టిగా చెప్తే ఏడుపు లంకించుకొంటుంది అనుకొని
"పోనీ యుట్యూబ్ లో చూసి చెయ్యరాదా!"అన్నాడు మధు.
"నువ్వుకూడా రారాదూ!ఇద్దరం చేద్దాం !..."తన మీద తనకు నమ్మకం లేదు హరిణికి.
"డాడీ వద్దు మమ్మీ!నువ్వే చెయ్యి!మా మమ్మీకి కూడా కేక్ చెయ్యటం వచ్చు అని ఫ్రెండ్స్ తో చెప్పాలి!"అంది శ్రీజ.
"దీనికి ప్రిస్టేజ్ ఇష్యూ అయింది. నువ్వే చెయ్యాలి!అన్నాడు నవ్వుతూ మధు.
"నువ్వు తప్పించుకోవాలి అని కదా!"అంటూ చిరుకోపం ప్రకటించింది హరిణి.
"ప్లీజ్!ప్లీజ్ మమ్మీ!అందరింట్లో మమ్మీలే కేక్స్ చేస్తారు తెలుసా!"అని మమ్మీ వైపు చూసింది శ్రీజ.
'చిన్నపిల్ల!దాన్ని నిరుత్సాహపరచటం ఎందుకు? కేకు చెయ్యటం పెద్ద బ్రహ్మవిద్య కాదు. కాసేపు యూట్యూబ్ లో చూస్తే సరి!'అనుకుంటూ కేక్ చెయ్యటానికి సిద్ధపడింది హరిణి.
తను గెలిచినట్లు గంతులు వేస్తోంది శ్రీజ.
పిల్లలు వచ్చేలోపు పిజ్జాలు ఆర్డర్ ఇచ్చింది. యూట్యూబ్ లో బనానా కేక్ రిసిపి చూసింది.'అంతేనా!ఈజీగా చెయ్యొచ్చు!'అనుకుంది కాన్ఫిడెంట్ గా.
కావాల్సినవన్నీ బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించింది.
ఇంతలో శ్రీజ ఫ్రెండ్స్ వచ్చారు.
"మా మమ్మీ కేక్ చేస్తోంది!బనానా కేక్ "అంటూ గర్వంగా ఫ్రెండ్స్ తో చెప్పింది శ్రీజ.
పిల్లలందరూ కోలాహలంగా ఆడుకుంటున్నారు.
అన్ని పదార్థాలు యూట్యూబ్ లో చెప్పిన కొలతల ప్రకారం కలిపి ఓవన్ లో జాగ్రత్తగా పెట్టింది హరిణి.కాసేపాగి ఓవెన్ తెరిచి చూసింది. ఇంకా అవలేదు... మళ్ళీ చూసింది.. అవలేదు.. పచ్చిగానే ఉంది..
'సరే!కాసేపు కూర్చుందాం!'అనుకుంటూ మధు పక్కన కూర్చుని టి. వి. లో 'హాయ్ నాన్నా!'సినిమాలో పాటలు చూస్తూ కూచుంది. కాసేపటికి కేక్ గుర్తొచ్చింది.
గబక్కున ఓవెన్ తెరిచి చూసింది. బ్రౌన్ కలర్ తో పైకి బాగానే ఉంది.బయటికి తీసి పిల్లన్ని పిలిచింది. ఉత్సాహంగా ప్లేట్లు పట్టుకొని వచ్చారు పిల్లలు.
తీరా కట్ చేద్దామంటే లోపల రాయిలాగా గట్టిగా ఉంది.మధ్యలో మాడిపోయింది.పిల్లల ముందు అభాసుపాలైనట్లు అనిపించింది హరిణికి.
శ్రీజకు దిగులేసింది.
ఏం చెయ్యాలో తోచలేదు హరిణికి. 'దీన్ని పారేసి మళ్ళీ ఇంకోటి చెయ్యాలా ఇప్పుడు...'
పిల్లలు గబగబా గదిలోకి వెళ్లి గుసగుసలాడుకొన్నారు.ప్రసన్నమైన ముఖాలతో అందరూ గదిలోంచి బయటికి వచ్చారు.
ఆ కేకు ముక్కల్ని ప్లేట్లో పెట్టుకున్నారు.
"ఆంటీ!ఫెంటాస్టిక్!కేక్ చాలా బాగుంది!"అంటూ హరిణిని పొగుడుతూ అతి కష్టం మీద కేకును తింటున్నారు పిల్లలు.
"కేక్ చాలా బాగుంది మమ్మీ!"అంటూ శ్రీజ హరిణిని ముద్దుపెట్టుకొంది.
పసిపిల్లలు!వాళ్ళ బిహేవియర్ చూస్తే సంతోషం వేసింది హరిణికి.
చిన్న పిల్లలు!ఎంత మెచూరుటీగా, హుందాగా ప్రవర్తిస్తున్నారు!
దగ్గరగా వచ్చాడు మధు.
కేకు ముక్క నోట్లో పెట్టుకొని "ఓస్!ఇంతే కదా!కొద్దిగా మాడింది. మన మమ్మీ ప్రేమ కేకులో కాస్త ఎక్కువయింది. మమ్మీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. నెక్స్ట్ టైమ్ అద్భుతంగా చేస్తుంది!"అంటూ భార్య భుజం తట్టాడు.ఫోన్ తీసికొని బేకరీకి కేక్, గులాబ్ జామ్ ఆర్డరిచ్చి ఒక అరగంటలో ఇంటికి వచ్చే ఏర్పాటు చేశాడు.
గిల్టీగా ఉంది హరిణికి.కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.'కంపెనీలో ప్రాజెక్టులు అతి సమర్ధవంతంగా చకచకా చేస్తూ ప్రమోషన్లు తెచ్చుకునే తను ఇంట్లో ఆఫ్టరాల్ ఒక కేకు చెయ్యలేకపోతోంది. టైమ్ లేదు అనుకోవటం కన్నా శ్రద్ధ లేకపోవటమే!ఈసారి కొంత టైమ్ తీసికొని భర్తకు, పాపకు వెరైటీ వంటలు నేర్చుకొని చెయ్యాలి 'అని గట్టిగా నిశ్చయించుకొంది ఈ కాలపు ఆధునిక గృహిణి హరిణి.
***
No comments:
Post a Comment