ఒకటైపోదామా ఊహల వాహినిలో - 10 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా ఊహల వాహినిలో - 10

Share This

 ఒకటైపోదామా ఊహల వాహినిలో - 10

కొత్తపల్లి ఉదయబాబు


(పెళ్లి కాకుండానే తనకు బిడ్డను కనిమ్మని హరితను అడుగుతాడు విరాజ్. ఆ అంశం మీద తన తల్లితో మాట్లాడుతూ ఉంటుంది హరిత.)

నీ మనవరాలు నాన్నమ్మో, అమ్మమ్మో అయినా ఈ దేశంలో ఆడదాని స్థితి, పరిస్థితి మారదమ్మా.మనదేశం ప్రజాస్వామ్య లౌకిక దేశం అని చెబుతూనే కోటిపడగల విషం కక్కే రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఈ దేశంలో ఆడదాని బ్రతుకు మరింత హీనమే అవుతుంది తప్ప ఏమీ మార్పు రాదు. అందుకే ఒక నిబద్ధతతో, మన హుందాతనాన్ని  మనం కాపాడుకుంటూ, మన జోలికి వచ్చినప్పుడు కాగితం పులిలా భయపెట్టి తప్పుకోవడమే మనం చేయవలసింది. '' 

హరిత అయిదు నిముషాలు మాట్లాడలేదు. ఒక్కసారిగా కళ్ళు తుడుచుకుని తల్లి దగ్గరగా వచ్చి కూర్చుంది. 

తల్లి చేయి తన తలమీద పెట్టుకుని అంది. 

'' ప్రారంభంలోనే నా కళ్ళు తెరిపించావు మమ్మీ.. నువ్వన్నట్టు చనిపోయిన నాన్నమీద కాదు. నన్ను కడుపులో పెట్టుకుని దాచుకునే నీ మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇది ఆవేశంతో చెప్పేమాట కాదు ...నా పరిధిలో ఆలోచించుకుని నీకు ఇచ్చే మాట మమ్మీ. 

నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా చదువు పాడు చేసుకోను. నువ్వు కోరినట్టుగానే చదువు పూర్తి చేసుకుని నా కాళ్ళమీద నేను నిలబడతాను. నువ్వు ఏ లక్ష్యం తో నన్ను పెంచుతున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకొని నీకు తోడుగా...అండగా ఉంటాను. 

ఇక అతని విషయంలో అతనితో నువ్వు ఎలా ప్రవర్తించమంటావో అలా ప్రవర్తిస్తాను. అతనివల్ల మనం ఏ మాత్రం నష్టపోకుండా చూసుకుంటానని నీమీద ఒట్టు వేస్తున్నానమ్మా..'' 

శకుంతల ఒక్కసారిగా కదిలిపోయింది, హరితని గాఢంగా కౌగలించుకుని తలనిమురుతూ అంది. 

'' తల్లీ ...ఆడపిల్ల ఏ నాటికైనా  పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లాల్సిందే. ఇపుడు నాకు నీమీద పరిపూర్ణమైన నమ్మకం కలిగిందమ్మా.. నేను నీకు అండగా ఉంటాను...నువ్వు నాకు తోడుగా నేనున్నంతవరకు ఉండు చాలు...నాకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వొక్కర్తివే. ''అంది కన్నీళ్లతో. 

''తప్పకుండా అమ్మా. నువ్వు నావల్ల పెట్టే ఆఖరి కన్నీరు ఇదే కావాలి.'' అంటూ తల్లి కన్నీళ్లు తుడిచింది హరిత. 

శకుంతల,  కూతురి నుదురు ప్రేమమీర ముద్దాడింది. 

(సశేషం)

No comments:

Post a Comment

Pages