23. రాకాసుధాకరా!
(27 నక్షత్రముల రూపు రేఖలను తెలియజేయు గేయము)
రాకాసుధాకరా - రా - రారా
మా రాజాజాబిలి రారా ||
గుర్రపు జుక్కను రా
నేనశ్విని రిక్కను రా
బరణిచుక్క నేనేరా
భరణి నామధేయను రా
మంగలకత్తిరూపు చుక్కను రా
కృత్తిక యని బిలువుమురా
నే బండిరిక్కనురా
రోహిణి యన బరగుదురా ||
జింకతలచుక్కనురా, మృగశీర్షము నుందునురా
మరి నే పగడపు రిక్కను రా, ఆర్ద్రగ గనరా
పొదరిండ్ల చుక్కనురా పునర్వసు యనరా
తొండరూపుచుక్కనురా పుష్యమి యందురురా ||
అసిలేరు (సర్పము) తారనురా, ఆశ్లేషనురా
జన్నపు (యజ్ఞము) రిక్కను రా మఖ యని అందురురా
పుబ్బ (పాము కంటిచుక్క) రిక్కనురా, పూర్వఫల్గుణిరా
ప్రొద్దు(ఉషఃకాలము) రిక్కనురా ఉత్తర యందురురా ||
కైపాటి (మంగలకత్తి) చుక్కనురా హస్త నామధేయనురా
ముత్తెపుసవతు (ముత్యము పోలికను ఉన్న) రిక్కనురా చిత్ర పేర బరగుదురా
కరువలి (వాయువు) రిక్కనురా స్వాతి స్వాతి యనరా
చేటచుక్కనురా విశాఖ యందురురా ||
చెలిమిచుక్కనురా అనూరాధ యన బలుకుదురా
తాటిరిక్కనురా జ్యేష్ట పేర కులికెదరా
అంకుసంబుమాద్రి (అంకుశమును బోలిన) రిక్కనురా మూల నుందురా
నీటిరిక్కనురా పూర్వాషాఢనురా ||
ఏచకంకటి (వక్రముగా నున్న, వికారమైన స్వరము గల) రిక్కనురా ఉత్తరాషాఢనురా
కరివేల్పు(ఏనుగుదేవత) చుక్కనురా శ్రవణము నేనురా
మద్దెలరూపురిక్కనురా ధనిష్థనురా
నీటిరేని(జలదేవత) రిక్కనురా శతభిషమందురురా ||
ఎనిమిది కాళ్ళ చుక్కనురా పూర్వభద్రపద యనరా
ముక్కంటిచుక్కనురా ఉత్తరభద్రపద యనరా
మీనురూపు రిక్కనురా రేవతి నేనేరా
అభిజిత్తునురా బొమ్మచుక్కనురా ||
ఏలుకొమ్మురా నెలకొక పక్షములో
తారాశశాంకమా రా తారాపతీ రా
నిండుగ నీవుంటే నీ చాటున మేముందుమురా
క్షీణత గల పక్షములో మా కాంతిని జేకొనరా ||
రాకాసుధాకరా రా - రారా - మా రాజాజాబిలి రారా ||
-----------------
No comments:
Post a Comment