అమ్మా! - అచ్చంగా తెలుగు

 అమ్మా! 

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


నువ్వు వస్తావన్న ఆశ అర్ధం లేనిదయ్యింది

ఎందుకంటే నువ్విక భువిపైనే లేవు కనుక.

నువ్విక రాలేవని తెలిసినా

నీగూర్చికొనసాగుతున్న నీధ్యాస అర్ధం కానిదయ్యింది.

జ్ఞాపకంగా నిన్ను మార్చుకోవాల్సిన సమయమిది,

వ్యాపకంగా నన్నునేను ఏమార్చుకోవాల్సిన తరుణమిది.

అందరిలానే కొన్ని పొరపాట్లు చేస్తూ జీవితం గడిపేవు,

కానీ,ఎందరిలానో  తడబాటు లేకుండానే తనువును వదిలేవు.

నిన్నర్ధం చేసుకున్న వారు ధన్యులౌతారు,

నిన్నపార్దం చేసుకున్నవారు వ్యర్దులౌతారు.

ఐనా నా పిచ్చి కానీ నీకివేవీ తట్టనే తట్టవు,

మా కుళ్ళు బుద్ధులు,ఆలోచనలు పట్టనేపట్టవు.

నిన్నెవరేమన్నాదీవిస్తూనే ఉంటావు,

ఉత్తమ స్థితిలో జీవిస్తూనే ఉంటావు.

నిన్ను దేవతగా గుర్తించటం మాకంత సులభం కాదు,

కనీసమానవత్వంతోనైనా నిన్ను విమర్శించకుండా ఉండటం

అత్యవసరమేమో మాకిప్పుడు.

ఒక్క నిజం చెబుతున్నా వినమ్మా!

నన్ను విడిచిపోవటం నీకు తప్పనిసరైందని నాకెలా తెలుసో,

వెళ్ళిపోయిన నిన్ను మరిచిపోవటం

నాకంత సులభం కాదని నీకు కూడా తెలుసు.

ఇక నిన్ను నిన్నలలో చూసుకోవటం తప్ప

వేరే మార్గం లేదని నాకు అర్ధం అయింది.

నీ దూరాన్ని అలవాటు చేసుకోవాల్సిందే.

***

No comments:

Post a Comment

Pages