రేకు: 0353-05 సం: 04-313
అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి
చ.1: అయమేవ ఖలు పురా అవనీధరస్తు సో
ప్యయమేవ వట దళాగ్రాధి శయనః
అయమేవ దశవిధైరవతారరూపైశ్చ
నయమార్గ భువి రక్షణం కరోతి
చ.2: అయమేవ సతతం శ్రియః పతిర్దేవేషు
అయమేవ దుష్ట దైత్యాంతకస్తు
అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య
ప్రియ భక్త పోషణం ప్రీత్యా తోతి
చ.3: అయమేవ శ్రీ వేంకటాద్రౌ విరాజతే
అయమేవ వరదోపి యాచకానాం
అయమేవ వేద వేదాంతైశ్చ సూచితో
ప్యయమేవ వైకుంఠాధీశ్వరస్తు
భావం
పల్లవి
ఇతడే ఇతడే (ఈ మహావిష్ణువే) స ృష్టిలో మొదటి పురుషుడు. జయాన్ని ఇచ్చే అతనిని నేను శరణు కోరుచున్నాను.
చ1.
ఇతడే పూర్వం భూమిని మోసిన వాడు. ఇతడే మర్రి ఆకు మీద పడుకొన్నవాడు. ఇతడే దశావతారాలు ధరించి , నీతి మార్గములో భూమిని , ప్రజను రక్షించుచున్నాడు.
చ 2.
ఇతడే ఎప్పుడు దేవతలలో లక్ష్మీపతి. ఇతడే దుషులైన రాక్షసులను అంతము చేసినవాడు. ఇతడే అన్ని రకాలైన జీవులో అంతర్యామిగా ఉండి ప్రేమతో తన ప్రియ భక్తులను పోషించుచున్నాడు.
చ 3.
ఇతడే వేంకటాద్రి పర్వతంలో ప్రకాశించుచున్నాడు. ఇతడే యాచకులకు వరములిచ్చు శ్రేష్ఠుడు. ఇతడే వేద వేదాంతములో సూచింపబడినవాడు. ఇతడే(ఈ మహావిష్ణువే) వైకుంఠానికి అధిపతి.
విశేషాలు
ఏవ
ఏవ అంటే ‘ఏ ‘అని తెలుగులో అర్థం. అయమేవ అంటే ‘ఇతడే’ అని అర్థం. అంటే ఆది పురుషుడని ఇంకొకరిని , ఇంకొకరిని చెప్పకు. శ్రీ మహావిష్ణువే ఆదిపురుషుడు. మిగతావాళ్లు కాదు అని చెప్పటానికి ‘ఏవ’ అని అన్నమయ్య వాడాడు.
బ్రహ్మర్షి పత్రిజీ సేవ అనే పదంలో స, ఏవ అని రెండు పదాలున్నాయని చమత్కరించారు. స అంటే అతడు లేక అది, ఏవ అంటే మాత్రమే. ( ఉన్నదంతా అతదు మాత్రమే )నేను అనేది లేకుండా చేసేదంతా సేవ. ఉన్నదంతా అతడే- ఆ దేవుడే అని భావించాలి. తమను తాము జీరో చేసుకోవాలి. ఇంత అర్థాన్ని సేవ అనే పదం ఇస్తుందని వారి భావన.
జయాన్ని ఇచ్చే అతనిని నేను శరణు కోరుచున్నాను
జయమంటే ఆధాత్మిక విజయం. ఇంద్రియాలమీద విజయం. ఇంద్రియాలకు తాను లొంగకుండా , తను ఇంద్రియాలను లొంగదీసుకోవడం. ఈ విజయాన్ని ప్రసాదించేవాడు మహావిష్ణువు. అందుకని విజయాన్ని ఇచ్చే అతనిని శరణు కోరుచున్నాను అని అన్నమయ్య భావన.
అవనీధర
వరాహావతారంలో భూమిని విష్ణు మూర్తి ధరించాడు.అందుకే అవనీధరుడయ్యాడు.
‘‘ఓ విష్ణుమూర్తీ! వరాహావతారం ధరించి మహాభీకరాకారుడవై శరీరాన్ని విపరీతంగా పెంచి నీ ముట్టెతో ప్రళయసముద్రంలోని నీటిని పెళ్లగించినప్పుడు అందులోని నీళ్లు పైకి చిమ్మి వంపు తిరిగి మళ్లీ క్రిందపడుతున్నాయి. ఆ ద ృశ్యం ఎలా ఉందంటే, నువ్వు ప్రక ృతియనే స్త్రీకి, బ్రహ్మాండమనే బంగారు ముక్కెరను అలంకరించినట్టు కనిపిస్తుంది’’ అని రాయలవారు వరాహావతారాన్ని వర్ణించారు. ( ఆముక్త మాల్యద) ఈ రాయలవారి వర్ణనతో పొటీ పడేటట్లుగా ‘తలకక నేలదవ్వెటిదొంగ’ (వీడివొ యిదె వింతదొంగకీర్తన) ‘కవగూడ గోరి భూకాంతముంగిటితలపు’ (తలపులోపలి తలపుదైవ మితడు కీర్తన) అని వివిధ కీర్తనల్లో వరాహ స్వామిని వర్ణించిన అన్నమయ్య ఈ గీతంలో మాత్రం ‘అవనీధర’ అని సామాన్యంగా చెప్పాడు.
శ్రియః పతి
శ్రియః అంటే లక్ష్మీ దేవి. ఆవిడకు భర్త శ్రియః పతి.
శ్రీ సూక్తమ్ లో ‘యః శుచిః ప్రయతో ...(16 వ మంత్రం )అని ఉన్నది. ఎవరైతే లక్ష్మీ దేవి దయ కోసం ప్రార్థిస్తున్నారో వారుశుచి గా ఉండాలని చెప్పబడిరది.శుచి అంటే బాహ్యాభ్యంతర శుచి. ఇంటా బయటా శరీరం, మన మనస్సు ఇవన్నీ శుభ్రం గా ఉండాలి.అటువంటి పవిత్రమైన మనస్సుతో కొలిచేవారిని లక్ష్మి అనుగ్రహిస్తుంది. అటువంటి వారిని లక్ష్మీనాథుడు కూడా అనుగ్రహిస్తాడు. ఈ అంతర్గత భావన శ్రియః పతి శబ్ద ప్రయోగంలో ఉంది.
వేదాలో విష్ణువు
విష్ణువు గాయత్రి మొదయిన ఏడు ఛందస్సులతో భూమిపై పదవిన్యాసము చేసాడు. విష్ణువు పాదధూళితో ఈ సమస్త ప్రపంచం నిండి ఉంది. (ఋగ్వేదం 22వ సూక్తము 16 నుండి 21 వరకు ఉన్న మంత్రాలు) ఇలా వేదాల్లో విష్ణువు సూచింపబడ్డాడు.ఆచార్య తాడేపల్లి పతంజలి
No comments:
Post a Comment