"బంగారు" ద్వీపం (అనువాద నవల) -18
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(పాడుబడిన ఓడలో బంగారం కోసం వెతుకుతున్న వారికి చివరకు ఒక చిన్న అరలో ఉన్న చెక్కపెట్టె దొరుకుతుంది. అక్కడ ఉన్న పనిముట్లతో ఆ పెట్టెను బలవంతంగా తెరవాలని ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. ఇంటి దగ్గర పైకెక్కి దాన్ని కిందపడేస్తే తెరుచుకొంది. ఆ చప్పుడుకి కోపంగా బయటకొచ్చిన క్వెంటిన్ దాన్ని తనతో తీసుకుపోతాడు. తరువాత. . . .)
@@@@@@@@@@@@@
ఆమె తండ్రి బలవంతంగా తెరవబడి విరిగిపోయిన పెట్టెను తీసుకుని, మరో మాట చెప్పకుండా వెనక్కి తిరిగి యింట్లోకి వెళ్ళిపోయాడు. అతని చెయ్యి ఆనిన చోట పెట్టెకి ఉన్న తగరపు పూత మెరుస్తోంది.
అన్నె భోరున ఏడిచింది. "దాన్ని ఓడలోనుంచి తెచ్చామని ఆయనకు చెప్పినందుకు నన్ను తిట్టకండి" వెక్కుతూ అంది. "దయచేసి ..... ఆయన కోపంగా నావైపు చూసారు. అందువల్ల చెప్పాల్సి వచ్చింది."
"సరేనమ్మా!" అన్నె చుట్టూ చేయి వేసాడు జూలియన్. అతను కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. తన బాబాయి పెట్టెను అలా తీసుకుని పోవటం అతనికి దారుణం అనిపించింది. "వినండి. నాకు ఊరుకోవాలని లేదు. ఎలాగైనా ఆ పెట్టెను తెచ్చుకొని, దానిలో చూడాలని ఉంది. ఆయన దీని గురించి ఏమాత్రం పట్టించుకోడన్నది ఖచ్చితం. జార్జ్! తన గదిలోకి వెళ్ళగానే పుస్తకం వ్రాయటం మొదలెట్టి, ఆయన దీని గురించి పూర్తిగా మర్చిపోతాడు. అవకాశం దొరికే వరకు ఆగి, మీ నాన్న గదిలో దూరి దానిని పట్టుకొస్తాను. దాని వల్ల తన్నులు తిన్నా సరె . . . . వదిలేది లేదు."
"మంచిది" చెప్పింది జార్జి. "నాన్న అసలు బయటకు వెళ్తాడో, లేదో మనమంతా ఒక కన్నేసి చూద్దాం "
అందువల్ల వాళ్ళంతా వంతుల వారీ ఆ గది దగ్గర కాచుకొని ఉన్నారు. కానీ క్వెంటిన్ పొద్దున్నంతా ఎటూ వెళ్ళకుండా ఆ గదిలోనే ఉండిపోవటం వాళ్ళకు చిరాకు తెప్పించింది. అంతా సముద్ర తీరానికి పోకుండా ఒకరిద్దరు పిల్లలు తోటలోనే తచ్చాడటం చూసి ఫానీ పిన్ని ఆశ్చర్యపోయింది.
"మీరంతా కలిసి స్నానమో, మరేదో పని చేయటం లేదెందుకు?" అడిగిందామె. "ఒకరితో ఒకరు గొడవ పడ్డారా?"
"అలాంటిదేమీ లేదు" చెప్పాడు డిక్. కానీ వాళ్ళు తోటలో ఎందుకున్నారో మాత్రం చెప్పలేదు.
"మీ నాన్న అసలు బయటకు వెళ్ళడా?" జార్జి తన వంతు కాపలాకి వచ్చినప్పుడు డిక్ అడిగాడు. "ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నాడని అనుకోను."
"శాస్త్రవేత్తలు అసలు కదలరు" వారి గురించి తనకు పూర్తిగా తెలిసినట్లు జార్జి చెప్పింది. "కానీ నేను చెప్పేదేమిటంటే .... మధ్యాహ్నం ఆయన నిద్రపోవటానికి వెళ్తాడు. అప్పుడప్పుడు అలాగే చేస్తాడు."
మధ్యాహ్నం జూలియన్ ఒక్కడే తోటలో ఉన్నాడు. అతను ఒక చెట్టు కింద కూర్చుని, పుస్తకం ఒకటి తెరిచాడు. త్వరలోనే అతనికి ఆసక్తి గొలిపే శబ్దం విని తలను పైకెత్తాడు. అదేమిటో అతనికి త్వరగానే అర్థమైంది.
"అది క్వెంటిన్ బాబాయి గురకే!" అంటూ ఉత్తేజితుడయ్యాడు. "ఖచ్చితంగా అదే! ఓ! నేను ఆ అద్దాల తలుపుల్లోంచి లోనికి పాకి వెళ్ళగలిగితే, మా పెట్టెను తెచ్చుకోవచ్చు."
అతను రహస్యంగా గాజు తలుపుల దగ్గరకు వెళ్ళి లోనికి తొంగి చూసాడు. కొద్దిగా తెరిచి ఉన్న ఒక తలుపుని మరి కొంచెం జూలియన్ తెరిచాడు. అతని బాబాయి చేతుల కుర్చీలో వెనక్కి జేరబడ్డాడు. అతని కళ్ళు మూతబడి ఉండగా, నోరు మాత్రం కొద్దిగా తెరిచి, గాఢనిద్ర పోతున్నాడు. గురక తీసిన ప్రతిసారీ నోటితో గాలి పీలుస్తున్నాడు.
"ఈయన నిజంగానే గాఢనిద్రలో ఉన్నాడు" అని ఆ కుర్రాడు అనుకొన్నాడు. "పెట్టె ఈయన వెనకాల బల్ల మీద ఉంది. నేను తెగించాలి. పట్టుబడితే దారుణంగా తన్నులు తినక తప్పదు. కానీ యింత కన్నా ఏమి చేయలేను."
కుర్రాడు దొంగతనంగా లోనికి అడుగుపెట్టాడు. అతని బాబాయి యింకా గురక పెడుతున్నాడు. మునివేళ్ళపై తను అతని పక్క నుంచి వెళ్ళి, బాబాయి కుర్చీ వెనుక ఉన్న బల్లను చేరాడు. దానిపై పెట్టెను చేత్తో పట్టుకొన్నాడు.
ఆ పెట్టెలోని విరిగిన చెక్కముక్క ఒకటి పెద్ద శబ్దంతో నేలపై పడింది. కుర్చీలోని అతని బాబాయి శబ్దం వచ్చిన వైపు ఒత్తిగిల్లి కళ్ళు తెరిచాడు. ఆ కుర్రాడు మెరుపులా తన బాబాయి కుర్చీ వెనుక కూర్చుని, చప్పుడు కాకుండా ఊపిరి బిగబట్టాడు.
"ఏమిటది?" అంటూ బాబాయి మాటలు అతనికి వినిపించాయి.
జూలియన్ కదలలేదు. తరువాత అతని బాబాయి కుర్చీలో సర్దుకుని మరల కళ్ళు మూసుకున్నాడు. త్వరలోనే లయబద్ధంగా గురక శబ్దం వినిపించసాగింది!
"అమ్మయ్య! తిరిగి పడుకున్నాడు" అనుకున్నాడు జూలియన్.
పెట్టెను చేతితో పట్టుకొని, మెల్లిగా లేచి నిలబడ్డాడు. మునివేళ్ళపై మెల్లిగా నడుస్తూ, అద్దాల తలుపుని చేరుకొన్నాడు. దానిలో నుంచి బయటకు జారుకొని, చప్పుడు కాకుండా తోట బాటకు పరుగెత్తాడు. అతను పెట్టెను దాచాలని అనుకోలేదు. దానిని తీసుకుని మిగిలిన పిల్లలను కలిసి, తాను చేసినదేమిటో వాళ్ళకు చూపాలనుకొన్నాడు.
సముద్రతీరంలో సూర్యరశ్మిలో పడుకున్న వారి దగ్గరకు అతను పరిగెత్తాడు. "హేయి!" అంటూ కేకపెట్టాడు. "హేయి! నేను దానిని తెచ్చాను! నేను దానిని తెచ్చాను."
తుళ్ళిపడి లేచి కూర్చున్న పిల్లలు, జూలియన్ చేతిలోని పెట్టెను చూసారు. తీరంలో ఉన్న మిగిలిన జనాలను వాళ్ళు మరిచిపోయారు. జూలియన్ ఇసుకలో కూలబడి ఇకిలించాడు.
"మీ నాన్న నిద్రపోయాడు" జార్జితో అన్నాడతను. "టిం! నన్నలా నాకొద్దు! జార్జ్! నేను లోనికెళ్ళాను. పెట్టెలో చిన్న భాగం నేలపై జారి పడింది. దానితో ఆయన మేలుకొన్నాడు."
"అయ్యో! తరువాత ఏమైంది?" జార్జి అడిగింది.
"ఆయన తిరిగి నిద్రపోయే వరకు కుర్చీ వెనుక దాక్కున్నాను" చెప్పాడు జూలియన్. "తరువాత పారిపోయి వచ్చాను. ఇప్పుడు దీని లోపల ఏముందో చూద్దాం. మీ నాన్న కనీసం దీనిలో చూడటానికి ప్రయత్నించలేదని అనుకుంటున్నాను"
అతను దాన్ని తెరవలేదనటానికి దానికి ఉన్న తగరపు పూత చెక్కుచెదరకుండా ఉండటమే సాక్ష్యం. చాలా ఏళ్ళుగా అది నీటిలో ములిగి ఉండటాన చిలుము పట్టి, దాని మూత దాదాపుగా కదపలేనంత గట్టిగా బిగిసిపోయింది.
కానీ తన పోకెట్ నైఫ్ తో జార్జి దానిని పట్టుకొని, చుట్టూ పట్టిన తుప్పును గీకి పారేసింది. దానితో అది నెమ్మదిగా వదులై, పావుగంట తరువాత తెరుచుకొంది.
పిల్లలు ఆత్రుతగా దాని వైపు తొంగి చూసారు. లోపల కొన్ని పాత కాగితాలు, నల్ల అట్ట ఉన్న ఏదో పుస్తకం కనిపించాయి. అవి తప్ప మరేమీ లేవు. బంగారు కడ్డీ కనపడలేదు. వేరే సంపద లేదు. దానితో ప్రతి ఒక్కరూ కొద్దిగా నిరాశ పడ్డారు.
"ఇవన్నీ పొడిగా ఉన్నాయి" జూలియన్ ఆశ్చర్య పోయాడు. "కొంచెం చెమ్మ అయినా లేదు. ఈ తగరపు పూత ప్రతి వస్తువుని సరిగా ఉంచింది."
.
అతను పుస్తకాన్ని పైకి తీసి, దానిని తెరిచాడు. " ఇది మీ తాత ముత్తాత తన సముద్ర యాత్రల గురించి వ్రాసిన డైరీ" అన్నాడు. "ఈ రాత చదవటం కష్టంగా ఉంది. అక్షరాలు చిన్నగా, గజిబిజిగా ఉన్నాయి."
జార్జి ఒక కాగితాన్ని పైకి తీసింది. అది దళసరి తోలుపత్రం. చాలాకాలానికి చెందినది కావటాన పసుపు రంగులో ఉంది. ఆమె దాన్ని యిసుకపై పరిచి చూసింది. మిగిలిన వాళ్ళు కూడా దానిలోకి చూసారు. కానీ అదేమిటో వాళ్ళెవరికీ అర్థం కాలేదు. అదొక రకమైన పటంలా కనిపించింది.
"బహుశా యిది తను వెళ్ళాల్సిన ప్రాంతానికి చెందిన మాప్ అయి ఉండవచ్చు" అన్నాడు జూలియన్. కానీ అకస్మాత్తుగా మాప్ ని పట్టుకున్న జార్జి చేతులు వణకసాగాయి. మెరుస్తున్న కళ్ళతో ఆమె యితరులను చూసింది. ఆమె నోరు తెరిచింది కానీ మాటలు బయటకు రావటం లేదు.
"ఏమిటి సంగతి?" జూలియన్ ఆసక్తిగా అడిగాడు. "ఏం జరిగింది? నోరు పడిపోయిందా?"
జార్జి కాదన్నట్లు తల ఊపి, కంగారుగా చెప్పింది. "జూలియన్! ఇదేమిటో నీకు తెలుసా? ఇది మా పాత కోట అంటే శిధిలం కాక ముందు ఉన్న కిర్రిన్ కోట మాప్. ఇది చీకటి కొట్లను చూపిస్తోంది. ఇటు చూడు. చీకటి కొట్లకు ఈ మూల ఏమి వ్రాసి ఉందో చూడు" అంటూ ఆ పటంపై తన వణుకుతున్న వేలు ఉంచింది. మిగిలిన వాళ్ళు అదేమిటో చూడాలని ముందుకి వంగారు. అక్కడ పాతకాలపు లిపిలో ఆసక్తి గొలిపే ఒక పదం ఉంది. "ఇన్గాట్స్!"
"ఇన్గాట్స్!" అన్నె ఆశ్చర్యపోయింది. "దాని అర్థం ఏమిటి? ఆ పదాన్ని యింతకు ముందు ఎప్పుడూ వినలేదు."
కాని యిద్దరు అబ్బాయిలు విన్నారు. "ఇన్గాట్స్!" డిక్ అరిచాడు. "ఎందుకు; అవి బంగారు కడ్డీలు. వాటినే ఇన్గాట్స్ అంటారు."
"లోహాలతో చేసిన కడ్డీలను ఇన్గాట్స్ అంటారు" ఉత్తేజం వల్ల ఎర్రబడ్డ ముఖంతో జూలియన్ చెప్పాడు. "కానీ ఓడ నుంచి బంగారం మాయమైందని మనం విన్నాం. దాని వల్ల ఇన్గాట్స్ కి యిక్కడ మనకు తెలిసిన అర్థం బంగారు కడ్డీలే. అయ్యో! ఆలోచిస్తే, కిర్రిన్ కోట కింద ఎక్కడో అవి యింకా దాచబడి ఉండొచ్చు. జార్జ్! జార్జ్! ఇది విచిత్రంగాను, ఉత్తేజంగాను లేదూ?"
అవునన్నట్లు జార్జి తలూపింది. ఆమె ఉత్తేజంతో నిలువెల్లా వణికి పోయింది. "మనం దానిని కనుక్కోగలిగితే" ఆమె నెమ్మదిగా గొణిగింది. "మనం దానిని కనుక్కొంటే!."
"మన ముందొక మంచి వేట ఉంది" అన్నాడు జూలియన్. "ఈ కోట చాలాభాగం కూలిపోవటం వల్ల అన్వేషణ చాలా కష్టం కూడా! కానీ ఏదోలా మనమా లోహపు కడ్డీలను కనుగొంటాం. ఎంత మధురమైన పదం. లోహపు కడ్డీలు! లోహపు కడ్డీలు! లోహపు కడ్డీలు!"
బంగారం అన్న పదం కన్నా ఇది మరింత ఉత్తేజాన్ని ధ్వనిస్తోంది. ఇకపై ఎవరూ బంగారం అన్న పదాన్ని ఉచ్ఛరించరు. వాళ్ళు లోహపు కడ్డీల గురించే మాట్లాడారు. ఈ హడావిడి అంతా ఏమిటో టిం కి అర్థం కాలేదు. తన తోకను ఊపుతూ ముందరున్న వ్యక్తిని, తరువాత మిగిలిన వారిని నాకాలని చూసాడు కానీ ఎవరూ ఆ కుక్కను పట్టించుకోలేదు. ఇలా ఎందుకు అవుతోందో అతనికి అర్థం కాలేదు. కొంతసేపయ్యాక తన చెవులను కిందకు దించి, వీపును పిల్లల వైపు ఉంచి కూర్చున్నాడు.
"ఓ! పాపం తిమొతీని చూడండి" అంది జార్జి. "తనకు మన ఉద్వేగం ఏమిటో అర్థం కాలేదు. టిం డార్లింగ్! అంతా బాగానే ఉంది. నువ్వు దీనిని అవమానంగా భావించకు. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన రహస్యం మాకు దొరికింది."
తనను గుర్తించినందుకు హుషారుగా తోక ఊపుతూ టిం వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. అది తన పంజాను విలువైన పటంపై ఉంచగానే, నలుగురు పిల్లలు కేకలేసారు.
"అయ్యో! అది చిరిగిపోకూడదు!" జూలియన్ అన్నాడు. తరువాత అతను మిగిలిన వారి వైపు చూసి చిరాకు పడ్డాడు. " ఈ పెట్టెను మనం ఏం చేద్దాం? " అని అడిగాడు. "నా ఉద్దేశం జార్జి నాన్నగారు దీన్ని వెతుకుతారు కదా! దీన్ని తిరిగి ఆయనకు యివ్వవలసి ఉంటుంది."
"సరె! ఈ మాప్ ని బయటకు తీసి మన దగ్గరే ఉంచుకోలేమా?" డిక్ అడిగాడు. "అతను పెట్టెలో చూసి ఉండకపోతే, ఈ పటం గురించి ఆయనకు తెలియదు కదా! అతను దీనిని చూడలేదన్నది మాత్రం ఖచ్చితం. మిగిలిన వస్తువులు, అవే పాత డైరీ మరియు కొన్ని ఉత్తరాలను, మనం అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదు."
"ఎందుకైనా మంచిది, ఈ పటం యొక్క కాపీని తీసుకుందాం" అన్నాడు డిక్. "తరువాత అసలు పటాన్ని పెట్టెలో పెట్టి, దానిని తిరిగి బాబయ్య దగ్గర పెట్టేద్దాం."
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment