విశిష్టమైన అవతారం హయగ్రీవ స్వామి - అచ్చంగా తెలుగు

విశిష్టమైన అవతారం హయగ్రీవ స్వామి

Share This

 విశిష్టమైన అవతారం హయగ్రీవ స్వామి

రచన: సి.హెచ్.ప్రతాప్




యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారల్లోకి ఒకటి ‘హయగ్రీవావతారం’ ప్రముఖమైనది. అన్ని రకాలైన అభ్యాసం మరియు జ్ఞానం ఆయనలో మూలం మరియు అతని నుండి ఉద్భవించాయి. శ్రీ హయగ్రీవుడి అవతారం శ్రీమన్నారాయణుని ఇతర అవతారాలన్నింటిలో అగ్రస్థానం ఇవ్వబడింది.  ఈ అవతారం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో పాటు సకల మానవాళికి అజ్ఞానమనే అంధకారం నుండ్Fఇ జ్ఞాజ్యోతుల దిశగా తీసుకువెళుతుంది. హయగ్రీవుడు మానవాళికి జ్ఞానప్రదాతగా కొలవబడుతున్నాడు. ఈ స్వామి దివ్యరూపం కాస్త విచిత్రంగా వుంటుంది.హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఏడమ చేతిలో పుస్తకము ఉంటుంది.  శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి వేదాలను ఉద్ధరించారు. అందువల్ల, వేదాలతోపాటు సమస్తమైన వాఙ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యాడు. ఈ అవతారంలో స్వామి గుర్రం ముఖం, మానవ శరీరం కలిసిన రూపంలో దర్శనమిస్తాడు. స్వామి వామాంకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. స్వామిది తెల్లటి శరీర ఛాయ. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, చిన్ముద్ర, పుస్తకాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.

భగవంతుని ఇతర అన్ని అవతారాలలో భగవంతుడు కొన్ని ముఖ్యమైన సత్యాన్ని బోధించడం జరిగింది  అయితే హయగ్రీవ అవతారంలో మాత్రమే సాధకుడు వేదాంత సత్యాలన్నింటినీ పూర్తిగా గ్రహించగలడు. హయవదన అవతారం కృతయుగం నాటిదని చెబుతారు. యుగయుగాలుగా, చాలా మంది ఋషులు జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందడానికి భగవంతుని యొక్క ఈ రూపాన్ని ధ్యానించారు అని మన పురాణాలలో వుంది.
 భాద్రపదనెలలో వచ్చే శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్వామి అవతరించిన రోజుగా మన పురాణాలలో చెప్పబడింది. ఉన్నత చదువు, లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినప్పుడు హయగ్రీవ స్వామిని తప్పక పూజించాలి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ద్యానించాలి.ఆ స్వామి యొక్క ధ్యాన శ్లోకం ఈ విధంగా వుంది:

 జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారరం. హయగ్రీవుడిని పూజించిన భక్తులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది.
ఈ శ్లోకం వాస్తవానికి పంచరాత్ర ఆగమాలకు చెందినది కానీ ఇప్పుడు 13వ శతాబ్దానికి చెందిన కవి-తత్వవేత్త వేదాంత దేశిక యొక్క హయగ్రీవ స్తోత్రానికి ఉపసర్గగా ఉంది అని వివిధ గ్రంధాల ద్వారా తెలుస్తోంది.


హయగ్రీవ అవతారం గురించి పలు పురాణ కధలు ప్రచారంలో వున్నాయి. మొదటిది :


 మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించి, పాతాళంలో దాచి పెడతారు. వేదాలు లేనిదే సృష్టికార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు. వెంటనే, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారంలో పాతాళానికి చేరి, మధుకైటభులను వధించి, వేదాలను రక్షించి, బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.


ఇంకొక కధలో దానవులతో యుద్ధం చేసి అలసిన విష్ణువు అల్లెతాడు (నారితాడు) గడ్డం కింద ఉంచుకొని నిద్రపోతుంటాడు. దేవతల కోరిక మేరకు, శివుడు భ్రమర రూపం ధరించి, అల్లెతాటిని కొరుకుతాడు. చివాలున తెగిన అల్లెతాటి వేగానికి విష్ణువు శిరస్సు శరీరం నుంచి వేరుపడుతుంది. విచారించిన దేవతలు, గుర్రపు తల తీసుకువచ్చి, విష్ణువుకు అతికించి, ఆయనను పునర్జీవితుడిని చేస్తారు.


మరొక కధలో పూర్వం గుర్రపు తల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు తెలుస్తుంది. ఆ హయగ్రీవుని ఆరాధించడం వలన జ్ఞానము, విజయం లభిస్తాయన్నది పెద్దల మాట.

హయగ్రీవుడు సకల దేవతాస్వరూపం అని కూడా వేదాలు చెబుతున్నాయి. ఆ స్వామి కృప వలనే ఈ లోకానికి లలితా సహస్రనామం, దుర్గా త్రిశతి మొదలైన శ్లోక సంపుటి  అందాయి.సాక్షాత్తు హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి శక్తి ఉపాసనా రహస్యాలను బోధించినట్లు బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లలితా సహస్రనామాలు హయగ్రీవుడి వల్లే లోకంలో వ్యాప్తిచెందాయి.  

***

No comments:

Post a Comment

Pages