మానస వీణ 54
లలితా వర్మ
చూస్తున్న అందరూ అవాక్కయ్యారు, అందరి నోళ్లూ మూగవోయాయి.
మానస దిగ్భ్రాంతి కి
లోనైంది. కొన్ని క్షణాలు... ఎవరి
గుండె చప్పుళ్లు వాళ్లకే వినబడేంత నిశ్శబ్దం.
సడిచేయని కొండగాలి
అలవోకగా తాకి మొక్కల మీదా, పూవుల మీదా కురిసిన మంచు చినుకులను జలజలా రాలుస్తున్న ఆ చల్లని
వాతావరణంలోనూ ముచ్చెమటలు పట్టాయి అనిరుధ్ కి.
"ఓహ్ నో"! అన్నాడు తల చేత్తో పట్టుకుని.
మానస అయోమయంగా
చూడసాగింది అతనివైపు. మిగతా అందరి చూపూ అనిరుధ్
పైనే.
"నో! ఇట్స్ ఇంపాజిబుల్! ఈ ఫోటో నాన్నని టార్గెట్ చేస్తుంది. ఇది
అబద్ధం! నాన్న అలాంటి వారు కాదు! ఇన్స్పెక్టర్ దినేష్! ఇందులో
ఏదో కుట్ర ఉంది" అనిరుధ్ మాటల్లో ఉద్వేగం,
కంగారు కలగలిసిపోయాయి.
"కూల్ అనిరుధ్! అది తెలుసుకోవడమే కదా మా డ్యూటీ.
"నువ్వన్నట్లు ఇది మీ నాన్నగారిని ఇరికించడానికి పన్నిన కుట్ర
అయితే బాగుండునని నేనూ అభిప్రాయపడుతున్నాను."
"అలా జరిగితే సంతోషించే వారిలో నేను మొదటిదాన్నవుతా" అంది
మానస దిగ్భ్రాంతి నుండి కొంత తేరుకుని.
"ఈ క్లూ దొరకగానే సర్చ్ వారెంట్ తో మీ ఇంటికీ, ఆశ్రమానికీ
వెళ్లొచ్చు. కానీ ఆశ్రమ శ్రేయస్సు కోసం,
అహరహం ప్రాణం పెట్టి కృషి చేస్తున్న
మానసకూ, నీకూ ముందుగా ఈ విషయం తెలియజేయడం నా బాధ్యతగా భావించి ఇక్కడకు
రావడం జరిగింది" అంటూ అనిరుధ్ ని సమాధాన పరుస్తున్నాడు ఇన్స్పెక్టర్ దినేష్.
మానస మనసులో
ఎన్నో భావ పరంపరలు...
'చెడుని తగ్గిస్తూ పోతుంటే మంచి వెలుగులోకి వస్తుందని తన
నమ్మకం. చెడు, చెడుగా కన్పించినపుడు ఆ ప్రయత్నం ఫలిస్తుంది, కానీ మంచి ముసుగులో
దాగిన చెడుని... గుర్తించడమే కష్టం కదా! పులిని అవలీలగా వేటాడే వేటగాడు మేకవన్నె
పులులను, గోముఖ వ్యాఘ్రాలనూ అంత సులువుగా గుర్తించగలడా?' ఆలోచిస్తోంది మానస.
"చూస్తుంటే ఇదో పెద్ద రాకెట్ లా ఉంది. అవయవాల రవాణా ఆషామాషీ వ్యవహారం కాదు. శస్త్ర చికిత్స తెలిసిన నిపుణులు, డ్రగ్స్, ఫార్మసీ గురించి
అవగాహన కలిగినవారు, దానికి కావలసిన ఎక్విప్మెంట్స్,
వీటన్నికీ ఓ స్థావరం, తప్పక ఉండి
ఉండాలి" మానస ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అన్నాడు దినేష్.
కాసేపు మౌనం తరువాత "ఎస్!
ఈ క్షణం నుండే నేను నాన్నగారి ప్రతికదలికనూ గమనిస్తా. ఎవరెవరితో డీలింగ్స్ ఉన్నాయో
కనిపెడతా, ఏ చిన్న సందేహం కలిగినా మీకు తెలియజేస్తా, తొంబై శాతం నాన్నగారి
ఇన్వాల్వ్ మెంట్ ఉండదనే నా నమ్మకం ఒకవేళ ఉంటే...
అయామ్ ష్యూర్! ఆయన్ని పట్టుకోవడంలో మీకు
సహకరిస్తా" దృఢంగా అంటూ దినేష్ చేతిని
తన కుడి చేత్తో పట్టుకుని ఎడం
చేయి ఆ చేతులపై వేసి నొక్కి, "ఐ ప్రామిస్ యూ" అనేసి విసవిసా నడిచి వెళ్తున్న అనిరుధ్ ని
చేష్టలుడిగి చూస్తూండి పోయింది మానస.
"అసలా అమ్మాయిలు ఎవర్ని చూసి భయపడ్డారో తెలుసుకోవాలిముందు"
అన్నాడు రాజా.
"ఎస్! శశిధర్! ఆ పని నీదే" ఆర్డరేశాడు దినేష్.
"దీనికి సరిత సహకారం కూడా చాలా అవసరం" అంది మానస ఇంకా
భయంనుండి తేరుకోని సరితని పొదివి పట్టుకుని.
"ఎస్ సర్!" అంటూ దినేష్ కి థంబ్సప్ చూపించాడు శశిధర్, ఆశ్రమంలోకి తను
చొరవగా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆ పని తనకు సులువవుతుందని భావించాడు.
"ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇన్స్పెక్టర్ శశిధర్ అని ఎవరికీ
తెలియకూడదు. ప్రవీణ్ గానే కొనసాగాలి" హెచ్చరించి, ఈలోగా నేను చేయాల్సిన
పనులు చాలా ఉన్నాయి" అన్నాడు దినేష్ సాలోచనగా.
‘పైకి కనిపించే
అకృత్యాలు కాకుండా ఓ ఊబిలో కూరుకుపోయిన వాటిని వెలికి తీయాలి. ఆధారాలు దొరికాయి... సుశీలమ్మ, సరిత, ఆశ్రమంలో చేరిన
నలుగురు కొత్త అమ్మాయిలు. వీళ్లందరినీ
చాలా జాగ్రత్తగా హాండిల్ చేయాల్సి ఉంటుంది,
లేదంటే వాళ్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే
ప్రమాదం ఉంది. అప్పలనాయుణ్ణి ఇంటరాగేషన్ చెయ్యడం మాత్రమేకాదు, అన్నిటి కన్నా ముఖ్యమైన
వ్యక్తి అనిరుధ్... అతని ద్వారా మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేయాలి' అంటూ ఆలోచించసాగాడు
దినేష్.
ఎవరినేమి ఆదేశిస్తాడో
అనుకుంటూ దినేష్ నే గమనిస్తున్నారందరూ.
"ఆ... రాజా! అవసరమైనపుడు సరితకి తోడుగా ఉండి జాగ్రత్తగా
వెంటబెట్టుకు రావాల్సి ఉంటుంది" చెప్పాడు దినేష్ రాజాతో.
"సరే సార్"!
అన్నాడు రాజా.
"కమ్ శశిధర్ ! వి షుడ్ లీవ్ నౌ" అంటున్న దినేష్ తో
"సర్! నేను ఆశ్రమానికి వెళ్లి ఆ అమ్మాయిల భయానికి కారణమేమిటో తెలుసుకుంటాను"
అంది మానస.
ఒక్క క్షణం ఆలోచించి
"నో మానసా! నువ్విపుడు వెళ్తే దుష్టశక్తులకు అనుమానం కలుగుతుంది. శశి
చూసుకుంటాడు" అంటూ దినేష్, శశిధర్ వెళ్లిపోయారు.
సరిత పనిలో పడింది. మానస ఆలోచనలకు మాత్రం
అంతులేకుండా పోయింది.
తల్లిదండ్రుల ప్రేమకు
తపించి, చివరకు తల్లిదండ్రులే కాదు తాతగారిని, దేవుడు లాంటి జిటిఆర్
అంకుల్
ని, కొండంత అండగా ఉన్న దినేష్ ని,
మనసంతా తనపై ప్రేమ నింపుకున్న అనిరుధ్
ని పొందగలిగానని, అన్ని బంధాలూ తన స్వంతమయాయనీ మురిసిపోతున్న తరుణంలో, ఈ అశనిపాతం లాంటి
వార్త ఏమిటో? ఏం జరగబోతోందో?
తన సంగతి పక్కన పెడితే ఆ అమాయక బాలల
హృదయవిదారక రోదనకి అంతం ఎప్పుడో?
ఎంతమంది అభం శుభం తెలియని చిన్నారులు ఆ నీచ నికృష్ట
రాక్షసకృత్యానికి బలయ్యారో? తలుచుకుంటుంటే కడుపులో తిప్పేసింది మానసకి.
నిద్రలేచిన శ్రావణి ఆలోచనలో మునిగివున్న
కూతుర్ని చూసి ఆశ్చర్యపోయింది.
లేడి పిల్లలా
లేచిందగ్గర్నుండీ చలాకీగా ఇల్లంతా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనో, చేయిస్తూనో హుషారుగా
ఉండే మానస అలా స్తబ్ధుగా కూర్చుని ఉండటమేమిటా అనే సందేహం కల్గిందావిడకి.
దగ్గరగా వచ్చి
"ఏంటి తల్లీ?" అంటూ భుజం మీద చేయివేయంగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన మానస
కళ్లలో సన్నని నీటి తెర చూసి చలించిపోయింది శ్రావణి.
కూతురి రెండు భుజాలూ
పట్టుకుని తనవైపు కి తిప్పుకుని "ఏమైంది చిట్టి తల్లీ?" అంది
గద్గదమైన స్వరంతో.
ఆ ఆప్యాయతకి
గుండెలోని బాధ కరిగి కన్నీళ్లై జాలువారుతుంటే తల్లి నడుంచుట్టూ చేతులు పెనవేసి, కడుపులో తలదాచుకుంది.
శ్రావణి మానస తల
నిమురుతూ "అయ్యో నా బంగారు తల్లికి ఏం కష్టం ఒచ్చిపడిందో? చెప్పమ్మా మానసా మీ
నాన్న, నేను మా ప్రాణాలైనా యిస్తాం తల్లీ నీకోసం" అంటున్న
తల్లితో, "కష్టం నాక్కాదమ్మా ! ఆశ్రమాన్ని అన్నివిధాలా అభ్యుదయపథాన
నడిపించాలనుకున్న నాకు ఆశ్రమ సంరక్షణే సవాలుగా మారిందమ్మా. అభం శుభం తెలియని
పిల్లల్ని కర్కోటకుల కసాయి కత్తులకు బలికాకుండా చూడాల్సిన పరిస్థితి
దాపురించిందమ్మా!' అని చెప్పలేక మనసులోనే మథనపడసాగింది మానస.
అది కాసేపు మాత్రమే! అంతలోనే తేరుకుని కళ్లు తుడుచుకుని, "ఏం
లేదమ్మా! నువ్వేం కంగారు పడొద్దు చిన్న సమస్య ఆశ్రమంలో" అని సర్ది చెప్పింది.
'నా తల్లి ఎవరికే కష్టం కలిగినా కరిగిపోతుంది' అనుకుంది శ్రావణి.
'ఆలోచనలు కాదు, ఆచరణ కావాలి! కర్తవ్యం శోధించాలి!' అనుకుంది మానస దృఢ
చిత్తంతో...
పుట్టుకతోనే
అబ్బిన ఆత్మస్థైర్యంతో, మొక్కవోని కార్యదీక్షతో
కర్తవ్యోన్ముఖురాలైంది మానస.
(సశేషం)
No comments:
Post a Comment