ఒకటైపోదామా ఊహల వాహినిలో - 11
కొత్తపల్లి ఉదయబాబు
(పెళ్లి కాకుండానే తనకు బిడ్డను కనిమ్మని హరితను అడుగుతాడు విరాజ్. ఆ అంశం మీద తన తల్లితో మాట్లాడి, ఒక నిర్ణయానికి వస్తుంది హరిత.)
విరాజ్ కి
రోజు రోజుకీ ఆతృతగా
పెరిగిపోసాగింది. అసలు మరునాడే హరితనుంచి ఫోన్ వస్తుంది అనుకున్నాడు. ఏ
నెంబర్ నుంచి కాల్ వచ్చినా అది హరితదేమోఅని అనుమానం. వాళ్లకి తమ సెల్ నంబర్లు ఇచ్చాడుగానీ
వారిది తానూ తీసుకోలేదు.
తెలియని ఏ కాల్ వచ్చినా వెంటనే ట్రూ కాలర్ లో చూడటం
...అది క్రెడిట్ కావాలా..లోన్ కావాలా...టైపు ఎర్రరంగు కాల్ అవడం ...అతను నిరాశకు గురికావడం...జరగసాగింది.
అసలు వాళ్ళ నెంబర్ తీసుకోకుండా తానెంత తప్పు
చేసాడు...అని తనని తానునుబోలెడు సార్లు తిట్టుకున్నాడు.
కాలేజీకి వెళ్లి
హరితను కలిసి తీసుకుందామనుకున్నాడు. హరితను అడిగితే ఇవ్వదని, ఆమె ప్యూను ద్వారా హరిత క్లాస్మేట్
ని అడిగించాడు. అసలు హరిత సెల్ ఫోన్ వాడదని తెలిసి ఆశ్చర్యపోయాడు.
ఈరోజుల్లో ఇంకా ఇలాంటి పాత చింతకాయ పద్ధతులున్నవాళ్ళు
ఉన్నారా అని చిరాకేసింది.
పాపం వాళ్ళ ఇంటి పరిస్థితి గుర్తుకువచ్చాకా నాలిక
కరుచుకున్నాడు. కేవలం ఇరవై వేలు పింఛనుతోను,
ఆమె హెల్పర్ ఉద్యోగం జీతంతోనూ ఇటు చదువుకుంటూ ...బ్రతకడం చాలా
కష్టమే. పోనీ తానే తన తండ్రికి తెలియకుండా ఒక పదివేలు ప్రతీనెలా సాయం చేస్తే?
అసలు హరిత ఒప్పుకుంటుందా? హరిత ఒప్పుకున్నా
వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందా? హరితతో మాట్లాడటానికి తానూ దారి
కాస్తే...ఏం మాట్లాడినా మా అమ్మ ముందే ...
అని హరిత అందీ అంటే... హరిత తన తల్లి మాటే వింటుందన్నమాట...అపుడు పదివేలు సాయం
చేస్తానంటే వాళ్ళమ్మతో చెబుతుంది.
''నువ్వు మాకేమవుతావని సహాయం
చేస్తానంటున్నావ్ ?'' అని పది మందిలోను ఆవిడ అడిగితే
తన పరువంతా పోతుంది. ఏం
చేయాలబ్బా?...'' ఇలాంటి ఆలోచనలతో అతని బుర్ర
వేడెక్కిపోసాగింది.
''ఏమిరా...బుర్ర ఎక్కడో పెట్టుకుని
వ్యాపారం చేస్తే వచ్చే లాభాలు నీ ఖాళీబుర్ర సందుల్లోంచి వెళ్లిపోతాయి. ఏం
...ఎవరితోనైనా ప్రేమ వ్యవహారమా?''అడిగాడు తండ్రి గవర్రాజు.
''ఆబ్బె ..అలాంటిదేమీ లేదు డాడీ. నా ఫ్రెండ్ ఒకడి లవ్ ఫేయిల్యూర్ అయింది.
వాడికి చదువు పూర్తి అయి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. చాలా తెలివైనవాడు కూడా
..అలాంటి వాడినే వాడి లవర్ దెబ్బతీసింది.
రేపు నేను ప్రేమలో పడితే ఎలాగా అని ఆలోచిస్తున్నాను.అంతే ' అని దాటేశాడు.
''నీ పెళ్లి కాకుండానే నీచేత రెండో
బ్రాంచ్ ఓపెన్ చేయించాలని నా ఉద్దేశం. వ్యాపారం చేయడం తెలిస్తే, వ్యవహారం ...ఆ తర్వాత ప్రేమ వ్యవహారాలూ ఎలా చెయ్యాలో అన్నీ తెలుస్తాయి.
జాగ్రత్త. షాపులో ఉన్నంతసేపు బుర్రలోకి ఏ 'మిడ్డీ'ని రానివ్వకు. అర్థమైందా...'' కాస్త గట్టిగానే
చెప్పాడు కొడుక్కి చెప్పాడు విరాజ్ తండ్రి అయిన గవర్రాజు.
ఇక వేరే గతిలేక శకుంతల గారి దగ్గర నుంచి వచ్చే తనకు కావలసిన సమాధానం కోసం ఎదురుచూస్తూ
అప్రమత్తంగానే రోజులు గడుపు తున్నాడు విరాజ్.
శకుంతల గారు విరాజ్ కి సమాధానం ఇస్తానన్న శనివారానికి
ముందు బుధవారం.
ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ అయిపోయిన వెంటనే తిన్నగా విరాజ్ వాళ్ళ బంగారామ్ షాపుకి వచ్చింది శకుంతల.
షాపులో ఒకరిద్దరి కంటే ఎక్కువ కస్టమర్స్ లేరు.
గవర్రాజు ఆర్డర్ కాగితం రాయగానే బజానాగా అయిదువేల రూపాయలు చెల్లించి ఆ వివరం ఆర్డర్ కాగితంలో నోట్ చేయించి ఒక కాపీని తన పర్సులో పెట్టుకుని బయటకు వచ్చేసింది శకుంతల.
ఆమె కుడివైపు దారిలోకి అడుగులు వేస్తుండగానే ఎడమవైపుగా ఆ ఆవరణలోకి అప్పుడే వచ్చిన విరాజ్ బైక్ పార్క్ చేసి షాప్ లోపలకి అడుగుపెట్టాడు.
''ఏం
లేదురా... వస్తూ ఆ విరాజ్ వాళ్ళ బంగారం కొట్టుకు కస్టమర్ లాగే వెళ్లాను.
వాళ్ళ నాన్నని చూసాను. ఆయన పక్కా వ్యాపారస్తుడు. అలాంటివాళ్ళు జీవితంలో అన్నీ
వ్యాపారపద్దతిలోనే చూస్తారు. తండ్రికి వ్యాపారంలో తోడుగా విరాజ్ సహకరిస్తున్నాడు. ఇదిగో... ఈ కరపత్రం చదువు...''
అంటూ అందించింది ఆమె.
టీ తాగుతూ
దాన్ని సాంతం చదివింది హరిత...నిర్లిప్తభావంతో
తల్లికి తిరిగి ఇచ్చేసింది.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment