ప్రకృతి ధర్మం
సి.హెచ్.ప్రతాప్
మానవుడు మెరుగైన జీవన యానం కోసం,ధర్మ మార్గాన నడిచేందుకు ధృఢసంకల్పంతో పాటు పృఅకృతి ధర్మాలను, నియమాలను పాటించమని శాస్త్రాలు బోధిస్తున్నాయి. దత్తాత్రేయుడు ప్రకృతిలోని 24 . అంశాలను, గురువులుగా స్వీకరించి వాటి నుండి ఎన్నో వేదరహస్యాలను నేరుకున్నానని చెప్పినట్లు దత్త భాగవతంలో వుంది.
ప్రకృతి ధర్మము తప్పితే ప్రపంచ నాశనం, మనిషి ధర్మం తప్పితే సమాజ వినాశనం తప్పవు. జ్ఞానాన్ని శరణు కోరి ముందుకు సాగండి అని శాస్త్రాలు బోధించాయి. ఇక్కడ ధర్మం అంటే ప్రకృతి ధర్మం అని అర్థం. ప్రకృతి ధర్మానుసారంగా నడుచుకోండని – అంతేగాని మనిషి మధ్యలోకల్పించుకున్న ఏవో ధర్మాలకు కట్టుబడి ఉండమని కాదు. ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకుని, ప్రకృతిలో గల కార్యకారణ సంబంధాల్ని అర్థం చేసుకుని ముందుకు సాగండి అని! ‘ధర్మోరక్షతి రక్షిత:’ – అంటే ప్రకృతి ధర్మాన్ని రక్షించుకుంటే – ఆ ప్రకృతి ధర్మమే మనల్ని రక్షిస్తుంది .ఆ సర్వేశ్వరుడి సృష్టిలో ప్రయోజనం లేని పదార్థమన్నదే లేదని వేదాలు చెబుతాయి. చెట్లు ప్రాణవాయువునిస్తాయి. చెరువులు నీటిని సమృద్ధిగా నిల్వ చేస్తాయి. ఇలా ప్రకృతి సమస్తం చైతన్య లక్షణం కలిగి ఉంటుంది. మానవుడి పురోగమనానికి సహకరించే లక్షణాలన్నింటినీ భగవంతుడు మానవాళిపై దయ, కారుణ్యంతో ప్రకృతిలో నిక్షిప్తం చేశాడు. మనిషిలో కోరికలు పెరగడానికి ప్రకృతి దోహదం చేస్తుంది. పలు రకాల భావనల్ని అతడిలో సృష్టిస్తుంది. వినీల ఆకాశంలో పక్షిలా ఎగరాలన్న మానవుడి కోరికకు ఈ సృజనే మూలం. ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం. మానవళి అడగకుండానే అన్ని ఇచ్చే ఈ గురువుల నుండి అనేకం నేర్చుకోవాల్సి వుంది.
నేల సహనానికి నిదర్సనం. ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. ఎన్ని రకాలుగా మలినాలను పడేసినా మౌనంగా భరించి తనలో కలిపేసుకోవడమే కాక తన శక్తితో శుభ్రం చేస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి మనల్ని మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది.
నీరు శుచి శుభ్రతకు చిహ్నం. ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది. అలాగే కాక శుభ్రం చేసే గుణం కలిగి ఉంది. మనిషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది.
నిప్పు కు కాల్చే శక్తి అమితంగా వుంది. అయినా మన శరీరంలో జఠరాగ్ని రూపంలో నిక్షిప్తం గా వుండి ఆకలిని కలిగించడమే కాకుండా తిన్న ఆహారాన్ని అరిగేలా చేస్తుంది. మలినాలను పోగొడుతుంది. దేవతలకు మనం చేసే యజ్ఞయాగాది క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది. లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది. నిప్పులో నిర్మలత్వం ఉంది.
గాలి కి పరోపకార గుణం అమితం. ఎప్పుడూ నిరాపేక్ష గా ఉపకారం చేస్తుంది. పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్ళి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ది పొందిస్తుంది. మనిషికి నిరంతరం చెట్ల నుండి ఆక్సిజన్ అందిస్తుంది. ఇలా గాలిని పరోపకార బుద్ది నేర్పుతుంది.
ఆకాశం నిర్మలత్వానికి చిహ్నం. ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది. ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది.
ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకుని, ప్రకృతిలో గల కార్యకారణ సంబంధాల్ని అర్థం చేసుకుని ముందుకు సాగండి అని మన వేద శాస్త్రాలు బోధిస్తున్నాయి ‘ధర్మోరక్షతి రక్షిత:’ – అంటే ప్రకృతి ధర్మాన్ని రక్షించుకుంటే – ఆ ప్రకృతి ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని. తర్వాత సంఘం – నీ చుట్టూ ఉన్న సంఘాన్నీ, దాని కట్టుబాట్లను గుర్తిస్తూ అందులో ఒదుగుతూ, ఇమిడిపోతూ మాత్రమే ముందుకు సాగమని అర్థం.
అపవిత్రత నుండి తనను తాను శుద్ధి చేసుకోవడానికి ఉత్తమ మార్గం మన మనస్సును అపవిత్రం చేస్తే, ప్రకృతి ఖచ్చితంగా మనల్ని ఎటువంటి ఆలస్యం చేయకుండా శిక్షిస్తుంది అనే ప్రాథమిక నియమాన్ని అర్థం చేసుకోవడం. దీనికి విరుద్ధంగా, మనం మంచి ఆలోచనలు మరియు పనులతో మనస్సును శుద్ధి చేస్తే, ప్రతిఫలం కూడా ఆలస్యం లేకుండా వస్తుంది. ప్రకృతి ప్రతిస్పందనలో ఖచ్చితంగా ఆలస్యం లేదు. అన్న వాస్తవం గ్రహింపుకు ర్తావడం ఎంతో అవసరం!
***
No comments:
Post a Comment