తెలుగు నేల మాతృభాషను మరువ నేల
- డా. తిరునగరి శ్రీనివాస్
9441464764
తెలుగు అభ్యసనానికి తోవ...
-------
అక్షరం ప్రభాకర్ అవిరళ కృషికి నిదర్శనం అక్షరాభ్యాసం తెలుగు వాచకం. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభాకర్ ఎంతో ఓపికతో, అంతే బాధ్యతతో చేసిన చక్కటి ప్రయత్నం ఈ అక్షరాభ్యాసమన్నది అందులోని పేజీలను తిరగేసి చూసినాక తప్పక తెలుస్తుంది. అక్షరాభ్యాసం పేరుకు తగ్గట్టుగానే ప్రాథమిక స్థాయిలో ప్రధమ సాధనగా తెలుగు భాష అభ్యసన వికాసానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది.. వరుస క్రమమును అనుసరించి అక్షరమాల, గుణింతాలు, ఒత్తులు, ఒక పద్ధతి ప్రకారం పాఠాలు, అభ్యాసాలు కూర్చిన విధానం ఎంతో సులభతరంగా ఉంది... అంతే కాదు తెలుగు వాచకం రచనకు సహకారిగా ఉంది... ఈ పుస్తకం సాధారణ పాఠకులకే కాక విద్యాధికులకు కూడా ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
అక్షరాభ్యాసంలో చేర్చిన అంశాలను అక్షరాలయం... తోవ పేరుతో విషయ సూచికగా అందించారు. వరుస క్రమంలో క్రమత్వాన్ని పాటిస్తూ తోవలో పాఠ్యాంశాలను చేర్చిన తీరు ఆసక్తికరంగా సాగింది. 42 పాఠాలను, 120 అభ్యాసాలుగా ఈ వాచకంలో కూర్చారు. అభ్యాసం 1 నుండి 21 వరకు అక్షరమాల పరిచయ పాఠాలు ఉన్నాయి. అభ్యాసం 22 నుండి 63 వరకు గుణింతాల పరిచయ పాఠాలను పొందుపరిచారు. అభ్యాసం 64 నుండి 85 వరకు ఒత్తుల పరిచయ పాఠాలు ఉన్నాయి. అభ్యాసం 86 నుండి 120 వరకు పదజాలామృతం, గేయాలు, కథలు, పరిచయ పాఠాలను చేర్చారు. ప్రతి అభ్యాసం పఠన కౌశలాన్ని పెంచే విధంగా రూపొందింది. అభ్యాసం 1 నుండి అభ్యాసం 120 వరకు నిశితంగా గమనిస్తే ప్రతి ఒక్క అభ్యాసం చదవడం, రాయడం వచ్చిన తరువాతే ఇంకో అభ్యాసాన్ని ప్రారంభించాలన్న నియమాన్ని తప్పక పాటించాలని సూచించిన విధం బోధపడుతుంది.
తెలుగు అక్షరమాలలోని ప్రతి అక్షరానికి ఉన్న ప్రత్యేకమైన శబ్దాన్ని స్పష్టంగా ఉచ్ఛరించడమే కాకుండా అక్షరం ఆకారం ఏమాత్రం చెడకుండా రాయడమే పునాది అని గమనించాలని చెప్పారు. బొమ్మలతో అక్షరమాలలోని అక్షరాలను ఎలా గుర్తు పట్టాలో ఎంతో చక్కగా వివరించారు. తెలుగు అక్షరమాలలోని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలను సోదాహరణంగా తెలిపారు. హల్లు అసలు రూపం ఏమిటో తెలిపేందుకు అనేక అంశాలను వివరించి చెప్పారు. హల్లు అసలు రూపం పేరు, ఆయువు పోసిన అమ్మ పేరు, ఆయువుకు ఆసరాగా నిలిచిన సంజీవని గుర్తు పేరు, అంకురించిన అక్షరం పేరు అన్న నాలుగు విభాగాలను చూపి అత్యంత సులభంగా అర్థమయ్యేలా విశదీకరించారు. స్పష్టంగా ఉచ్ఛరించడం, వేగంగా చదవడం ఎలాగో తెలిపేందుకు వర్ణాలను పైనుండి కిందికి, కింది నుండి పైకి గుర్తుపట్టే వరకు చదవాలన్న తప్పనిసరి సూచనను ఇచ్చారు. పఠనా కౌశలం పెంచుకునేందుకు అక్షరాల మధ్య ఉన్న శబ్దాల తేడాలను జాగ్రత్తగా పలుకుతూ భాషా దోషాలు లేకుండా చదివి రాయాలన్న ఇంకో సలహా కూడా ఇచ్చారు. అక, అగ, అచ, అజ, అట, అడ, అన, అత వంటి పదాలను ఉదాహరిస్తూ పఠన కౌశల సామార్థ్యపు పెంపును స్పష్టంగా క్రోడీకరించారు. అర్థం పర్థం లేని పదాలను పెదవి విరవకుండా చెప్పాలని, ఉన్నత స్థాయి పఠనానికి పఠనా నైపుణ్యాలను సాధనతో పెంచుకోవడమే మార్గమని తెలిపారు. స్పష్టమైన ఉచ్ఛారణతో పఠనా కౌశలం పెరుగుతుందని చెప్పారు. అక్షరమాలతో సరళ పదాల ఉచ్ఛారణ జరపాలని అన్నారు. గుర్తులతో గుణింతాలను ఎలా గుర్తుపట్టాలో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడిదీర్ఘం, కొమ్ము, కొమ్ముదీర్ఘం వంటి ఉదాహరణలతో స్పష్టంగా వివరించారు. హల్లులు, అచ్చులతో కలిసినప్పుడు వచ్చే రూపమే గుణింతమని తెలిపారు. గుణింతాల పఠనం సులువుగా ఎలా చేయవచ్చో వివరించారు. టాటా, టాటూ, టైటు, డోడౌ, తైతే, దోదా, పేపా, బైబి, బాబో, మూమి, నూని, శూశ, హేహా వంటి పదాలను ఉదాహరిస్తూ అత్యంత స్పష్టతతో తెలిపారు. గుణింతాలతో పదాల ఉచ్ఛారణను వివరిస్తూ ఫలం, ఘిరాయించు, ఛీదిరం, తిథి, నూతి, తూకం, సూనం, ఖళూలిక, జముడు వంటి పదాలను సూచించారు. పాఠం చదవడం అంటే అసలే దడ ఉండకూడదని సాధనమే సిసలైన విజయానికి సోపానమన్నారు. గాలిపటం, గిలక, గీత, గుడి, గూడు, గృహిణి, గేద, గైహికం, గొడుగు, గౌను వంటి పదాలను అభ్యాసాలుగా సూచిస్తూ తదనుగుణమైన పదాలను ఇచ్చి ఉచ్ఛారణ రూపాలను తెలిపారు.
బంగారు మాట - బంగారు బాట అన్న పాఠంలో ఎన్నో సామెతలను స్పృశించారు. దసరా సెలవులలో కథ సమయపాలన ప్రాధాన్యతను వివరించింది. అక్షరం వెలుగు, ఒత్తుల పట్టిక, ఒత్తు పలుకు విధం వంటి అంశాలు ఉచ్ఛారణాసక్తిని పెంపొందిస్తాయి . బిడ్డ, గొడ్డలి, కత్తి, కత్తెర, అద్దం, వెన్నుపూస, దుప్పి, జమ్మిచెట్టు, గొర్రె, గుర్రం, బల్లి, ఉల్లి, పువ్వు, దువ్వెన, నిశ్శబ్దము, దుశ్శాలువ, కాళ్ళగజ్జెలు వంటి పదాలను పరిచయం చేసి సమన్వయ ఉచ్ఛారణ రూపాలను తెలిపారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది సంయుక్తాక్షరమని వివరిస్తూ తర్కం, ఖడ్గం, నిర్జరుడు, కర్పూరం, సంపూర్ణం, ప్రశాంతం, ప్రోత్సాహం, చతుర్థి, అగస్త్యుడు, దౌష్ట్యము వంటి పదాలను ఉదాహరించారు. ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు ఉంటే దానిని సంశ్లేషాక్షరం అంటారని తెలిపారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శీర్షికలో అంబేద్కర్ మొదలుకొని గుడిపాటి వేంకటాచలం వరకు ముప్పై మంది మహనీయులను సచిత్రంగా చూపించారు. కలుపుటలో స్వల్పమే - అర్థంలో బహు తేడా అంటూ కుడి ఎడమైతే పొరపాటేనోయ్ అన్న శీర్షికన అట - ఆట, ఒక్క - వక్క, పరాయి - షరాయి, శబల - సబల వంటి పదాలను వివరించి చెప్పారు. అక్షర బోధిని, ఒత్తులు చేర్చి రాయడం, వర్ణమాల పాడుతుంది (గేయం), గుణింతాలతో గేయం వంటి శీర్షికలు ఉచ్ఛారణ సామర్థ్యాన్ని పెంచే పదాల కూర్పును కలిగి ఉన్నాయి. తలవంచిన పులి కథలో గుణింతాలను గుర్తించే పద క్రీడను ప్రవేశపెట్టి ఎంతో ఆసక్తిని పెంచారు. ఏ ఊరు మీది, ఒత్తులతో గేయం, ఆటాపాట, బతుకమ్మ మన పండుగ, తెలుగు - ఆంగ్ల నెలలు, సెలవుపత్రం, రాశులు - 12, తెలుగు సంవత్సరాలు - 60, మన నిత్య జీవితంలో అనునిత్యం గణితం పేరిట అంకెలు - సంఖ్యలను వివరించారు. అమ్మ మాట విందాం, కాలం బంగారం కన్నా విలువైనది, దిక్కులు - దిక్పాలకులు, పదామృతం, ఆరోగ్యమే మహాభాగ్యం, ధ్వన్యనుకరణ గేయం, ఇవి తెలుసుకుందాం (పంచ భూతాలు, చతురాశ్రమములు, త్రిగుణములు, త్రికరణములు, నీకు చేతులెత్తి దండం పెడతాం, అటు నేనే - ఇటు నేనే (ఎక్కాలు చదువుదాం), అక్షరం ఆయుధం (గేయం), జాతీయ సమైక్యత (జాతీయ గీతం, వందేమాతరం), తెలుగు భాషా వైతాళికులు వంటి శీర్షికాంశాలు భాష నేర్చుకొనే దిశగా ఎంతో ఆసక్తిని పెంపొందిస్తాయి. భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, డాక్టర్ చుక్కా రామయ్య, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ కాలువ మల్లయ్య, ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనాథం వంటి ప్రముఖులు అక్షరాభ్యాసంలోని విశిష్టతను వివేచిస్తూ ఈ అక్షరాభ్యాసం వాచకానికి తమ సందేశాలను అందించారు.
విద్యార్థులకు, భాషపై మక్కువ ఉన్న భాషాభిమానులకు ఎంతో ఉపయోగపడే రీతిలో అత్యంత అరుదైన అంశాలను చేర్చి రూపొందిన ఈ వాచకాన్నివిద్యార్థులకు అందజేస్తే ప్రాథమిక స్థాయి నుండే ఎంతో ప్రయోజనకారి అవుతుందన్న విశ్వాసాన్ని కూడా ఎందరో ప్రముఖులు ఈ వాచకాన్ని చదివి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పుస్తకమంతటా పాఠాల క్రింది భాగాన ప్రతి పేజీలో టాల్‌స్టాయ్, కబీర్, శ్రీనివాసరామానుజం, జార్జి బెర్నార్డ్ షా, అంబేద్కర్, సరోజిని నాయుడు, స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణ, గుర్రం జాషువా, కాళోజీ వంటి ఎందరెందరో మహనీయులు చెప్పిన ఆణిముత్యాల్లాంటి ఆచరణీయమైన మంచి సూక్తులను పాఠకులు, అభ్యాసకుల కోసం అందజేశారు. మాతృభాషలో విద్యాబోధన జరిగినప్పుడు విద్యార్థి సమగ్ర వికాసంతో పాటు ప్రాథమిక విద్యా లక్ష్యం తప్పనిసరిగా నెరవేరేందుకు, సామాన్యులకే కాకుండా విద్యాధికులకు కూడా ఈ తెలుగు వాచకం ఎంతో ఉపయుక్తమన్నది నూరుపాళ్ల నిజం.
పుస్తకముల కొరకు:
అక్షరం ప్రభాకర్ మానుకోట
9951537533
మరియు అచ్చంగా తెలుగు. ను
సంప్రదించగలరు
No comments:
Post a Comment