వింతైన వేడుకలు - అచ్చంగా తెలుగు
వింతైన వేడుకలు
జి.ఎస్.లక్ష్మి 


“అమ్మా, నాకీ పెళ్ళొద్దే..” రాత్రి భోజనాలయ్యాక, వంటిల్లు సవరించుకుంటున్న రుక్మిణి  వెనక నుంచొచ్చి, తల్లి కొంగు పట్టుకుని నలుపుతూ నెమ్మదిగా అన్నాడు రవి.
“ఏవిటీ!” గట్టిగా అంటూ వెనక్కి తిరిగింది రుక్మిణి.
“హుష్…హుష్.. నాన్న వింటారు..” ముందు గది వైపు తొంగి చూస్తూ అన్నాడు.
రవి హెచ్చరిక విని కాస్త గొంతు తగ్గించింది రుక్మిణి.
“ఏమైందిరా!”
“ఏమైతేనేం.. నాకైతే వద్దంతే..” అని ఖచ్చితంగా తల్లికి చెప్పేసి, తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు రవి.
వంటింటి తలుపులు మూసి వచ్చి హాల్లో టీవీ లో వార్తలు వింటున్న రాజారావు పక్కన కూర్చుని ఉస్సురని నిట్టూర్చింది రుక్మిణి..
“ఏంటీ.. అలసిపోయేవా.. ఇంకెన్నాళ్ళులే.. నాల్రోజుల్లో కోడలొచ్చి నీ చేతిలో పని అందుకుంటుంది.”
రాజారావు మాటలకి ఇంకాస్త గట్టిగా నిట్టూర్చింది రుక్మిణి.
“ఏవైందీ.. ఏవిటి సంగతీ..” అన్ని నిట్టూర్పులు విడుస్తోందంటే ఏదో గట్టి విషయమే అయ్యుండొచ్చని అనుకున్నాడు రాజారావు.
“మీ అబ్బాయికి ఈ పెళ్ళొద్దుట..” పక్కలో బాంబు పేలినంత పనైంది రాజారావుకి.
“ఏం.. ఎందుకుట.. ఈ సంబంధం కుదరడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలీదా వాడికీ!”
“ఎందుకో చెప్పలేదు. వద్దన్నాడంతే.. “ రుక్మిణి మాటలకి సర్రున కోపం వచ్చింది రాజారావుకి.
   “ఏం చూసుకుని వద్దంటున్నాడూ! అసలు కారణం ఏవిట్ట…ఎంత బుధ్ధిమంతుడు మనవాడు.. ఒఖ్ఖ చెడు అలవాటు కూడా లేదు కదా! అలాంటి పిల్లాణ్ణి ఒకింటివాణ్ణి చెయ్యడానికి ఇన్నాళ్ళూ  మనం పడ్ద తంటాలు వాడికి తెలీదూ! వీడు ఎంత సంపాదిస్తున్నా కూడా ఈ రోజుల్లో అమ్మాయిలకి ఆ సంపాదన ఎంతమాత్రం ఆనటంలేదు. ఆ బెజవాడ సంబంధం వాళ్ళేవన్నారూ.. వేరుకాపరం పెడతారా అని పెళ్ళిచూపుల్లోనే అడిగేసేరు. మీ తమ్ముడు తెచ్చిన సంబంధం వాళ్ళు మటుకు తక్కువ తిన్నారా.. వాళ్ల ఊరికి మనవాణ్ణి ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నారు. ఇవన్నీ ఇలా ఉన్నాయని మాట్రిమోనియల్ సైట్ లో వీడి వివరాలు పెడుతే ఒఖ్ఖళ్ళంటే ఒఖ్ఖళ్ళు  ఫోన్ చేసేరా!.. ఆఖరికి మనవే కొంతమంది గోత్రాలూ, నక్షత్రాలూ చూసుకుని కాంటాక్ట్ చేస్తే ఒఖ్ఖళ్ళైనా సరిగ్గా సమాధానం చెప్పేరా! “
  ఆగకుండా  సాగిపోతున్న రాజారావు మాటల ప్రవాహాన్ని ఆపుతూ, “అవన్నీ సరేనండీ.. అయిపోయినవేవో అయిపోయేయీ.. ఈ సంబంధం కుదుర్చుకున్నాం కదా! అన్నీ అయ్యాక ఇప్పుడు చేసుకోనంటున్నా డేంటండీ!”
“అదే నేనూ చెప్పేది.. ఎంత కష్టపడి ఈ సంబంధం కుదుర్చుకున్నాం. ఋషులు కలిసినా గోత్రాలు వేరే కదా అని సర్దుకున్నాం. ఇద్దరి జాతకాల్లోనూ షష్టాష్టకాలున్నా అవీ మంచి షష్టాకాలేనని సిధ్ధాంతిగారంటే సరిపెట్టుకున్నాం.  ఆ పిల్ల వీడిని పేరుతో పిలుస్తున్నా పట్టించుకోనట్టు నటించాం. వాళ్ల అమ్మా నాన్నా మాటిమాటికీ ‘మా అమ్మాయిని గారంగా పెంచాం… గారంగా పెంచాం…’ అని ఒకటికి పదిసార్లు చెప్తుంటే వెర్రి మొహాలేసుకుని తలలూపాం..”
“అవునండీ.. అదేదో మనం మన పిల్లాడిని రోడ్లమీద పడేసి పెంచినట్టు అలా చెప్పేరేంటండీ!” దవడలు నొక్కుకుంది రుక్మిణి.
“అదేకదా నేనూ చెప్పేది. వాళ్ళు చెప్పిన కండిషన్లన్నింటికీ మారు మాటలేకుండా ఒప్పుకున్నాం. ఒక్క రూపాయి కట్నం అని కానీ, లాంఛనాలు అని కానీ అడగలేదు. ‘ఒక్కడే కొడుకు నా ముద్దూమురిపెం ఎప్పుడు తీరేను’ అని నువ్వు సరదా పడుతుంటే కూడా ‘నీకు కావల్సినవి నేను కొనిస్తా’ నని నేనే నీకు నచ్చచెప్పేను.  ఆ పిల్ల కూడా చాలామంది అబ్బాయిల్ని చేసుకోను పొమ్మందిట.. మరి ఏ దేవుడు కరుణించేడో మనవాడికి ఓకె చెప్పింది.”
రాజారావు ఆయాసం తీర్చుకుందుకు ఒక్క నిమిషం ఆగాడు.
“అసలే ఈ రోజుల్లో అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కుదుర్చుకుందుకు కార్ల టైర్లు అరిగిపోతున్నాయి. ఇప్పటికి అయిదేళ్ళనించీ చూస్తుంటే ఇప్పటికి ఇది అవుననుకున్నాం. హమ్మయ్యా…ఇంక కారు టైర్లు మార్చక్కరలేదని నేను సంతోషిస్తుంటే ఉరుములేని పిడుగులాగ ఇప్పుడు వీడు  పెళ్ళి వద్దనడవేంటీ!”
“ఏమోనండీ.. వాడు నాకు చెప్పడానికి మొహమాటపడుతున్నాడేమో.. పోనీ మీరు కనుక్కోకూడదూ!”
“నా దగ్గర అసలు నోరు విప్పడు.. ఎలాగోలాగ విషయమేంటో నువ్వే కనుక్కో.. ఎలాగైనా ఈ పెళ్ళి జరిగేలా చూడు.  లేటైతే మరీ ముదిరిపోతాడు.”
“అవునండీ.. నాకు తెలీక అడుగుతాను.. వయసు మీద పడేది ఒక్క మగపిల్లలకేనా! ఆడపిల్లలు మాత్రం ముదిరిపోరా! అయినా వాళ్ళు  ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా ఇన్ని కండిషన్లు పెడుతున్నారంటే ఏమనుకోవాలీ!”
“రోజులలా ఉన్నాయి రుక్మిణీ.. ఇదివరకు మగపిల్లల హయాం చలామణీ అయితే ఇప్పుడు ఆడపిల్లల హయాం అవుతోంది. రోజుల్నిబట్టి మనం కూడా నడవాలి కదా!”
“ఏం రోజులో ఏవో.. పిల్లాడి పెళ్ళి అనుకున్నప్పట్నించీ ఎన్నెన్ని రకాల అనుభవాలు ఎదురౌతున్నాయో..” సాలోచనగా అంది రుక్మిణి.
రుక్మిణీ, రాజారావూ కలిసి రవికి శతవిధాల నచ్చచెప్పేరు.
తెలిసున్న పాత సామెతలూ, తెలుసుకుని కొత్త సామెతలూ చెప్పి రవి బుర్రని తినేసేరు. పెళ్ళయేదాకా అణకువగా ఉండడం ఈ రోజుల్లో చాలా అవసరమని నొక్కి వక్కాణించేరు. అన్నీ సరేననుకున్నాక  ఈ పెళ్ళి ఎందుకు వద్దంటున్నట్టో తేల్చి చెప్పమన్నారు.
రవి వాళ్ళన్నవన్నీ నోరు మెదపకుండా విన్నాడు. ముఫ్ఫైయ్యేళ్ళు వచ్చిన అతనికి తల్లీ తండ్రీ తన పెళ్ళి కోసం ఎంత బెంగ పెట్టుకున్నారో ఆమాత్రం తెలీదా! పెళ్ళి కుదిరితే కాలినడకన కొండెక్కి వచ్చి, ఆ శ్రీనివాసుని కల్యాణం చేస్తానని రాజారావు మొక్కుకుంటే, వారానికి మూడురోజులు ఉపవాసం ఉంటానని రుక్మిణి  సుబ్రహ్మణ్యస్వామికి మొక్కుకుంది.
  రవి మనిషి మంచివాడే.. కానీ  గబుక్కున కలుపుకుని నలుగురిలోకీ వెళ్ళి మాట్లాడే మనిషి కాదు. చాలా రిజర్వెడ్ గా ఉంటాడు. మనుషులు బాగా తెలిసినవారైతే కానీ పెదవి విప్పి మాట్లాడడు. ఇదివరకైతే అలాంటి మనిషిని పెద్దమనిషని గౌరవించేవారు. కానీ ఈ రోజుల్లో బతకడం చేతకానివాడంటున్నారు. నలుగురితో నవ్వుతూ తిరుగుతూ, వీకెండ్స్ లో పార్టీలకి, నెలకోసారి సైట్ సీయింగ్ కీ వెళ్ళని వాళ్ళని ఎలా తమ సర్కిల్ లోంచి తీసేస్తారో అలా తీసేస్తారు అతన్ని ఈ రోజుల్లో యువత. .
అందుకే చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ అతనికి  ఎవరూ దగ్గరి స్నేహితులు కాలేకపోయేరు.
    అతని కుటుంబం, ఉద్యోగం చూసి కొందరు ఆడపిల్లలు రవిని బుట్టలో వెయ్యడానికి ప్రయత్నించేరు. కానీ వారి చిల్లర వేషాలు అతనికి అసహ్యం అనిపించి, అసలు ఆడవాళ్లంటేనే దూరంగా ఉండడం మొదలుపెట్టేడు. పెళ్ళి కాకముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకుంటూ, ఆడా మగా కలిసి తిరిగే ఈ రోజుల్లో రవిలాంటి అబ్బాయి ప్రత్యేకంగానే కనిపించేడు అందరికీ. అందుకే అతని జోలికి వెళ్ళడం మానేసేరు. ఇది రవికైతే బాగానే ఉంది కానీ వాళ్ళమ్మా నాన్నలకే కష్టమైపోయింది. అయిదేళ్ళనించీ కార్ల టైర్లు అరిగిపోయేలా తిరిగి, ఆఖరికి ఈ సంబంధం అవుననుకుని, నాల్రోజుల్లో నిశ్చితార్థం అనుకుంటుంటే…ఉరుములేని పిడుగులా ఇప్పుడు పెళ్ళి వద్దనడం ఏంటో వాళ్లకి అర్థం కాలేదు.
ఇంక తను కనుక్కోక తప్పదనుకుంటూ రుక్మిణి రవి గదిలోకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే రవి మొబైల్ కి మెసేజ్ వచ్చినట్టు శబ్దం వచ్చింది.  గదిలోకి వస్తున్న తల్లిని చూసి చటుక్కున మొబైల్ ని వెనక్కి దాచేసేడు రవి. రుక్మిణి అనుమానంగా చూసింది. రవి తలొంచుకున్నాడు. రుక్మిణి చనువుగా వెళ్ళి, రవి చేతిలో మొబైల్ అందుకుని, ఆ మెసేజ్ ఏమిటోనని చూసింది.
“హాయ్ బేబీ.. వాట్సప్..” అనుంది అందులో. తెల్లబోయిన రుక్మిణి పంపిందెవరోనని చూస్తే ‘వర’ అని ఉంది.. వర అంటే పెళ్ళికూతురు వరలక్ష్మే అయుండాలి అనుకుంటూ, “ఏంరా.. ఆ పిల్లేనా!” అనడిగింది రవిని. తలూపేడు రవి…
“‘ఈ వాట్సప్… అంటే ఏంటిరా..!” అడిగింది అర్థం కాక.
“నిన్న కూడా పంపిందమ్మా..” అన్నాడు రవి నెమ్మదిగా.
“ఇలాగే..” ఆశ్చర్యంగా అడిగింది.
“ఊహు.. కాదు.. ఇదిగో చూడు..” అంటూ ముందురోజు వచ్చిన మెసేజ్ చూపించేడు.
“హాయ్ బేబీ.. కెన్ వుయ్ మీట్ ఎట్ ఇనార్బిట్ మాల్ టు డే..” అనుంది.
“అంటే.. నిన్న వెళ్ళేవా..” అనుమానంగా అడిగింది… ఎప్పుడూ వీకెండ్ కి ఇల్లు కదలని రవి నిన్న శనివారం బైటకి ఎందుకెళ్ళేడో అప్పు డర్థమైంది రుక్మిణికి.
“ఏం మాట్లాడుకున్నారూ!”
“ఆ అమ్మాయి చాలా ఫాస్టమ్మా..”
“అంటే…”
“వెళ్ళగానే హాయంటూ నాకు షేక్ హాండ్ ఇవ్వబోయింది. పెళ్ళికాని అమ్మాయిల చెయ్యి పట్టుకోవడం తప్పు కదమ్మా. అందుకే నా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను.” తర్వాత అన్నట్టు చూసింది రుక్మిణి.
“తర్వాత షాపింగ్ చేద్దామంది. ఏం కొనాలని అడిగితే ఎంగేజ్ మెంట్ కి ఇద్దరం మేచ్ అయేటట్టు ఒకలాంటి బట్టలే కొనుక్కుందామంది. ఉంగరాలు కూడా ఒక్కలాంటివే కొనాలంది.  అయినా ఇద్దరి అభిరుచులూ, అభిప్రాయాలూ మేచ్ అవాలి కానీ బట్టలూ ఉంగరాలూ మేచ్ అవడం ఏంటమ్మా!  అందుకే మీకు చెప్పకుండా అవన్నీ కొనడానికి నాకు ఇష్టం లేకపోయింది. ఆ మాటే ఆ అమ్మాయితో చెప్పేను.”
“ఏమందీ!” ఆత్రంగా అడిగింది..
“అయితే అమ్మకూచివన్న మాట… అంటూ ఫక్కున నవ్విందమ్మా.” రుక్మిణి ఆశ్చర్యంగా చూసింది.
ఇంకా చెప్పమన్నట్టు చూసింది. “కాఫీ తాగుదామంటూ ఫుడ్ కోర్ట్ కి తీసికెళ్ళింది. తాగేక ఇద్దరికీ నేను పర్సులోంచి డబ్బు తీసి ఇస్తుంటే, ‘నీ క్రెడిట్ కార్డులు తేలేదా!’ అనడిగింది. నేను ఉన్న మాటే చెప్పేనమ్మా… ‘నా కార్డులు నా దగ్గర ఉండవు. నా పేరు మీద తీసుకున్న విల్లాకి మా డాడీ నెలనెలా ఇన్స్టాల్ మెంట్స్ కడుతుంటారు. అందుకని అవి ఆయన దగ్గరే ఉంటాయీ.’ అన్నాను. దానికి ‘ఓహో… అయితే యెస్ ఫాదర్ టైప్ అన్న  మాట.’ అందమ్మా.”
రుక్మిణి కళ్ళల్లో కోపం తొంగి చూసింది. “తర్వాత…” అంది తనను తను సంబాళించుకుంటూ.
“ఇవాళ మధ్యాహ్నం మళ్ళీ సెంట్రల్ కోర్ట్ లో కలిసేమమ్మా..” రుక్మిణి  కళ్ళు మరింత విప్పారాయి.
“నిన్న ఆమె మాట్లాడిన మాటలకి  ఏదో నవ్వులాటకి అందని  సర్దుకుందాములే అనుకుంటున్న నేను, ఇవాళ తను అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలీక ఈ పెళ్ళి  వద్దంటున్నానమ్మా.”
“ఏవడిగిందిరా!” తననీ, భర్తనీ ఇంట్లోంచి పంపెయ్యమని అడిగిందేమోనని భయపడుతూ అడిగింది రుక్మిణి.
“ప్రీ  వెడ్డింగ్ షూట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకుందాము…అని అడిగిందమ్మా…”
“హేవిటీ!” రుక్మిణి నోటమాట రావడం కష్టమయింది.
  ఈమధ్య వస్తున్న  ప్రీవెడ్డింగ్ షూట్స్ చూస్తున్న రవి, రుక్మిణి, రాజారావూ కూడా చూసినప్పుడల్లా  వాంతి చేసుకున్నంత పని చేసేవారు. పవిత్రంగా, సాంప్రదాయంగా జరిగే వివాహానికి ముందు పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ అలా ఒకళ్ళ మీద ఇంకోళ్ళు పడిపోవడం, ఇద్దరూ కలిసి బురదలో దొర్లడం లాంటివి చూస్తుంటే వారికి కడుపులోంచి బాధ తన్నుకుంటూ పైకి వచ్చేసేది. అలాంటిది, ఇప్పుడు ఈ పిల్ల ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి అడిగేసరికి పాపం రవి అసలు ఈ పెళ్ళే వద్దు అనే నిర్ణయం తీసుకోవలసొచ్చింది.
రవి చెప్పింది విన్నాక రుక్మిణి కూడా ఇంక ఏమీ మాట్లాడలేకపోయింది. చిన్నబోయిన ముఖంతో కూర్చున్న కొడుకుని చూసి కడుపు తరుక్కుపోయిందావిడకి.
“ఇప్పుడు ఆ విషయం గురించి అడగడానికే నమ్మా… ‘వాట్సప్’ అంటూ మెసేజ్ పెట్టిందీ.”
అంటూ రవి వరలక్ష్మి గురించి తల్లికి చెపుతుండగానే మళ్ళీ మరో మెసేజ్ పంపింది వరం.
 “హాయ్ బేబీ.. నేను పెళ్ళిపీటలమీదకి ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త పా…డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ…’ పాటకి డాన్స్  చేస్తూ వస్తే భలే ఉంటుంది కదా!” 
అది చదివి హడిలిపోయిన రవి చేతుల్లోంచి మొబైల్ జారిపోతుంటే గబుక్కున పట్టుకుంది రుక్మిణి.
ఏమిటా మెసేజ్ అని చూసిన రుక్మిణి ఇంక తన్ను తాను సంబాళించుకోలేకపోయింది.
కొడుకు తల నిమురుతూ, “పోన్లేరా… ఈ పిల్ల  కాపోతే ఇంకో బుల్లి… మనకి తగ్గవాళ్ళు దొరక్కపోరు.  ఈ సంబంధం వదులుకోమని పొద్దున్నే ఫోన్ చేస్తానులే వాళ్లకి. నువ్వు పడుక్కో…” అంటూ ఈ విషయం  రాజారావుకి చెప్పడానికి హాల్లోకి వెళ్ళింది.
విషయం విన్న రాజరావు “రేపటిదాకా ఎందుకూ…ఇప్పుడే చెప్పేస్తే హాయిగా పడుకోవచ్చు…” అంటూ కాబోయి, ఆగిపోయిన వియ్యంకులు చక్రపాణికి ఫోన్ చేసి చెప్పేడు. విషయం విన్న వెంటనే అటువైపునుంచి ఫక్కున నవ్విన ఆయన నవ్వు వినిపించింది. రాజారావుకి ఏమీ  అర్థం కాలేదు. కాసేపటికి సంబాళించుకున్న చక్రపాణి ఇలా అన్నాడు.
“బావగారూ, మీరేమీ అనుకోనంటే ఒకసారి మా చెల్లెమ్మగారినీ, రవిబాబునీ కూడా పిలిచి, ఫోన్ స్పీకర్ లో పెట్టండి… మీకు ఒక విషయం చెప్పాలి.” అన్నాడు.
వెంటనే రాజారావు స్పీకర్ ఆన్ చేసి రవీ, రుక్మిణిలతో కలిసి చక్రపాణి చెప్పిన మాటలు వినసాగేడు.
“బావగారూ, మా అమ్మాయి వరలక్ష్మి చక్కగా చదువుకుంది. మంచి ఉద్యోగం చేస్తోంది. అయినా కూడా ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లల్లా కాకుండా పధ్ధతిగా పెరిగింది. చదువు, ఉద్యోగం మనిషిలోని జ్ఞానాన్ని పెంచాలి కానీ అక్కర్లేని అభిజాత్యాలని కాదని అనుకునే అమ్మాయి మా అమ్మాయి. ఇప్పటివరకూ తనకి చూసిన సంబంధాల వాళ్లందరూ పెళ్ళింకా కుదరకుండానే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటూ తనని షాపింగ్ లకి రమ్మనీ, గిఫ్ట్ లు తీసుకోమనీ అనేవారు. అంతే కాకుండా పెళ్ళికి ముందు ప్రీవెడ్డింగ్ షూట్ కావాలనేవారు.  అది ఇష్టం లేని మా అమ్మాయి వాళ్ళెవరినీ చేసుకోనని చెప్పేసింది. పెళ్లయేక ఒక స్థిరమైన కుటుంబం ఏర్పడాలంటే పధ్ధతిగా పెరిగిన అబ్బాయిని మాత్రమే పెళ్ళి చేసుకుంటానంది. అదృష్టవశాత్తూ మీ రవి మాకు దొరికేడు. మరింక నిన్నా, ఇవాళా మా వరం మీ అబ్బాయితో అలా ఎందుకు మట్లాడిందంటే… ఈ విషయాల్లో అతని అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందుకు మాత్రమే. మా అమ్మాయి రవిని పెట్టిన ఇబ్బందికి ఆమె తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీరు అర్థం చేసుకుని, నిశ్చితార్థానికి వస్తారని ఆశిస్తున్నాను.” అన్నాడు.
సంగతి తెలిసేక ముగ్గురి మొహాలూ సంతోషంతో విచ్చుకున్నాయి.
“తప్పకుండా వస్తామండీ… మర్యాదలూ గట్రా ఘనంగా ఉండాలండోయ్ బావగారూ… మేమసలే  పధ్ధతులూ గట్రా ఖచ్చితంగా పాటించేవాళ్లం.” అన్న రాజారావు  మాటలకి బదులుగా చక్రపాణి
“అందులో మీకే లోటూ రానివ్వం బావగారూ… అల్లుడికి అలకపాన్పు కూడా ఏర్పాటు చేస్తాం.” అన్నాడు.
ఆ మాట విన్న రవి, రుక్మిణి, రాజారావుల ముగ్గురి నవ్వులు స్పీకర్ లోంచి అవతలివారికి గట్టిగా వినిపించేయి.

  ****

No comments:

Post a Comment

Pages