మానసవీణ -55 - అచ్చంగా తెలుగు

మానసవీణ -55

Share This

 మానస వీణ-55

-శ్రీసత్య గౌతమి

 



అనిరుధ్, తన తండ్రిని పట్టి ఇస్తానని నమ్మకంగా దినేష్ కి చెప్తున్నా లోలోపల కృంగి పోతున్నాడు. అది అతని ముఖంపై కొట్టొచ్చినట్లుగా దినేష్ కి కనబడుతోంది. 

అయితే మాత్రం, పోలీసు!  అంతే నమ్మకంగా ముఖం పెట్టి అనిరుధ్ ని సాగనంపి... తనతో ఉన్న కానిస్టేబుల్స్ కి కంటితోనే సైగ చేసాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ అతని కంటి ద్వారా ఉత్తర్వు అందుకొని, అనిరుధ్ ని ఒక కంట కనిపెట్టడానికి అక్కడినుండి వెళ్ళి పోయారు. అనిరుధ్ ఇంటికి వచ్చేసి హోం కంప్యూటర్లో, ఇంటర్నెట్లో ఏదో పిచ్చిగా వెతకడం మొదలు పెట్టాడు.

*****

"ఏరన్ ఫెర్నాండేజ్, థి డిటెక్టివ్. అన్నవరంలో పుట్టిన వీర వెంకట సత్యనారాయణ రామజోగయ్య ఎలాగైనా మిస్టీరియస్ ఛాలెంజింగ్ విషయాల్ని ఛేదించి డిటెక్టివ్ కావాలన్న ఆశతో పేరు మార్చుకొని మలేషియాలో జర్నలిస్టు అయ్యాడు. తన యజమాని హత్యకు గురైతే, దాని కారణాలను వెతికి పట్టుకునే బాధ్యతను తలపైకెత్తుకొని, ఆ నేపథ్యంలో చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ ను బట్టబయలు చేసి, నేరస్తులను చట్టానికి పట్టించి స్వదేశానికి విచ్చేస్తున్నారు. మలేషియా గవర్నమెంట్ అతనికి పురస్కారాన్ని అందించి అభినందించింది. తెలుగువాడి విజయం తెలుగు రాష్ట్రానికే విజయం..." అంటూ ఏరన్ గురించిన వివరాలు, అతని ఫొటో ఎప్పుడో అన్ని పేపర్లలో చూసాడు అనిరుధ్. 

ఆ సమాచారాన్ని మళ్ళీ పట్టి, ఏరన్ ని కాంటాక్ట్ చేసి తన తండ్రి కేసుని రహస్యంగా అతనికి ఇవ్వాలని నిర్ణయించాడు.  

'దినేష్ ఒక పోలీసు, తన తండ్రికి ప్రత్యర్ధి స్థానంలో ఉన్నాడు. అతని ఆలోచనలలో తన తండ్రి అల్రెడీ ఒక ముద్దాయిగా ముద్ర వేసుకున్నాడు. కేవలం సరియైన సాక్ష్యం గురించి చూస్తున్నాడు, అరెస్ట్ చెయ్యడానికి. దానికి నన్నే పావుగా వాడాలనుకుంటున్నాడు. ఈ విషయంలో అతని కంట పడకుండా ఒక డిటెక్టివ్ ద్వారా నడిపిస్తే కనీసం తండ్రిని కాపాడుకొనే అవకాశమన్నా దొరుకుతుంది’ అనిరుధ్ ఆలోచనలు పరి పరి విధాలా సాగుతున్నాయి.

ఆలొచిస్తూనే... ఏరన్ నెంబర్ కి కాల్ చేసాడు. పిఎ ఎత్తాడు.

"సార్ ఇప్పుడు మలేషియాలో లేరు. ఇండియాలోనే ఉన్నారు ఒక కేసు పని మీద. వచ్చాక చెప్తాను."

"అయితే ఇండియాలో నెంబర్ ఇవ్వండి, నేను ఇక్కడే కలిసి మాట్లాడతాను."

"సారు ఫోన్ చేసాక మీ గురించి చెప్తాను. మీ నెంబర్ ఇవ్వండి. ఆయనే కాల్ చేస్తారు మీకు" అంటూ అనిరుధ్ నెంబర్ తీసుకున్నాడు.

"ఆయన నెంబర్ కూడా నాకు ఇవ్వొచ్చుగా..." అన్నాడు అనిరుధ్.

"సారు కేసు మీద పని చేస్తున్నప్పుడు, తన నెంబర్స్ ఎవ్వరికి ఇవ్వకూడదంటారు. ఆ సమయంలో మీలాంటి క్లయింట్స్ వస్తే ఆయన ఫోన్ చేసేంతవరకూ ఎదురు చూడడమే.." అన్నాడు పిఎ.

"ఓకే... నాది కూడా ఒక అంతుపట్టని చిక్కు సమస్య. ఈ కేసును కూడా చాలా పకడ్బందీగా చేధించాలి."

"అలాగే, అర్జెంట్ అని చెప్తాను. వీలయితే ఇవాళ రాత్రికే ఫోన్ చేయిస్తాను" అని ఫోన్ పెట్టేసాడు పిఎ.

అనిరుధ్ కి వెయ్యేనుగుల బలం వచ్చింది.

ఎప్పుడెప్పుడు ఏరన్ ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తున్న అనిరుధ్ కి ఫోన్ రంకెలు వేస్తూ మ్రోగడం మొదలెట్టింది. ఉలిక్కి పడుతూ ఆలోచనల నుండి బయట కొచ్చిన అనిరుధ్ తో అవతలనుండి ఒక బొంగురు గొంతు మాట్లాడుతోంది.

"మరి ఇప్పుడు ఏమి చెయ్యాలనుకుంటున్నావు? నీ తండ్రి నిర్దోషి అని నమ్ముతూ సాక్ష్యాలు వెతుకుతావా లేక దోషి అని నమ్ముతూ సాక్ష్యాలు వెతుకుతావా?"

ఖంగు తిన్న అనిరుధ్.. "ఎవరు మీరు? మీ పేరేమిటి? నా తండ్రి గురించి మీకేమి తెలుసు?"

నీ తండ్రి గురించి నాకేమి తెలుసన్నది కాదు ముఖ్యం, నీవేమి తెలుసుకోవాలనుకుంటున్నావన్నది ముఖ్యం."

"నాకు నిజం కావాలి. ఎంతో గౌరవనీయుడైన నా తండ్రిపై నేరాన్ని మోపుతున్నారు పోలీసులు. ఇది నన్ను బాధిస్తున్నది. మీకు తెలిసిన నిజాలు చెప్పండి. అసలు మీరెవరు?"

"హహహ..." అని అవతలనుండి నవ్వుతూ ఫోన్ పెట్టేసారు.

దాంతో పిచ్చెక్కిపోయింది అనిరుధ్ కి. ఇంతలో మళ్ళీ ఫోన్...

అతని దగ్గిరనుండే అనుకొని మళ్ళీ ఎత్తాడు ఆత్రంగా...

కానీ ఈసారి ఏరన్ నుండి ఫోన్. మనసుని కుదుట పెట్టుకొని, ఇంటికి రమ్మన్నాడు. అరగంటలో ఇంటి ముందు ఏరన్ కారాగింది.

"ప్లీజ్ కం..." అంటూ సాదరంగా ఆహ్వానించాడు అనిరుధ్.

ఆపై దినేష్ చెప్పిన విషయాలు, ఆశ్రమం తాలూకు విషయాలు అలాగే కొంచెం సేపటి క్రితం వచ్చిన ఫోన్ కాల్ విషయం కూడా చెప్పాడు.

"ఆ కాల్ గురించి డోంట్ వర్రీ... మీ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసుకుందామని చేస్తున్న కాల్స్ మాత్రమే అది."

"అదే ఎవరు?"

"పోలీసులు కూడా కావచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా దొంగల్లాగే పని చేస్తుంటారు. అంటే మీ మీద నిఘా వేసారు, మీ ద్వారానే అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంతే."

"నేనే వాళ్ళకి నిజానిజాలు బయట పెడతానని చెప్పాగా..."

"ఔను... అది మీకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా... ఇంట్లో ఒక నేరస్తుడు ఉంటే, ఇంటిల్లిపాది మీద నిఘా ఉంటుంది.

అయినా ఇప్పుడు నేను ఉన్నానుగా... చూసుకుంటాను. నన్ను మీరు ఆశ్రమానికి తీసుకు వెళ్ళాలి. కానీ నేను ఒక డిటెక్టివ్ ని అని తెలియకూడదు. ఒక ఉద్యోగం క్రియేట్ చెయ్యండి. రేపట్నుండి జాయిన్ అవుతా... ఆశ్రమాన్ని, అక్కడి సిబ్బందినీ నేను క్లోజ్ గా అబ్జెర్వ్ చెయ్యాలి."

"ఓ... తప్పకుండా. మానసకు వెంటనే చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చెయ్యమంటాను."

"అలాగే...నా గురించి మాత్రం చెప్పొద్దు. చాలా సీక్రెట్ మైంటైన్ చెయ్యాలి. చెయ్యగలరా?"

"మానస దగ్గిర నేను దాచాలంటే కష్టమే... అయినా రహస్యం గానే ఉంటుంది."

"గుడ్, అయితే ఇక పన్లు మొదలెట్టండి, నన్ను మళ్ళీ కాంటాక్ట్ చెయ్యండి" అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఏరన్ వెళ్ళిపోయాడు.

ఆశ్రమంలోని పిల్లలకు సరికొత్త టెక్నాలజీలో శిక్షణ ఇచ్చే ‘టెక్నాలజీ ఎక్స్పర్ట్ గా ఏరన్ ను చేర్చాడు అనిరుధ్.


No comments:

Post a Comment

Pages