మరో అవకాశం
డాక్టర్. బీ.యన్.వీ.పార్థసారథి
సత్యభూషణ్ ఒక అంతర్జాతీయ ఫార్మా కంపెనీ లో మార్కెటింగ్ మేనేజర్.
అంచలంచెలుగా ఎదిగి ఇరవై ఐదేళ్లలో ఏళ్లలో మార్కెటింగ్ డైరెక్టర్ స్థాయికి చేరాడు. అతను
తరచూ టూర్ల మీద దేశమంతా తిరుగుతూ ఉండటంతో పిల్లల బాధ్యత పూర్తిగా అతని భార్య సావిత్రి
మీద పడింది.
వాళ్లకి ఇద్దరు పిల్లలు చరణ్, రాధిక. చరణ్, రాధికలు బాల్యం
లో సత్యభూషణ్ ని వారానికోసారి చూడటం వల్ల, అతను ఎవరో గెస్ట్, లేదా చుట్టం అనుకునేవారు.
కొంచం పెద్దయ్యాక అతనే తమ తండ్రి అని గ్రహించారు. పిల్లలకి పదిహేనేళ్ళు వచ్చేసరికి
సత్యభూషణ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అయ్యాడు. అప్పటినుంచి ప్రతీ ఏడు వేసవి శలవల్లో
కుటుంబం అంతా కలిసి వారం, పదిరోజులు విహార యాత్రలు చెయ్యటం ప్రారంభించారు.
పిల్లలు తమకి ఏది కావాలన్నా తల్లి సావిత్రికే చెప్పేవారు.
వాళ్ళ చదువు మీదకూడా బాల్యం నుంచి సత్యభూషణ్ కన్నా సావిత్రి ఎక్కువ శ్రద్ధ వహించటంతో,
అన్ని విషయాలు పిల్లలు తల్లితోనే పంచుకునేవారు. తండ్రి సత్యభూషణ్ అంటే పిల్లలకి గౌరవం
తో పాటు భయం కూడా వుంది. అలాగని తండ్రి మీద ప్రేమ లేదని కాదు. భయం ముసుగులో ప్రేమ బంధింపబడింది.
తరచూ కుటుంబమంతా కలిసి విహార యాత్రలకి వెళ్ళటం మొదలుపెట్టినప్పటికీ,
పిల్లలు సావిత్రి తోనే బాగా చనువుగా మసలటం, తనతో మామూలుగానే ఉన్నప్పటికీ, పిల్లలు తనతో
అంత చనువుగా మసలకపోవటం గమనించాడు సత్యభూషణ్.
సత్యభూషణ్ కి పదోన్నతి వచ్చింది. అతను మార్కెటింగ్ డైరెక్టర్
అయ్యాడు. అతనికి ఇంకా ఏడేళ్ల సర్వీస్ వుంది. సత్యభూషణ్ ఖచ్చితంగా కంపెనీ కి ఎం డీ అవుతాడని
సహోద్యోగులు అనుకుంటున్నారు. కూతురు రాధిక ఎం బీ ఏ పూర్తి చేసి ఒక మంచి గ్లోబల్ కన్సల్టింగ్
కంపెనీ లో ఉద్యోగంలో చేరింది. కొడుకు చరణ్ ఇంజనీరింగ్ చేసి ఎల్ & టీ లో పని చేస్తున్నాడు.
అనుకోకుండా రాధికకి పెళ్లి కుదిరింది. పెళ్లి చేశారు. రెండేళ్లు అయ్యేసరికి రాధిక గర్భం
దాల్చింది. సత్యభూషణ్ కి మరో రెండేళ్లలో ఎం డీ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అతని వయస్సు ఇప్పుడు యాభై ఐదేళ్లు. సరిగ్గా రాధిక
మరో రెండు నెలల్లో పురుడు పోసుకుంటుందనగా సత్యభూషణ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
ఆఫీస్ లో అందరూ ఆశ్చర్యపోయారు అతను రాజీనామా చెయ్యటం చూసి.
పురుడు కోసం పుట్టింటికి వచ్చిన రాధిక, "నాన్న ఎందుకు
హఠాత్తుగా ఉద్యోగం మానేశారు?" అని అడిగింది తల్లి సావిత్రిని.
"ఏమోనమ్మా! నాకు ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేశారా?
అన్నీ చేసిన తరవాత చెప్పడమే కాని " అంది తల్లి కూతురితో. రాధికకి ప్రసవం అయ్యింది. మగపిల్లవాడు పుట్టాడు.
ఆశ్చర్యం ఏమిటంటే సావిత్రి తో పాటు సమానంగా సత్యభూషణ్ కూడా తల్లీ బిడ్డలని కంటికి రెప్పలా
చూసుకుంటున్నాడు. తండ్రి రోజంతా పక్కనే వుండి తల్లి సావిత్రి తోపాటు తనకి, తన పసికందుకి
సపర్యలు చెయ్యటం రాధికకిఎంతో ఆశ్చర్యంగా, సంతోషంగా కూడా అనిపించింది. రాధిక కి కొడుకు
పుట్టిన నెలరోజులకు చరణ్ కి కూడా పెళ్లయింది.
అనుకోకుండా రాధిక భర్తని వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆరు నెలలు ప్రాజెక్ట్
పనిమీద జెర్మనీ పంపించారు. దానితో రాధిక పసికందుని పెట్టుకుని పుట్టింట్లోనే ఉండిపోయింది.
కూతురు, మనవడు ఆరు నెలలు వుంటారనగానే సావిత్రి,సత్యభూషణ్
లు సంతోషించారు. సావిత్రికి ఇంటిపనుల్లో సహాయం చేయటంతో పాటు, మనవడిని రాత్రింబవళ్ళు
చూడటం, నిద్రబుచ్చటం కూడా సత్యభూషణ్ డ్యూటీల్లో భాగం అయ్యింది. సత్యభూషణ్ దగ్గర బాగా అలవాటై, పిల్లవాడు ఇతరులు
ఎవరు ఎత్తుకున్నప్పటికీ ఏడవటం మొదలుపెట్టాడు.
రాధిక భర్త జర్మనీ నుంచి తిరిగివచ్చాడు. ఇంతలో కోవిడ్ మహమ్మారి
వచ్చి రాధిక అత్తా మామల్ని పొట్టనిపెట్టుకుంది. ఈ పరిణామాల పర్యవసానంగా ఇప్పుడు రాధిక,
పసికందుతో పాటు రాధిక భర్త కూడా శశిభూషణ్ ఇంట్లోనే వుంటున్నారు.
ఇంతలో శశిభూషణ్ కోడలు గర్భవతి అయ్యింది. పుట్టింటికి వెళ్లి
పదినెలల్లో పండంటి ఆడపిల్లతో మళ్ళీ అత్తవారింటికి తిరిగివచ్చింది. శశిభూషణ్ మనవడిని
పెంచిన అనుభవంతో ఇప్పుడు మనవరాలిని కూడా సునాయాసంగా పెంచుతున్నాడు. మనవడు, మనవరాలు
ఇద్దరూ శశిభూషణ్ ని విడిచి పెట్టటం లేదు.
సత్యభూషణ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు అతని కింద
పనిచేసే ప్రశాంత్ పదోన్నతి పొంది మార్కెటింగ్ డైరెక్టర్ అయ్యాడు. అతను ఇప్పుడు కంపెనీ
ఎం డీ అయ్యాడు. ప్రశాంత్ ప్రత్యేకంగా సత్యభూషణ్ కి, సావిత్రికి స్టార్ హోటల్ లో పార్టీ
ఇచ్చాడు. రాత్రి పార్టీ అయ్యి ఇంటికి కారులో తిరిగి వస్తుండగా, "మీరు రాజీనామా
చెయ్యకుండా ఉండివుంటే ప్రశాంత్ స్థానంలో ఈ రోజు మీరు ఎం డీ అయివుండేవారు. " అంది
సావిత్రి.
“పెళ్ళైన కొత్తల్లో నా ఉద్యోగం, కెరీర్ మీద పూర్తిగా దృష్టి
పెట్టడంతో చరణ్, రాధికలు పుట్టినప్పుడు, ఆ తరవాత వారి బాల్యంలో ఒక తండ్రిగా నేను వాళ్ళతో
కలిసి నేను గడిపింది చాలా తక్కువ. నేను ఆ విషయం గ్రహించేసరికి వాళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యారు.
నువ్వే తల్లీ, తండ్రీ అయి వాళ్ళిద్దరినీ పెంచావు. వారి బాల్యం లో వారికి నాతో ఏర్పడిన
దూరాన్ని ఆ తరవాత నేను తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు.
తండ్రి తన పిల్లల పెంపకంలో చేసిన లోపాల్ని సరిద్దిదుకోవటానికే
భగవంతుడు మరో అవకాశం మనవళ్ల రూపంలో కల్పిస్తాడు. నేను ఆ రెండో అవకాశం జారవిడుచుకోకూడదని
నిర్ణయించుకునే నా ఉద్యోగానికి అప్పుడు రాజీనామా చేసాను." అన్నాడు సత్యభూషణ్
సావిత్రితో.
ఇంటికి వచ్చేసరికి రాత్రి పది గంటలయింది. అయినా పిల్లలు నిద్రపోలేదు.
సత్యభూషణ్ ని చూడగానే, "తాతా" అంటూ ఇద్దరూ పోటాపోటీగా సత్యభూషణ్ చెరో చంక
ఎక్కారు ఆనందంగా. సావిత్రి కళ్ళలో ఆనందభాష్పాయాలు రాలాయి.
***
No comments:
Post a Comment