నవవిధ భక్తి సాధనాలు
శ్రీరామభట్ల ఆదిత్య
శ్రీ వేదవ్యాస ప్రణీత బ్రహ్మాండ పురాణాంతర్గతమైన ఆధ్యాత్మ రామాయణంలోని అరణ్యకాండలో గల పదవ సర్గలో శ్రీరాముడు శబరితో తనను పొందడానికి తొమ్మిది భక్తి సాధనాలను చెప్పాడు ఆ సాధనాలు ఏమిటంటే...
శ్రీరాముడు శబరివో ఇలా చెప్పాడు...
"పురుషుడు, స్త్రీ అనే భేదం కాని, జాతి, పేరు, ఆశ్రమాది భేదాలు కాని, నా భజనకు కారణాలు కావు. దానికి ఒక్క భక్తే ముఖ్యకారణం
నాపై భక్తికి లేనివారు యజ్ఞ,దాన,తపాలవల్ల కానీ, వేదాధ్యయనాది కర్మలవలనకానీ నన్ను దర్శించలేరు. అందువల్ల, శబరీ! భక్తిని పొందడానికిగల సాధనాలను నేను సంక్షిప్తంగా చెప్తాను విను -
1)మొదటిది సత్పురుషులతో సాంగత్యం.
2)నా జన్మకర్మలను గురించి కథాగానము రెండోది.
3)నా అనంతకళ్యాణ గుణగణాలను చర్చించుకోవడం మూడవ సాధనం.
4)నా ప్రవచన రూపాలైన శ్రుతులను, ఉపనిషత్తులను, గీతాదివాక్యములను విశ్లేషించుకోవడం, వ్యాఖ్యానం చేయడం నాలుగవ సాధనం.
5)నాపైననే బుద్ధిని ఉంచి, మాయకులోబడక, పుణ్యకార్యములపై ఆసక్తి కలిగి, యమనియమాలను అనుష్ఠిస్తూ ఆచార్య ఉపాసన చేయడం ఐదవ భక్తి సాధనం.
[ యమనియమాలు మొత్తం పది అహింస, సత్యము, అస్తేయము (పరుల సొమ్మును ఆశించకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచము, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం( మనస్సును దైవానికి శరణాగతి చేయడం, ఆ దైవానికి, ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తించడమే ఈశ్వర ప్రణిధానం ) ]
6)ప్రతినిత్యం నా పూజపై నిష్ఠను కలిగి ఉండడమే ఆరవ సాధనం.
7)సాంగోపాంగంగా నా మంత్రాన్ని ఉపాసించడమే ఏడవ సాధనం.
8)నాకంటే నా భక్తులమీద ఎక్కువగా భక్తిభావన ఉండడం, సమస్త ప్రాణికోటిలో నా స్వరూపాన్నే దర్శించగలగడం, ప్రాపంచిక విషయాలపై వైరాగ్యం ఉండడం, శమదమాదులు ఉండడం, నా భక్తికి ఎనిమిదవ సాధనం.
[ శమము - శమమంటే మనస్సుని నిగ్రహించడం, దమము - దమమంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి - మనస్సును నిరంతరం బ్రహ్మధ్యానంపైన ఉంచడం ఉపరతి, తితీక్ష - భౌతిక ప్రాపంచికవిషయాలపట్ల చలించని మనస్సుకలిగిఉండడం తితీక్ష, శ్రద్ధ - నిష్ఠను విడవకుండా వుండడమే శ్రద్ధ, సమాధానము - గురుశాస్త్ర భోధనలను అనుసరించి ఆత్మజ్ఞాన విచారంపై చిత్తాన్ని ఏకాగ్రంగా నిలుపడమే సమాధానం ]
9)సత్యమైన నా తత్త్వవిచారమే తొమ్మిదవ సాధనం.
శబరీ! ఎవరికైనా ఈ తొమ్మిది భక్తి సాధనాలు ఉన్నట్లైతే వారు స్త్రీలైనా, పురుషులైనా, పశుపక్ష్యాదులుగా జన్మనెత్తినా, ప్రేమ స్వరూపమైన భక్తి ఏర్పడుతుంది. సాధకుని హృదయాలలో భక్తి కలిగిన మాత్రం చేతనే నా తత్త్వస్వరూపము అనుభవానికి వస్తుంది. తద్వారా నా స్వరూపానుభవం సిద్ధించినవానికి, అదే జన్మములో ముక్తి లభిస్తుంది.
అందువల్ల, భక్తి ఒక్కటే ముక్తికి కారణం. మొదటి సాధనమైన సత్సంగ సమాగమం ( సత్పురుషుల సాంగత్యం ) ఎవరికి లభిస్తుందో, వారికి క్రమక్రమంగా మిగిలిన సాధనాలన్నీ అనువర్తించి, తద్వారా భక్తి పుట్టి, తత్ఫలముగా ముక్తి లభించి తీరుతుంది. ఇది నిస్సంశయము. "
ఇక్కడ శబరికి మొట్టమొదటిగా లభించింది సత్పురుషుల సాంగత్యం. ఈ మొదటి సాధనం ద్వారానే మిగిలిన అన్ని సాధనాలు శబరికు లభించాయి. దాని ద్వారానే భక్తి పుట్టింది ఆ భక్తి ద్వారానే వేల సంవత్సరాల ఎదురుచూపు తర్వాత కూడా రాముడు శబరికి దర్శనమిచ్చి అనుగ్రహించి మోక్షమిచ్చాడు.
శ్రీరామ జయం.
No comments:
Post a Comment