ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -12
కొత్తపల్లి ఉదయబాబు
''విరాజ్ మంచివాడే. లేకపోతే కాలేజీలో అంతమంది ఆడపిల్లలు ఉండగా నిన్నే ఎన్నుకున్నాడంటే అతడు పేదపిల్లను భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాడన్నమాట. తనకే కావలసినంత డబ్బు ఉంది. నిన్ను కోరి నీ వెంటపడి, నిష్కర్షగా నువ్వు చెప్పిన మాటలు విని మన ఇంటికి వచ్చి తన అన్ని వివరాలు మొహమాటం లేకుండా చెప్పాడంటే అతన్ని మనం నమ్మవచ్చు. అతనిమీద నీ అభిప్రాయం ఏంటిరా తల్లిగాడు?'' అడిగింది శకుంతల.
''నా లక్ష్యాన్ని మరిచిపోనని నీకు మొన్నే మాట ఇచ్చానమ్మా. అతని విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమేనమ్మా...''
''ఆమాట సంతోషంగానే చెబుతున్నావా?'' అని అడగబోయి ఆగిపోయింది శకుంతల.
తల్లి సందేహం అర్ధం అయినా హరిత అంది.
''అమ్మా...నాకు ఎలాంటివాడిని చూసి
పెళ్లి చేయాలనుకుంటున్నావో... నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు విరాజ్ ని చూసినా,
మరి ఎవరిని చూసినా నా భర్తతో పెళ్లి తర్వాతే ప్రేమ. ఇది మాత్రం నాన్నగారిమీద ఒట్టు వేసి
చెబుతున్నాను.''
''కన్నపిల్లల పట్ల తల్లిప్రేమకు ' అతి' ఉండదురా..అది నువ్వు తల్లి అయిననాడు నీకు తెలుస్తుంది. సరే...విరాజ్ మాటలను బట్టి నాకు అర్ధమైనదేమిటంటే అవసరమైతే అతను తన తండ్రిని ఎదిరించైనా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. మరి నువ్వేమంటావ్?''
''ఏమంటాను? ముందు ఏదైనా ఒక జాబ్ చూసుకుంటాను. అతనితో స్నేహంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ హద్దులు దాటకుండా నా పరిధి దాటానని కూడా నీకు మాట ఇస్తున్నానమ్మా. నా ఆత్మ సంరక్షణకు కరాటే నేర్చుకుంటాను. నన్ను నేను ఖాళీ లేకుండా చేసుకుంటాను. ఒక్క ఆదివారం తప్ప నాకు ఖాళీ లేకుండా చూసుకుంటాను. ఇది నా అభిప్రాయం.'' స్థిరంగా చెప్పింది హరిత.
''నాకు తెలుసురా..నువ్వు అచ్చం మీ నాన్న పోలికే...ఆయన అంతే ఒక నిర్ణయం తీసుకుంటే ఇటు సూర్యుడు అటు పొడిచినా తన మాట తప్పేవారు కాదు.'' కూతురి బుగ్గ చిడుముతూ ముద్దుగా అంది హరిత.
''పాపం ఇప్పటికే అతను నీ సమాధానము కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్ళాడు ''
''ఇపుడు ఫోన్ చేసి నువ్వు 'సరే' అన్నావని చెప్పనా?'' అడిగింది శకుంతల.
''వద్దమ్మా... ప్రేమలో ఆ మాత్రం నిరీక్షణ మంచిదే. మనిషి గట్టి పడటానికి. శుక్రవారమే చెబుదువుగాని.ఆరోజు నువ్వు ఆఫీసులో ఉండగా అతనికి ఫోన్ చేసి చెప్పు. ఆ సాయంత్రం మన ఇంటికి రమ్మని కూడా చెప్పు.'' అంది హరిత.
''అలాగే...'' అంది నవ్వుతూ శకుంతల.
***
శుక్రవారం రానే వచ్చింది.
''అమ్మా. విరాజ్ నెంబర్ నీ ఫోన్ లో ఫీడ్ చేసాను. లంచ్ అయ్యాకా అతనికి ఫోన్ చేయి. సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చాకా రమ్మని చెప్పు.'' అంటూ డ్యూటీకి బయల్దేరి వెళ్తున్న తల్లికి నార్మల్ సెల్ అందించింది హరిత.
''సరేనమ్మా,'' అని బాక్స్ తీసుకుని డ్యూటీకి వెళ్ళిపోయింది శకుంతల.
తల్లి వెళ్లిపోయాకా చదువుకుందామని పుస్తకాలు తీసింది హరిత. అపుడే వార్షికోత్సవం జరిగి పదిరోజులైంది. పరీక్షలకు సిద్ధం అవడానికి కేవలం ఇరవై రోజులే సమయం ఉంది. తనకి ఇప్పటికి గతరెండేళ్ళుగా సరాసరి శాతం ఎనభై రెండు ఉంది. ఈ సంవత్సరం కూడా అదే నిలబెట్టుకునేలా చదివితే ..చదువు పూర్తి అయ్యాకా ఆ మార్కులు చూసైనా ఏదో ఒక చిన్న వుద్యోగం సంపాదించుకోవచ్చు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మరో ఆలోచనకు తావివ్వకుండా తానూ చదువుకోవాలి.
హరిత తన నోట్ పుస్తకంలో దాచిపెట్టుకున్న ఫోటో బయటకు తీసింది.
అందులో అమ్మ నాన్నల ఇద్దరిమద్ద్య తాను రెండేళ్ల పాపగా ముద్దుగా, బొద్దుగా ఉంది. నాన్న అమ్మలా మధ్య తాను నవ్వుతున్న ఫోటో. ఆ ఫోటోని చూస్తే ఒక పెద్ద ఫోటోని మధ్యలోకి కత్తిరిస్తే ఉన్న ముక్కలాగా ఉంటుంది ఎందుకో...దీనిని ఎవరు ఎందుకిలా కత్తిరించారమ్మా? అని అడిగితే మీ నాన్న ఇలాగే తెచ్చారమ్మా...అని చెప్పింది అమ్మ.
ఆ విషయం గుర్తొచ్చి ఒక్కసారి నిట్టూర్చి ''డాడీ..నేను ఇపుడు ఎదుర్కునే అన్ని 'పరీక్షలు' ధైర్యంగా ఎదుర్కొని నిలబడే శక్తిని ఇచ్చి ఆశీర్వదించండి.'' అని మనస్ఫూర్తిగా తండ్రికి నమస్కరించుకుని, ఫోటో ముద్దు పెట్టుకుని చదువు మొదలుపెట్టింది హరిత.
***
సాయంత్రం అయింది.
శకుంతల ఇంటికి వస్తూనే ''నేను విరాజ్ కి ఫోన్ చేశానమ్మా. ఫోన్ ఎత్తగానే ఎస్సా ...నో...నా ...ఆంటీ ....చెప్పండి ప్లీజ్.'' అన్నాడు.
''శుభవార్తే బాబు. అయితే మీకు ఖాళీ కుదిరాకా ఒకసారి చీకటి పడకుండా రండి .''అన్నాను.
''అయితే మీరే శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామీ టెంపుల్ కి వచ్చేయండి ఆంటీ..మొదటిసారి దేవుడి గుడిలో మాట్లాడుకుందాం. అక్కడ నిరీక్షిస్తూ ఉంటాను అన్నాడు .. ఇంటికి వెళ్లి హరితతో వస్తాను అని చెప్పాను. ఏం వెల్దామా? ఏమంటావ్?'' అడిగింది శకుంతల.
''ఇంటికే రమ్మనకపోయావా?''
'' ఒకమాటరా... ఆ కుర్రవాడు అలా మన ఇంటికి రావడం అలవాటు చేసామనుకో ...ఒంటరిగా ఉంటున్న ఆడవాళ్ళం. చుట్టుపక్కలవాళ్ళు క్షణాల్లో ఏవో పుకార్లు పుట్టించే అవకాశం మనమే ఇచ్చినవాళ్లమవుతాం. దాన్నే కొరివితో తల గోక్కోవడం అంటారు.''
''మనలో ఏ తప్పూ లేనప్పుడు ఎవరేమనుకుంటే మనకేంటి?'
''మనకు ఆవేశం కాదు కావలసింది. ఆలోచన. దూరాలోచన. అది జనానికి భయపడి కాదు. మనని మనం సంరక్షించుకోవడం కోసం.''
తల్లి ఆలోచనావిధానానికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది హరిత.
''సారీ...మమ్మీ. నేను అంత దూరం ఆలోచించలేదు.''
''ఒక పని చేయబోయేముందు అన్నీ ఆలోచించుకుని అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకుని అడుగు ముందుకువెయ్యాలి.''
''అర్ధమైంది మమ్మీ.. గుడికి వెళ్ళడానికి సిద్దమై వస్తాను.''అని పదినిముషాల్లో తయారై వచ్చింది హరిత.
శకుంతల పంజాబీ డ్రెస్ లో, హరిత చీరలో తయారై వేంకటేశ్వరుని టెంపుల్ కు చేరుకున్నారు .
పార్కింగ్ ప్లేస్ లో వాళ్ళకి విరాజ్ ఎక్కడా కనిపించలేదు.
''ఇంకా రాలేదనుకుంటా''...చుట్టూ పరిశీలిస్తూ అంది శకుంతల.
''మనం స్వామీ దర్శనం చేసేసుకుందాం
మమ్మీ. అతనే వచ్చి కలుస్తాడు.పద.'' అని ముందుకు అడుగేసింది
హరిత. శకుంతల అనుసరించింది.
(సశేషం)
No comments:
Post a Comment