శమీ వృక్షం (జమ్మి చెట్టు)
అంబడిపూడి శ్యామసుందర రావు
చెట్లను దైవంగా పూజించే అలవాటు మన హిందూ సంస్కృతిలో ఒక భాగం. జమ్మి చెట్టును శమీ వృక్షం అని అంటారుజమ్మి చెట్టు శాస్త్రీయంగా ప్రోసోపీస్ ఫాబేసి కుటుంబానికి చెందినది.జమ్మి చెట్టు వేలాడే శాఖలతో ముళ్ళున్న మధ్యరకంగా పెరిగే వృక్షం. జమ్మి పత్రాలు సన్నగా దీర్ఘవృత్తాకారంగా గురు అగ్రంతో పత్రకాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు. ఈ ఆకు సన్నటి పొడుగాటి కంకులతో అమర్చబడిన పసుపు రంగు పుష్పాలు రంగులో ఉంటుంది. ఈ చెట్టు లోతైన నొక్కులు గల ద్విదారక ఫలం గా పెరుగుతుంది జమ్మి చెట్టుకు దసరా నాడు పూజలు చేయడం మనకు అలవాటు. ఈ అలవాటు ఎంతో కాలం నుంచి వున్నది జమ్మి చెట్టు భారత ఉప ఖండం లోనే ఉద్భవించింది అని శాస్త్రవేత్తలు చెబుతారు. రుగ్వేద కాలం లోనే ఈ జమ్మి చెట్టు ప్రస్తావన ఉంది. ఈ చెట్టును అగ్ని పుట్టించటానికి అంటే యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు నిప్పు పుట్టించడానికి సాధనంగా వాడతారు పురాణాలలో వేదాలలో తరచూ వినే అరణి ని ఈ జమ్మి చెట్టు తో రూపొందించేవారు ఇప్పటికీ హోమాలలో నిప్పు పుట్టించటానికి అరణి వాడతారు. ఈ చెట్టు నీటి లభ్యత తక్కువగా ఉన్న చోట్లలో కూడా పెరుగుతుంది.
జమ్మి చెట్టు గ్రామీణ ప్రాంతాల వారికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీని వేళ్ళు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టు లోని ప్రతి భాగము ఆయుర్వేద వైద్యములో ఔషదాలుగా పనిచేస్తాయి. కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టువ్యాధి నశిస్తుంది.రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచెం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టుకు సురభి బంగారం అనే పేరు వచ్చింది బిళ్వాష్టకంలో జమ్మి ఒకటి.ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా దీని చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం సమకూరుతుంది అని పెద్దలు చెబుతారు. అందుకే వినాయకుడి పూజలో వాడే పత్రిలో శమీ పత్రాన్ని కూడా చేర్చారు.
పురాణాలలో జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. పాండవులు అజ్ఞాతవాసం గడపటానికి ముందు వారి వారి ఆయుధాలను జమ్మి చెట్టు పై ఉంచి ఆ చెట్టుకు పూజలు చేసి అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో చేరతారు అలాగే అజ్ఞాతవాసము పూర్తి అయిన వెంటనే జమ్మి చెట్టుకు పూజలు చేసి ఆయుధాలు తీసుకుని ఉత్తర గోగ్రహణం అప్పుడు కౌరవులపై అర్జునుడు యుద్ధానికి వెళతాడు పాండవులు మాత్రమే కాదు త్రేతాయుగంలో రాముడు సైతం జమ్మి చెట్టును పూజించాడు జమ్మి చెట్టును స్త్రీ స్వరూపముగా అంటే శక్తిగా భావిస్తారు శక్తి అనుగ్రహం రాముల వారికి లభించబట్టే అయన రావణాసురిడిపై విజయాన్ని సాధించారు.
జమ్మి చెట్టుకు మన పురాణాలలో,జీవితాలలోని ఇంతట సంబంధం ఉన్నది కాబట్టి దసరా నాడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదువుకుంటారు.
"శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా ,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ ,
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కార్తీత్వం భవ శ్రీ రామ పూజితే "
పూజ ముగిసినాక జమ్మి ఆకులను తెంచుకుని వాటిని బంగారం లా భద్రముగా ఇళ్లకు తీసుకుని వెళతారు. ఈ ఆకులను పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఈ ఆకులకు ఆధ్యాత్మికప్రాధాన్యతరీ త్యా ఇవి బంగారం తో సమానమైన భావిస్తారు. ఈ నమ్మకానికి బలం చేకూర్చేదిగా ఒక కథనం కూడా ఉంది కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకు భయపడి జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో బంగారాన్ని కురిపించాడని చెపుతారు. జమ్మి చెట్టును పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే. పెద్దల అశీసులతో వారి మనో కామ్న నెరవేరాలని ఆశిస్తారు.
No comments:
Post a Comment