శ్రీథరమాధురి - 121
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వచనాలు)
'సమ దృష్టి' లేక 'సమభావం' ఉన్నవారు నిశ్చయంగా జ్ఞానులే! అటువంటి దశకు చేరుకోవాలని దైవాన్ని ప్రార్థించండి. దేన్నీ ఉన్నతంగా లేక అధమంగా చూడకండి. ఏదైనా, దేన్నైనా మనసులో సమ దృష్టితో చూస్తూ పని చేయండి. ధనికులు, పేదవారు, శక్తివంతులు, బలహీనులు, తెలివైనవారు, మూర్ఖులు, అందమైన వారు, అందవికారులు, విజయం పొందిన వారు, అపజయం పాలైన వారు, భగవంతుని సృష్టిలో అన్నిటినీ ఒకేలా చూడండి. మీ దృష్టికి, అంతర్దృష్టి కి ప్రతిదీ, ప్రతిచర్యా కేవలం అందంగా కనిపించేటటువంటి చూపును ఆ దైవం మీకు ప్రసాదించాలి.
'పండితః సమ దర్శనః'
జయజయ శ్రీ సుదర్శన!
***
ఏదైనా మిమ్మల్ని కలతకు గురిచేస్తే మీరు వెంటనే అప్రమత్తులై, మీ శ్వాసను గమనించడం మొదలు పెట్టాలి.
ప్రపంచం అలాగే ఉంటుంది, అది మారదు. మీరు దాన్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవాలి.
సుదర్శన - సు-దర్శన - మంచి అంతర్దృష్టి.
***
మేము సుదర్శన భగవానుని గురించి మాట్లాడినప్పుడు, మొట్టమొదటగా మాకు గుర్తుకు వచ్చేది 'అంతర్దృష్టి'. 'సు' దర్శన.
ఈ రోజుల్లో కొందరు 'విపస్సన' అనే ధ్యానం చేస్తారు. ఇది 'అంతర్ధృష్టి' కి మరొక పదం. అంటే కేవలం గమనించడం, పరిశీలించడం. వ్యక్తిగతంగా కానీ బహిర్గతంగా కానీ ఉన్న దేన్నైనా గమనించడం. ఈ గమనించడం లేదా పరిశీలించడం నిష్పక్షపాతంగా చేయాలి. ఇలా గమనించడంలో ఆ ఆలోచన/భావనతో ఎటువంటి సంగమూ ఉండదు. ఎవరి పట్లయినా కోపం ఉంటే, ఆ కోపాన్ని గమనిస్తారు. ఆకలిగా ఉంటే ఆకలిని గమనిస్తారు. అప్పుడు కోపంగా లేక ఆకలిగా ఉన్నది మీరు కాదని, చికాకుగా ఉన్నది బుద్ధి అని, ఆకలిగా ఉండి ఆహారం కావలసినది శరీరానికని, తెలుసుకుంటారు. అది మీరు కాదు, ఎందుకంటే మీరు కర్త కాదు. ఒకరు అటువంటి 'విపస్సన' స్థాయికి చేరుకుంటే ఇక వారికి కోపం, ఆకలి అన్నవి అరుదుగా కలుగుతాయి. ఒకవేళ అతనికి ఆకలి వేసినా కూడా, అతను తినట్లేదని అతనికి తెలిసినా కూడా, అది కేవలం ఆత్మ నెలవైన తన దేహానికేనని అతడికి తెలుసు.
***
No comments:
Post a Comment