బంగారు ద్వీపం - 20 - అచ్చంగా తెలుగు

బంగారు ద్వీపం - 20

Share This
"బంగారు" ద్వీపం (అనువాద నవల) -20
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Writer : Enid Blyton


@@@@@@@@

(క్వెంటిన్ పట్టుకుపోయిన పెట్టెను దొంగిలించి తెచ్చుకున్న పిల్లలు, దానిలో దొరికిన మాప్(పటాన్ని)ని కాపీ చేసుకొని, తిరిగి దాన్ని క్వెంటిన్ గదిలో బల్లపై పెట్టేస్తారు. నీటి అడుగునుంచి గట్టుపైకి కొట్టుకొచ్చిన శిధిలమైన పాత ఓడను చూసిన లండన్ పేపరువాళ్ళు క్వెంటిన్ని ఇంటర్వ్యూ కోసం ఫోను చేస్తారు. మరునాడు వార్తాపత్రికల్లో ఆ ఓడ గురించి అసాధారణ రీతిలో వర్ణిస్తున్న వార్త వస్తుంది. తరువాత . . . . .)
@@@@@@@@@@@@@@@@@@@

మరునాడు వార్తాపత్రికలు సముద్రం నుండి బయటకు విసిరివేయబడ్డ శిధిలమైన పాత ఓడ‌ గురించి అసాధారణ రీతిలో వర్ణించాయి. పత్రికల వాళ్ళు శిధిలమైన ఓడ, దానిలో మాయమైన బంగారం గురించి ‌క్వెంటిన్ నుంచి రాబట్టారు. వారిలో కొంతమంది కిర్రిన్ ద్వీపంలో దిగి శిధిలమైన పాత కోట ఫొటోలను కూడా తీసుకున్నారు.

జార్జి కోపంతో ఊగిపోయింది. "అది నా కోట" అంటూ తన తల్లి మీద తిరగబడింది. "అది నా ద్వీపం. అది నాదేనని నువ్వే కద చెప్పావు. నువ్వే చెప్పావు! నువ్వే చెప్పావు!"

"నాకు తెలుసమ్మా జార్జి!" ఆమె తల్లి అంది. " కానీ నువ్వు తెలివిగా ఆలోచించాలి. దాని మీద దిగినందువల్ల ద్వీపానికి ఏమీ నష్టం రాదు. ఫొటోలు తీసినందువల్ల కోట దెబ్బ తినదు."

"కానీ అలా చేయడం నాకు యిష్టం లేదు" చెబుతున్న జార్జి ముఖం కోపంతో నల్లబడింది. "అది నాది. ఆ ఓడ నాది. అదంతా నువ్వే చెప్పావు."

"అవును. కానీ అది అలా గట్టుకి విసిరి వేయబడుతుందని నాకు తెలియదు" ఆమె తల్లి అంది. "తెలివిగా మాట్లాడు జార్జి! జనాలు ఆ పాడైన ఓడను చూడటానికి వెళ్తే ఏమవుతుంది? నువ్వు వాళ్ళను ఆపలేవు."

జార్జి వాళ్ళను ఆపలేక పోవచ్చు. కానీ ఆ విషయంలో ఆమెకు తక్కువ కోపం రాలేదు. పైకి వచ్చిన ఆ‌ శిధిలమైన ఓడ కలిగించిన ఆసక్తికి పిల్లలు ఆశ్చర్యపోయారు. దాని వల్ల కిర్రిన్ ద్వీపం ఆసక్తిని కలిగించే విహార ప్రాంతం అయిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి సందర్శకులు దానిని చూడటానికి వస్తున్నారు. జాలర్లు లోనికి ‌వెళ్ళడానికి సన్నని దారిని కనిపెట్టి ప్రజలను అక్కడ దించుతున్నారు. జార్జి కోపంతో ఏడుస్తూంటే, జూలియన్ ఆమెను ఓదార్చటానికి ప్రయత్నిస్తున్నాడు.

"చెప్పేది విను జార్జి! మన రహస్యం యింకా ఎవరికి తెలియదు. జ‌నాల్లో ఈ ఉత్సాహం చల్లబడేవరకు మనం ఎదురు చూద్దాం. తరువాత మనం కిర్రిన్ కోటకు వెళ్ళి, ‌లోహపు కడ్డీలను కనుక్కుందాం."

"మొదటగా దాన్ని ఎవరూ కనక్కోకపోతే" అంటూ జార్జి కళ్ళు తుడుచుకొంది. ఏడిచినందుకు తనని తనే కోపగించుకొంది. కానీ ఆమె నిజంగా ఆపుకోలేకపోయింది.

"వాళ్ళెలా చేయగలరు?" అన్నాడు జూలియన్. "ఇంకా ఆ పెట్టెలో ఎవరూ చూడలేదు! అవకాశం కోసం నిరీక్షించి, ఆ పటాన్ని ఎవరూ చూడకుండానే పెట్టె లోంచి తీసేస్తాను."

కానీ ఊహించని సంఘటన జరగటంతో అతనికి అవకాశం దొరకలేదు. క్వెంటిన్ బాబయ్య పురాతన వస్తువులను కొనే వ్యక్తికి ఆ పాత పెట్టెను అమ్మేశాడు. సందడి మొదలైన ఒకటి, రెండు రోజుల తరువాత క్వెంటిన్ తన అధ్యయనం గది నుంచి హుషారుగా బయటకు వచ్చి, ఫానీ కి, పిల్లలకు ఈ విషయం చెప్పాడు.

"ఆ వ్యక్తితో మంచి బేరం కుదిరింది" తన భార్యతో చెప్పాడతను. "శిధిలమైన ఓడలోని తగరపు గీత ఉన్న ఆ పాత పెట్టె నీకు తెలుసు కదా? అదే....ఈ‌ వ్యక్తి ఇలాంటి ఆసక్తి కలిగిన వస్తువులను సేకరిస్తాడట! అతను దానికి చాలా మంచి ధరను చెల్లించాడు. నిజంగా చాలా మంచి ధర. నేను వ్రాసే పుస్తకం కన్నా చాలా ఎక్కువ మొత్తం! దానిలో ఉన్న పాత‌ పటాన్ని, డైరీని చూసిన వెంటనే ఆ మొత్తం వస్తువులను కొంటానన్నాడు."

పిల్లలు ‌భయంతో అతన్ని తెల్లబోయి చూసారు. ‌ పెట్టె అమ్ముడుపోయింది! ఇప్పుడు దానిని ఎవరో అధ్యయనం చేసి, ఆ లోహపు కడ్డీలు ఏమిటో చూడాలని ముందుకి దూకొచ్చు. అదృశ్యమైన బంగారం కథ అన్ని పత్రికలలో రావచ్చు. ఆ పటాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వాడు,‌ ఆ పటం చూపించేదేమిటో తెలుసుకోవడంలో విఫలం కాడు.

పిల్లలు తమకు తెలిసినదేమిటో క్వెంటిన్ బాబయ్యకు చెప్పే ధైర్యం చేయలేక పోయారు. ప్రస్తుతం అతను చాలా హుషారుగా ఉన్నాడు. అడిగితే వాళ్ళకు రొయ్యలు పట్టే వల, తెప్ప కొని యిచ్చేలా ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా మారిపోయే తత్వం గల మనిషి. తను నిద్రపోతున్నప్పుడు జూలియన్ ఆ పెట్టెను తీసుకెళ్ళి తెరిచాడని వింటే వీరావేశంతో చిందులు తొక్కవచ్చు.

ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లలందరూ కూర్చుని మొత్తం విషయాన్ని చర్చించారు. నిజంగా వాళ్ళకు అది గంభీరమైన విషయంగా తోచింది. ఫానీ పిన్నికి ఈ రహస్యాన్ని చెబితే ఎలా ఉంటుందో అని కొంతసేపు చర్చించారు. కానీ యిది చాలా విలువైన, అద్భుతమైన రహస్యం గనుక దీనిని ఎవరికీ బహిర్గతం చేయకూడదని భావించారు.

"అంతా వినండి!" చివరికి జూలియన్ చెప్పాడు. "మనం కిర్రిన్ ద్వీపానికి వెళ్ళి, అక్కడ రెండు, మూడు రోజులు ... రాత్రి పూట అక్కడ పడుకొందుకు కూడా అని నా ఉద్దేశం... గడపడానికి ఫానీ పిన్ని అనుమతి అడుగుదాం. దాని వల్ల మనం ఆ చుట్టుపక్కల శోధించి, మనకేమి కనిపిస్తుందో చూసే సమయం దొరుకుతుంది. ఒకటి, రెండు రోజుల తరువాత సందర్శకులు అక్కడకు రారని ఖచ్చితంగా చెప్పగలను. ఎవరో మన రహస్యంలోకి చొరబడే లోగా మనం దానిలో ప్రవేశించి ఉంటాం. బహుశా పెట్టెను కొన్న వ్యక్తి కూడా ఆ పటంలో ఉన్నది కిర్రిన్ కోట అని ఊహించి ఉండకపోవచ్చు."

దానికి‌ వాళ్ళు చాలా ‌సంతోషించారు. ఏమీ ఆలోచించనప్పుడు, సమస్య చాలా భయంకరంగా కనిపించింది. రంగంలో దిగుదామని అనుకోగానే, వారికి బాగా అనిపించింది. కోటకు వెళ్ళి వారాంతాన్ని అక్కడ గడపటానికి తమ పిన్నిని మరునాడు అడుగుదామని నిర్ణయించారు. వాతావరణం కూడా అద్భుతంగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా వాళ్ళు గడపవచ్చు. తమతో పాటు చాలినంత ఆహారాన్ని మోసుకుపోవచ్చు.

ఫానీ పిన్ని అనుమతి అడుగుదామని‌ వారు వెళ్ళిన సమయానికి, క్వెంటిన్ బాబయ్య ఆమె దగ్గర ఉన్నాడు. అతను మళ్ళీ చాలా హుషారుగా ‌కనిపించాడు. జూలియన్ వీపు మీద ఆప్యాయంగా తట్టాడు. "బాగుంది!" అన్నాడతను. "మీ రాకకు కారణం ఏమిటి?"

"ఫానీ పిన్నిని ఒకటి అడగాలని‌ యిప్పుడే‌ అనుకొన్నాం" వినయంగా చెప్పాడు జూలియన్. ‌‌"పిన్నీ! వాతావరణం అద్భుతంగా ఉంది. వారాంతంలో కిర్రిన్ కోటకు మమ్మల్ని పంపించాలని‌ నువ్వు అనుకోవటం లేదా? దయచేసి అక్కడ ఒకటి, రెండు రోజులు గడపడానికి అనుమతించు. మేమెలా యిష్టపడతామో నువ్వు ఆలోచించలేదా?"

"సరె! క్వెంటిన్ ! నువ్వు ఏమంటావు?" వాళ్ళ పిన్ని తన భర్త వైపు తిరిగి అడిగింది.

"వాళ్ళు వెళ్ళాలనుకొంటే వెళ్ళవచ్చు" క్వెంటిన్ చెప్పాడు. "త్వరలోనే వాళ్ళకు అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. పిల్లలూ! కిర్రిన్ ద్వీపం కోసం అద్భుతమైన బేరం వచ్చింది. ఒక వ్యక్తి దానిని కొని,‌ కోటను ఒక హోటల్ గా మార్చి కట్టి, ఆ ప్రాంతాన్ని సెలవుల్లో గడిపే ఒక విహారకేంద్రంగా మార్చాలని అనుకుంటున్నాడు. దానిపై మీరు ఏమంటారు?"

నవ్వుతూ చెప్పే అతన్ని ‌నలుగురు పిల్లలు నిశ్చేష్టులై చూసారు. ఎవరో ఆ ద్వీపాన్ని కొనబోతున్నారా? వారి రహస్యాన్ని ఎవరైనా ‌కనిపెట్టేసారా? ఆ కోటను కొనాలని చూసే వ్యక్తి ఆ పటాన్ని చదివి, అక్కడ చాలా ‌బంగారం దాగి ఉందని తెలుసుకున్నాడా?

జార్జికి వివరాలు తెలుసుకోవాలన్న ఆరాటంతో ఊపిరి పట్టేసింది. ఆమె కళ్ళు అగ్ని గోళాల్లా మండుతున్నాయి. "అమ్మా! నువ్వు నా ద్వీపాన్ని అమ్మలేవు. నా కోటను అమ్మలేవు. వాటిని నేను అమ్మనీయను."

ఆమె తండ్రి కోపంతో ముఖం చిట్లించాడు. "మూర్ఖంగా మాట్లాడకు జార్జియానా! వాస్తవానికి అది నీది కాదు. ఆ సంగతి నీకు తెలుసు. అది మీ అమ్మకు చెందింది. తను అమ్ముకోవాలనిపిస్తే మీ అమ్మ అమ్ముకోవచ్చు.‌ మనకు ఇప్పుడు బాగా డబ్బు అవసరం. మనం ఆ ద్వీపాన్ని అమ్మితే, నువ్వు ఎన్నో విలువైన వస్తువులను పొందుతావు."

"నాకు విలువైన వస్తువులు ఏవీ వద్దు!" జార్జి గట్టిగా అరిచింది. "నా కోట, నా ద్వీపమే నాకు ఉన్న విలువైన వస్తువులు. అమ్మా! అవి నాకు చెందుతాయని నువ్వే చెప్పావు. ఆ విషయం నీకు తెలుసు. నేను‌ నిన్ను నమ్మాను.
"అమ్మా జార్జి! వాటికి ఏ మాత్రం విలువ లేదని నేను భావించినప్పుడు, నువ్వు ఆడుకోవడానికి అవి ఉన్నాయని చెప్పాను" చెబుతున్న ఆమెలో కలవరం కనిపించింది. "కానీ యిప్పుడు పరిస్థితులు వేరు. .మీ నాన్నకు మంచి బేరం దొరికింది. అంత మొత్తాన్ని మనం ఊహించను కూడా లేదు. దానిని వదులుకొనే‌ స్థితిలో మనం ఇప్పుడు లేము."

"అంటే అది విలువైనది కాదని నువ్వు అనుకొన్నప్పుడు మాత్రమే దానిని నాకు యిచ్చావన్న మాట!" అంటున్న జార్జి ముఖం కోపంతో పాలిపోయింది. "విలువ పెరగగానే‌ దాన్ని తిరిగి తీసేసుకున్నావు. ఇది ఘోరం. ఇది.....ఇది మంచి పని కాదు."

"ఇక చాలు జార్జియానా!" ఆమె తండ్రి కోపంతో అన్నాడు. "మీ అమ్మ నేను చెప్పినట్లు చేసింది. నువ్వింకా‌ చిన్న పిల్లవి. మీ అమ్మ అచ్చంగా నీతో ఆ మాట చెప్పలేదు. ఏదో ‌నిన్ను సంతోషపెట్టాలని మాత్రమే అలా చెప్పింది. కానీ వీటిని అమ్మగా వచ్చిన సొమ్ములో నీకు వాటా ఉందని బాగా తెలుసు. దానితో నీకు కావలసిన దేనినైనా నువ్వు కొనుక్కోవచ్చు."

"ఒక పెన్నీ కూడా ముట్టను" వెక్కుతూ ‌అంది జార్జి. ‌ "దాన్ని అమ్మినందుకు నువ్వే బాధపడతావు."

ఆమె వెనుదిరిగి తడబడుతూ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages