భగవద్గీత మన నుదిటి రాత అని ఒక మహా కవి అంటాడు. మతాలతో సంబంధం లేకుండా ఒక పుస్తకం పుస్తకం అనుకోని అందరూ దాన్ని ఒకసారన్నా అది చదివితే మన ఆలోచనలో మార్పు వస్తుంది.ఎవరు చెప్పిన ఎక్కడ చెప్పినా ప్రతి వాళ్ళు జీవితంలో ఒక్కసారి అయినా భగవద్గీత చూడాలని అంటుంటారు కానీ ఎవరు స్పష్టముగా ఎందుకు చదవాలో చెప్పరు ఈ వ్యాసము లో భగవద్గీత ఎందుకు చదవాలి ఆ గీత మనకు ఏమి చెబుతుంది చదవడం వలన మన జీవితాలను ఎలా మారుస్తుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ద్వాపరయుగం లో యుగం లో ఇంద్రుడినే జయించగలిగే బలం, తెగువ అస్త్ర సంపద ఉన్న అర్జునుడు సైతం కురుక్షేత్రం లో తన వారిని చూసి మానసికంగా బలహీనుడు అయిపోతాడు.. దాదాపు అస్త్ర సన్యాసం చేసే పరిస్థితికి వస్తాడు. అలాంటి సమయంలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన గీతోపదేశం ఒక్క అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త మానవ జాతికే మార్గదర్శకం అయింది. మనిషి తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు అనే మాట మనం పదే పదే వింటుంటాము,. అంటే మనిషి తన తల రాతను మార్చుకో లేడు అన్నది సత్యం అలాంటప్పుడు భగవద్గీత లేదా ఏదైనా ఇతర మత గ్రంథాలు ఎందుకు చదవాలి అనేది సాధారణంగా మనిషికి వచ్చే సందేహము
ఈ సందేహానికి సమాధానం ఏమిటి అంటే భగవద్గీత మన కర్మ ఫలాన్ని లేదా మన జీవన గీతను మార్చదు. కానీ మనం జీవితాన్ని పద్దతిని మారుస్తుంది. భగవద్గీత సమస్త మానవ జాతికి ఉపయోగపడే విధంగా చెప్పబడింది ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది ఇది మతాలకు సంబంధం లేని ఒక సందేశం. అది ఎలాగో చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలి అంటే జీవితం యొక్క పరమార్థాన్ని భగవద్గీత మనకు చెప్తుంది.
1. భగవద్గీత జీవితం యొక్క పరమార్థాన్ని తెలియచేస్తుంది: భగవంతుడిని ఎలా అన్వేషించాలి అని ఒక మార్గాన్ని మనకు భగవద్గీత చూపిస్తుంది.శ్లేష్మం లో పడ్డ ఈగలాగా నిత్య కృత్యాలలో సతమతమయ్యే సగటు మానవుడికి ఇది చాలా ఉపయోగం జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేసే భగవంతుడిని అన్వేషించడానికి ఒక మార్గాన్ని ప్రతి ఒక్కరికి చూపిస్తుంది శ్రీ కృష్ణుడు అర్జునుడితో చెబుతూ,"నేను ఈ ముల్లోకాలలో సాధించలేనిది చేయలేనిది అంటూ ఏది లేదు అలా నేను చేసుకుంటూ పోతే నాకు కూడా చేయడానికి ఏమి మిగలదు. అయినా సరే నేను కర్మను చేస్తున్నాను .. అలా చేయకపోతే, కర్మ అనేది చేయక్కర్లేదు అని ఒక తప్పుడు ఉద్దేశాన్ని జీవులకు నేను చెప్పినట్టు అవుతుంది. దాని వలన వాళ్ళు కర్మ చేయడం మానేస్తారు. కాల చక్రం అనేది దాని వల్ల ఆగిపోతుంది. జీవుల్లో మేలు కోసమే నేను కర్మను చేస్తున్నాను" అని చెపుతాడు.
2 భగవద్గీత కర్మ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది :-ఆత్మ బలం, దైవం యొక్క గొప్పతనాన్ని, చేసే కర్మ యొక్క ఫలాన్ని, గీత తెలియ చెప్తుంది. దాని వలన మనిషి యొక్క ఆలోచన దృక్పథం మారి సరి అయిన మార్గములో ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకో గలుగుతాడు
3. గీత మనలో ఉన్న బలాన్ని మనం గుర్తించేలా చేస్తుంది: మనిషి ఎక్కువగా గతం గురించి లేదా జరగబోయే దాని గురించి ఆలోచన ఉంటుంది. గీతలోని సారంశాము మనిషి యొక్క ఆలోచన పద్దతిని ప్రభావితం చేసి గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచనల నుంచి ప్రస్తుత కాలంలో ఉంచి సక్రమంగా ఆలోచింప చేసే ముందుకు నడిపిస్తుంది జరిగిపోయిన వాటి గురించి లేదా జరగబోయే వాటి గురించి ఆలోచిస్తూ వర్తమానంలో ఇబ్బందులు పడే ప్రమాదాన్ని నివారిస్తుంది.
4. గీత మనిషి నిర్ణయాలు తీసుకునే సమర్ధతను పెంచుతుంది: చాలా మందికి ఉన్న బలహీనత ఏమిటి అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు లేదా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పర్యవసానాలను ఎదుర్కొనే ధైర్యం ఉండదు. గీత చదవడం వల్ల మనకు స్తిమితమైన ఆలోచన పద్దతి అలవాటు అవుతుంది ఈ అలవాటు జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుంది. అంటే మన ఆలోచన ధోరణిని సక్రమమైన మార్గం లో పెడుతుంది.
5. గీత మనకు మంచి చెడుల మధ్య తేడాను తెలియజేస్తుంది : మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు అది మంచిదా చెడ్డదా అని అని మన మనసు మనకు చెప్తుంది. మనం తీసుకునే నిర్ణయం వలన ఇంకో మనిషికి సమస్య రాకుండా ఎలా తీసుకోవాలి అన్న ఒక దృష్టికోణాన్ని భగవద్గీత మనకు చెప్తుంది. మనము తీసుకునే నిర్ణయము పక్క వారిని బాధిస్తే మటుకు దానికి మనమే పూర్తి బాధ్యులం అని కూడా తెలియజేస్తుంది అందువల్ల గీత చదవడం వల్ల మంచి చెడుల మధ్య తేడాలు గుర్తించి సరి అయిన నిర్ణయం తీసుకోవడం లో మన ఆలోచనలను నడిపిస్తుంది.
6. భగవద్గీత భావోద్వేగాలకు, కర్మ కు తేడా తెలియ చెప్తుంది::-శ్రీకృష్ణుడు అర్జునికి గీత బోధించిన సందర్భం ఏమిటి అంటే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు తన బంధుగణాన్ని చూసి భావోద్వేగానికి లోనయి తానూ యుద్ధము చేయనని అంటాడు అలాగే మన నిత్యజీవితంలో కూడా మనము భావోద్వేగాలకు లోనయి చేయవలసిన కర్మను విస్మరిస్తాము అటువంటప్పుడు గీత భావోద్వేగాలకు కర్మకు గల తేడాను తెలియజేసి కర్మ నిర్వర్తించటానికి తోడ్పడుతుంది.
7. భగవద్గీత మనల్ని మనము గుర్తించేలా చేస్తుంది::- నిత్య జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు అధైర్య పడకుండా శ్రీకృష్ణుడు బోధించిన గీత మనకు కర్తవ్యాన్ని గుర్తు చేసి కర్మను చేయడానికి ప్రోత్సహిస్తుంది
8. భగవద్గీత మన మనసు ని కంట్రోల్ చేసుకునే మార్గం చూపిస్తుంది:- మనము సాధారణ మానవులం అందుచేత ప్రాపంచిక విషయాలపై మోజుతో ఆనందాన్ని,అనవసరమైన ఆలోచనలతో మనశాంతిని కోల్పోతుంటాము. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి పనికి రాని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనసును అదుపులో పెట్టుకోవడానికి గీతాసారం మనకు దారి చూపిస్తుంది.
9. భగవద్గీత ఒంటరి తనాన్ని జయించేలా చేస్తుంది:- సాధారణంగా చాలామంది వయసు పెరుగుతుంటే బాధపెట్టే విషయం ఒంటరితనం. జీవితంలో ప్రతి మనిషికి ఇది తప్పించుకోలేని సమస్య. జీవాత్మకు పరమాత్మ ఎప్పుడు తోడుగా ఉంటాడు అన్న సంగతి సామాన్య మానవుడు అర్థం చేసుకోలేడు,కానీ భగవద్గీత చదువుతూ ఉంటె ఈ విషయం మనకు చాలా సరళంగా తెలుస్తుంది.
10. భగవద్గీత మనకు ఈ సమాజంలో ఉంటూనే సాధారణ జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలో చెప్తుంది: -సమాజములో ఉం టున్నప్పటికీ వ్యక్తికీ ఈ లోకములోని సంసార పరమైన రుచులను అంటకుండా తామరాకు మీది నీటి బొట్టు లా జీవితం ఎలా గడపాలో భగవద్గీత చదవడం ద్వారా మనము తెలుసుకోవచ్చు.
11.భగవద్గీత మనకు తిండి యొక్క విశిష్టత గురించి చెప్తుంది:- మనము తినే ఆహారం ను బట్టి మన భావోద్వేగాలు మారుతూ ఉంటాయి మనము తీసుకునే ఆహారం మన జీవన శైలిని నిర్దేశిస్తుంది అలాగే మనం తినే తిండి మన ఆరోగ్యం, ఆలోచన, జీవన శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న సారాంశం భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు .
ఈ విధంగా భగవద్గీత చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను చాలా మంది పండితులు గీత జ్ఞాన యజ్ఞము పేరుతో లేదా గీత పారాయణం పేరుతో చెబుతూ ఉంటారు ప్రతి సారి వారు కొత్త కొత్త విషయాలు అనేకం చెబుతూ ఉంటారు అందువల్ల ఒక సారి భగవద్గీత చదివాము అర్ధం చేసుకున్నాము అని అనుకోవడానికి వీలు లేదు చదువుతున్న కొద్దీ లేదా వింటున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు అనేకం తెలుసుకోవచ్చు చదవడానికి అవకాశం లేకపోతే ఎవరైనా పండితులు గీత పారాయణం చేస్తున్నప్పుడు వినడం అలవాటు చేసుకుంటే జీవితపు విలువలు తెలుస్తాయి సక్రమైన మార్గంలో ప్రశాంత చిత్తముతో బ్రతకవచ్చు.
No comments:
Post a Comment