ఇన్నిటా నింతటా నిరవొకటే - అచ్చంగా తెలుగు

ఇన్నిటా నింతటా నిరవొకటే

Share This
ఇన్నిటా నింతటా నిరవొకటే  

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 


రేకు: 0353-06 సం: 04-314

పల్లవి: 

ఇన్నిటా నింతటా నిరవొకటే

వెన్నునినామమే వేదంబాయ


చ.1: 

నలినదళాక్షునినామకీర్తనము

కలిగి లోకమునగలదొకటే

యిల నిదియే భజియింపగ బుణ్యులు

చెలగి తలప సంజీవని యాయ

చ.2:

కోరిక నచ్యుత గోవిందాయని

ధీరులు దలపగ దెరువొకటే

ఘోరదురితహర గోవర్ధనధర

నారాయణ యని నమ్మగగలిగె

చ.3:

తిరువేంకటగిరి దేవుని నామము

ధరదలపగ నాధారమిదే

గరుడధ్వజుని సుఖప్రదనామము

నరులకెల్ల బ్రాణము దానాయ

భావం

పల్లవి:

అన్నిచోట్లా  స్థానమయినది ఒక్కటే. అదే  విష్ణుదేవుని నామము. అది  వేదమయినది.

చ.1:

తామరరేకుల వంటి కన్నులు కలిగిన స్వామి వారి  నామకీర్తనము ఈ లోకములో అన్ని కలిగినది.( అన్ని ప్రసాదిస్తుందని భావం) లోకమున  పుణ్యాలు కలిగించేది స్వామి  నామకీర్తనము ఒకటే.

ఈలోకంలో నామకీర్తనము  చేయుచున్న పుణ్యాత్ములకు ఈ గోవిందుని నామమే  సంజీవనిలా బాధల గాయాలను చెరిపి స్వస్థతను ఇస్తుంది.

చ.2:

కోరికతో అచ్యుత గోవిందా అని ధైర్యవంతులైన భక్తులు తలచగా లభించే మార్గము ఒకటే ! ( మోక్షమని తాత్పర్యం)

ఘోరమయిన పాపములను హరించువాడా ! గోవర్ధన పర్వతమును ధరించినవాడా ! నారాయణ అని పిలుస్తూ స్వామిని నమ్ముకొంటే - నాకు ఈ నామకీర్తనము చేసే అదృష్టం కలిగింది.

చ.3:

శ్రీ ప్రదమైన వేంకటగిరి దేవుని(వేంకటేశ్వరుని)  నామము -ఈ భూమిలో ఆధారము.

గరుత్మంతుడు ధ్వజముగా కలిగిన  సుఖప్రదమైన గోవిందుని నామము  మానవులందరికి ప్రాణము .

***

No comments:

Post a Comment

Pages